చప్పగా సాగిన పవన్ కళ్యాణ్ స్పీచ్
posted on Apr 22, 2014 @ 2:51PM
నిజామాబాద్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగసభలో చప్పగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులతోపాటు బీజేపీ వర్గాలను కూడా నిరాశపరిచాడు. మెల్లమెల్లగా, ఒక్కోమాట, సాగదీస్తూ మాట్లాడిన పవన్ ప్రసంగం సభలో వున్న వారికి బోర్ కొట్టించింది. పవన్ మాట్లాడినంతసేపూ తన గురించి ఎక్కువగా చెప్పుకోవడంతో సరిపోయింది. మాట్లాడ్డానికి మాటలే లేనట్టు గత మీటింగ్స్ లో చెప్పిన మాటలు చెబుతూ విసుగెత్తించాడు. మాట్లాడినంతసేపూ తన ముందు వున్న కాగితాలు చదువుతూ బోరు కొట్టించాడు. ఒక దశలో అయితే చేతిలోకి కాగితాలు తీసుకుని ఎవరో రాసిచ్చిన ప్రసంగాన్ని బట్టీ పట్టినట్టు చదివేశాడు. కాసేపు టీఆర్ఎస్‌ని, కాసేపు కాంగ్రెస్‌ని తిట్టిన పవన్ కళ్యాణ్ మరి కాసేపు మోడీని పొగిడాడు. అయితే ఏ దశలోనూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ఎంతమాత్రం ఆకట్టుకునేలా లేదని పరిశీలకులు అంటున్నారు. పవన్ మాట్లాడిన మాటలు ఆయనకు రాజకీయాల పట్ల అపరిపక్వత స్పష్టంగా తెలుస్తోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పవన్ ఉత్తేజభరితంగా మాట్లాడి ఓట్లు రాలేలా చేస్తాడని ఆశించిన బీజేపీ నాయకులు పవన్ మాట్లాడిన తీరు చూసీ డీలా అయిపోయారు. పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణల వల్ల సచిన్ టెండూల్కర్ అభివృద్ధిలోకి వచ్చాడని పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు అందరూ నోళ్ళు తెరిచారు.