త్వరలో జేసీకి, శ్రీనివాస రావుకి బొత్స గంట కొట్టనున్నారా
posted on Nov 27, 2013 @ 8:25PM
కొద్ది రోజుల క్రితం మెహబూబ్ నగర్ సమీపంలో జరిగిన ఘోర బస్సు అగ్ని ప్రమాదం తరువాత రవాణా శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు నిబంధనలకు వ్యతిరేఖంగా తిరుగుతున్నఅనేక ప్రైవేట్ బస్సులను పట్టుకొంటున్నారు. వాటిలో జేసీ బ్రదర్స్ యొక్క దివాకర్ ట్రావెల్స్ కి చెందిన బస్సులు కూడా చాలానే ఉన్నాయి. దానితో సహజంగానే జేసీ సోదరులకు బొత్సపై ఆగ్రహం కలగడం సహజమే. అయితే వారి పరిస్థితి తేలు కుట్టిన దొంగల్లా అవడంతో ఈ విషయంపై నోరు మెదపలేక నానా అవస్థలు పడుతున్నారు.
అయితే అందివచ్చిన రాష్ట్ర విభజన అంశం సాకుగా తీసుకొని బొత్సపై ఇంతవరకు పరోక్ష విమర్శలు చేస్తూన్నారు. రాష్ట్ర విభజనకు ప్రధానకారకుడని ఇప్పటికే బోలెడంత అపఖ్యాతి మూటగట్టుకొన్న బొత్ససత్యనారాయణ, దివాకర్ రెడ్డి గుప్పిస్తున్న తీవ్ర విమర్శల కారణంగా మరింత అభాసుపాలవుతాననే ఆలోచనతో ఆయన కూడా ఎదురు దాడికి దిగారు.
“పార్టీలో కొందరు నేతలు వేరే పార్టీలో టికెట్స్ ఖరారు చేసుకొని పార్టీని అప్రదిష్ట పాలుచేసె విధంగా మాట్లాడుతూ, ప్రజల ముందు పార్టీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వారి పేర్ల లిస్టు సిద్దం అయ్యింది. వారిపై చర్యలు తీసుకొనేందుకు అధిష్టానం కూడా అనుమతి ఇచ్చింది. నేడో రేపో వారికి నోటీసులు పంపబోతున్నాను,” అని హెచ్చరించారు. ఇది జేసీ దివాకర్ రెడ్డిని ఉద్దేశించేనని చెప్పనవసరం లేదు.
తెగించిన వాడికి తెడ్డే ఆయుధం అన్నట్లు, తమ మధ్య యుద్ధం క్లైమాక్స్ దశకు చేరుకుందనో లేక ఇంత కాలమయినా తమ బస్సులను తిరగనీయకపోవడంతో సహనం నశించిందో ఏమో గానీ, దివాకర్ రెడ్డి వెంటనే బొత్సపై ఎదురుదాడి చేసారు. “అసలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్ససత్యనారాయణ ఇద్దరూ కూడా తోడు దొంగలవంటి వారే. వారికి రాష్ట్ర విభజన గురించి అంతా ముందే తెలుసు. అయినా తెలియనట్లు నటిస్తూ ప్రజలని మభ్యపెడుతున్నారు. వీరికే కాదు, సీమాంధ్ర కేంద్రమంత్రులందరికీ కూడా ఈ విషయం చాలా ముందు నుండే తెలుసు. అయినా అందరూ చివరి నిమిషం వరకు ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారు. బొత్స ఎవరిపైనైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చును,” అని ఘాటుగా జవాబిచ్చారు.
అయితే ఈ సారి ఆయన ముఖ్యమంత్రిని కూడా బొత్సతో కలిపి నిందించడం చూస్తే ఆయన ఇక పార్టీతో తెగ తెంపులకి సిద్దంగా ఉన్నారని అర్ధం అవుతూనే ఉంది. తెదేపాతో టచ్చులో ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా బొత్సని ఘాటుగా విమర్శించారు. శాస్త్ర ప్రకారం జరగవలసిన ఈ విమర్శల తంతు కూడా పూర్తయింది గనుక ఇక బొత్సదే ఆలశ్యం మరి.