కేవీపీకి ‘రెడ్‌కార్నర్’పై చేతులెత్తేసిన ఏఐసీసీ

      రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో వుండగా వైఎస్సార్, కేవీపీ ఆధ్వర్యంలో జరిగిన టైటానియం కుంభకోణం విషయంలో అమెరికా కేవీపీ రామచంద్రరావుకు ‘రెడ్ కార్నర్’ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశం మీద త్వరలో కేవీపీ రామచంద్రరావును అరెస్టు చేసే అవకాశాలు వున్నట్టు తెలుస్తోంది. ఈ కుంభకోణానికి పూర్తి బాధ్యత వహించాల్సిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ కుంభకోణంతో తనకేమీ సంబంధం లేదన్నట్టుగా చేతులెత్తేసింది. దీనికి సంబంధించి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తన స్పందనను తెలియజేసింది. ఈ విషయంలో అమెరికా స్పందిస్తున్న ఆరోపణలకు కేవీపీ రామచంద్రరావు వివరణలిచ్చుకోవాలని, దీనితో తమకెలాంటి సంబంధం లేదని చెప్పేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ తెలియజేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు కేవీపీ రామచంద్రరావే వివరణలిచ్చుకోవాలి. ఈ కుంభకోణంలో ఆయన దోషిగా ఖరారైతే శిక్ష అనుభవించక తప్పదు అని ఆనంద్ శర్మ అన్నారు.

శోభా నాగిరెడ్డి మృతి: షాక్‌లో కుటుంబం

      భూమా శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడాన్ని ఆళ్ళగడ్డ నియోజకవర్గ ప్రజలతోపాటు రాష్ట్రం యావత్తూ జీర్ణించుకోలేకపోతోంది. ఆమె కుటుంబం అయితే షాక్‌లో వుంది. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో వాళ్ళు తల్లడిల్లిపోతున్నారు. శోభా నాగిరెడ్డి పిల్లలు తల్ల మృతదేహం మీద పడి భోరున రోదిస్తున్నారు. శోభ భర్త భూమా నాగిరెడ్డి ఆమెకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి రోదిస్తూనే వున్నారు. ఆమె మరణించినట్టు ప్రకటించినప్పటి నుంచి ఆయన భోరున విలపిస్తున్నారు. ఊహించని షాక్‌కి గురైన ఆయన చాలాసేపు స్పృహతప్పి పడిపోయారు. శోభ తండ్రి, ప్రముఖ రాజకీయ నాయకుడు ఎస్వీ సుబ్బారెడ్డి తీవ్ర శోకంలో మునిగిపోయి వున్నారు. తన చిన్న కూతురు శోభ గృహిణిగా తన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడమే కాకుండా, రాజకీయాల్లో కూడా రాణిస్తోందన్న సంతోషంలో వున్న తమ జీవితాలను ఈ విషాదం అల్లకల్లోలం చేసిందని ఆయన అన్నారు.

శోభా నాగిరెడ్డి మృతి: రాజకీయాలు ప్రారంభం

      ప్రతి అంశాన్నీ రాజకీయాలకు వాడుకోవడం పార్టీలకి, వాటిలోని వ్యక్తులకు మామూలైపోయింది. ఇప్పుడు యాక్సిడెంట్‌లో మరణించిన భూమా శోభా నాగిరెడ్డి మరణం మీద కూడా రాజకీయాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ రాజకీయాలు శోభ మరణం ముందు నుంచే ప్రారంభమయ్యాయి. శోభా నాగిరెడ్డి చికిత్స పొందిన కేర్ ఆస్పత్రికి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతి ఈ రాజకీయాలకు తెరతీశారు. శోభా నాగిరెడ్డి కారు ప్రమాదానికి గురి కావడానికి ప్రభుత్వ నిర్లక్షమే కారణమని ఆమె అన్నారు. రోడ్డు మీద రైతులు ధాన్యం ఆరబోయడం ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని, అలా ధాన్యం ఆరబోసే పరిస్థితులు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వమే ఈ ప్రమాదానికి కారణమని ఆమె అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన నడుస్తోంది కాబట్టి ఈ యాక్సిడెంట్‌కి రాష్ట్రపతే కారణమని ఆరోపించలేదు. రాష్ట్రపతి వరకూ రానందుకు లక్ష్మీపార్వతి మేడమ్‌కి థాంక్స్. ఇదిలా వుంటే జగన్ మీడియా ఆయన ముఖ్యమంత్రి కావడమే శోభా నాగిరెడ్డి ముఖ్య లక్ష్యమని ప్రచారం చేస్తోంది. దానికి సంబంధించి శోభా నాగిరెడ్డి మాట్లాడిన వీడియోలను ప్రదర్శిస్తోంది.

