ప్రాజెక్టులు కట్టి ఏమి బావుకొన్నామని
స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కృష్ణానది మిగులు జలలాపై తమకు హక్కులు ఎటువంటి అవసరంలేదంటూ లేఖ ఇచ్చి, రాష్ట్రానికి తీరని అన్యాయం చేసారని తెలుగుదేశం చేస్తున్నఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జగన్మోహన్ రెడ్డి, చనిపోయిన తన తండ్రిని నిందించడం తప్పని చెపుతూ, ఆయనని వెనకేసుకు వచ్చే ప్రయత్నంలో చంద్రబాబు తన హయంలో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదని, అందువల్లే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంత ఘాతుకానికి ఒడి గట్టిందని ఒక వితండ వాదం చేస్తున్నారు. తన తండ్రి అధికారంలోకి రాగానే జలయజ్ఞం పేరిట మిగులు జలాల ఆధారంగా అనేక ప్రాజెక్టులు మొదలుపెట్టారని అని కూడా గొప్పగా చెప్పుకొంటున్నారు.
ప్రాజెక్టులు కట్టకపోవడం వలననే ఈ సమస్య వచ్చిందని వితండవాదం చేస్తున్నజగన్మోహన్ రెడ్డి, మిగులు జలాలపై హక్కులు కోరబోమని రాజశేఖర్ రెడ్డి లేఖ ఇచ్చిన తరువాత, రాష్ట్రానికి నీళ్ళు వస్తాయో రావో తెలియని పరిస్థితుల్లో రూ.39,000 కోట్లు ఖర్చు చేసి కృష్ణ బేసిన్ లో ఎందుకు ప్రాజెక్టులు మొదలుపెట్టారో కూడా జగన్ వివరించి ఉంటే బాగుండేది.
జల యజ్ఞం ధన యజ్ఞంగా మారిందని పత్రికలూ, ప్రతిపక్షాలు ఎంత మొత్తుకొంటున్నా నిర్భీతిగా కోట్ల రూపాయల వ్యయంతో చెప్పటిన ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటో ప్రజలకీ తెలుసు. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా అమలయినట్లయితే ఆ ప్రాజెక్టులు అన్నీ నిరూపయోగంగా మారడం ఖాయం.
చంద్రబాబు ప్రాజెక్టులు కట్టకపోవడం వలన రాష్ట్రానికి ఎటువంటి నష్టమూ జరుగలేదు. కానీ ప్రజల నుండి వసూలు చేసిన పన్నులతో రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టిన ప్రాజెక్టుల వలన వారి కష్టార్జితమంతా బూడిదలో పోసిన పన్నీరుగా వృధా అవడమే కాక, ఇప్పుడు ఆ ప్రాజెక్టులకి కనీసం నీళ్ళు కూడా రాని పరిస్థితి. వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి అనాలోచితంగా కట్టిన ఈ ప్రాజెక్టుల వల్ల ప్రజలకు జరిగిన నష్టాన్ని ఎవరు భరిస్తారు?
ఈ ప్రాజెక్టుల వలన ప్రజలకు ఒరిగిందేమీ లేకపోయినా,కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, అధికారులు మాత్రం బాగుపడ్డారు. ఈ భాగోతం గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి తిరిగి తెదేపాపై ఎదురు దాడి చేయడం, తాను, తన కుటుంబము, తన పార్టీయే ఈ భూప్రపంచంలో నీతి నిజాయితీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్లు మాట్లాడటం హాస్యస్పదం.