ముసలాయన పొట్టలో 12 బంగారు బిస్కెట్లు

  ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రికి స్థానిక వ్యాపారి అయిన ఒక ముసలాయన వచ్చాడు. తాను మంచినీళ్ళు తాగుతూ వుండగా పొరపాటుగా బాటిల్ మూత గొంతులో పడి పొట్టలోకి వెళ్ళిపోయిందని, దాన్ని ఆపరేషన్ చేసి బయటకి తీయండని రిక్వెస్ట్ చేశాడు. ఎక్స్ రే, స్కానింగ్ గట్రాలు చేసిన డాక్టర్లకి పొట్టలో బాటిల్ మూత అయితే కనిపించలేదుగానీ, ఏవో లోహం తాలూకు ఆనవాళ్ళు కనిపించాయి. డాక్టర్లు ఆ ముసలాయనకి ఆపరేషన్ చేస్తే పొట్టలోంచి మొత్తం 12 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. ఈ విషయాన్ని డాక్టర్లు పోలీసుల చెవిలో వేశారు. పోలీసులు వచ్చి ముసలాయన్ని ఇంటరాగేట్ చేస్తే అసలు విషయం బయటపడింది. మొన్నీమధ్యే సదరు ముసలాయన సింగపూర్ వెళ్ళొచ్చాడు. సింగపూర్‌ నుంచి ఇండియాకి బంగారం తెచ్చుకోవాలని ముచ్చటపడ్డాడు. మామూలుగా అయితే కస్టమ్స్ వాళ్ళకి దొరికిపోతానని ఎంచక్కా పన్నెండు బంగారు బిస్కెట్లు మింగేశాడు. కస్టమ్స్ దగ్గర ఎలాంటి ఇబ్బందీ రాలేదుగానీ, ఆ తర్వాతే ముసలాయనకి అసలు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. తాను మింగిన 12 బంగారు బిస్కెట్లు నంబర్ టూకి వెళ్తే బయటపడిపోతాయని అనుకున్నాడు. కానీ అలాంటిది జరగకపోవడంతో టెన్షన్ పడిపోయాడు. బాటిల్ మూత సాకు చెప్పి ఆస్పత్రిలో చేరాడు. ఆపరేషన్ చేసిన డాక్టర్లు మీ పొట్టలో బంగారం మీదే అని తనకే ఇచ్చేస్తాడని అనుకున్నాడు. అయితే వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముసలాయన ప్లాన్ అడ్డం తిరిగింది.

బీజేపీ, టీడీపీ భాయీ భాయీ : కలసి పనిచేస్తారట

  భారతీయ జనతాపార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య ఏర్పడిన అంతరం తొలగిపోయింది. రెండు పార్టీలూ ఈ ఎన్నికలలో స్నేహపూర్వక వాతావరణంలో కలస పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. బీజేపీ తనకు కేటాయించిన స్థానాల్లో బలహీనులైన అభ్యర్థులను నిలబెట్టిందని ఆగ్రహించిన చంద్రబాబు సీమాంధ్రలో బీజీపీతో కటిఫ్ చెప్పాలని భావించారు. అయితే బీజేపీ కేంద్ర నాయకత్వంతోపాటు, ఆంధ్రప్రదేశ్ నాయకత్వం కూడా చంద్రబాబుతో చర్చలు జరిపింది. ఢిల్లీ నుంచి ప్రకాష్ జవదేకర్ ప్రత్యేకంగా వచ్చి చంద్రబాబుని కలిసి చర్చలు జరిపారు. ఇరు పార్టీల మధ్య వున్న అభిప్రాయ భేదాల విషయంలో చర్చించి, వాటన్నిటినీ క్లియర్ చేశారు. ఆ తర్వాత రెండు పార్టీల ప్రతినిధులూ తమ మధ్య పొత్తు కొనసాగుతుందని ప్రకటించారు. రెండు పార్టీలు ఈ ఎన్నికలలో కలసి పనిచేసి విజయం సాధిస్తాయని వారు అన్నారు. సీమాంధ్రలో బీజేపీకి కేటాయించిన కొన్ని అసెంబ్లీ సీట్లను ఆ పార్టీ వదులుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఒక స్థానాన్ని వదులకుంటున్నామని బీజేపీ ప్రకటించినప్పటికీ, నామినేషన్ల చివరి రోజైన రేపటికి మరిన్ని స్థానాలు వదులుకునే అవకాశం వుందని తెలుస్తోంది.