బాలకృష్ణ ‘లెజెండ్’కి ఇ.సి. బ్రేక్ వేస్తుందా?

      నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమా ప్రదర్శనను ఎన్నికలు పూర్తయ్యే వరకు నిలిపివేయాలని జగన్ పార్టీ ఎన్నికల కమిషన్‌కి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ ఎన్నికలలో పోటీ చేయడంతోపాటు తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తున్నారు. ఆయన నటించిన ‘లెజెండ్’ సినిమా ఓటర్లమీద ప్రభావం చూపించే అవకాశం వుంది కాబట్టి ఆ సినిమా ప్రదర్శనని నిలిపివేయాలని వైసీపీ ఎన్నికల కమిషన్‌ని అభ్యర్థించింది. దీని మీద తెలుగుదేశం వర్గాలు వైసీపీ మీద మండిపడ్డాయి. ఇదిలావుంటే వైసీపీ అభ్యర్థనకు స్పందించిన ఇ.సి. ‘లెజెండ్’ సినిమా చూసి అందులో రాజకీయ అంశాలు, ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయేమో పరిశీలించాలని నిర్ణయించింది. దీంతో ఈ సినిమాని ఎన్నికల కమిషన్ ప్రతినిధులకు హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్ లో ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ప్రతినిధులు ఈ సినిమా చూసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ‘లెజెండ్’ ప్రదర్శనను నిలిపివేయడానికి ఆదేశాలు జారీ చేస్తారన్న నమ్మకంలో వైసీపీ నేతలు వున్నారు. అయితే అలా జరిగే అవకాశమే లేదని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.

తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రచార షెడ్యూలు ఖరారు

      బీజేపీ, టీడీపీ కూటమికి తన మద్దతు ప్రకటిస్తానని, ప్రచారం చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించగానే ఈ రెండు పార్టీలు పవన్‌ కళ్యాణ్‌ని తెలంగాణలో ప్రచారానికి దించేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తెలంగాణలో జరిపే ఎన్నికల ప్రచారం షెడ్యూలు ఖరారైపోయింది. శుక్రవారం నుంచి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం, బీజేపీ నాయకులతో కలసి తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఈనెల 25న హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సనత్‌నగర్, కూకట్‌పల్లి, సనత్‌నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు. 26న సిరిసిల్ల, హుస్నాబాద్, పాలకుర్తి నియోజకవర్గాల్లో, 27న ఎల్బీనగర్, అంబర్‌పేట, ఖైరతాబాద్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో, 28న నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు.

సబ్బం హరి పోటీ ఎవరితో?

