సూర్యాపేటలో చంద్రబాబు కామెడీ

  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నల్గొండ జిల్లా సూర్యాపేటలో భలే కామెడీ చేశారు. పాపం రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాలు, 42 పార్లమెంట్ స్థానాలకు వేలాది మంది అభ్యర్థుల్ని పరిశీలించి, వడపోసి, ఎంపికచేసి, నిర్ణయించి... ఇలా నానా తంటాలు పడిన ఆయన బుర్రలో బోలెడన్ని పేర్లు మిక్సయిపోయినట్టున్నాయి. అందుకే ఆయన గుర్తుంచుకోవాల్సిన వాళ్ళ పేర్లు మర్చిపోతున్నారు. మొన్నీమధ్య సూర్యాపేటలో ప్రచారానికి వెళ్ళిన చంద్రబాబు ప్రసంగిస్తూ వుండగానే ఆయన పక్కనే వున్న అసెంబ్లీ అభ్యర్థి పేరు మరచిపోయారు. ‘ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న ...’’ అని ఆగిపోయి అసెంబ్లీ అభ్యర్థి పేరు పక్కనే వున్న అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డినే  కనుక్కుని మైకులో ఎనౌన్స్ చేశారు. అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థి పేరునే మరచిపోయిన చంద్రబాబును చూసి అప్పుడు అందరూ నవ్వుకున్నారు. రాజకీయ వర్గాల్లో కూడా దీని గురించి చెప్పుకుని నవ్వుకుంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు మైండ్ బాగా పనిచేయాలంటే కొంతకాలం రెస్ట్ తీసుకోవాలి. ఎన్నికల సమయంలో రెస్టు ఎలాగూ వుండదు. ఎన్నికల తర్వాత ఆయన రెస్టు తీసుకుంటారో లేదో చూడాలి.

రాహుల్ గాంధీ మహబూబ్‌నగర్ సభ విశేషాలు

  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దక్కించుకునే పార్లమెంట్ స్థానాల మీద భారీగా ఆశలు పెట్టుకున్న రాహుల్ గాంధీ మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని మాట్లాడారు. ఆయన మాటల సారాంశం చూద్దాం. 1- తెలంగాణ అరవై ఏళ్ళ కల ఫలించింది. 2- తెలంగాణ కల నెరవేరడానికి కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన పాత్ర పోషించింది. 3- తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీ తెలంగాణకి అడుగడుగునా అడ్డుపడ్డాయి. 4- తెలంగాణ బిల్లు రూపకల్పనలోగానీ, ఆమోదం పొందడంలోగానీ టీఆర్ఎస్‌కి ఎలాంటి సంబంధం లేదు. 5- తెరాసకి అధికారం ఉంటే చాలు. మరేమీ అక్కర్లేదు. ప్రజల సంక్షేమం అక్కర్లేదు. 6- తెలంగాణ ఇస్తే తెరాసని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని మాట తప్పారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని మరోసారి మాట తప్పాలని అనుకుంటున్నారు. 7- ఎన్నికలలో చేసిన వాగ్దానాలు ఆ తర్వాత తెరాస మరచిపోతుంది. 8- తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సమతుల్యమైన అభివృద్ధి చేస్తాం. 9- తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల్లో పదేళ్ళపాటు పన్ను మినహాయింపు ప్రకటిస్తాం. 10- ప్రాణహిత చేవెళ్ళను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తాం. 11- కాంగ్రెస్ దేశం కోసం చాలా చేసింది. ప్రతిపక్షాలు దేశాన్ని పేద, ధనిక భాగాలుగా విడదీస్తున్నాయి. 12- తెలంగాణ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి. ‘మేడిన్ తెలంగాణ’ వస్తువులు రావాలి. 13- మహిళాబిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి.

