బీజేపీకి పెరుగుతున్న మద్దతు
posted on May 15, 2014 @ 9:35AM
ఆంధ్ర, తెలంగాణాలలో ఏ పార్టీలు అధికారంలోకి వస్తాయనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, కేంద్రంలో మాత్రం బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమే అధికారంలోకి వస్తుందనే విషయంలో ఎవరికీ అనుమానం లేదు. తత్ఫలితంగా ఇంతవరకు బీజేపీతో మైల పాటించిన అనేక పార్టీలు, తమ కుహానా సెక్యులర్ ముసుగులను పక్కన పడేసి కేంద్రంలో స్థిరమయిన ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి సహకరిస్తామని ప్రకటిస్తున్నాయి. ఒరిస్సాలో బిజూ జనతా దళ్, మహారాష్ట్రలో మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన, తమిళనాడులో అన్నాడీయంకే, చివరికి ఇంతకాలం కాంగ్రెస్ పార్టీతో అంటకాగిన నేషనలిస్‌ట కాంగ్రెస్ పార్టీ తదితర పార్టీలు కూడా ఎన్డీయేకి మద్దతు ఇచ్చేందుకు సంసిద్దత ప్రకటించాయి. ఎన్డీయే కూటమి స్వయంగా 300 సీట్లు సాధించే అవకాశం ఉన్నప్పటికీ, ముందు జాగ్రత్తగా ఇతర పార్టీల మద్దతు స్వీకరించేందుకు తాము సిద్దమని బీజేపీ ప్రకటించింది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో మొత్తం 25 పార్టీలున్నాయి. రేపు ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఎన్డీయే కూటమిలో చేరే పార్టీల, స్వతంత్ర యంపీల జాబితా మరింత పెరుగవచ్చును.ఇంతవరకు మోడీని, బీజేపీను బూచిగా చూపిస్తూ కుహనా లౌకిక వాదంతో పబ్బం గడుపుకొన్న కాంగ్రెస్ పార్టీకి మున్ముందు గడ్డు రోజులు ఎదురవవచ్చును.