  అనకాపల్లి సిట్టింగ్ యంపీ సబ్బం హరి, కొన్ని నెలల క్రితం వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే వైకాపా తరపున పనిచేసారు. జగన్ జైలు నుండి విడుదల కాగానే కాంగ్రెస్ ను వీడి వైకాపాలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకొన్నారు. అయితే ఆయన వైకాపాలో చేరక మునుపే అత్యుత్సాహానికి పోయి “ఎన్నికల తరువాత తమ పార్టీ (వైకాపా) కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందని” నోరుజారడంతో, ఆయనకి వైకాపా తలుపులు మూసుకుపోయాయి.   ఆ తరువాత నుండి మళ్ళీ ఆయన నిఖార్సయిన కాంగ్రెస్ నాయకుడిలాగే వ్యవహరిస్తూ, అందివచ్చిన సమైక్యాంధ్ర ఉద్యమంతో మాజీ సీయం కిరణ్ కుమార్ రెడ్డికి క్రమంగా దగ్గరయ్యారు. ఆనక కాంగ్రెస్ అధిష్టానం బహిష్కరణ వేటు వేయడంతో, కాంగ్రెస్ నుండి వేరుపడి కొత్త పార్టీ పెట్టుకొన్న కిరణ్ కుమార్ రెడ్డితో ఆయన కూడా సమైక్యమయిపోయారు. ఈసారి జైసాపా పార్టీ టికెట్ మీద వైజాగ్ నుండి లోక్ సభకు పోటీ చేస్తున్నారు.   ఆయన వైజాగ్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం తను పార్టీలో చేరక ముందే తన మొహం మీద తలుపులేసి అవమానించిన వైకాపాపై ప్రతీకారం తీర్చుకోవడానికే! ఈసారి ఎన్నికలలో తాను గెలవకపోయినా పరువాలేదు కానీ విజయమ్మ గెలవకుండా అడ్డుపడగలిగితే ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలిని ఓడించిన ఘనత దక్కుతుంది. అంతే గాక తమ పార్టీ గౌరవాధ్యక్షురాలినే గెలిపించుకోలేకపోయినందుకు వైకాపాకు తీరని అవమానమే. ఆవిధంగా వైకాపా ప్రతీకారం తీర్చుకోన్నట్లవుతుందని సబ్బం హరి ఆలోచన.   సబ్బం హరి అందుకు సమర్దుడేనని చెప్పవచ్చును. బీజేపీ తరపున వైజాగ్ నుండి లోక్ సభకు పోటీ చేస్తున్న కంబంపాటి హరిబాబు పేరు వైజాగ్ ప్రజలు విని ఉండకపోవచ్చునేమో కానీ వైజాగ్ కి మాజీ మేయర్ గా విశేష సేవలందించిన సబ్బం హరి గురించి తెలియని వారుండరు. స్థానికుడయిన ఆయనకు అనేకమంది అనుచరులున్నారు, అన్ని పార్టీల నేతలతో మంచి పరిచయాలు ఉన్నాయి. అందువలన ఆయన ఈ ఎన్నికలలో తాను గెలిచినా గెలవకున్నా విజయమ్మ విజయావకాశాలకు గండి కొట్టగల సమర్ధుడు.   ఆయన కాంగ్రెస్ లేదా బీజేపీ అభ్యర్ధులలో ఎవరో ఒకరికి లోపాయికారిగా సహకరించి నట్లయితే విజయమ్మ విజయం అనుమానమే అవుతుంది. ఎన్నికల తరువాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని ఆయన భావించినట్లయితే ఆ పార్టీ అభ్యర్ధికి సహకరించవచ్చును. తద్వారా ఎన్నికల తరువాత ఆయన బీజేపీలోకి మారిపోయి, చేసిన సహాయానికి ప్రతిఫలంగా ఏ రాజ్యసభ సీటులోనో ఒద్దికగా సర్దుకు పోవచ్చును. అందువల్ల ఒకవేళ విజయమ్మ ఓడిపోయినట్లయితే ఆమె ఓటమికి సబ్బం హరే కారణమని చెప్పవలసి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మనసు మార్చుకొని ఆయనతో రాజీపడినట్లయితే, ఆయన విజయమ్మకే సహకరించినా ఆశ్చర్యం లేదు.

వారణాసిలో నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు

      బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గుజరాత్‌లోని వదోదర, ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గాల నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. వదోదరలో మోడీ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. గురువారం నాడు ఆయన వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. దాదాపు రెండు లక్షలమంది కాషాయదళంతో ప్రదర్శనగా వెళ్ళి మోడీ నామినేషన్ దాఖలు చేశారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడైన మదన్ మోహన్ మాలవ్య మనవడు జస్టిస్ గిరిధర్ మాలవ్య వారణాసి నుంచి నరేంద్ర మోడీ నామినేషన్‌ని బలపరిచారు. వారణాసిలోనే నివసించే షహనాయ్ విద్వాంసుడు బిస్మిల్లాఖాన్ కుటుంబ సభ్యులు కూడా తన నామినేషన్‌ని బలపరిస్తే బాగుంటుందని నరేంద్ర మోడీ భావించారు. అయితే తాము రాజకీయాలకు పూర్తిగా దూరంగా వుండేవారని బిస్మిల్లాఖాన్ చెబుతూ వుండేవారని, అందువల్ల మీ నామినేషన్‌ని మేము బలపరచలేమని బిస్మిల్లాఖాన్ కుటుంబ సభ్యులు చెప్పడంతో మోడీ వారిని ఇబ్బంది పెట్టలేదు.

