టీడీపీ అధికారంలోకి రావాలి: బొత్స సంచలనం
posted on May 15, 2014 @ 4:52PM
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, చీపురుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విచిత్రంగా ప్లేటు ఫిరాయించారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. అలాగే జగన్ అధికారంలోకి వస్తే ప్రజలకు ఒరిగేదేమీ లేదని కూడా చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన బొత్స ఆ పదవి పోయిన తర్వాత తన చీపురుపల్లి నియోజకవర్గానికే పరిమితమైపోయారు. రాష్ట్ర స్థాయిలో మీడియా ముందుకు రావడం మానేశారు. తన చీపురుపల్లిలో తన చీపురు విరిగిపోకుండా చూసుకోవడంలో బిజీగా వున్నారు. రాష్ట్ర విభజన విషయంలో తెలుగు ప్రజలను మోసం చేసేలా వ్యవహరించిన బొత్స ఈసారి చీపురుపల్లిలో గెలవటం డౌటేనన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇలా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడటం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.