దివిసీమ బాగు కోసమే రాజకీయాల్లోకి: కంఠంనేని రవిశంకర్

      దివిసీమని ఎన్నో సమస్యలు చుట్టుముట్టి వున్నాయి. దివిసీమ ప్రజలు కనీసం తాగటానికి మంచినీరు కూడా లేక బాధపడుతున్నారు. ఇప్పుడు తాగే నీరు కూడా విషంగా మారిపోయి రోగాల బారిన పడుతున్నారు. నీటి సమస్యే కాకుండా ఎన్నో సమస్యలు దివిసీమ ప్రజల్ని బాధపెడుతున్నాయి. ఎన్నికలప్పుడే కనిపించే నాయకుల చేతిలో ఇక్కడి ప్రజలు మోసపోయారు. ఇక్కడి ప్రజల బాగోగుల గురించి పట్టించుకునే నాయకుడే లేకుండా పోయారు. అందుకే తన ప్రాంతాన్ని తానే బాగు చేసుకునే ఉద్దేశంతో రాజకీయ రంగప్రవేశం చేశానని కంఠంనేని రవిశంకర్ అంటున్నారు. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్న కంఠమనేని రవిశంకర్ ఇప్పటికే తన ప్రాంతం బాగుకోసం ఎన్నో పనులు చేశారు. దివిసీమ ఎదుర్కొంటున్న సమస్యల మీద, వాటి పరిష్కార మార్గాల మీద పూర్తి అవగాహన వున్న తనకు అధికారం లభిస్తే దివిసీమను బాగుచేసుకుంటానని ఆయన చెబుతున్నారు. ఈ ప్రాంత ప్రజలు తనను ఎంతో ప్రేమిస్తారని, తాను తనకోసం అధికారం కోరుకోవడం లేదని.. తన ప్రాంతం బాగు కోసం, తన ప్రాంత ప్రజల అభ్యున్నతి కోసమే అధికారం కోరుకుంటున్నానని వివరిస్తున్నారు.    

‘భూత్‌నాథ్ రిటర్న్స్’ చూసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

  భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అమితాబ్ బచ్చన్ నటించిన తాజా చిత్రం ‘భూత్‌నాథ్ రిటర్న్స్’ని చూశారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శించిన ప్రత్యేక షోలో ఆయన ఈ సినిమాని చూశారు. ఈ సినిమాలో ఒక భూతం ఎన్నికలలో నిలబడటం, ఓటు హక్కుని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చెప్పడం.. ఇలాంటి సందేశాత్మక కథాంశంతో రూపొందిన చిత్రం కావడంతో ఆయన ఈ సినిమాని ప్రత్యేకంగా చూశారు. ఈ షోలో రాష్ట్రపతితోపాటు కథానాయకుడు అమితాబ్ బచ్చన్, ఇతర నటీనటులు, యూనిట్ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ చిత్రం చూసిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ మంచి చిత్రాన్ని రూపొందించారంటూ యూనిట్ సభ్యులను అభినందించారు. జ్ఞాపికలను అందించారు.

విజయవాడ నుంచి నామినేషన్ కి పురందేశ్వరి రెడీ.!

      విజయవాడ బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా పురందేశ్వరి రేపు విజయవాడలో నామినేషన్ వేసేందుకు సిద్దమైనట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ల పొత్తు వ్యవహారం గందరగోళంలో పడటంతో ఇరు వర్గాలూ ఇప్పుడు తమ తమ వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ చాలా నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. పొత్తు భాగంగా తెలుగుదేశం పార్టీకి అప్పజెప్పిన సీట్లలో ఇప్పుడు బీజేపీ తరపున నామినేషన్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి కొన్ని కీలకమైన నియోజకవర్గాలను మాత్రం వదులకోకూడదని బీజేపీ భావిస్తోందట. టీడీపీతో పొత్తులేదని అధికారికంగా ప్రకటన వెలువడిన వెంటనే విజయవాడ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా పురందేశ్వరి పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగనున్నట్లు తెలుస్తోంది.

