చిరంజీవి 150 సినిమాకి సిద్ధమయ్యారా?

  మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రానికి సిద్ధమయ్యారా అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ఈనెల 22వ తేదీన చిరంజీవన తన బర్త్‌డే జరుపుకోనున్న నేపథ్యంలో ఆయన ఫోట్ షూట్ జరిగింది. అలా చిరంజీవి కొత్తగా దిగిన ఫోటోలు విడుదలైన నేపథ్యంలో అందరికీ సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ ఫోటోల్లో చిరంజీవి అంత బావున్నారు మరి. ఎప్పుడూ రాజకీయ లుక్ తో కనిపించే చిరూ ఇప్పుడు ఈ ఫోటోల్లో మొత్తం ఢిపరెంట్ లుక్ తో.. ఫుల్ హీరో లుక్ తో కనిపించారు. దీంతో చిరంజీవి 150వ సినిమాకు చిరూ సిద్దమౌతున్నాడని అనుకుంటున్నారు. ఈ విషయంలో తన బర్త్‌డే రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వారి మాటల్లో అర్ధమయింది.. జేసీ

  కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటూ చెపుతుంది. దీనిపై ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆందోళనలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే ఇంకా ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అంటున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంధ్ర రాష్ట్ర ఆర్ధికంగా చాలా దెబ్బతిందని.. అయినా కూడా అభివృద్ధిపై దృష్టి పెట్టామని, అభివృద్ధి కోసం అప్పులు కూడా చేస్తున్నామని చెప్పారు.   మరోవైపు ఏపీ ప్రత్యేక హోదాపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా రాదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిషాత్, ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి రాజనాథ్‌ సింగ్‌ తో మాట్లాడినప్పుడు వారి మాటల్లో ఏపీకి ప్రత్యేకహోదా రాదన్న విషయం అర్ధమయిందని.. అయితే వారికి రాష్ట్రంపై సానుభూతి ఉందని.. రాష్ట్రాభివృద్దికి కేంద్రం డబ్బులిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

దీపక్‌మిశ్రాకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం

  ముంబై వరుస పేలుళ్ల కేసులో నిందితుడైన యాకుబ్ మెమెన్ ను ఉరి తీసిన సంగతి తెలిసిందే. ఇక్కడి వరకూ బానే ఉన్నా ఇప్పుడు యాకుబ్ మెమెన్ కు శిక్ష వేసిన జడ్డి సుప్రీంకోర్టు జడ్జి దీపక్‌మిశ్రాకు అసలు చిక్కు వచ్చిపడింది. యాకుబ్ మెమెన్ క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ వేసిన నేపథ్యంలో అతని పిటిషన్ ను న్యాయమూర్తులు కొట్టిపారేశారు. దీంతో యాకుబ్ మెమెన్ కు ఉరిశిక్ష వేశారు. అయితే యాకుబ్ మెమెన్ పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయమూర్తుల్లో దీపక్‌ మిశ్రా ఒకరు.దాంతో ఇప్పుడు జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఇంటికి బెదిరింపు లేఖలు వస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత భద్రత ఏర్పాట్లు ఉన్నా వదిలిపెట్టబోమని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు యాకుబ్ మెమెన్ సోదరుడు టైగర్ మెమెన్ కూడా తన సోదరుడి ఉరితీతకు ప్రతీకారం తీర్చుకుంటానని హెచ్చరించాడు.దీంతో దీపక్‌మిశ్రా ఇంటి దగ్గర గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని సమర్పించారు.

మీడియానే సమస్యలు సృష్టిస్తోంది.. నరసింహన్

  ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో విద్యుత్ ఉద్యోగుల మధ్య వివాదాలు జరుగుతున్నాయి.. కానీ త్వరలోనే విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. అనవసరంగా మీడియానే మరీ ఎక్కువగా చూపిస్తుందని.. రెండు రాష్ట్రాల్లో సమస్యలు సృష్టిస్తుందని వ్యాఖ్యానించారు. అనంతరం ఆయన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలుసుకున్నారు. గవర్నర్ నరసింహన్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. కాగా గవర్నర్ నరసింహన్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.

కష్టాలంటే సోనియాకు రాహుల్ కు తెలుసా?

  లలిత్ మోదీ వ్యవహారంలో సుష్మా స్వరాజ్, వసుంధరా రాజేలు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుష్మా స్వరాజ్ తను కేవలం మానవత్వంతో లలిత్ మోదీ భార్య క్యాన్సర్ తో బాధ పడుతున్న నేపథ్యంలో ఆమెకు సహాయం చేశానని.. అంతే కాని వేరే ఉద్దేశం లేదని.. అది కూడా మోడీకి వీసా ఇవ్వగలిగితేనే ఇవ్వమని బ్రిటన్ ప్రభుత్వానికి సూచించానని సమాధానమిచ్చారు. అదే నా స్థానంలో సోనియాగాంధీ ఉన్నా అలా చేసేవారు కాదా? అని ప్రశ్నించారు. అయితే దీనికి సోనియాగాంధీ.. సుష్మా మాటల గారడిలో దిట్ట అని.. బాగా నటించారని.. అదే తన స్థానంలో ఉంటే డబ్బు సాయం చేసేదాన్ని అంతే కాని చట్ట విరుద్దమైన పనులు చేసే దాన్ని కాదని సమాధానమిచ్చారు.   మరోవైపు దీనిపై అమ్మకూచి రాహుల్ గాంధీ కూడా స్పందించి తన తల్లి ఎన్నడూ అటువంటి తప్పు చేయదని అన్నారు. ఇదిలాఉండగా సుష్మాస్వరాజ్ పై చేసిన వ్యాఖ్యలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తప్పుబట్టారు. సుష్మాస్వరాజ్ చాలా సాధారణమైన కుటుంబం నుండి ఎన్నో కష్టాలు పడి.. ఎండకు ఎండి వానకు తడిసి ఇప్పుడు ఇలాంటి ఉన్నతస్థానంలో ఉన్నారని.. అలాంటి సుష్మా పై ఇలాంటి వ్యాఖ్యలు తగవని అన్నారు. సోనియా గాంధీ కాని రాహుల్ గాంధీలు ఉన్నత కుటుంబాల నుండి వచ్చారు కాబట్టి వాళ్లకు కష్టాలంటే ఏంటో తెలియదని.. ఎండ అంటే ఎంటో వాళ్లకు తెలుసా అని మండిపడ్డారు. ఏదో రాజకీయ వారసత్వం వల్ల ఎలాంటి కష్టాలు పడకుండానే వంశపారంపర్య రాజకీయాలు చేస్తున్న సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీకి సుష్మాపై ఆరోపణలు చేయడానికి తగరని ఆరోపించారు.

చనిపోయిన భార్యతో 5 సంవత్సరాలుగా

  నిజ జీవితంలో కాని, సినిమాల్లో కాని మనం చాలా ప్రేమ కథలు చూసుంటాం. అలాంటి ప్రేమ చాలా స్వచ్చమైనది.. ఎవరూ మరువలేనిది.. విడదీయలేనిది. కానీ ఇక్కడ ఓ భర్త భార్య మీద చూపించిన ప్రేమ అందరిని భయభ్రాంతులకు గురి చేసింది. అంతలా ఆ భర్త ఏ ప్రేమ చూపించాడనేగా మీ డౌట్.. ఈ సంఘటన చూస్తే మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఈ సంఘటన వియత్నంలో జరిగింది. వియత్నంలోని క్వాంగ్ నామ్ ప్రావిన్స్ వద్ద 55 ఏళ్ల ఓ వ్యక్తి భార్య చనిపోయింది. అయితే అతను మాత్రం తన భార్య చనిపోవడం ఏ మాత్రం తట్టుకోలేక పోయాడు. తన భార్యతో తాను కూడా చనిపోదామా అనుకుంటే తనకు కొడుకు ఉండటంతో అటు చావలేక బ్రతలేక తన భార్య సమాధివద్దనే దాదాపు రెండు సంవత్సరాలు గడిపాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది.. అలా ఎంతకాలం సమాధి దగ్గర ఉండాలనుకున్నాడేమో అతను తన భార్య సమాధి తవ్వి ఆమె హస్తికలు ఇంటికి తీసుకొచ్చి వాటిని కాగితం మట్టితో అచ్చు శరీరంలా తయారు చేసి ముఖానికి మాస్క్, ఇంకా డ్రస్స్ కూడా వేశాడు. అలా ఐదు సంవత్సరాలుగా అతను.. తన కొడుకు కూడా చనిపోయిన తన భర్య పక్కనే పడుకుంటున్నారట. ఒక పక్క భయం వేసిన మరోపక్క అతను చేసిన పని అతని భార్యపై ఉన్న ప్రేమ ఎంతో గొప్పదో కనిపిస్తుంది.  

