అధికారం ఇవ్వకుంటే రెస్ట్ తీసుకుంటా: కేసీఆర్
posted on Apr 23, 2014 @ 11:30AM
కేసీఆర్ మాట తీరు గురించి అందరికీ తెలిసిందే. నోరు విప్పాడంటే చాలు విచిత్రమైన మాటలే నోట్లోంచి వస్తూనే వుంటాయి. సీమాంధ్రులు వినలేక చెవులు మూసుకోవాల్సిన మాటల తూటాల్ని వదలటంలో ఆయనకి ఆయనే సాటి. లేటెస్ట్ గా ఆయన సీమాంధ్రులను తిట్టడంతోపాటు తెలంగాణ ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేసేవిధంగా కూడా మాట్లాడుతున్నారు. మీరు చచ్చినట్టు తెరాసకే ఓటేయాలని బెదిరించినట్టుగా చెబుతున్నారు.
టీఆర్ఎస్‌కి 90 సీట్లు వస్తాయని బిల్డప్పు కోసం చెబుతున్నప్పటికీ తన పార్టీకి అంత సీన్ లేదని టీఆర్ఎస్ అధినేతకి అర్థమైపోయింది. తెలంగాణ ప్రజలు తన మాటలను నమ్మడం లేదని తెలుసుకున్న ఆయన ఇప్పుడు తనకే ఓటేయాలన్నట్టుగా బ్లాక్ మెయిలింగ్ చేస్తునారు. తనకు అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలకు సేవ చేస్తానని, అధికారం ఇవ్వకపోతే రెస్ట్ తీసుకుంటానని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. ఇది బెదిరింపో, దేబిరింపో అర్థంకాక తెలంగాణ ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.
టీఆర్‌ఎస్‌కి అధికారం ఇచ్చినా కేసీఆర్ రెస్ట్ తీసుకుంటాడని అనుకుంటున్నారు. టీడీపీ, బీజేపీ కూటమికి తెలంగాణలో విశేష ఆదరణ లభిస్తూ వుండటంతో కేసీఆర్‌కి వణుకుపుట్టి ఇలాంటి బెదిరింపులు చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే కేసీఆర్ బ్లాక్ మెయిలింగ్‌ని పట్టించుకునే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని పరిశీలకులు చెబుతున్నారు.