ఆశ్చర్యపోయే తీర్పు ఖాయం: రఘువీరా రెడ్డి

  మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడంలో బహుశః కాంగ్రెస్ వారిని మించినవారు మరొకరు ఉండరేమో! పార్టీ ఇచ్చిన టికెట్లను కూడా విసిరికొట్టి, అభ్యర్ధులు వేరే పార్టీలలోకి మారిపోయినా కూడా, తమ పార్టీ టికెట్స్ కోసం విపరీతమయిన పోటీ ఉందని, సీమాంధ్రాలో ఉన్న 175 స్థానాలకు ఏకంగా 2000 దరఖాస్తులు వచ్చాయని ఆయన చెప్పుకొన్నారు. అంతేకాక ఈ ఎన్నికలలో ప్రజలు కనీవినీ ఎరుగనిరీతిలో కాంగ్రెస్ అనుకూలమయిన తీర్పు ఇవ్వబోతున్నారు. అది ఏవిధంగా ఉంటుందంటే, అది 1978 నాటి రికార్డు తిరగవ్రాయబోతోంది అని చెప్పారు. ఈ ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలన్నీ కనబడకుండా మాయమయిపోతాయని జోస్యం చెప్పారు. సమైక్యాంధ్ర పేరిట పార్టీని పెట్టి, నేటికీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని ప్రజలను మభ్యపెడుతున్న కిరణ్ కుమార్ రెడ్డే రాష్ట్ర విభజనకు అసలు కారకుడని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో చిరకాలంగా పనిచేస్తున్న రఘువీరా రెడ్డి, ఆ విధంగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడంలో అసహజమూ లేదు. అయితే ఆయన చెప్పిన మాటలలో కిరణ్ కుమార్ రెడ్డి గురించి చెప్పిన దాంట్లో నూటికి నూరు శాతం నిజముందని అంగీకరించవచ్చును.

ఆమ్ ఆద్మీ పార్టీ కుష్టువ్యాధితో సమానం: బాదల్

  అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ రోజు రోజుకీ ప్రజల్లో ఆదరణ కోల్పోతోంది. రాజకీయ పక్షాలన్నీ ఆమ్ ఆద్మీ పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నాయి. అసలే దేశంలో రాజకీయాలు నాశనమైపోయాయని అనుకుంటూ, వాటిని ఇంకా నాశనం చేయడానికి కేజ్రీవాల్ కృషి చేస్తున్నాడన్న విమర్శులు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా వుంటే ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ ఇప్పటి వరకూ ఆమ్ ఆద్మీ పార్టీని ఎవరూ తిట్టని విధంగా, ఘోరాతి ఘోరంగా తిట్టాడు. ఆమ్ ఆద్మీ పార్టీని ఆయన కుష్టువ్యాధితో పోల్చారు. కుష్టువ్యాధి మనిషిని ఎలా క్రమంక్రమంగా, మెల్లగా చంపేస్తుందో, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కుష్టువ్యాధి సమాజాన్ని, ప్రజాస్వామ్యాన్ని అలా క్రమక్రమంగా, మెల్లగా చంపేస్తుందని ఆయన అన్నారు. ఈసారి ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఒక్క సీటు కూడా గెలవదని ప్రకాష్ సింగ్ బాదల్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు.

తెలుగుదేశం కోసం నందమూరి మోక్షజ్ఞ ఏం చేస్తున్నాడు?

  నందమూరి, నారా కుటుంబాలు ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తేవడానికి కృషి చేస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్, బాలకష్ణ, కళ్యాణ్‌రామ్, తారకరత్న... వీళ్ళందరూ ఇంటిపట్టున వుండకుండా ఎన్నికల ప్రచారం పనుల్లో పూర్తిగా నిమగ్నమై వున్నారు. మరి ఈమధ్యే ఓటు హక్కు కూడా వచ్చిన నందమూరి తారకరామ మోక్షజ్ఞ ఏం చేస్తున్నాడు. బయటకి వచ్చి ప్రచారం చేయబోతున్నాడా? తెలుగుదేశం పార్టీ బలపడటం కోసం తనవంతుగా ఏం చేస్తున్నాడు? ఈ ప్రశ్నలు నందమూరి, నారా అభిమానుల్లో వున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం దొరికింది. మిగతా అందరూ పాత పద్ధతులలో వెళ్తూ తెలుగుదేశానికి ప్రచారం చేస్తుంటే, మోక్షజ్ఞ మాత్రం హైటెక్ పద్ధతులలో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తున్నాడట. అది కూడా సోషల్ మీడియా ఆధారంగా! మోక్షజ్ఞ సోషల్ మీడియాలో నిపుణులైన కొంతమందిని ఒకచోట చేర్చి తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో ప్రచారం చేయించే కార్యక్రమంలో నిమగ్నమై వున్నాడట. గత నెల రోజులుగా మోక్షజ్ఞ ఇదే ప్రాజెక్టులో తలమునకలుగా వున్నట్టు సమాచారం. దీన్నిబట్టి అర్థమవుతున్నదేంటంటే, నందమూరి వంశంలో మోక్షజ్ఞ కూడా ముదురే!