శోభానాగిరెడ్డి మృతి: తల్లడిల్లుతున్న ఆళ్ళగడ్డ ప్రజలు

      తమ ప్రియతమ నాయకురాలు శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆళ్ళగడ్డ ప్రజానీకం తల్లడిల్లుతోంది. శోభ మరణవార్త వినగానే ఆళ్ళగడ్డలో విషాద ఛాయలు అలముకున్నాయి. శోభ ఏ పార్టీలో వున్న ఆళ్ళగడ్డ ప్రజలు ఎప్పుడూ ఆమెకు మద్దతుగానే వున్నారు. తమ ప్రాంతానికి చెందిన నాయకులు ఎస్వీ సుబ్బారెడ్డి కుమార్తెగా, భూమా నాగిరెడ్డి భార్యగా స్థానిక ప్రజలు ఆమెను ఎంతో గౌరవిస్తారు. ఎమ్మెల్యేగా ఆమె చేసిన సేవలను వారు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. రాజకీయంగా ఎంతో ఉజ్వల భవిష్యత్తు వుంటుందని భావిస్తున్న తరుణంలో ఆమె ఇలా దుర్మరణం పాలు కావడాన్ని అక్కడి ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. రాత్రి ఎన్నికల ప్రచారంలో ఎంతో చురుకుగా పాల్గొన్న ఆమె తెల్లవారేసరికి ఇలా అయిపోతుందని ఎవరూ ఊహించలేకపోయారు. ఆమె ఏపార్టీలో ఉన్నా పార్టీలో సంబంధం లేకుండా ఆమెని గెలిపించుకునే ఆళ్ళగడ్డ ప్రజలు ఈసారి కూడా ఆమె మంచి మెజారిటీతో గెలవటం ఖాయమని అనుకుంటున్న తరుణంలో ఈ ఊహించని దుర్ఘటన వారి మధ్య నుంచి శోభా నాగిరెడ్డిని తీసుకెళ్ళిపోయింది. శోభానాగిరెడ్డి మృతికి సంతాపంగా ఆళ్ళగడ్డ పరిసరాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు.

ఓటు వేసిన సూపర్ స్టార్ రజనీకాంత్‌

      ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్‌ తన ఓటుహక్కుని చెన్నయ్‌లో వినియోగించుకున్నారు. పోయెస్ గార్డెన్ ప్రాంతంలోని ఓ పోలింగ్ బూత్ లో రజనీ ఓటు వేశారు. సినీ నటి విద్యాబాలన్‌ కూడా ఓటు హక్కుని వినియోగించుకున్నారు. పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఓటు హక్కుని వినియోగించుకోవడమే కాక, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అనీ నినాదిస్తున్నారు.   సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో కలిపి మొత్తం 117 లోకసభ స్థానాలలో ఆరోదశ పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 2076 మంది అభ్యర్ధుల భవితవ్యం ఈ ఎన్నికల్లో తేలనుంది. తమిళనాడులో 39, మహారాష్ట్ర 19, ఉత్తరప్రదేశ్ 12, మధ్యప్రదేశ్ 10, బీహార్లో 7, ఛత్తీస్ గఢ్ 7, పశ్చిమబెంగాల్ 6, అస్సాం 6, రాజస్థాన్ 5, జార్ఖండ్ 4, జమ్మూకాశ్మీర్ 1, పుదుచ్చెరి 1 స్థానాల్లో పోలింగ్ ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటేనట

  తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటేనని చిరంజీవి మరొకమారు తేల్చి చెప్పారు. తామిదరం వేర్వేరు పార్టీలలో ఉన్నందున ఎవరి ప్రచారం వారిదేనని, ఇద్దరూ సోదరులే అయినప్పటికీ, రాజకీయంగా మాత్రం ప్రత్యర్దులమేనని అన్నారు.   ఈరోజు తూర్పు గోదావరి జిల్లా తునిలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్న చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ఒక జీవనది వంటిది. దానిని ప్రవహించకుండా అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు.కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేస్తామని గతంలో చాలామంది బయలుదేరారు, కానీ చివరికి వారే కనబడకుండా పోయారు. రాష్ట్ర విభజనకు కేవలం కాంగ్రెస్ పార్టీనే నిందించడం తగదు. అన్ని పార్టీల అంగీకరించిన తరువాతనే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించింది. కాంగ్రెస్ పట్ల సీమాంధ్ర ప్రజలలో వ్యతిరేఖత ఉందని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం తప్పని ప్రజలే నిరూపించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించబోతోంది. దానిని ప్రతిపక్షాలే స్వయంగా చూడబోతున్నాయి."   "చంద్రబాబుకి ఈ ఎన్నికలు ఆఖరిపోరాటం వంటివి. ఈ ఎన్నికల తరువాత ఆయన మరిక కనబడక పోవచ్చును. అదేవిధంగా ఈ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి తన కేసుల నుండి బయటపడేందుకు చేస్తున్న రక్షణ పోరాటం వంటివి. ఆయన చెపుతున్న సంక్షేమ కబుర్లు, చేస్తున్న వాగ్దానాలు అన్నీ అబ్బదం. ఆయన అధికారంలోకి వచ్చి తన కేసుల నుండి బయటపడాలని తాపత్రయ పడుతున్నారు. నరేంద్ర మోడీ హిట్లర్ అని నేనన్న మాటకి కట్టుబడిఉన్నాను. ఆయనకు మహిళలలంటే ఎంత చులకన భావమో అయన ప్రియాంకా గాంధీని ఉద్దేశించి అన్న మాటలు వింటే అర్ధమవుతుంది. ఆయన మాటలను కనీసం బీజేపీ మహిళా నేతలు కూడా సమర్ధించరని ఖచ్చితంగా చెప్పగలను,” అని అన్నారు.

