కంగ్రాట్స్ మోడీ: రజనీకాంత్ ట్విట్

      ఎన్నికల ముందు నరేంద్ర మోడీకి మద్దతు ప్రకటించిన తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇప్పుడు ఎన్నికలలో బీజేపీ, ఎన్డీయే ఘన విజయం సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన సంతోషాన్ని రజనీకాంత్ ట్విట్టర్ ద్వారా వెలిబుచ్చారు. ఈమధ్యే ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించిన రజనీకాంత్ మోడీకి తన అభినందనలను కూడా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘నరేంద్ర మోడీ జీ.. చారిత్రక విజయం సాధించిన మీకు హ‌ృదయపూర్వక అభినందనలు’’ అని ట్విట్ చేశారు. పనిలో పనిగా తమిళనాడులో భారీగా పార్లమెంట్ స్థానాలు గెలిచిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కూడా రజనీకాంత్ అభినందనలు తెలిపారు.

ముచ్చటగా మూడోసారి ఓడిన డి.శ్రీనివాస్

      ఆల్రెడీ శాసనమండలి సభ్యుడిగా వున్న డి.శ్రీనివాస్ ఇంకా ఏదో సాధించాలని నిజామాబాద్ రూరల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. ఫలితం మరోసారి.. ఇంకా చెప్పాలంటే ముచ్చటగామూడోసారి ఓడిపోయారు. ఓటమిలో ఆయన హ్యాట్రిక్ సృష్టించారు. ధర్మపురి శ్రీనివాస్ వరుసగా మూడోసారి పరాజయం పాలయ్యారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన డిఎస్, టిఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో 20 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తొలిసారి 2009లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి ఎండల లక్ష్మీ నారాయణ చేతిలో ఓడిపోగా, రెండవ సారి 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో అదే ఎందల లక్ష్మీ నారాయణ (బిజెపి) చేతిలో డిఎస్ కంగుతిన్నారు. 2014 ఎన్నికల్లో ఓటమి భయంతో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి మారినా ప్రయోజనం లేక పోయింది. బాజిరెడ్డి గోవర్ధన్ చివరి క్షణంలో వైకాపా నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించారు. కానీ అనూహ్యంగా టీఆర్ఎస్‌లో చేరి డీఎస్‌పై సంచలన విజయం సాధించారు.

ప్రజాస్వామ్యం మీద నమ్మకం పెంచిన విజయం: పవన్ కళ్యాణ్

      సీమాంధ్రలో బీజేపీ, టీడీపీ కూటమి, దేశంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం పట్ల సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హర్షాన్ని వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలుగా, వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో వున్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజలను దోచుకున్న విధానం, తెలంగాణను విచ్ఛిన్నం చేసిన విధానం తాను ‘కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో’ నినాదం ఇవ్వడానికి కారణమైందని చెప్పారు. ఈ ఎన్నికలలో ఓట్లు చీలకూడదని, టీడీపీ, బీజేపీ కూటమి గెలవాలన్న ఉద్దేశంతోనే తన పార్టీ ఎన్నికలలో పోటీ చేయాలేదని, ఆ నిర్ణయం కారణంగా ఇప్పుడు బీజేపీ, టీడీపీ కూటమి సీమాంధ్రలో అధికారంలోకి రావడం ఆనందాన్ని కలిగిస్తోందని పవన్ కళ్యాణ్ చెప్పారు. నరేంద్ర మోడీకి, చంద్రబాబుకి, తెలంగాణలో గెలిచిన కేసీఆర్‌కి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. తనకు ఏ రాజకీయ నాయకుడిమీదా వ్యక్తిగత ద్వేషం లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. దోపిడీ దారులు గెలవకూడదని ప్రజలు ఈ ఎన్నికలలో తీర్పు ఇచ్చారని, తనకు ప్రజాస్వామ్యం మీద నమ్మకాన్ని పెంచిన విజయమిదని పవన్ కళ్యాణ్ అన్నారు.

