మోడీ ప్రసంగంలో కేసీఆర్ ప్రసక్తి లేదేమిటి?
posted on Apr 22, 2014 @ 5:26PM
ఈరోజు నిజామాబాద్ బీజేపీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్, మోడీ ఇద్దరూ తమ ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కేసీఆర్ కుటుంబంపై కూడా విమర్శలు గుప్పించారు, కానీ మోడీ మాత్రం తన ప్రసంగంలో ఎక్కడా కేసీఆర్, తెరాసల ప్రసక్తి రాకుండా జాగ్రత్త పడటం గమనార్హం. తెలంగాణాను బీజేపీ చేతుల్లో పెడితే అన్ని విధాల అభివృద్ధి చేస్తానని అన్నారు తప్ప ‘కాంగ్రెస్, తెరాసలను ఓడించి తెదేపా-బీజేపీ కూటమికే ఓటేయండి!’ అని నేరుగా ఆయన పిలుపు ఈయకపోవడం చాలా ఆశ్చరయం కలిగించింది. అదే నిన్న రాహుల్ గాంధీ తన ప్రసంగంలో కేసీఆర్ నే లక్ష్యంగా చేసుకొని ప్రసంగించి, అటువంటి నమ్మక ద్రోహికి ఓటేయవద్దని, కాంగ్రెస్ పార్టీకే ఓటేయమని గట్టిగా చెప్పారు. కానీ, తెరాసపై యుద్ధం ప్రకటిస్తారనుకొన్న మోడీ మాత్రం తన ప్రసంగంలో అసలు కేసీఆర్, తెరాసల ఊసే లేకుండా ముగించడం విశేషమేనని చెప్పుకోవచ్చును. ఎన్నికల తరువాత బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు బహుశః తెరాస మద్దతు కూడా అవసరం ఉంటుందనే ఆలోచనతోనే, కేసీఆర్, తెరాసపై విమర్శలు చేయకుండా, ఇతర అంశాల గురించి మాట్లాడి లౌక్యం ప్రదర్శించినట్లు కనబడుతోంది. కానీ ఆయన కేసీఆర్, తెరాసను ఉపేక్షిస్తే, తెదేపా-బీజేపీ కూటమికి ఆశించిన ప్రయోజనం దక్కదు. అందువల్ల ఆయన ఈరోజు హాజరయ్యే మిగిలిన మూడు సభలలో కేసీఆర్,తెరాసలపై విమర్శలు గుప్పిస్తారా? లేక ఆ పనిని చంద్రబాబు నాయుడు, కిషన్ రెడ్డిలకు అప్పగించి తాను లౌక్యంగా తప్పుకొంటారా? చూడవలసి ఉంది. మొదటగా మాట్లాడిన పవన్ కళ్యాణ్, తాను ఎన్నికల రాజకీయాలు చేయడానికి ఈ సభకు రాలేదని స్పష్టం చేసారు. కానీ, మోడీ ప్రసంగం చూస్తే, ఆయన ఎన్నికల రాజకీయాలు చేస్తున్నారా? అనే అనుమానం కలుగక తప్పదు.