సీమాంధ్ర కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో

      సీమాంధ్ర కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో శుక్రవారం ఉదయం కేంద్ర మంత్రి జైరాం, ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, ఆనం తదితరులు హజరయ్యారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ... టిడిపి, వైకాపా మేనిఫెస్టోలను నమ్మవద్దని అన్నారు. జగన్ అధికారంలో లేనప్పుడే లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే ఐదు సంతకాలతో రాష్ట్రాన్ని అమ్మేస్తారని విమర్శించారు.   ఏపీ మేనిఫెస్టో ముఖ్యాంశాలు : * ప్రభుత్వ కార్యాలయాల్లో ఐదు రోజుల పనిదినాలు * రిటైర్‌మెంట్ వయసు 60 ఏళ్లకు పెంపు * రూ.5వేల కోట్లతో రైతుల అత్యవసర సహాయనిధి ఏర్పాటు * వ్యవసాయానికి 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఏర్పాటు * వచ్చే ఐదేళ్లు విద్యుత్ చార్జీలు పెంపు ఉండదు * రైతుల నుంచి ధాన్యం సేకరణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు * కృష్ణా, గోదావరి, పెన్నా నదుల అనుసంధానం చేస్తాం * విశాఖ, విజయవాడ, తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు * ప్రతి జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు * ప్రధాన ఓడరేవులకు అనుబంధంగా షిప్పింగ్ హార్బర్ * పేదలకు జనతా వస్తాల పంపిణీ * వితంతు, వృద్ధులకు రూ.వెయ్యి పెన్షన్ * వికలాంగులకు రూ.1500 పెన్షన్ * ప్రభుత్వ ఇంటర్ కాలేజీ విద్యార్థులకు లాప్‌టాప్‌లు * జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా మెడికల్ కాలేజీలు * ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు * స్వయం సహాయక సంఘాల రుణాలు మాఫీ * ఆడపిల్ల పుడితే 100 గజాల స్థలం ఇస్తాం * బెల్టు షాపులు మూయిస్తాం * 100 యూనిట్లలోపు వినియోగదారులకు ఉచిత విద్యుత్ * డిష్ కనెక్షన్‌తో ఉచిత కలర్ టీవీలు ఇస్తాం

బీజేపీని చూస్తున్న హరికృష్ణ – అడ్డుపడుతున్న చంద్రబాబు

అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు. పాపం హరికృష్ణ ఇదే టైపులో ఆక్రోశిస్తున్నాడు. బావ టిక్కెట్ ఇవ్వడు.. వేరే పార్టీలో చేరనివ్వడు అని బాధపడుతున్నట్టు సమాచారం. హిందూపురం, పెనమలూరు, నూజివీడు టిక్కట్లని ఆశించిన హరికృష్ణకి చంద్రబాబు మొండి చెయ్యి చూపించాడు. ఒక దశలో మూడు నియోజవర్గాలలో ఎక్కడ నుంచైనా ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని హరికృష్ణ భావించినప్పటికీ ఆ తర్వాత బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్న వెంటనే రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో సంప్రదింపులు కూడా మొదలుపెట్టేశారు. అయితే ఇక్కడ కూడా హరికృష్ణకి చంద్రబాబు నుంచి సమస్యలు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ కుమారుడైన హరికృష్ణ మరో పార్టీలో చేరడం తెలుగుదేశానికి ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం వుంది కాబట్టి హరికృష్ణని మీ పార్టీలో చేర్చుకోవద్దని బీజేపీ నాయకులకు చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. హరికృష్ణని రేపటి వరకు అదుపు చేస్తే, రేపటితో నామినేషన్లు ముగుస్తాయి కాబట్టి ఆ తర్వాత హరికృష్ణ శాంతించే అవకాశం వుందని భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీలోకి చేర్చుకోమని చెప్పేయకుండా ఇష్యూని నాన్చమని బీజేపీ నాయకత్వానికి సూచించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు బీజేపీ, తెలుగుదేశం సంబంధాలలో నిమిషానికో మార్పు కనిపిస్తోంది. రెండు పార్టీలమధ్య పొత్తు వికటించిన పక్షంలో హరికృష్ణకి బీజేపీ రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించే అవకాశం వుంది.

