లగడపాటివి ఉత్తుత్తి సర్వేలు: వైఎస్సార్సీపీ
posted on May 15, 2014 @ 5:03PM
సర్వేల స్పెషలిస్టు లగడపాటి రాజగోపాల్ తాను చేయించిన సర్వేల ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సర్వేల్లో సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు. ఆయన అలా చెప్పినప్పటి నుంచి జగన్ పార్టీ ఆయన మీద మాటల దాడి చేస్తూనే వుంది. తాజాగా జగన్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు లగడపాటి సర్వేలు ఉత్తుత్తి సర్వేలని తేల్చిచెప్పారు. అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, లగడపాటి నిజంగా సర్వే చేయించి ఉంటే ఏ సంస్థలో చేయించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని అంబటి చెప్పారు. లగడపాటి సర్వేను నమ్మి ఎవరూ పందాలు కాయొద్దని అంబటి సూచించారు. జాతీయ సంస్థలన్ని వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని వెల్లడించాయని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల మధ్య నెలరోజుల సమయం ఉందని, ఆ సమయంలో చాలా మార్పులు జరిగాయని అంబటి పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు తాము పోటీ చేయలేమంటూ చేతులెత్తేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 110కంటే ఎక్కువ సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని అంబటి ధీమా వ్యక్తం చేశారు.