మలేసియా విమానం ఎమర్జెన్సీ లాండింగ్ : కుట్ర ఏమైనా వుందా?

  మలేసియా నుంచి బెంగళూరు వెళ్లాల్సిన విమానాన్ని ఎమర్జెన్సీ లాండింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? 166 మంది ప్రయాణికులతో వున్న విమానాన్ని లాండ్ చేయడం ఏదనా కుట్రలో భాగమా? ఈ కోణంలో మలేసియా పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టారు. అసలే విమానం మాయమైపోయిన విషాదంలో వున్న మలేసియా ఏ చిన్న అనుమానం వచ్చినా ఉలిక్కి పడుతోంది. ముఖ్యంగా విమానా విషయంలో చాలా జాగ్రత్తగా వుంటోంది. 166 మంది ప్రయాణికులతో మలేసియా నుంచి బెంగుళూరుకు బయల్దేరిన ఎంహెచ్ విమానాన్ని టేకాఫ్ తీసుకోగానే ఎమర్జెన్జీ లాండింగ్ చేశారు. టైరు పేలిపోవడం, ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతో ఈ విమానాన్ని కిందకి దించేశారు. విమానం బయల్దేరేసరికి అందులో ఎవరైనా కుట్రదారులు ఉన్నారేమో దర్యాప్తు చేస్తున్నట్లు మలేసియా ఐజీపీ తెలిపారు.

మెక్సికోలో విమాన ప్రమాదం 8 మంది మృతి

  విమానాలు జనాన్ని మింగేస్తున్నాయి. మొన్నామధ్య 259 మందితో మాయమైపోయిన మలేసియా విమానం ఆధారాలు ఎంత వెతికినా దొరకడం లేదు. నెల రోజులు అయిపోయినా ఈ విమానం ఆచూకీ కనుక్కోవడం ఎవరివల్లా కావడం లేదు. ఈ ప్రమాదం విషయం ఇలా వుంటే, మరో మలేసియా విమానం నిన్న దాదాపు రెండు వందల మందితో ప్రయాణిస్తూ సాంకేతిక లోపానికి గురైంది. విమానంలో ప్రయాణిస్తున్న వారి టైమ్ బాగుండి ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇదిలా వుంటే ఉత్తర మెక్సికోలో ఇద్దరు పైలెట్లతో కలిపి ఎనిమిది మందితో ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ విమానం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ఎనిమిదిమందీ మరణించారు. విమానశ్రయంలో దిగబోతున్న ఈ విమానం అదుపు తప్పి దగ్గర్లో వున్న ఒక బిల్డింగ్‌ని ఢీకొని కుప్పకూలింది.

రాహుల్ గాంధీకి దేశాన్ని పాలించే సీన్ లేదు: నరేంద్ర మోడీ

  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని గెలిపించాలని ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నిన్న అమేథీ నియోజకవర్గ ప్రజలను కోరడంపై బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు. తన సొంత నియోజకవర్గం అమేథీనే సరిగా చూసుకోలేని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దేశానికి ఎలా నాయకత్వం వహిస్తారని ఎద్దేవా చేశారు. గాంధీ కుటుంబ అక్రమ ఆస్తులను, రాబర్ట్ వాద్రా రాజ్యాంగేతరశక్తిగా మారి ఆస్తులు సంపాదించుకోవడాన్ని మోడీ తీవ్రంగా దుయ్యబట్టారు. తల్లీకొడుకులు, అల్లుడు కలసి దేశాన్నినాశనం చేశారని విమర్శించారు. మహిళల భద్రతపై రాహుల్‌గాంధీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. దేశంలో మహిళలపై ఎక్కువ నేరాలు జరిగిన పది రాష్ట్రాల్లో ఏడు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలేనని మోడీ ఆరోపించారు.

