అందరి కళ్ళూ హిందూపురం బాలకృష్ణ మీదే!
posted on May 15, 2014 @ 5:09PM
శుక్రవారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగా ఓట్ల కౌంటింగ్ పండుగ అంగరంగ వైభవంగా మొదలు కానుంది. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ, దేశంలో ఎన్డీయే అధికారంలోకి రావడం ఖాయమనే విషయం తేలిపోయింది. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందన్న విషయం కూడా క్లియర్‌గా వుంది. తెలంగాణలో హంగ్ ఏర్పడి తెలుగుదేశం, బీజేపీ కూటమి కింగ్ మేకర్‌గా మారే అవకాశం వుందన్న విషయం కూడా స్పష్టంగా వుంది.
అయితే ఇప్పుడు రాష్ట్రంలోని కొన్ని కీలక నియోజకవర్గాల్లో బాలకృష్ణ పోటీ చేసిన హిందూపురం నియోజకవర్గం కూడా వుంది. ఇంతకాలం తెలుగుదేశం పార్టీకి ప్రచారం మాత్రమే చేసిన బాలకృష్ణ ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల బరిలోకి కూడా దిగారు. ఇప్పుడు అందరి దృష్టి ఆయనమీదే వుంది. హిందూపురం నందమూరి వంశానికి పెట్టని కోటలా వుంది. ఎన్టీఆర్ కూడా అక్కడి నుంచి పోటీ చేసి విజయాలు సాధించారు. ఇప్పుడు ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని బాలకృష్ణ కొనసాగిస్తాన్న నమ్మకం అందరిలోనూ వుంది.
అయితే ఇప్పుడు అందరూ బాలకృష్ణ వైపు చూస్తున్నది అయన విజయం సాధిస్తారా.. లేదా అనే విషయం మీద కాదు.. బాలకృష్ణ ఎంతటి సంచలన విజయం సాధిస్తారన్న విషయం మీదే. బాలకృష్ణ సాధించబోయే మెజారిటీ మీదే ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమై వుంది. బాలకృష్ణ హిందూపురం నుంచి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా నిలుస్తారన్న నమ్మకాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. వారి నమ్మకం నిజం కావడానికి ఎంతో సమయం లేదు. శుక్రవారం మధ్యాహ్నానికి ఈ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది.