తెరాసను మోడీ ఎందుకు ఉపేక్షించినట్లో!
నిన్న తెలంగాణాలో నరేంద్ర మోడీ పాల్గొన్న నాలుగు సభలలో కూడా ఆయన నేరుగా కేసీఆర్ లేదా తెరాస పార్టీ పేరు పెట్టి విమర్శలు చేయలేదు. ఆయన కేవలం ‘తండ్రీకొడుకుల రాజ్యం’, ‘మామా అల్లుళ్ళ రాజ్యం’ కూడదని మాత్రమే అన్నారు. అంతకు మించి కేసీఆర్, తెరాసలపై ఆయన పెద్దగా విమర్శలు చేయలేదు. నరేంద్ర మోడీ ప్రచారంపై స్థానిక బీజేపీ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకొన్నారు. ఆయన తామెవరమూ ఎదుర్కోలేని కేసీఆర్ ను గట్టిగా ఎదుర్కొని తమకు కొండంత బలం కలిగిస్తారని ఆశపడ్డారు. కానీ మోడీ ‘కేసీఆర్’, ‘తెరాస’ పదాలు కూడా ఎక్కడా పలకకకుండా చాలా జాగ్రత్తపడ్డారు.
తెలంగాణాలో 1100 మంది విద్యార్ధులు చనిపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని బలంగా నొక్కి చెప్పిన మోడీ, తెలంగాణా కోసం తమ పార్టీ నేతలు చేసిన ఉద్యమాలు గురించి మాట్లాడలేదు. నిజానికి ఆయన కంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ కోసం, బీజేపీ తరపున గట్టిగా మాట్లాడారని చెప్పవచ్చును. అయితే తమ పార్టీ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు పనిగట్టుకొని మరీ వచ్చిన మోడీ, ఎందుకు ఈవిధంగా వ్యవహరించారు? అని ఆలోచిస్తే కొన్ని బలమయిన కారణాలు కనబడతాయి.
1.ఈ ఎన్నికలలో తెలంగాణాలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవచ్చని ఆయన వద్ద నివేదికలు ఉండి ఉండవచ్చును. అందువల్ల ఎన్నికల తరువాత తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రి అవ్వాలని కలలుగంటున్న కేసీఆర్ కు మద్దతు ఇచ్చి, అందుకు బదులుగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తెరాస యంపీల మద్దతు తీసుకొని, తను ప్రధాని కావాలనే కలను సాకారం చేసుకోవాలని మోడీ భావిస్తున్నందునే, కేసీఆర్, తెరాసలపై గట్టిగా విమర్శలు చేసి ఉండకపోవచ్చును. తెలంగాణా బీజేపీ నేతలు మొదటి నుండి కూడా తెదేపాతో కంటే తెరాసతో జత కట్టేందుకే మొగ్గు చూపుతున్నందున, ఎన్నికల తరువాత పరిస్థితులను బట్టి అవసరమయితే తెరాసకు మద్దతు ఇచ్చేందుకు బీజేపీ ఆలోచిస్తున్నందునే మోడీ తెరాసను ఉపేక్షించి ఉండవచ్చును.
2. ఇక తెరాస పట్ల ఈ మాత్రమయినా సానుకూలత చూపినట్లయితే, ఎన్నికల తరువాత వారు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపకుండా నిలువరించవచ్చును.
3. దేశంలో మోడీ ప్రభంజనం ఉందని భావిస్తున్నా అది ప్రధానంగా ఉత్తర భారతంలోనే ఎక్కువగా కనిపిస్తోంది తప్ప దక్షిణాదిన అంతగా లేదు. కారణం భాష అవరోధం, ప్రాంతీయ పార్టీల ప్రాభల్యం అధికంగా ఉండటమే. తెలంగాణా కూడా అందుకు మినహాయింపు కాదు. తెలంగాణా సెంటిమెంటు ముందు మోడీ ప్రభంజనం పెద్దగా ప్రభావం చూపక పోవచ్చును. అందువల్ల స్వయంగా తానే వచ్చి ప్రచారం చేసినా, అవి బీజేపీ అభ్యర్ధుల విజయావకాశాలను మెరుగు పరచలేవు. తెలంగాణా సెంటిమెంటు, తెలంగాణా క్రెడిట్, మంచి ఆర్ధిక, అంగ బలం, ప్రజలలో ఉన్న గుర్తింపు వగైరాలు గల కాంగ్రెస్, తెరాస అభ్యర్ధులతో పోలిస్తే బీజేపీ అభ్యర్ధులు అన్ని విధాల తేలిపోతున్నారు. ఈసంగతి మోడీకి తెలియదని భావించలేము. బహుశః అందువల్లే ఆయన తెరాసతో బాటు స్వంత పార్టీ పట్లకూడా ఉదాసీనంగా వ్యవహరించారు.
అందువల్ల ఇకపై బీజేపీ అభ్యర్ధులు తమ స్వశక్తితోనే కాంగ్రెస్, తెరాసలను ఎదుర్కొని గెలిచే ప్రయత్నాలు చేసుకోవలసి ఉంటుంది. తెదేపా అభ్యర్ధులలో చాలా మంది స్వయంశక్తితోనే గెలువగల సమర్ధులు, అలా గెలవలేనివారి తరపున ప్రచారం చేసేందుకు చంద్రబాబు ఉండనే ఉన్నారు.