ఢిల్లీ హైకోర్టు పీఠంపై తెలుగు తేజం : జస్టిస్ రోహిణి ప్రమాణ స్వీకారం

  రాష్ట్రంలో తెలుగువాళ్ళు ప్రాంతీయ విభేదాలతో పాతాళానికి పడిపోతున్నా, ఢిల్లీలో మాత్రం తెలుగు తేజం గౌరవప్రదమైన స్థానాన్ని చేరుకుంది. అది కూడా ఒక తెలుగు మహిళ. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా హైదరాబాద్‌కి చెందిన మహిళ జస్టిస్ రోహిణి ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా, తొలి తెలుగు మహిళగా జస్టిస్ రోహిణి ఘనతను సొంతం చేసుకున్నారు. జస్టిస్ రోహిణి హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు.

మరోసారి రాజకీయ సన్యాసానికి కిరణ్ రెడీ

  శాసనసభ తిరస్కరించిన విభజన బిల్లుని యధాతదంగా పార్లమెంటులో ప్రవేశపెట్టినట్లయితే తాను రాజకీయ సన్యాసం తీసుకొంటానని సవాలు విసిరిన మాజీ సీయం.కిరణ్ కుమార్ రెడ్డి, ఆ పని చేయకపోగా గంపెడు ఆశలతో వేరు కుంపటి పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగారు. కానీ కనీసం తనుకూడా గెలిచే అవకాశం లేదని గ్రహించడంతో, ఎన్నికలలో పోటీ చేయకుండా తప్పుకొని తన స్థానంలో తమ్ముడు కిషోర్ రెడ్డిని పీలేరు నుండి బరిలో దింపి మరోమారు అస్త్ర సన్యాసం చేసారు. అయితే నేటికీ ఆయన తన సమైక్య గానం కొనసాగిస్తూనే ఉన్నారు. చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలలో నిన్న ఆయన నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మళ్ళీ మరోమారు రాజకీయ సన్యాసం ప్రతిజ్ఞ చేయడం విశేషం. తను గనుక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకొంటానని ప్రకటించారు.   తనకు పదవులు మీద ప్రేమ లేదు గనుకనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చానని అన్నారు. చంద్రబాబు, జగన్ తదితరులందరికీ చాలా పదవీ కాంక్ష ఉందని, అందుకే ప్రజలను మభ్యపెట్టేందుకు వారు అనేక ఆచరణ సాధ్యం కాని అనేకానేక వాగ్దానాలు చేస్తున్నారని ఎద్దేవా చేసారు. వారికి ప్రజల మీద నిజమయిన ప్రేమ కలిగి ఉంటే, తనతో కలిసి సమైక్య పోరాటానికి రాగలరా? అని సవాలు విసిరారు.   నిజమే! చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా తాము ముఖ్యమంత్రులు కావాలనే కోరికను ఎన్నడూ దాచుకొనే ప్రయత్నం చేయలేదు. సరికదా ఇరువురూ తాము అధికారం చెప్పట్టగానే తాము ఏ ఏ ఫైళ్ళ మీద మొదటి సంతకాలు చేస్తారో కూడా గొప్పగా చాటింపు వేసుకొంటున్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి తనకా ఆ ఆవకాశం ఎంతమాత్రం లేదని గ్రహించినందునే, ఆయన పోటీ నుండి తప్పుకొన్నారు. అందుకే ఆచరణ సాధ్యం కానీ సమైక్యం కోసం ప్రత్యర్ధులు పోరాడగలరా? అని సవాలు విసురుతున్నారు. అదే సాకుతో రేపు తన రాజకీయ సన్యాసానికి కూడా ఇప్పటి నుండే మార్గం సుగమం చేసుకొంటున్నారు. అటువంటప్పుడు ఇంకా ఈ మండుటెండల్లో పడి తిరుగుతూ ఈ వృదా ప్రయాస ఎందుకు? దానివలన ఫలితం ఏమిటి? ఆయనకే తెలియాలి.

