హరీష్ కు దేవినేని కౌంటర్.. ఇరు రాష్ట్రాలకు అక్షింతలు
posted on Aug 7, 2015 @ 3:51PM
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఎప్పటినుండో వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ రాష్ట్రంలోని పాజెక్టులపై తెలంగాణ.. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ రెండూ వాదులాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య లేఖల యుద్దాలు జరిగాయి. తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పాలమూరు ప్రాజెక్టు, దిండి ప్రాజెక్టులు ఎప్పటినుండో ఉన్నాయని.. అనవసరం ఏపీ ప్రభుత్వ వీటిపై రాద్ధాంతం చేస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్టులు కొత్తవి కాదు అని చెప్పడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయని అన్నారు. ఈ ప్రాజెక్టు గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హామీ వచ్చిందని.. దీనిపై కిరణ్ కుమార్ రెడ్డి సర్వే చేసి జీవో ఇచ్చారని స్పష్టం చేశారు. దీనికి ఏపీ నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు హరీష్ రావుకి కౌంటర్ ఇచ్చారు. సాగు నీటి పైన హరీష్ రావు వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదని.. పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు అక్రమమని అన్నారు. హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులు పాతవేనని చెప్పారు. సుప్రీం కోర్టులో చెప్పిన దానికి భిన్నంగా పాలమూరు, డిండి ప్రాజెక్టులు ప్రారంభించారన్నారు.
ఇరు రాష్ట్రాలకు అక్షింతలు
మరోవైపు నీటి ప్రాజెక్టులపై విమర్శలు చేసుకుంటూ రెండు రాష్ట్రాలు అసలు విషయం మరచిపోయినట్టున్నాయి. 2014-15 జల సంవత్సరానికి సంబంధించి వినియోగించుకున్న నీటికి సంబంధించిన వివరాలు తెలుపమని కృష్ణా జలాల యాజమాన్య బోర్డు కొద్ది రోజుల క్రితమే ఇరు రాష్ట్రాలను కోరింది. అయితే రెండు రాష్ట్రాలు మాత్రం ఈ విషయాన్ని పక్కన బెట్టి నీటి వాటాలపై నిత్యం తగవులాడుకుంటున్నాయి. దీంతో కృష్ణా రివర్ బోర్డు నీటి వాటాలపై లెక్కలు సమర్పించడంలో తాత్సారం చేస్తున్న విషయమై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఏఏ ప్రాజెక్టులకు ఎంత వాటా వినియోగించుకున్నారో ప్రాజెక్టుల వారీగా పూర్తి వివరాలు తెలపాలని ఆదేశాలు జారీ చేసింది.