జీఓయం తుది నివేదిక 4న
posted on Nov 28, 2013 @ 12:56PM
కొద్ది సేపటి క్రితమే కేంద్రమంత్రుల బృందం(జీఓయం) సమావేశం ముగిసింది. ఆర్ధికమంత్రి చిదంబరం కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో షిండే, జైరామ్ రమేష్ పాల్గొన్నారు. అనంతరం షిండే మీడియాతో మాట్లాడుతూ వచ్చేనెల 4న జీఓయం తన తుది నివేదికను కేంద్ర మంత్రి వర్గం సమావేశంలో ప్రవేశపెడుతుందని తెలిపారు. హైదరాబాద్, భద్రాచలం పై ఎటువంటి సమస్యలు లేవని, ఎవరికీ బాధ కలిగించని విధంగానే తమ నివేదిక తయారుచేస్తున్నామని ఆయన తెలిపారు. శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణా బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెడతామని ఆయన తెలిపారు.
అందువల్ల ఈ రోజు జరుగబోయే కేంద్రమంత్రి వర్గ సమావేశంలో జీఓయం నివేదిక ఉండబోదని స్పష్టమయింది. అయితే నాలుగవ తేదీలోగా రాష్ట్ర నేతలతో షిండే మరికొన్ని సార్లు చర్చించి నివేదికకు తుది రూపం ఇచ్చే అవకాశం ఉంది. నాలుగవ తేదీన జరిగే మంత్రి మండలి సమావేశంలో బిల్లుని ఆమోదించిన వెంటనే అదే రోజు రాష్ట్రపతికి పంపబడవచ్చును. ఆయన దానిపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోతే, వెంటనే రాష్ట్ర శాసనసభకు పంపుతారు. అంటే వచ్చేనెల 9లోగా ఎప్పుడయినా తెలంగాణా బిల్లు రాష్ట్ర శాసనసభకు వచ్చే అవకాశం ఉన్నట్లు భావించవచ్చును.
శీతాకాల సమావేశాలలోనే బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్రం కృత నిశ్చయంతో ఉన్నందున, బిల్లుపై చర్చించేందుకు రాష్ట్ర శాసనసభకు అట్టే సమయం ఈయకపోవచ్చును. బహుశః రెండు మూడు రోజులలో, మహా అయితే ఒక వారంలోనే బిల్లుపై సభ చేత ‘మమ’ అనిపించేసి డిల్లీ తిప్పి పంపేయవచ్చును. ఇంత క్లిష్టమయిన, సున్నితమయిన అంశాన్ని కాంగ్రెస్ నిర్వహిస్తున్న తీరు చాలా అసంబద్దంగా అనిపిస్తున్నప్పటికీ, కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉండటంతో తనకు నచ్చిన విధంగా కధ నడిపిస్తోంది.