వికసించిన కమలం.. వణుకుతున్న హస్తం

      దేశవ్యాప్తంగా విడుదలవుతున్న ఎన్నికల ఫలితాలు ఎన్డీయేకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా లభిస్తున్న మద్దతుతో కమలం వికసించింది. దారుణంగా ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ హస్తం గడగడా వణుకుతోంది. బీజేపీ కూటమికి 339 స్థానాలలో ఆధిక్యం దక్కింది. బీజేపీ కూటమి ధాటికి కాంగ్రెస్ పార్టీ కకావికలు అయిపోయింది. కాంగ్రెస్ పార్టీలోని మహామహులు అడ్రస్ లేకుండా పోయారు. సాక్షాత్తూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఓటమి దాకా వెళ్ళి బయటపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడలో కాంగ్రెస్ పార్టీకి సహకరించిన లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ కూడా ఓడిపోవడం శుభ పరిణామం.

ఓట్ల కౌంటింగ్: సీమాంధ్ర, తెలంగాణలో తాజా బలాబలాలు

  సీమాంధ్రలోని 195 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ మధ్యాహ్నం రెండున్నర గంటల సమయానికి 36 స్థానాలు గెలుచుకుంది. మరో 74 స్థానాల్లో లీడింగ్‌లో వుంది. వైసీపీ 26 స్థానాల్లో గెలిచింది. మరో 34 స్థానాల్లో లీడింగ్‌లో వుంది. బీజేపీ ఒక్క స్థానాన్ని గెలుచుకుని మరో రెండు స్థానాల్లో లీడింగ్‌లో వుంది. ఇద్దరు ఇండిపెండెంట్లు గెలిచారు. అలాగే సీమాంధ్రలోని 25 పార్లమెంట్ సీట్లలో తెలుగుదేశం ఒక స్థానాన్ని గెలుచుకుంది. 14 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. వైసీపీ రెండు స్థానాల్లో గెలిచి 5 స్థానాల్లో లీడింగ్‌లో వుంది. బీజేపీ మూడు స్థానాల్లో లీడింగ్‌లో వుంది.

గీతారెడ్డి గెలుపు..మెదక్ లో విజయశాంతి ఓటమి

      మెదక్ జిల్లాలో పోటీ చేసిన ఇద్దరు కాంగ్రెస్ మహిళా అభ్యర్థులు, తెలంగాణ ముఖ్యమంత్రి అవ్వాలని కలలు కన్న నాయకురాళ్ళు గీతారెడ్డి, విజయశాంతి. వీరిలో గీతారెడ్డి ఓటమి వరకు వెళ్ళి తప్పించుకుని, గెలిచారు. విజయశాంతి మాత్రం మొదటి నుంచీ వెనుకగులోనే వుండి చివరికి ఓడిపోయారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయిన రాములమ్మకు భారీ షాక్ తగిలింది. తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న వెంటనే ఆ పార్టీకి జంప్ అయిన విజయశాంతి టీఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. జహీరాబాద్ (ఎస్సీ) నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి జె.గీతారెడ్డి ఓటమిని తృటిలో తప్పించున్నారు.

హిందూపురంలో బాలకృష్ణ ఘన విజయం

      సినీ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. బాలకృష్ణ తన సమీప ప్రత్యర్థి, వైకాపాకి చెందిన నవీన్ నిశ్చల్ మీద 15 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. మొదటి నుంచి లీడింగ్‌లో వున్న నందమూరి బాలక‌ృష్ణ మధ్యలో కొన్నిసార్లు వైకాపా అభ్యర్థి కంటే వెనుకబడ్డారు. బాలక‌ృష్ణ లీడింగ్‌లో వున్నప్పుడు ఉత్సాహంతో ఉరకలు వేసిన ఆయన అభిమానులు బాలకృష్ణ వెనుకబడినప్పుడు మాత్రం నిరాశపడ్డారు. చివరిలో బాలకృష్ణతో గెలుపు దోబూచులాడింది. ఇద్దరు ప్రత్యర్థుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టు సాగింది. చివరికి బాలకృష్ణ విజయం సాధించారు. 15 వేల ఓట్ల ఆధిక్యతతో ఆయన విజయం సాధించారు. గతంలో ఎన్టీఆర్ పోటీ చేసిన హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ విజయం సులువుగా వుంటుందని అందరూ భావించారు. అయితే ఇక్కడ విజయం సాధించడానికి చెమటోడ్చాల్సి వచ్చింది.