తన భార్య దగ్గర దొరికిన డబ్బులకు లెక్కలున్నాయట

      వైకాపా మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్ది మాజీ మంత్రి పార్థసారథి భార్య కమల నుంచి హైదరాబాద్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్న 45 లక్షలకు స౦బంధించి తన వద్ద లెక్కలు వున్నాయని పార్థసారథి చెప్పారు. ఎన్నికల ఖర్చు కోసమే తన భార్య హైదరాబాద్ లోని కార్పోరేట్ బ్యాంకు నుంచి ఆ నగదును డ్రా చేసుకొని వస్తున్నారని తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం లోక్ సభ అభ్యర్థి రూ. 70 లక్షల వరకూ ఖర్చు పెట్టవచ్చని గుర్తు చేశారు. మరోవైపు మచిలీపట్నం లోక్‌సభ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జగన్ తన పార్టీ వాటాగా పలు విడతలుగా డబ్బును అందజేస్తున్నారని, గురువారం దొరికిన డబ్బు కూడా ఈ వాయిదాల్లో భాగంగా ఇచ్చినదేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బిజెపి తెలంగాణ మేనిఫెస్టో

      తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోను టీ-బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో రూపొందించామని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు: 1. రైతులకు 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్. 2. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి. 3. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా. 4. వ్యవసాయాభివృద్ధి కోసం ఆధునిక పరిజ్ఞానం. 5. ప్రభుత్వ-ప్రైవేటు ప్రాజెక్టులకు పెద్దపీట. 6. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ. 7. రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్. 8. ఆదిలాబాద్ జిల్లాకు కొమురం భీం పేరు. 9. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినం. 10. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం. 11. అక్టోబర్ 19న గిరిజన సాధికార దినం. 12. అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా, మూడెకరాల భూమి లేదా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం. 13. పారదర్శకతతో కూడిన ప్రభుత్వ వ్యవస్థ. 14. బ్రాండ్ ఇండియా నిర్మాణానికి కృషి.

ఓటర్లకి చెల్లని నోట్లు పంచిన జగన్ పార్టీ అభ్యర్థి

  ఈమధ్య జరిగిన మునిసిపల్ ఎన్నికలలో చెల్లని నోట్లు పంచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిని పోలసులు అరెస్టు చేశారు. నోట్లు పుచ్చుకున్న ఓటర్లని కూడా అరెస్టు చేశారు. కృష్ణాజిల్లా గుడివాడ మునిసిపల్ ఎన్నికలలో కౌన్సిలర్‌గా పోటీ చేసిన వైకాపా అభ్యర్థి బొమ్మారెడ్డి ధనలక్ష్మి ఓటర్లకు చెల్లని నోట్లు పంపిణీ చేసింది. నోట్లు అందుకున్నప్పుడు గమనించని ఓటర్లు ఆ తర్వాత మాకు చెల్లని నోట్లు పంచావేంటని ఆందోళనకి దిగారు. ఈ విషయం ఆనోటా ఆనోటా పోలీసులకు చేరింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఓట్లను కొనడానికి నోట్లు వినియోగించిన ‘ధన’లక్ష్మిని అరెస్టు చేశారు. ఆమె దగ్గరి నుంచి 32 వేల రూపాయలను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరిచారు. ఓటర్లకు డబ్బులు ఇవ్వడంతోపాటు డబ్బు తీసుకుని ఓట్లు వేయడం కూడా నేరమే కాబట్టి నోట్లు పుచ్చుకున్న కొంతమంది ఓటర్లను కూడా అరెస్టు చేసి కేసులు పెట్టారు.

హైదరాబాద్ ఆస్పత్రికి కేటీఆర్ : కిడ్నీ ఆపరేషన్

  సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తెరాస నేత కేటీఆర్ గురువార నాడు సిరిసిల్ల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న కేటీఆర్‌కి సిరిసిల్ల ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసిన డాక్టర్లు, ఆయనను తక్షణం హైదరాబాద్‌కి తీసుకెళ్ళాల్సిందిగా కుటుంబ సభ్యులకు సూచించారు. దాంతో ఆయన్ని శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేటీఆర్‌కి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన కిడ్నీలో భారీ స్థాయిలో వున్న రాళ్ళని గుర్తించారు. వాటి కారణంగానే కేటీఆర్ కడుపునొప్పితో బాధపడుతున్నారని తీర్మానించారు. నిపుణులైన వైద్యులు ఆయనకి శస్త్ర చికిత్స చేసి కిడ్నీలో వున్న రాళ్ళని తొలగించారు. మరో రెండు రోజులపాటు ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు కేటీఆర్‌కి సూచించినట్టు తెలుస్తోంది.