తుమ్మితే ఊడే ముక్కు తెదేపా-బీజేపీల పొత్తులు

  తెదేపా-బీజేపీ ఎన్నికల పొత్తులు తెగిపోతాయనుకొన్న సమయంలో ఇరు పార్టీల కృషివల్ల మళ్ళీ కలిసికొనసాగేందుకు సిద్దపడ్డాయి. అయితే నేటికీ వాటి పొత్తులు తుమ్మితే ఊడిపోయే ముక్కు చందాన్నే కొనసాగుతున్నాయి. కారణం తెలుగుదేశం సూచించిన విధంగా కొన్ని నియోజక వర్గాలలో బీజేపీ తన అభ్యర్ధులను మార్చినప్పటికీ, బీజేపీకి కేటాయించిన ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు మరియు కడప అసెంబ్లీ సీట్లకు తెదేపా అభ్యర్ధులు నామినేషన్లు వేసారు. వారికి చంద్రబాబే స్వయంగా బీ-ఫారంలు అందజేయడం, బీజేపీకి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. వారిరువురి చేత వెంటనే నామినేషన్లు ఉపసంహరింపజేయమని బీజేపీ ఒత్తిడి తెస్తోంది. మరో రెండు రోజుల్లో ఎన్డీయే భాగస్వాములతో కలిసి నరేంద్ర మోడీ హైదరాబాదులో నిర్వహించే భారీ బహిరంగ సభలో చంద్రబాబు కూడా పాల్గొనవలసి ఉంది. అయితే పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆయన ఆ సభలో పాల్గోనకపోవచ్చును. అందువల్ల బీజేపీ కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉంది. అయితే ఎన్నికలలో విజయమే లక్ష్యంగా కలిసి పనిచేయాలనుకొన్న ఆ రెండు పార్టీల మధ్య నేటికీ సరయిన సయోధ్య లేకపోగా, వాటిలో అవే కొట్లాడుకోవడం వల్ల ప్రత్యర్ధులకు వరంగా మారుతోంది. మరి ఇటువంటి పొత్తుల వలన ఆ రెండు పార్టీలు ఏవిధంగా ప్రయోజనం పొందగలవని భావిస్తున్నాయో వాటికే తెలియాలి.

నేడు శ్రీకాకుళంలో బాలయ్య ఎన్నికల ప్రచారం

  మొట్టమొదటిసారి హిందూపురం నుండి ఎన్నికలలో పోటీ చేయబోతున్ననందమూరి బాలకృష్ణ, తన నియోజక వర్గంలో ఇప్పటికే ఒకసారి ప్రచారం నిర్వహించారు. పార్టీలో మంచి ప్రజాకర్షణ గల ఆయన కేవలం హిందూపురంకే పరిమితం అవలేరు కనుక సీమాంధ్రలో అన్ని జిల్లాలలో కూడా ప్రచారం చేయనున్నారు. మొదటగా ఆయన ఈరోజు శ్రీకాకుళంలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నారు. ఈరోజు ఉదయం పది గంటలకు హైదరాబాదు నుండి విమానంలో విశాఖ కు చేరుకొని అక్కడి నుండి హెలికాప్టర్ ద్వారా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సారవకోట చేరుకొని ఎన్నికల ప్రచారం మొదలు పెడతారు. ఈరోజు ఆయన పోలాకి, ఉర్లాం, ఆముదాలవలస, భ్రుజ కొల్లివలస, సింగుపురం, శ్రీకూర్మం, శ్రీకాకుళం పట్టణంలో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఈ నందమూరి లెజెండ్ ప్రచారానికి ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేసినా చేయకపోయినా, ఆయనకున్న ప్రజాకర్షణ కారణంగా ప్రజలు ఆయనను చూసేందుకు, ఆయన చెప్పే డైలాగ్స్ వినేందుకు భారీ ఎత్తున తరలిరావడం తధ్యమని చెప్పవచ్చును.

తెలంగాణా ప్రజలపై రాహుల్ ప్రభావం చూపగలరా?