వైకాపా నేత శోభా నాగిరెడ్డి కన్నుమూత

      రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైకాపా కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజక వర్గం అభ్యర్ధి శోభా నాగిరెడ్డి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు కన్నుమూశారు. బుధవారం రాత్రి నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు వెళ్తుండగా... గూబగుండం మిట్ట సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న వాహనం బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. మొదట నంద్యాలలో ఆసుపత్రిలో ప్రాధమిక చికిత్స నిర్వహించిన తరువాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రి తీసుకొనివచ్చారు. ఐసియులో చికిత్స పొందుతున్న ఆమె ఉదయం 11.05గంటలకు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

తెలంగాణాలో సంకీర్ణ ప్రభుత్వమే

  తెలంగాణాలో ఎన్నికలకు ఇంకా కేవలం 6రోజులే మిగిలున్నాయి. ప్రధాన ప్రత్యర్దులయిన కాంగ్రెస్, తెరాస, తెదేపా-బీజేపీలు చాలా గట్టిగా ఎన్నికల ప్రచారం చేసుకొంటున్నాయి. కాంగ్రెస్ తరపున సోనియా, రాహుల్ గాంధీ ఇద్దరూ వచ్చి ప్రచారం చేసారు. ఉద్యమాలు జరుగుతున్న సమయంలో ఎన్నడూ రాష్ట్రం మొహం చూడని కేంద్రమంత్రి జైరామ్ రమేష్ గత నెల రోజులుగా తెలంగాణాలోనే తిష్టవేసి టీ-కాంగ్రెస్ నేతలకంటే ఎక్కువగా కష్టపడుతున్నారు. చంద్రబాబు అందరికంటే ముందుగా తెలంగాణాలో ప్రచారం మొదలుపెట్టడమే కాకుండా ఆర్. క్రిష్ణయ్యని తమ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నారు. రెండు రోజుల క్రితమే నరేంద్రమోడీ కూడా వచ్చి తెదేపా-బీజేపీ కూటమికి ప్రచారం చేసి వెళ్ళారు. వీరందరినీ తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ఒక్కరే బలంగా డ్డీకొంటూ, పది జిల్లాలలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.   ముగ్గురు ప్రధాన ప్రత్యర్ధులు దీటుగా ప్రచారం చేసుకొంటున్నందున, ఇంతవరకు తెరాస తన ప్రత్యర్ధులపై చూపుతున్న ఆధిక్యతను కోల్పోగా కాంగ్రెస్ రేసులో ముందుకు దూసుకుపోతున్నట్లు తాజా సర్వేలు చెపుతున్నాయి. అయితే అది పూర్తి మెజార్టీ సాధించేత మాత్రం కాదని సర్వేలే స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్, తెరసలతో పోలిస్తే, తెదేపా-బీజేపీ కూటమి పోటీలో వెనుకబడిపోయిందని, కానీ వారి కూటమి కూడా గౌరవనీయమయిన స్థానాలనే దక్కించుకోవచ్చని సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.    తాజా నివేదిక ప్రకారం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొంత ఆధిక్యత కనబరుస్తూ 35-45 సీట్లు సాధించుకొనే అవకాశం ఉందని సమాచారం. తెరాస-25-30, తెదేపా-బీజేపీ కూటమి-20-30, మజ్లిస్-4 to 6 మరియు ఇతరులు 8 సీట్లు సాధించవచ్చని సమాచారం.   కాంగ్రెస్ తరపున తెలంగాణాలో ప్రచారం చేస్తున్న జైరామ్ రమేష్ “ఎన్నికల తరువాత తెరాస మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే దుస్థితి తమకు రాదని, తమ పార్టీయే స్వయంగా మెజార్టీ సీట్లు సాధించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని” విశ్వాసం వ్యక్తం చేసారు.   కేసీఆర్ మొన్న ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ తమ పార్టీకే గనుక పూర్తి మెజార్టీ రానట్లయితే, కాంగ్రెస్ మద్దతు తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడం కంటే ఫారం హౌస్ లో వ్యవసాయం చేసుకోవడానికే ఇష్టపడతానని అన్నారు. అంటే ఎవరికీ పూర్తి మెజార్టీ రాదని వారు కూడా అప్పుడే గ్రహించినట్లు అర్ధమవుతోంది. అందుకే వారిరువురూ మద్దతు తీసుకోవడం గురించి మాట్లాడుతున్నారిప్పుడు.   అయితే, కేంద్రంలో, రాష్ట్రంలో కూడా చక్రం తిప్పాలని, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని తహతహలాడిపోతున్న కేసీఆర్ నిజంగానే ఆ పరిస్థితి వస్తే, నిజంగా ఫారం హౌస్ కి వెళ్లిపోతారని అనుకోవడం అవివేకమే. అవసరమయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చో, పుచ్చుకోనయినాసరే ముఖ్యమంత్రి పదవి లేకపోతే కనీసం ఆర్ధిక శాఖ, హోంశాఖనో పుచ్చుకొని సంతృప్తి పడవచ్చును. అంటే ఎన్నికల తరువాత అధికారం చేజిక్కించుకొనేందుకు కాంగ్రెస్-తెరాసలు తప్పనిసరిగా మళ్ళీ చేతులు కలుపుతాయని అర్ధమవుతోంది. ఒకవేళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే మాటయితే తెరాస-కాంగ్రెస్ పార్టీకి బదులు బీజేపీ మద్దతు తీసుకొనే అవకాశం ఉంది. అంటే తెలంగాణాలో సంకీర్ణ ప్రభుత్వమేర్పడే అవకాశాలే ఎక్కువని అర్ధమవుతోంది.