హిందూపురం: బాలకృష్ణపై హరికృష్ణ పోటీ?

  ఈసారి ఎన్నికలలో పోటీ చేసి గెలిచేయాలని ఉవ్విళ్ళూరుతున్న హరికృష్ణని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన హిందూపురం, కృష్ణాజిల్లాలోని పెనమలూరు, నూజివీడు స్థానాల మీద ఆశలు పెట్టుకున్న హరికృష్ణకి నిరాశే ఎదురైంది. ఏ సీటు అడిగినా చంద్రబాబు ఇవ్వకపోవడంతో హరికృష్ణ ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు సమాచారం. తనను నిర్లక్ష్యం చేయడం వల్ల ఎంత మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందో చంద్రబాబుకి ప్రాక్టికల్‌గా రుచి చూపించాలని హరికృష్ణ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే అన్నయ్య ఇష్టపడుతున్నాడని కూడా పట్టించుకోకుండా హిందూపురం సీటు మీద ఆసక్తి చూపించి, సదరు సీటు తనకి దక్కకుండా చూసిన బాలకృష్ణ మీద కూడా హరికృష్ణ కోపంగా వున్నాడట. అందువల్ల అటు చంద్రబాబుకి, ఇటు బాలకృష్ణకి జాయింట్‌గా షాక్ ఇవ్వడానికి హరికృష్ణ ఆలోచిస్తున్నట్టు సమాచారం. హిందూపురం నుంచి ఇండిపెండెంట్‌గా కానీ, ఏదైనా పార్టీ ద్వారాగానీ పోటీ చేసి, తనతోపాటు జూనియర్ ఎన్టీఆర్‌ కూడా హిందూపురంలోనే మకాం వేసి గెలవాలని హరికృష్ణ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇలా చేయడం మంచి పద్ధతి కాదని కుటుంబ సభ్యులు సర్ది చెబుతున్నప్పటికీ హరికృష్ణ ఆగ్రహానికి ఆనకట్ట పడటం లేదని వినికిడి. నిజంగానే హిందూపురం నుంచి బాలకృష్ణకి వ్యతిరేకంగా హరికృష్ణ పోటీ చేస్తే కుటుంబ రాజకీయం మాంఛి రసపట్టుకు చేరుకోవడం ఖాయం.

మమత, ఉమాభారతి : లేడీ లీడర్లకి తప్పిన గండాలు!

  గురువారం ఇద్దరు లేడీ లేడర్లు తృటిలో గండాల నుంచి బయటపడ్డారు. వారిలో ఒకరు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మరొకరు బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమాభారతి. బెంగాల్‌లోని మాల్దాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి మమతా తాను బస చేసిన హోటల్‌ రూమ్‌లో వుండగా గురువారం సాయంత్రం గదిలో వున్న ఏసీకి నిప్పంటుకుని గది నిండా పొగలు వ్యాపించాయి. మమత పెద్దగా కేకలు వేయడంతో ఆమె సహాయకులు ఆమెని సురక్షితంగా బయటకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం కారణంగా మమతకు ఎలాంటి గాయాలూ తగల్లేదు. అయితే ఈ ప్రమాదం వెనుక కుట్ర వుందన్న అనుమానాలను మమత పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా వుంటే భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకురాలు ఉమాభారతి యు.పి.లోని ఝాన్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర్ ప్రదేశ్‌లో హెలికాప్టర్‌లో తిరుగుతున్నారు. అయితే గురువారం నాడు ఉమ ఎక్కిన హెలికాప్టర్ అంతు చిక్కకుండా పోయింది. యుపిలోని రాజ్‌ఘాట్ నుంచి కళ్యాణపుర గ్రామానికి వెళ్లాల్సి వున్న హెలికాప్టర్ దారితప్పి మధ్యప్రదేశ్‌లోని శివపురి ప్రాంతానికి వెళ్ళిపోయింది. వాతావరణం బాగాలేకపోవడంతో అక్కడే దిగింది. రావలసిన హెలికాప్టర్ సమయానికి రాకపోవడంతో అధికారులు టెన్షన్ పడిపోయారు. చివరికి హెలికాప్టర్, ఉమ సురక్షితంగా వున్నారని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా వుంటే హెలికాప్టర్‌కి సరిగా సిగ్నల్ ఇవ్వకపోవడం వల్లే ఇలా జరిగిందని, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కావాలనే ఇలా చేసిందని భారతీయ జనతాపార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

హరికృష్ణ.. కిం కర్తవ్యమ్?