ఆ కాల్‌డేటా కూడా మాకు పంపండి.. హైకోర్టు

  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సర్వీసు ప్రొవైడర్లు కాల్ డేటాను విజయావాడ కోర్టుకు సమర్పించిన సంగతి తలిసిందే. హైకోర్టు కూడా విజయవాడ కోర్టుతో పాటు మాకు కూడా ఓ ప్రత్యేక మెసెంజర్ ద్వారా పంపించమని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ పై వొడాఫోన్, టాటా టెలీ సర్వీసెస్‌ సంస్థల కాల్‌డేటాను సీల్డ్‌ కవర్లలో ఇవ్వాలన్న విజయవాడ కోర్టు ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హోంశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌ మిశ్రా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది మాట్లాడుతూ వొడాఫోన్‌, టాటా టెలీ సర్వీసులు ప్రతివాదులుగా లేవని... అందవల్ల వాటికి సంబంధించిన కాల్ డేటా సీల్డ్ కవర్ లో ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించారు. అయితే ఏపీ తరపు న్యాయవాది మాట్లాడుతూ గతంలో ఇదే తరహా వ్యాజ్యంపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విధంగానే ఇప్పుడు కూడా చేయాలని కోరారు. అయితే ఇద్దరు వాదనలు విన్న హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలే ఈ వ్యాజ్యంలోనూ వర్తించేలా మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. వొడాఫోన్‌, టాటా టెలీ సర్వీసు సంస్థలు కాల్‌డేటా సీల్డు సీల్డు కవర్లను ప్రత్యేక దూతద్వారా హైకోర్టుకు తరలించి జ్యుడీషియల్‌ రిజిస్ర్టార్‌ వద్ద భద్రపర్చాలని స్పష్టం చేసింది.

అయినా కష్టాలేనా..

  ‘‘మీకు అండగా నేనుంటా'' ఇవి కాంగ్రెసపార్టీ ఉపాధ్యక్షుడు పలికిన మాటలు. ఈ మాటలు ఎవరితో చెప్పారనుకుంటున్నారా.. తెలంగాణ ఓయూ విద్యార్ధులతో.. అయితే కేవలం తమ పార్టీ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ ఒకటిగా ఉన్న రాష్ట్రాన్ని రెండుగా చీల్చిందని రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. అయితే ఈ రాష్ట్ర విభజన వల్ల అటు ఆంధ్రా రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి సరైన రీతిలో బుద్ధిచెప్పినా.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రం సోనియా గాంధీని ఓ దేవతలా పొగిడారు. సోనియాగాంధీనే తెలంగాణను ఇచ్చిందని.. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని ప్రశంసలు కురిపించారు. నాటి నుండి నేటి వరకు కూడా కేసీఆర్ కు సోనియాగాంధీ అంటే కాస్తంత గౌరవమే ఉంటుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీనే కేసీఆర్ పై పోటీ పడటానికి బరిలోకి దిగారు.     ఉస్మానియా విద్యార్ధులు ఢిల్లీలో రాహుల్ గాంధీ, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి డీకే అరుణ, ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, ప్రతినిధులు అద్దంకి దయాకర్‌, శ్రావణ్‌లతో కలిసి భేటీ అయ్యారు. ఉస్మానియాలో జరగనున్న విద్యార్ధి ఆత్మగౌరవ సభకు హాజరుకావాలని వారు రాహుల్ గాంధీని ఆహ్వానించగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. అయితే ఓయూ భూముల విషయంలో కేసీఆర్ కు, విద్యార్ధులకు మధ్య వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్ధులు కేసీఆర్ తీరుపై ఫిర్యాదు చేయడంతో దీనికి స్పందించిన రాహుల్ గాంధీ.. కేసీఆర్ పై పోరాడండి మీతో నేనుంటా అని భరోసా ఇచ్చారంట. అంతేకాదు ఇంకా చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో పోరాడి రాష్ట్రాన్ని సాధించిన వారిలో మొదటి పాత్ర మీదేనని.. అదే విధంగా ప్రజా సమస్యలపై కూడా పోరాడండి అంటూ విద్యార్ధులతో చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు పనిలో పనిగా కేసీఆర్ పై కూడా విమర్శల బాణాలు విసిరారు రాహుల్.. తెలంగాణ సీఎం కేసీఆర్ నిరంకుశత్వాన్ని ఇక ఎంతమాత్రం సహించొద్దని... కేసీఆర్ లో నిరంకుశతత్వ లక్షణాలు ఎక్కువని ఎద్దేవ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డా కూడా ఇంకా కష్టాలేనా? ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన విద్యార్థుల గోడే కేసీఆర్ కు పట్టడం లేదా ప్రశ్నించారు.   మొత్తానికి రాహుల్ గాంధీ అందరిపై పోరాడటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. విశ్రాంతి పేరిట కొంత కాలం మాయమైన రాహుల్ గాంధీ తరువాత బయటికి వచ్చి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నట్టు.. పోరాట పటిమ పెరిగినట్టు తెలుస్తోంది. దీంతో రాహుల్ గాంధీ పై ఉన్న అముల్ బేబి అనే బ్రాండ్ పోవడం ఖాయమని అందరూ అనుకుంటున్నారు.

సినిమా రంగం కీలక పాత్ర పోషిస్తుంది.. మోదీ

  భారత ప్రధాని నరేంద్ర మోదీ చెన్నైలోని మద్రాస్ యూనివర్శిటిలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్నారు. ఈయనకు ముఖ్యమంత్రి జయలలిత ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమాతారలకు పిలుపునిచ్చారు. సినిమా తారలు. యువత చేనేత ఉత్పత్తులు వాడాలని.. చేనేత వస్త్రాలను వాడాలని సూచించారు. సినిమా రంగం ప్రచారం కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని.. సినిమా తారల వల్ల ఎక్కువ ప్రాచుర్యం పొందుతాయని అన్నారు. తాము నటింటే సినిమాల్లో చేనేత వస్త్రాలు ధరించడంవల్ల ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చని తెలిపారు. ప్రస్తుతం యువత ఆన్ లైన్ షాపింగ్ పై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారని కాబట్టి చేనేత ఉత్పత్తులకు కూడా ఆ సదుపాయం కల్పించాలని కోరారు.

ఆ హామీ ఇస్తే సస్పెండ్ ఎత్తివేస్తాం.. వెంకయ్యనాయుడు

  పార్లమెంట్ సమావేశాలు మొదలైన దగ్గరనుండి కాంగ్రెస్ నేతలు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వీళ్ల ఆందోళనలతో పార్లమెంట్ అట్టుడికిపోతుంది. లలిత్ మోదీ విషయంలో సుష్మా స్వరాజ్, వసుంధరా రాజేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి ఆందోళనలు చేపట్టారు. దీంతో స్పీకర్ 25 కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ ఆవరణలో నిరసన చేస్తూనే ఉన్నారు. అయితే దీనిపై పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. దీనిపై వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సస్పెన్షన్‌ ఎత్తివేసేందుకు ప్రభత్వం సిద్ధంగా ఉందని.. సస్పెన్షన్‌ ఎత్తివేయడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. సభ సజావుగా సాగనిస్తామని హామీ ఇస్తే కాంగ్రెస్‌ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు ఎత్తివేస్తామని అన్నారు.

'శ్రీమంతుడిని' పొగిడిన వర్మ.. 'బాహుబలికి' కౌంటర్

  రాంగోపాల్ వర్మ అంటేనే మనకు గుర్తొచ్చేది విమర్శలు. విమర్శలకు బ్రాండ్ అంబాసిడర్ మారిపోయాడు. కానీ అప్పుడప్పుడు పొగడ్తలు కూడా చేస్తుంటారు. కానీ ఒకరిని పొగిడేప్పుడు మరోకరిని విమర్శించకుండా ఉండలేరు. మొత్తానికి విమర్శించడం రాంగోపాల్ వర్మకు చాలా ఇష్టం. ఇంతకీ ఎవరిని ప్రసంశించారనే కదా మీ సందేహం. అదే తాజాగా విడుదలైన మహేష్ బాబు మూవీ ‘శ్రీమంతుడు' సినిమాను వర్మ ప్రశంసించారు. బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత వచ్చిన ‘శ్రీమంతుడు' సింపుల్ అండ్ ప్లేన్ మూవీ అని.. సినిమా విజయం సాధించే అవకాశం ఉందని పొగిడేశారు. పొగిడితే పొగిడారు కాని అటు బాహుబలికి కూడా కౌంటర్ ఇచ్చారు. వందల కోట్లతో వందలాది రోజులు షూటింగ్ చేస్తేనే కాదు... సింపుల్ స్టోరీతో కూడా ప్రేక్షకులని ఆకట్టుకోవచ్చని అది శ్రీమంతుడు సినిమా రుజువు చేసిందని వర్మ పేర్కొన్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విటోరియో స్టోరారో కూడా ఇదే చెప్పారని.. చార్మింగ్ ఉన్న నటుడు క్లోజప్ తో నటిస్తే అంతకంటే అద్భుతమైన విజువల్స్ ఏమీ అవసరం లేదని దానిని మహేష్ బాబు చక్కటి ఉదాహరణ అని ప్రశంసించారు.