శోభా నాగిరెడ్డి పరిస్థితి విషమం

      రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైకాపా కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజక వర్గం అభ్యర్ధి శోభా నాగిరెడ్డి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శోభా నాగిరెడ్డి పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెబుతున్నారు. గుండె వైపు పక్కటేముకలు విరగడంతో ఆమెకు శ్వాస తీసుకోలేకపోతున్నట్లు వైద్యులు తెలిపారు.    బుధవారం నంద్యాలలో షర్మిల పర్యటించారు. ఆమెతోపాటు శోభానాగిరెడ్డి కూడా ప్రచారంలో పాల్గొన్నారు. రాత్రి 10.30 గంటల సమయంలో షర్మిలకు వీడ్కోలు పలికి... తన మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ వాహనంలో శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డకు బయలుదేరారు. దూబగుంట గ్రామం సమీపంలో రోడ్డు పక్కన పోసి ఉన్న ధాన్యం కుప్పపైకి ఆమె పయనిస్తున్న కారు ఎక్కడంతో, కారు అదుపు తప్పి నాలుగు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె పక్కటెముకలు విరిగి, తలకు తీవ్ర గాయాలయినట్లు సమాచారం. ఆమెతో బాటు కారు డ్రైవర్ మరియు ఆమె గన్-మెన్ క్కూడా తీవ్ర గాయాలయ్యాయి.

కారు ప్రమాదంలో శోభా నాగిరెడ్డికి తీవ్ర గాయాలు

  వైకాపా కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజక వర్గం అభ్యర్ధి శోభా నాగిరెడ్డి నిన్న రాత్రి జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను హైదరాబాదులో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఆళ్లగడ్డలో ప్రచారం ముగించుకొని తిరిగి వెళ్తుండగా రాత్రి 11గంటల సమయంలో దూబగుంట గ్రామం సమీపంలో రోడ్డు పక్కన పోసి ఉన్న ధాన్యం కుప్పపైకి ఆమె పయనిస్తున్న కారు ఎక్కడంతో, కారు అదుపు తప్పి నాలుగు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె పక్కటెముకలు విరిగి, తలకు తీవ్ర గాయాలయినట్లు సమాచారం. ఆమెతో బాటు కారు డ్రైవర్ మరియు ఆమె గన్-మెన్ క్కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నపటికీ, ఆమె శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నందున, ఐ.సీ.యూ.లో ఉంచి కృత్రిమ శ్వాస అందిస్తూ వైద్యం చేస్తున్నారు.