సీమాంధ్ర విజయంతో టీడీపీలో ఆనందోత్సాహాలు

      సీమాంధ్రలో ఘన విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. సీమాంధ్రలో 109 స్థానాల ఆధిక్యతని సాధించడంతోపాటు పార్లమెంట్ సీట్లలో బీజేపీ, టీడీపీ కూటమి 18 ఎంపీ స్థానాలలో ఆధిక్యను ప్రదర్శిస్తూ వుండటం పట్ల తెలుగుదేశం శ్రేణులు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వం స్థాపించే మెజారిటీ రాదని ముందుగానే తెలిసినప్పటికీ, తెలంగాణలో కూడా గౌరవప్రదమైన అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే దిశగా తెలుగుదేశం పయనిస్తూ వుండటం కూడా తెలుగుదేశం శ్రేణుల్లో ఆనందాన్ని నింపింది. అటు సీమాంధ్రలో విజయం సాధించడంతోపాటు ఇటు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష హోదా పొందే అవకాశాలు వుండటంతో తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

బీజేపీ విజయం సూపర్: రాజ్‌నాథ్ సింగ్

      దేశవ్యాప్తంగా భారతీయ జనతాపార్టీ, ఎన్డీయే కూటమి ఘన విజయం సాధిస్తూ వుండటం పట్ల బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రధాన అభ్యర్థి నరేంద్రమోడీకి, విజయాలు సాధిస్తున్న బీజేపీ అభ్యర్థులకు, బీజేపీ పార్టీ శ్రేణులకు ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ విజయం మీద రాజ్ నాథ్ సింగ్ స్పందిస్తూ ట్విట్టర్‌లో ‘సూపర్’ అని ట్విట్ పోస్ట్ చేశారు. నరేంద్రమోడీకి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఆ విషయాన్ని కూడా ట్విట్టర్‌లో ప్రస్తావిస్తూ ‘‘నరేంద్రమోడీకి అభినందనలు. బీజేపీ అద్భుత ప్రతిభ చూపించింది’’ అని కామెంట్ పోస్ట్ చేశారు.

4లక్షల ఓట్లతో వడోదరలో మోడీ విజయం

      బిజెపి నాయకుడు నరేంద్ర మోదీ వడోదరలో సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ మిస్త్రీ పై ఆయనకు 4 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యం లభించింది. దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమి 326 స్థానాల్లో దూసుకుపోతుంది. సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించింది. ఎన్నికల ఫలితాలు ఇంకా అధికారికంగా ప్రకటించడానికి ముందే కాంగ్రెస్ పార్టీ పరాజయాన్ని అంగీకరించింది. ప్రతిపక్షంలో కూర్చోడానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో శుక్రవారం ఉదయం పదిన్నరకే ప్రకటించింది.ఈ సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ తరపున ప్రధాన అభ్యర్థిగా పేర్కొన్న యువనేత రాహుల్ గాంధి సైతం ఒక దశలో వెనుకపడి మళ్లీ కాస్త పుంజుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పిన మహామహులు ఎందరో ఓడిపోతున్నారు. స్పీకర్ మీరా కుమార్, కమల్ నాథ్, కపిల్ సిబాల్, సుశీల్ కుమార్ షిండే వంటివారంతా ఓటమి అంచుల్లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఉద్దండులు అందరూ ముందంజలో ఉన్నారు.