బలిదానాల వల్లే తెలంగాణ వచ్చింది: నరేంద్ర మోడీ
posted on Apr 22, 2014 @ 3:15PM
తెలంగాణ మేం ఇచ్చాం.. మేం తెచ్చాం అని కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు చెప్పుకుంటున్నాయని, కానీ నిజానికి తెలంగాణ రావడానికి ప్రధాన కారణం ఆత్మ బలిదానాలేనని భారతీయ జనతాపార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. తెలంగాణ ఎవరో ఇస్తే వచ్చందని కాదని ఆయన చెప్పారు. నిజామాబాద్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణను చిన్న శిశువుతో ఆయన పోల్చుతూ, ఆ శిశువును బాగా పెంచి పెద్ద చేసేవాళ్ళ చేతుల్లో పెట్టాలని, అది చాలా ముఖ్యమని అన్నారు. ఆ బాధ్యతను బీజేపీ తీసుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్ చేతిలో ఈ తెలంగాణ బాలుడిని పెడితే కాంగ్రెస్ ఆ బాలుడిని ఎదగనివ్వదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ 11 వందల మంది బలిదానం చేసుకునేవరకూ తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మితే దారుణంగా మోసపోతారని ఆయన హెచ్చరించారు. తెలంగాణ బిడ్డ టి.అంజయ్యని అవమానించిన చరిత్ర రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీకి వుందని మోడీ గుర్తు చేశారు. ఈ కుటుంబానికి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజల్ని మరింత అవమానిస్తారని అన్నారు. తెలంగాణ బిడ్డ అయిన పీవీ నరసింహరావును ఆయన చనిపోయిన తర్వాత కూడా దారుణంగా అవమానించిన చరిత్ర గాంధీ కుటుంబానికి వుందని ఆయన చెప్పారు. దేశంలో పీవీ నరసింహరావు పేరు కనిపించకుండా చేసిన దుర్మార్గం గాంధీ కుటుంబానిదని ఆయన చెప్పారు. ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజలకు ఎంతో కీలకమైనవని, వారి భవిష్యత్తు ఎలా వుండాలో నిర్ణయించకోవాల్సింది వారేనని నరేంద్ర మోడీ అన్నారు.