అక్క పురందేశ్వరికి బాలకృష్ణ రాజంపేటలో ప్రచారం చేయడంట!
posted on Apr 23, 2014 @ 12:18PM
గత ఎన్నికల సమయంలో బాలకృష్ణ అక్కయ్య దగ్గుబాటి పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీలో వున్నారు. బాలకృష్ణ గురించి చెప్పేదేముంది పక్కా తెలుగుదేశం. బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా తన అక్క అత్తగారి ఊరు కారంచేడు వెళ్ళి, అక్కయ్య ఇంటిముందు నిల్చుని తొడ కొడితే రాష్ట్రంలో సంచలనం రేగింది. అయితే పురందేశ్వరి మాత్రం తమ్ముడి తొడకొట్టుడుని లైట్‌గా తీసుకుని తమ్ముణ్నే వెనకేసుకుని వచ్చారు.
ఫ్లాష్ బ్యాక్ ఇలా వుంటే, తాజాగా పురందేశ్వరి రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి భారతీయ జనతాపార్టీ నుంచి పోటీలో వున్నారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ పొత్తు వుండటంతో బాలకృష్ణ రాజంపేట వెళ్ళి అక్కడ అక్కకి అనుకూలంగా ప్రచారం చేస్తారని అందరూ అనుకున్నారు. ఇలా ప్రచారం చేయడం ద్వారా గతంలో తాను అక్క ఇంటి ముందు తొడకొట్టిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటారని అందరూ భావించారు.
అయితే బాలకృష్ణ అలాంటిదేమీ చేయడం లేదని తెలుస్తోంది. రాష్ట్రమంతటా ప్రచారం చేస్తున్న బాలకృష్ణ రాజంపేట మాత్రం తన ప్రచారం రూట్లో లేదని చెబుతున్నాడు. తెలుగుదేశం వర్గాలు చెప్పేదాని ప్రకారం బాలకృష్ణ రాజంపేటలో ప్రచారం చేయరు. దీనికి కారణం చంద్రబాబు బాలకృష్ణని కట్టడి చేయడమేనని తెలుగుదేశంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.