  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈరోజు మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గోనున్నారు. మళ్ళీ 25వ తేదీన మరోమారు ప్రచారానికి వస్తారు. ఈ ఎన్నికలలో తెలంగాణాలో అన్ని యంపీ సీట్లు తన ఖాతాలో వేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో సీమాంధ్రలో పార్టీని, తమ నేతల భవిష్యత్తుని కూడా పణంగా పెట్టి తెలంగాణా ఏర్పాటు చేసినప్పటికీ, కేసీఆర్ మాట తప్పడంతో కాంగ్రెస్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారయింది. తెలంగాణాలో అవలీలగా గెలవగల స్థితి నుండి నేడు చెమటోడ్చినా గెలవలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఎన్నడూ రాష్ట్రంలో అడుగు పెట్టని జైరామ్ రమేష్ వంటి సీనియర్ నేత, టీ-కాంగ్రెస్ కి అండగా నిలబడి పార్టీ తరపున కేసీఆర్ తో పోరాటం చేయవలసి వస్తోంది. నిజానికి కాంగ్రెస్ లో తెరాస విలీనమయినా లేక ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకొన్నా ఇంత ప్రయాసపడవలసిన అవసరముండేదే కాదు. కానీ కేసీఆర్ పదవీ కాంక్ష వలన వాటి మధ్య పొత్తులు పొసగలేదు. అందుకే సోనియా, రాహుల్ గాంధీలు సైతం ఆయనను డ్డీ కొనేందుకు దిగిరావలసి వస్తోంది.   ఇక రాహుల్ గాంధీ తన ప్రచారంలో ప్రజలకు ఏమి చెప్పబోతున్నారో తేలికగానే ఊహించవచ్చును. ఆయన కూడా తన తల్లి సోనియాగాంధీ చెప్పినట్లే తెలంగాణా ఏర్పాటులో కేసీఆర్ కేవలం ప్రేక్షకపాత్రకే పరిమితమని, తన తల్లి తెలంగాణా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం, ఆమె పట్టుదల కారణంగానే తెలంగాణా ఏర్పడిందని చెప్పవచ్చును. అదేవిధంగా తనకు పక్కలో బల్లెంలా తయారయిన నరేంద్ర మోడీపై కూడా తీవ్ర విమర్శలు చేస్తూ, దేశాన్ని విభజించాలని ప్రయత్నిస్తున్న అటువంటి వ్యక్తితో చంద్రబాబు పొత్తులు పెట్టుకొన్నారని ఆక్షేపించవచ్చును. అయితే తనను ప్రధానిని చేయడం కోసమే బలమయిన ఆంద్ర రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన సంగతి ఆయన అంగీకరించరు.   ఈసారి ఎన్నికలలో తెలంగాణా సెంటిమెంటు బలంగా ఉన్న కారణంగా ఆయన ఎంత గొప్పగా మాట్లాడినా, అది ప్రజల మీద ఎటువంటి ప్రభావం చూపలేవు. అదే పనిని టీ-కాంగ్రెస్ నేతలందరూ కలిసికట్టుగా చేయగలిగితే మాత్రం తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది.

అవనిగడ్డ నుంచి రవిశంకర్ కంఠంనేని నామినేషన్

      దివిసీమను స్వర్గసీమగా మార్చడమే ధ్యేయంగా అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ కంఠంనేని శనివారం అవనిగడ్డ ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ రెబల్ అభ్యర్థిగా, ఇండిపెండెంట్‌గా రవిశంకర్ కంఠంనేని నామినేషన్ దాఖలు చేశారు. వాస్తవానికి అవనిగడ్డ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టిక్కెట్ రవిశంకర్ కంఠంనేనికి దక్కాల్సి వుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మండలి బుద్ధప్రసాద్ జంప్ చేయడంతో బుద్ధప్రసాద్‌కి చంద్రబాబు అవనిగడ్డ టిక్కెట్ ఇచ్చారు.   అయితే బుద్ధ ప్రసాద్‌కి స్థానిక సమస్యలు, వాటి పరిష్కారం మీద అవగాహన లేదని, ఆయన ఇక్కడ నుంచి గెలిచే అవకాశాలు లేవని స్థానిక తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఎంతోకాలంగా తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేయడంతోపాటు, పదవి లేకపోయిన్పటికీ తన సొంత ప్రాంతం మీద అభిమానంతో అవనిగడ్డ పరిసరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన రవిశంకర్ కంఠంనేనికి అవనిగడ్డ టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో స్థానిక ప్రజలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల ప్రోత్సాహంతో రవిశంకర్ కంఠమనేని అవనిగడ్డ నియోజకవర్గానికి నామినేషన్ వేశారు. శనివారం నాడు రవిశంకర్ కంఠమనేని మోపిదేవిలోని తన నివాసం నుంచి నామినేషన్ వేయడానికి అవనిగడ్డ ఎం.ఆర్.ఓ. కార్యాలయానికి పదివేలమందికి పైగా మద్దతుదారులతో ప్రదర్శనగా బయలుదేరారు. మార్గమధ్యంలో ఆయన కులమతాలకు అతీతంగా దేవాలయాలు, మసీదులు, చర్చ్ లను సందర్శించి సర్వమత సమానత్వాన్ని చాటారు. ఆ తర్వాత అవనిగడ్డ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. రవిశంకర్ కంఠమనేనికి మోపిదేవి నుంచి అవనిగడ్డ వరకు స్థానికుల నుంచి మంచి ప్రతిస్పందన, అభినందనలు లభించాయి. అవనిగడ్డ నియోజకవర్గం నుంచి ఈ స్థాయిలో, ఇంతమంది మద్దతుదారులతో నామినేషన్ వేసిన తొలి వ్యక్తి రవిశంకర్ కంఠమనేని అని స్థానికులు చెబుతున్నారు. రవిశంకర్ కంఠమనేని అవనిగడ్డ స్థానం నుంచి విజయం సాధించడం ఖాయమని అంటున్నారు.

