పవన్ చెప్పిన ఆ మూడు ముక్కలు
posted on Apr 22, 2014 @ 9:04PM
ఈరోజు మోడీతో కలిసి రెండు బహిరంగ సభలలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, ప్రధానంగా మూడు విషయాలు బలంగా చెప్పారు. 1. తెరాస యొక్క వేర్పాటువాదాన్ని బలంగా ఖండించడం. 2. కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టమని పిలుపు ఈయడం. 3. దేశానికి నరేంద్ర మోడీ నాయకత్వం అవసరమని గట్టిగా చెప్పడం.
తెరాస నేతలు, ముఖ్యంగా కేసీఆర్ ఎన్నికలలో గెలిచేందుకు చేస్తున్న విద్వేష ప్రచారం, అందుకు వారు ఎంచుకొన్న అసభ్యకరమయిన బాష పట్ల పవన్ కళ్యాణ్ చాలా ఆగ్రహంతో ఉన్నట్లు అర్ధమవుతోంది. అధికారం కోసం దేశ సమగ్రతకు భంగం కలిగించేలా పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడినా, వ్యహరించినా సహించబోనని హెచ్చరించారు. అయితే ఇటువంటి హెచ్చరికలను తెరాస నేతలు ఖాతరు చేసే స్థితిలో లేరనే సంగతి ఆయనకీ తెలిసే ఉండాలి. అటువంటప్పుడు పవన్ ఇటువంటి హెచ్చరికలు చేయడం వలన ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదు. సరికదా తిరిగి వారే ఆయనకు తీవ్రమయిన హెచ్చరికలు చేయడం, ఆయనపై అందరూ విమర్శలు గుప్పించడం మొదలుపెట్టవచ్చును.
అయితే పవన్ ఒక సామాజిక స్పృహ గల పౌరుడిగా ఆవిధంగా హెచ్చరించడంలో తప్పులేదని చెప్పవచ్చును. రాజకీయాలలో విలువలు ఎన్నడో పూర్తిగా దిగజారిపోయాయి. ఇప్పుడు తెరాస నేతలు బాషను కూడా మరింత దిగజార్చుకొని ‘మోడీ బీడీ’ ‘ పనికి రాని సన్నాసులు’ వంటి పదాలతో సభ్యసమాజం తల దించుకొనేలా మాట్లాడుతున్నారు. అందుకే పిల్లి మెడలో గంట కట్టేందుకు ఎవరు సాహసించకపోవడంతో, నేడు పవన్ కళ్యాణ్ ఆపని చేయవలసి వచ్చింది.
ఇక పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పట్ల తనకున్న వ్యతిరేఖతను ఎన్నడూ దాచుకొనే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడూ చేయలేదు. కారణం కాంగ్రెస్ పాలనలో పొంగి పొర్లుతున్న అంతులేని అవినీతి, వంశ పారంపర్య పరిపాలన. అందుకే ఆయన నేరుగా రాహుల్ గాంధీ పైనే విమర్శలు ఎక్కుపెట్టారు. ఒక సాధారణ క్రికెట్ ఆటగాడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడాలంటే అనేక స్థాయిల్లో ఆది తన ప్రతిభ నిరూపించుకోవలసి ఉంటుంది. కానీ 120 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి కీలకమయిన ప్రధాని పదవి చెప్పట్టేందుకు, రాహుల్ గాంధీ కేవలం తన గాంధీ, హ్రూ వంశంలో పుట్టడమే ఒక అర్హతగా భావిస్తున్నారని ఎద్దేవా చేసారు. రాహుల్ ఎటువంటి అనుభవము, సామర్ధ్యము, తెలివితేటలు లేకుండా దేశానికి ప్రధాన మంత్రి అయిపోదామని కలలు కంటే మాత్రం ప్రజలు అంగీకరించరని ఈసభలో మరోమారు స్పష్టంగా చెప్పారు. అవినీతిలో కూరుకుపోయి, వంశ పారంపర్య పాలనను ప్రజల నెత్తిన రుద్దుతున్న కాంగ్రెస్ పార్టీని దేశం నుండి తరిమి కొట్టి దేశాన్ని రక్షించు కోవాలని ఆయన మరోమారు నినదించారు.
గుజరాత్ రాష్ట్రాన్ని ప్రగతి పధంలో నడిపించిన కారణంగానే అక్కడి ప్రజలు మోడీకి వరుసగా మూడుసార్లు పట్టం కట్టారని దృడంగా నమ్ముతున్న పవన్ కళ్యాణ్ అదే మాటను నేడు కూడా మరోమారు గట్టిగా చాటి చెప్పారు.