  తెదేపా అభ్యర్ధుల 5వ జాబితా కూడా వెలువడింది. కానీ, అందులో కూడా నందమూరి హరికృష్ణ పేరు కనబడలేదు. ఇక నేడో రేపో తెదేపా బీజేపీలు తెగతెంపులు చేసుకొన్నట్లయితే, ఆ స్థానాలలో పోటీ చేసేందుకు కూడా ఇప్పటికే పార్టీ అభ్యర్ధుల పేర్లు ఖరారు అయ్యున్నాయి. కనుక ఈసారి శాసనసభకు పోటీ చేయాలని ఉవ్విళ్ళూరిన హరికృష్ణకు ఇక ఎంతమాత్రం ఆ అవకాశం లేనట్లే భావించవచ్చును. ఇది స్వయం కృతాపరాధమేనని చెప్పక తప్పదు.   తను పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి యన్టీఆర్ కొడుకుననే అహంభావంతో వ్యవహరిస్తూ ఆయన ఎప్పుడూ కూడా పార్టీలో తనకొక ప్రత్యేక స్థానం, హోదా కావాలని కోరుకోన్నారే తప్ప, అది పొందేందుకు ఏనాడు కృషి చేసిందీ లేదు, అందుకు అనుగుణంగా ఏనాడు వ్యవహరించనూ లేదు. తత్ఫలితంగానే నేడు టికెట్ కోసం చంద్రబాబు చుట్టూ ప్రదక్షిణాలు చేయవలసి వస్తోంది. కానీ, ఆయన ఒకవేళ స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగినట్లయితే అది కూడా మరో పెద్ద తప్పు అవుతుంది.   తనంతట తానుగా నందమూరి రాజకీయ వారసత్వాన్ని అందుకోలేని ఆయన, స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగినట్లయితే, నందమూరి వంశానికి చెందినవారు గనుకనే అటు పార్టీకి, తనకి, నందమూరి కుటుంబీకులకు సమస్యలు సృష్టించిన వారవుతారు. ఇప్పటికే పార్టీతో ఆయనకున్న విభేదాల కారణంగా కొడుకు జూ.యన్టీఆర్ సినీ జీవితంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒకవేళ ఆయన తెదేపా అభ్యర్ధిపై స్వతంత్ర అభ్యర్ధిగా పోటీకి దిగి గెలిచినా, ఓడినా ఆ ప్రభావం జూ. యన్టీఆర్ తో సహా అందరి మీద పడటం ఖాయం. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ చేయకపోవడమే మేలేమో!

జూలు విదిల్చిన చంద్రబాబు : దారిలోకొచ్చిన బీజేపీ

  మొన్నటి వరకూ పొత్తుల విషయంలో తెలుగుదేశం మీద పైచేయి సాధించిన భారతీయ జనతాపార్టీ ఇప్పుడు చంద్రబాబు జూలు విదిలించేసరికి దారిలోకి వచ్చింది. మీకిచ్చిన సీట్లలో చెత్త అభ్యర్థులను నిలబెడుతున్నారు. మీతో పొత్తు కట్ అని చంద్రబాబు ప్రకటించేసరికి బిజేపీ నాయకత్వం గతుక్కుమంది. నిన్నమొన్నటి వరకూ చంద్రబాబుని బెదిరిస్తూ మాట్లాడిన బీజేపీ నాయకులు ఇప్పుడు చాలా శాంతంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబుని శాంతింపజేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ జాతీయ నేత వెంకయ్య నాయుడు పొత్తులు, సీట్లలో నిలిపిన అభ్యర్థుల విషయంలో ఏర్పడిన పొరపొచ్చాలు గాలిలో మబ్బుల్లా తేలిపోతాయని ప్రకటించారు. అలాగే మరో జాతీయ నేత ప్రకాష్ జవదేకర్ తెలుగుదేశంతో పొత్తు కొనసాగుతుందని, రెండు పార్టీల మధ్య వున్న అభిప్రాయ భేదాలు తొలగిపోయి మంచి వాతావరణం ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తాజాగా చంద్రబాబుతో చర్చించి, ఆయన్ని శాంత పరిచేందుకు బీజేపీ సీమాంధ్ర నాయకుడు, వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థి హరిబాబు ఈరోజు చంద్రబాబుని కలిసి స్నేహగీతం ఆలాపించున్నారు. మొత్తానికి చంద్రబాబు సింహగర్జన చేసేసరికి బీజేపీ దారిలోకి వచ్చిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

సీతయ్య మాట చంద్రబాబు వినడు!