తవ్వకాల్లో దొరికిన 450 కిలోల బాంబు!

      ఒకటి కాదు.. రెండు కాదు.. 450 కిలోల బాంబు పశ్చిమ బెంగాల్లోని కలైకుండా ఎయిర్‌బేస్ ప్రాంతంలో వున్న మౌలిషూల్ గ్రామం దగ్గర జరిపిన తవ్వకంలో దొరికింది. ఒక స్ట్రీట్ లైట్ పాతడానికి చిన్న గుంట తవ్వుతూ వుండగా బయటపడిన ఈ భారీ బాంబుని చూసి ఎయిర్‌ఫోర్స్ అధికారులే నోళ్ళు తెరిచారు. ఈ బాంబు నాలుగు అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పుతో వుంది. భూమిలో మూడడుగుల గుంట తవ్వగానే బయటపడింది. 1939లో తయారైన ఈ బాంబు రెండో ప్రపంచ యుద్ధంలో పేలకుండా మిగిలిపోయిన భారీ బాంబుగా అధికారులు గుర్తించారు. ఈ బాంబు ఇప్పటికీ పేలే స్థితిలోనే వుందని అధికారులు చెబుతున్నారు. ఈ భారీ బాంబుని త్వరలో దూరంగా వున్న అరణ్య ప్రాంతంలోకి తీసుకెళ్ళి డిఫ్యూజ్ చేయనున్నట్టు ఎయిర్ బేస్ అధికారులు వెల్లడించారు.

మళ్ళీ మళ్ళీ ఆయనే గెలవాలని ప్రజలు కోరుకొంటున్నారుట

  మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈరోజు చీపురుపల్లిలో నామినేషన్ వేసారు. రాష్ట్ర విభజన వ్యవహారంలో జిల్లా ప్రజల నుండి తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కొన్న ఆయన, అందరూ అనుకొంటునట్లుగా తన పట్ల ప్రజలలో ఎటువంటి వ్యతిరేఖత లేదని నిరూపించేందుకన్నట్లుగా ఈ సందర్భంగా భారీ ఊరేగింపుతో తరలివెళ్లి చాలా అట్టహాసంగా నామినేషన్ వేశారు. “గత పదేళ్లుగా నేను నా కుటుంబ సభ్యులు అందరూ కూడా జిల్లా ప్రజల సేవలోనే ఉన్నాము. చీపురుపల్లి నియోజక వర్గంలో, విజయనగరం జిల్లా వ్యాప్తంగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్పటిన సంగతి ప్రజలకు తెలుసు. నేను ఎక్కడి వాడినని ఎవరయినా ప్రశ్నిస్తే, చీపురుపల్లి వాడినని గర్వంగా చెప్పుకొంటాను. నేను నా కుటుంబ సభ్యులు అందరూ ఎల్లపుడూ కూడా ప్రజలకు అందుబాటులోనే ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తుంటాము. అందుకే ప్రజలు కూడా మళ్ళీ మళ్ళీ నేనే కావాలని ఓటేసి గెలిపించుకొంటున్నారు. నాకు ఓటేసి గెలిపించిన నా అక్కలు, చెల్లెమ్మలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా నేను శిరసు వంచి నమస్కరించి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఈసారి కూడా మీరందరూ మళ్ళీ నాకే ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. కాంగ్రెస్ ను వీడి ఇతర పార్టీలలో చేరినవారు కొంతమంది చాలాచాలా గొప్పమాటలు, వాగ్దానాలు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకే ద్రోహం చేసిన వారికి ప్రజలు ఓటేసి గెలిపిస్తే రేపు వారు ప్రజలను మాత్రం మోసం చేయరని నమ్మకం ఏమిటి? అందువలన ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే సీమాంధ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది,” అని బొత్స అన్నారు.   ఒకప్పుడు విభజన జరిగితే తప్పేమిటి? అని ప్రశ్నించిన  బొత్స సత్యనారాయణ, ఆ తరువాత సమైక్య ఉద్యమం జోరందుకొన్నపుడు, తాను విభజనను వ్యతిరేఖిస్తున్నాని అన్నారు. అనడమే కాకుండా నాటి  ముఖ్యమంత్రి కిరణ్ తయారుచేసిన వినతి పత్రం మీద అందరితో బాటు సంతకం కూడా చేసారు. కానీ మళ్ళీ ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డిని తప్పించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు పసిగట్టగానే ఆయన తన దూకుడు తగ్గించుకొని విభజన వ్యవహారంలో అధిష్టానందే అంతిమ నిర్ణయమని దానిని అందరూ శిరసావహించాల్సిందే అంటూ వాదించారు.   కానీ తనను కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ పదవి నుండి తప్పించిన తరువాత, పార్టీ మారబోతున్నట్లు మీడియా లీకులిచ్చారు. మళ్ళీ  ఇప్పుడు తన కుటుంబంలో అందరికీ పార్టీ టికెట్స్ కేటాయించడంతో, పార్టీ వదిలినవారు ద్రోహులని అంటున్నారు. రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలని భావిస్తున్న ప్రజలకు, సీమాంధ్ర అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ కే ఓటేయాలని ఆయన కోరుతున్నారు. ఏది ఏమయినప్పటికీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడిపోయినా బొత్స మాత్రం తప్పకుండా గెలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.  