సోనియాకు స్మృతి కౌంటర్

  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన దగ్గరనుండి కాంగ్రెస్ నేతలు ఇప్పటివరకూ సభను సజావుగా సాగించింది లేదు. లలిత్ మోదీ వ్యవహారంలో సుష్మా స్వరాజ్ ను వసుంధరా రాజేలు రాజీనామా చేయాలని పట్టుబడుతూనే ఉన్నారు. అయితే ఈ వ్యవహారంపై సుష్మా స్వరాజ్ స్పందిస్తూ నేను తాను కేవలం క్యాన్సర్‌తో బాధపడుతున్న లలిత్‌ మోడీ భార్యకు మాత్రమే సహాయం చేశానని, నా స్థానంలో సోనియాగాంధీ ఉంటే ఏం చేసేవారని ప్రశ్నించారు. దీనికి సోనియా గాంధీ కూడా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. సుష్మా స్వరాజ్ మాటల గారడీలో ఎక్స్‌పర్ట్ అని.. ఒకవేళ తాను కనుక అలాంటి పరిస్థితిలో ఉంటే డబ్బు సహాయం చేసేదాన్నని.. ఇలా చట్ట విరుద్దంగా చేసే దాన్ని కాదని అన్నారు. అయితే ఇప్పుడు సోనియా గాంధీ సుష్మా స్వరాజ్ పై చేసిన వ్యాఖ్యలకు ధీటుగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కౌంటర్ ఇచ్చారు. సోనియా గాంధీ ఏదైనా ప్రసంగం ఇవ్వాలంటే అంత సులభం కాదు.. ప్రసంగాన్ని పేపర్ పైన రాసుకొని చదువుకున్నాకే మాట్లాడగలరని ఎద్దేవా చేశారు.

హరీష్ కు దేవినేని కౌంటర్.. ఇరు రాష్ట్రాలకు అక్షింతలు

  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఎప్పటినుండో వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ రాష్ట్రంలోని పాజెక్టులపై తెలంగాణ.. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ రెండూ వాదులాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య లేఖల యుద్దాలు జరిగాయి. తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పాలమూరు ప్రాజెక్టు, దిండి ప్రాజెక్టులు ఎప్పటినుండో ఉన్నాయని.. అనవసరం ఏపీ ప్రభుత్వ వీటిపై రాద్ధాంతం చేస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్టులు కొత్తవి కాదు అని చెప్పడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయని అన్నారు. ఈ ప్రాజెక్టు గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హామీ వచ్చిందని.. దీనిపై కిరణ్ కుమార్ రెడ్డి సర్వే చేసి జీవో ఇచ్చారని స్పష్టం చేశారు. దీనికి ఏపీ నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు హరీష్ రావుకి కౌంటర్ ఇచ్చారు. సాగు నీటి పైన హరీష్ రావు వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదని.. పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు అక్రమమని అన్నారు. హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులు పాతవేనని చెప్పారు. సుప్రీం కోర్టులో చెప్పిన దానికి భిన్నంగా పాలమూరు, డిండి ప్రాజెక్టులు ప్రారంభించారన్నారు. ఇరు రాష్ట్రాలకు అక్షింతలు మరోవైపు నీటి ప్రాజెక్టులపై విమర్శలు చేసుకుంటూ రెండు రాష్ట్రాలు అసలు విషయం మరచిపోయినట్టున్నాయి. 2014-15 జల సంవత్సరానికి సంబంధించి వినియోగించుకున్న నీటికి సంబంధించిన వివరాలు తెలుపమని కృష్ణా జలాల యాజమాన్య బోర్డు కొద్ది రోజుల క్రితమే ఇరు రాష్ట్రాలను కోరింది. అయితే రెండు రాష్ట్రాలు మాత్రం ఈ విషయాన్ని పక్కన బెట్టి నీటి వాటాలపై నిత్యం తగవులాడుకుంటున్నాయి. దీంతో కృష్ణా రివర్ బోర్డు నీటి వాటాలపై లెక్కలు సమర్పించడంలో తాత్సారం చేస్తున్న విషయమై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఏఏ ప్రాజెక్టులకు ఎంత వాటా వినియోగించుకున్నారో ప్రాజెక్టుల వారీగా పూర్తి వివరాలు తెలపాలని ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణలో కోదండరాం కొత్త పార్టీ?

  తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు ఆ రాష్ట్రంలో ఎలాంటి డోకా లేదు. ప్రతిపక్ష పార్టీలు ఉన్నా పోటీ చేసి అధికారంలోకి వస్తాయన్న నమ్మకం లేదు. కాని ఇప్పుడు తెలంగాణలో మరో పార్టీ రాబోతుంది అనే వార్తలు జోరుగాసాగుతున్నాయి. అది ఎవరో కాదు తెలంగాణ ఉద్యమం సమయంలో ఆ రాష్ట్రాన్ని సాధించడానికి ముఖ్య పాత్ర పోషించిన టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం. ఆ పార్టీకి ఈయన సారథ్యం వహించనున్నారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఢిల్లీలో ఆప్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ముఖ్య కారకులైన యోగేంద్ర యాదవ్‌ అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై చాలామంది అసంతృప్తి కరంగానే ఉన్నారు. ఉద్యమ సమయంలో అందరిని కలుపుకున్న కేసీఆర్ ఆ తరువాత ఎవరిని పట్టించుకోకపోవడం.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం వీటన్నింటిపై కోదండరాం ఇంతకుముందే వ్యతిరేకించారు.   అయితే ఆప్‌ నుంచి బయటకు వచ్చిన యోగేంద్ర యాదవ్‌ ఆ తర్వాత ‘స్వరాజ్‌ అభియాన్‌’ అనే కొత్త వేదికను ప్రారంభించారు. ఈ ‘స్వరాజ్‌ అభియాన్‌’ వేదిక ద్వారా ఆయా రాష్ట్రాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ వేదిక ద్వారానే తెలంగాణ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై దృష్టి సారించారు. ఈనేపథ్యంలోనే కోదండరాంతో కూడా చాలా సార్లు సమావేశమయ్యారు. దీనిలో భాగంగానే యోగేంద్ర యాదవ్ కోదండ రాంతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అసలే టీఆర్ఎస్ వైఖరితో ఆసంతృప్తితో ఉన్న కోదండరాం యోంగేంద్ర యాదవ్ తో కలిసి పని చేయడానికి సముఖత చూపినట్టు రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. దీనిలో భాగంగానే ఆప్‌ తరహాలో తెలంగాణలో జాప్‌ (జాయింట్‌ యాక్షన్‌ పార్టీ)ని ఏర్పాటు చేయాలని కూడా యోగేంద్ర సూచించినట్లు తెలిసింది. అయితే, దీనిపై ఇంకా కోదండరాం తుది నిర్ణయం తీసుకోలేదు అలాగని తోసిపుచ్చనూ లేదు. ఈ నేపథ్యంలో ఈనెల పదిన వీరిద్దరి మధ్య కీలక సమావేశం జరగనుందని అత్యంత విశ్వసనీయ వర్గాలు వివరించాయి. మరి ఇన్ని రోజులు మాకు ఎవరూ పోటీరారని ఎగిరిపడుతున్న టీఆర్ఎస్ కు ఒకవేళ కోదండరాం కనుకు పార్టీ పెడితే టీఆర్ఎస్ కు చెక్ పడినట్టే అని భావిస్తున్నారు.

ఇరు రాష్ట్రాల వాదనలు పక్కన పెట్టండి..

  ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విద్యార్ధుల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు మండిపడింది. విద్యార్ధుల వివాదంలో ఇరురాష్ట్రాలు వాదనలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర పభుత్వం కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే నోటిఫికేషన్లు జారీ చేసే విధంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అంబేద్కర్ యూనివర్శిటీ ఏపీ విధ్యార్ధులకు అందిస్తున్న సేవలను నిలిపి వేసింది. అంతేకాదు ఈ వర్శిటీలో పనిచేసే ఉద్యోగులకు ఈ నెల నుండి జీతాలు కూడా చెల్లించేది లేదని తేల్చి చెప్పింది. అయితే ఈ విషయంపై విచారణ జరిపిన హైకోర్టు మీ రెండు రాష్ట్రాల వాదనలు పక్కన పెట్టి విద్యార్ధులకు నష్ట జరగకుండా చూడండి అని సూచించింది. అయితే ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ ‘‘బీఆర్‌ఏవోయూ పదో షెడ్యూలులో ఉంది. తెలంగాణ రాష్ట్ర విడిపోయిన తరువాత కూడా ఏడాది వరకూ ఇరు రాష్ట్రాల్లోని విద్యార్ధులకు సేవలు అందించాం.. తెలంగాణలోనే కాదు అటు ఆంధ్రాలో ఉన్న 93 బీఆర్‌ఏవోయూలో ఉన్న శాశ్వత, కాంట్రాక్టు, తాత్కాలిక సిబ్బందికి కూడా తెలంగాణ ప్రభుత్వమే జీత భత్యాలు చెల్లిస్తుంది. కానీ చట్ట ప్రకారం చట్ట ప్రకారం ఏడాది ముగిసిన తర్వాత వర్సిటీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంది. దీనికి సంబధించి ఏపీ ప్రభుత్వానికి లేఖలు కూడా రాశాం. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం స్పందించలేదు’’ అని కోర్టు దృష్టికి తెచ్చారు.   దీంతో హైకోర్టు ఏపీ ప్రభుత్వం ఉద్దేశించి మీ రాష్ట్రంలో విద్యార్ధులు నష్టపోతుంటే మౌనంగా ఎందుకు ఉంటున్నారు? మీ వాదనల వల్ల విద్యార్ధులు ఎంత నష్ట పోతున్నారో తెలియడం లేదా అని మండిపడింది. అయితే ఏపీ ఏజీ పి.పి.వేణుగోపాల్‌ మాట్లాడుతూ 10వ షెడ్యూల్‌లోని సంస్థలపై వివాదం కొనసాగుతోందని, దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిందని, అక్కడ కేసుల విచారణ పెండింగ్‌లో ఉందని వేణుగోపాల్‌ తెలిపారు. దీంతో ధర్మాసనం కల్పించుకొని మేము పదో షెడ్యూల్‌లోని సంస్థలపై ఉన్న వివాదంలోకి వెళ్లడం లేదు మీ రెండు రాష్ట్రాల వివాదాల వల్ల విద్యార్ధులు నష్ట పోతున్నారు.. వారి కోసం మీ వివాదాలు పక్కనపెట్టి ఇరు రాష్ట్రాల అధికారులు, ఏజీలు మాట్లాడుకొని ఓ నిర్ణయం తీసుకోండి అంటూ సూచించింది. దీనిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమేమిటో తెలపాలంటూ తదుపరి విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది.

ఏపీ సచివాలయం 50 అంతస్తులు!

  ఏపీ రాజధాని అమరావతిలో ప్రభుత్వ కార్యలయాల నిర్మాణానికి గాను, వాటికి సంబధించిన ప్రణాళికకు గాను ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నెల రోజుల్లో తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేసి హైదరాబాద్ లో ఉన్న కొన్ని శాఖలను ఏపీ ప్రభుత్వం అక్కడి నుండి ఇక్కడికి తరలించాలని నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ప్రజలకు దగ్గరగా పాలన చేయాలనే ఉద్దేశంతో ముందుగా ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే ముందుగా అమరావతిలో ఫేజ్‌-1 భాగమైన అసెంబ్లీ, సచివాలయం, ప్రధాన కార్యాలయాలు, ఉద్యోగుల గృహాలు తదితర భవనాల నిర్మాణ కార్యక్రమాలను త్వరితగతిన చేపట్టేందుకు సీఆర్‌డీఏ సన్నద్ధమవుతోంది.   ఈ నేపథ్యంలో ఏపీలో అసెంబ్లీ, సచివాలయాల నిర్మాణాలను ప్రపంచస్థాయి కట్టడాలుగా నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నారు. రాజధానిలో సచివాలయాన్ని 50 అంతస్తుల్లో విశాలమైన గదులతో.. అందే విధంగా సీఎం క్యాంపు కార్యాలయాన్ని దీనిలోనే 47 లేదా 48వ అంతస్తులో నిర్మించాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. ఇప్పటికే వీటి నిర్మాణానికి సరైన డిజైన్ ను ఇచ్చేందుకు కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. అయితే మరో రెండు మూడు రోజుల్లో వీటిలో ఒక మంచి సంస్థకు ఈ డిజైనింగ్ బాధ్యతను ఇవ్వనున్నారు. అంతేకాదు అసెంబ్లీని కూడా తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా నిర్మించాలని భావిస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్.. లోకేష్, బ్రాహ్మణి ఫోన్లు కూడా

  ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏపీ పోలీసుల దర్యాప్తులో కొత్త కొత్త అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏపీ అధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేసిందని దానికి సంబంధించిన పలు ఆధారాలతో కూడిన నివేదికను ఏపీ ప్రభుత్వం పదిరోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. అంతేకాదు దానిలో ఫోన్ ట్యాపింగ్ కు తలపడిన పలు అధికారుల పేర్లును కూడా పేర్కోంది. ఏపీ సీఎం చంద్రబాబు, తనయుడు నారా లోకేశ్ తోపాటు పలు అధికారుల ఫోన్లు జరిపినట్టు చెపుతున్నారు. అయితే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒక్క నోటుకు ఓటు వ్యవహారం విషయంలో కాకుండా మరెన్నో లక్ష్యాలతో ఏపీ ప్రభుత్వ పెద్దల ఫోన్లను ట్యాప్ చేసినట్టు ఏపీ పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఏపీ రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి గాను చంద్రబాబు సింగపూర్ జపాన్ ప్రతినిధులతో మాట్లాడిన సంభాషణలు, ఇంకా ముఖ్యమైన అధికారుల కుటుంబ సభ్యుల సంభాషణలు కూడా తెలంగాణ ప్రభుతం ట్యాపింగ్ చేసినట్టు ఏపీ పోలీసులు పేర్కొంటున్నారు. అంతేకాదు సీఎం తనయుడు నారా లోకేశ్ తన భార్య బ్రహ్మిణి ల ఫోన్ సంభాషణలు.. వ్యాపార, వ్యక్తిగత విషయాలనూ తెలంగాణ పోలీసులు ట్యాపింగ్‌ ద్వారా తెలుసుకున్నట్లు ఏపీ పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం హైకోర్టులో ఈ వ్యవహారంలో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఈ అంశాలన్నీ పొందుపరచనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.   అయితే ఈ కేసులో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అవును మేము ట్యాపింగ్ చేశాము.. అది మా హక్కు.. చట్టప్రకారమే ఫోన్ ట్యాపింగ్ చేశామని బహిరంగంగానే వెల్లడించాయి. వారు చెప్పిన చట్టం ప్రకారం అంటే టెలిగ్రాఫ్‌ చట్టంలోని సెక్షన్‌ 52 ఆధారంగా దేశ భద్రత, శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్య క్తుల ఫోన్లు ట్యాపింగ్‌ చేయవచ్చు. అలా ట్యాపింగ్ చేయడానికి కూడా కొన్ని షరతులుంటాయి.. ముందుగా దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ నుండి అనుమతి తీసుకొని అప్పుడు ట్యాపింగ్ చేయాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం అవేమీ లేకుండా తనకి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించింది. ఇప్పుడు వాళ్లు చట్ట ప్రకారమే అంటున్నా ఆచట్టాన్నే కనుక తీసుకుంటే వాళ్లు చెప్పిన దాని ప్రకారం దేశ భద్రత, శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్య క్తుల లిస్టులోకి ఎవరూ రారు. ఆ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అడ్డంగా బుక్కయింది. మొత్తానికి తీగ లాగితే డొంకంతా కదిలి అన్నట్టు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఇంకా ఎన్ని విషయాలు బయటపడతాయో చూడాలి.

వాళ్లను తిడితే వీళ్ల కడుపు నిండుతుందా.. రేవంత్ రెడ్డి

  తెలంగాణ సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఏడాది పాలనలో ఆయన రాష్ట్రానికి చేసిందేమీ లేదని.. తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గ్రామాన్ని చూస్తే తెలంగాణ పాలన ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతుందని ఎద్దేవ చేశారు. లేచిన దగ్గర నుండి ఆంధ్రా వాళ్లను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని.. వాళ్లని తిట్టడంవల్ల తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది ఏం లేదని.. వాళ్లని విమర్శించినంత మాత్రాన తెలంగాణ ప్రజల కడుపు నిండదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేసిన వందలాది కార్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుమారుడి షోరూమ్‌లో కొన్నవేనని చెప్పారు. యాదగిరి గుట్ట డిజైన్ ఇచ్చింది కూడా ఆంధ్రాకు చెందిన వ్యక్తే అని తెలిపారు. ప్రతి పనిని ఆంధ్రా వారితోనే కలసి చేస్తున్న కేసీఆర్... హైకోర్టు విభజనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డొస్తున్నారని ఎలా అంటారని ప్రశ్నించారు. తన మీద కక్ష్యతో తన నియోజకవర్గమైన కొడంగల్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని.. అది సరికాదని.. అలా చేస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తానని అన్నారు.