  సాధారణంగా సీతయ్య (నందమూరి హరికృష్ణ) ఎవరిమాటా వినడు. అయితే సీతయ్య మాట చంద్రబాబు నాయుడు వినడు. ఎందుకంటే, అదంతే! తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర అసెంబ్లీ స్థానాలకు విడుదల చేసిన ఐదో జాబితాలో కూడా హరికృష్ణకి మొండిచెయ్యే దక్కింది. బావమరిది హరికృష్ణ బెదిరింపులను, అలకలను బావగారు చంద్రబాబు నాయుడు ఎంతమాత్రం పట్టించుకున్నట్టు లేరు. మొదట హిందూపూర్ టిక్కెట్, ఆ తర్వాత కృష్ణాజిల్లా పెనమలూరు టిక్కెట్ కోరుకున్న హరికృష్ణ ఆ రెండు స్థానాలూ తన చేజారిపోవడంతో లేటెస్ట్ గా నూజివీడు స్థానానికి షిఫ్టయ్యాడు. తనకి టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానన్న బెదిరింపులకు భయపడిపోయి చంద్రబాబు తనకి టిక్కెట్ ఇచ్చేస్తాడని హరికృష్ణ అనుకున్నాడు. అయితే హరికృష్ణ అనుకున్నదొకటి.. చంద్రబాబు చేసిందొకటి. నూజివీడు స్థానాన్ని వెంకటేశ్వరరావుకి ఇచ్చేశాడు. దాంతో హరికృష్ణకి పెద్ద షాక్ తగిలింది. ఇప్పుడు మరో స్థానాన్ని ఇవ్వమని అడగటమా.. లేక ఇండిపెండెంట్‌గా బరిలో దిగడమా అనే మీమాంసలో హరికృష్ణ ఉన్నట్టు సమాచారం.

అంతులేని పొత్తుల కధ

  రెండున్నర నెలల క్రితం మొదలయిన తెదేపా-బీజేపీల మధ్య సీట్ల సర్దుబాట్లు, పొత్తుల సస్పెన్స్ సీరియల్, రేపటితో నామినేషన్లు వేసేందుకు గడువు ముగుస్తున్నా కూడా ఇంకా గంటకో ట్విస్టుతో ఉత్కంఠభరితంగా సాగిపోతూనే ఉంది. నిన్నఅర్ధరాత్రి వరకు తెదేపా-బీజేపీ అగ్ర నేతల మధ్య జరిగిన చర్చల్లో సీట్ల సర్దుబాట్లపై ఉభయుల మధ్య ఎటువంటి అంగీకారం కుదరనట్లు సమాచారం. బీజేపీకి ఇచ్చాపురం, నరసారావుపేట, గుంతకల్లు, తాడేపల్లిగూడెం మరియు సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గాలలో బలమయిన అభ్యర్ధులు లేరు గనుక వాటిని తమకు తిరిగి ఇమ్మని, అందుకు ప్రతిగా గోదావరి జిల్లాలో ఒక యంపీ సీటు ఇస్తామని తెదేపా చేసిన ప్రతిపాదనను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకి౦చినట్లు తెలుస్తోంది. ఈవ్యవహారం ఎంతకూ ముగిసేలా కనబడకపోవడంతో, బీజేపీకి కేటాయించిన సీట్లలో తెదేపా తన అభ్యర్ధులను నిలబెట్టేందుకు సిద్దమవుతోంది. అదేవిధంగా బీజేపీ కూడా ఒకవైపు తెదేపాతో చర్చలు సాగిస్తూనే సీమాంధ్రలో మొత్తం అన్ని స్థానాలలో తన అభ్యర్ధులను పోటీలో నిలబెట్టేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.   ఇక సందట్లో సడేమియా అన్నట్లుగా పొట్లూరి వరప్రసాద్ ఇప్పుడు బీజేపీ చుట్టూ ప్రదక్షిణాలు ప్రారంభించినట్లు సమాచారం. బీజేపీ కూడా ఆయనను విజయవాడ నుండి పోటీకి దింపేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇక రెండు పార్టీలు పొత్తులు రద్దు చేసుకొంటున్నట్లు అధికారికంగా ప్రకటించడమే మిగిలుంది. సీమాంద్రాలో పొత్తులు రద్దు చేసుకొని తెలంగాణాలో కొనసాగడం కష్టం గనుక బహుశః అక్కడ కూడా రద్దయిపోవచ్చును.