వారణాశిలో 24న నరేంద్రమోడీ నామినేషన్

      భారతీయ జనతాపార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఈనెల 24న వారణాశి పార్లమెంట్ నియోజకవర్గం నామినేషన్ దాఖలు చేయనున్నారు. నరేంద్రమోడీ గుజరాత్‌లోని వదోదర, ఉత్తరప్రదేశ్‌లోని వారణాశి నియోజకవర్గాల నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. వదోదరలో ఇప్పటికే మోడీ నామినేషన్ దాఖలు చేశారు. వారణాశిలో మోడీ 24న నామినేషన్ దాఖలు చేయనున్న విషయాన్ని మోడీ సన్నిహితుడు అమిత్ షా ప్రకటించారు. వారణాశిలో మే 12న పోలింగ్ జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక ఎమ్మెల్యే అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు.

చంద్రబాబు కూడా సీట్లు అమ్ముకుంటున్నాడట!

      ఏ ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు మీద ఈ ఆరోపణ రాలేదు.. కానీ, ఈ ఎన్నికలలో మాత్రం చంద్రబాబు మీద ఈ ఆరోపణ వచ్చింది. ఇప్పటి వరకూ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి మీద, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు జగన్ మీద మాత్రమే టిక్కెట్లు అమ్ముకున్న ఆరోపణలు ఎక్కువగా వచ్చాయి. చంద్రబాబు మీద మాత్రం రాలేదు.   తాజాగా చంద్రబాబు మీద ఈ ఆరోపణ వచ్చింది. చంద్రబాబు టిక్కెట్లు అమ్మకుంటున్నారని ఆరోపించింది మరెవరో కాదు.. కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే లింగారెడ్డి. తెలుగుదేశం ఇప్పటికి ఆరు లిస్టులు ప్రకటించినా అందులో లింగారెడ్డి పేరు లేదు. ప్రొద్దుటూరు టిక్కెట్ మరొకరికి కేటాయించారు. తనకు ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదని ప్రశ్నించడానికి శనివారం లింగారెడ్డి చంద్రబాబు నాయుడిని కలిశారు. తనకు ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదని లింగారెడ్డి ప్రశ్నిస్తే చంద్రబాబు నుంచి మౌనమే సమాధానంగా ఎదురైందట. దాంతో లింగారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రొద్దుటూరి టిక్కెట్‌ని తనకు ఇవ్వకుండా మరొకరికి ఇచ్చారని, ప్రొద్దుటూరు టిక్కెట్‌ని అమ్ముకున్నారని ఆరోపించారు.