తెలుగుదేశం సీమాంధ్ర ఐదో జాబితా

  తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయబోయే తన అభ్యర్థుల ఐదో జాబితా విడుదల చేసింది. 23 మంది అభ్యర్థుల జాబితా ఇలా వుంది.. కురుపాం- జనార్ధన్ థాట్రాజ్, చీపురుపల్లి- కిమిడి మణాళిని, ఆనపర్తి- రామకృష్ణారెడ్డి, కొవ్వూరు- జవహర్, రాజోలు- సూర్యారావు, పాలకొల్లు- నిమ్మల రామానాయుడు, ఉండి- శివరామరాజు, నరసాపురం- బండారు మాధవనాయుడు, చింతలపూడి- పీతల సుజాత, నూజివీడు- వెంకటేశ్వరరావు, విజయవాడ ఈస్ట్- గద్దె రామ్మోహనరావు, మంగళగిరి- తులసి రామచంద్రప్రభు, ప్రత్తిపాడు- రావెల కిషోర్‌బాబు, గుంటూరు ఈస్ట్- మద్దాల గిరి, మాచర్ల- బొనబోయిన శ్రీనివాస్ యాదవ్, గిద్దలూరు- అన్నె రాంబాబు, కొండపి- డా.డోల శ్రీబాల వీరాంజనేయస్వామి, గూడురు- డా.బాతుల జ్యోత్స్నలత, సూళ్లూరుపేట- పరస వెంకటరత్నం, ప్రొద్దుటూరు- వరదరాజులు రెడ్డి, పీలేరు- ఎమ్.డి. ఇక్బాల్, తిరుపతి- వెంకటరమణ, సత్యవేడు- తల్లారి ఆదిత్య.

కేటీఆర్ ఆనారోగ్యం : టీఆర్ఎస్‌లో ఆందోళన

  తెరాస అధినేత కేసీఆర్ తనయుడు కేటీఆర్ తరచుగా అనారోగ్యంపాలు అవుతూ వుండటం పట్ల టీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో వున్నారు. గురువారం ప్రచారంలో వున్న ఆయనకి అకస్మాత్తుగాకడుపునొప్పి రావడంతో బాగా ఇబ్బందిపడ్డారు. ఆయన కడుపునొప్పితో బాధపడుతున్న విషయాన్ని గమనించిన టీఆర్ఎస్ నాయకులు ఆయన్ని వెంటనే సిరిసిల్లలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయన్ని పరిశీలించిన వైద్యులు కేటీఆర్‌ని తక్షణం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్తే మంచిదని సూచించారు. అంతలోనే కేటీఆర్ కడుపునొప్పి తగ్గుముఖం పట్టడంతో హైదరాబాద్‌కి బయలుదేరలేదు. ప్రస్తుతం ఆయన సిరిసిల్లలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అలాగే ఒక పదిహేను రోజుల క్రితం కేటీఆర్‌కి హైదరాబాద్‌లో వుండగా అర్థరాత్రి సమయంలో భారీగా కడుపునొప్పి వచ్చింది. దాంతో ఆయన్ని హుటాహుటిగా ఆస్పత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయించారు. ఆ తర్వాత కొన్నిరోజులు ఆయన బయట కనిపించలేదు. ఇప్పుడు మరోసారి ఆయనకు భారీగా కడుపునొప్పి వచ్చింది. కేటీఆర్‌కి ఇలా చీటికిమాటికి కడుపునొప్పి వస్తూ వుండటం పట్ల టీఆర్‌ఎస్ వర్గాలు ఆందోళనపడుతున్నాయి.