ఇరు రాష్ట్రాల వాదనలు పక్కన పెట్టండి..
posted on Aug 7, 2015 @ 12:56PM
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విద్యార్ధుల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు మండిపడింది. విద్యార్ధుల వివాదంలో ఇరురాష్ట్రాలు వాదనలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర పభుత్వం కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే నోటిఫికేషన్లు జారీ చేసే విధంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అంబేద్కర్ యూనివర్శిటీ ఏపీ విధ్యార్ధులకు అందిస్తున్న సేవలను నిలిపి వేసింది. అంతేకాదు ఈ వర్శిటీలో పనిచేసే ఉద్యోగులకు ఈ నెల నుండి జీతాలు కూడా చెల్లించేది లేదని తేల్చి చెప్పింది. అయితే ఈ విషయంపై విచారణ జరిపిన హైకోర్టు మీ రెండు రాష్ట్రాల వాదనలు పక్కన పెట్టి విద్యార్ధులకు నష్ట జరగకుండా చూడండి అని సూచించింది. అయితే ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ ‘‘బీఆర్‌ఏవోయూ పదో షెడ్యూలులో ఉంది. తెలంగాణ రాష్ట్ర విడిపోయిన తరువాత కూడా ఏడాది వరకూ ఇరు రాష్ట్రాల్లోని విద్యార్ధులకు సేవలు అందించాం.. తెలంగాణలోనే కాదు అటు ఆంధ్రాలో ఉన్న 93 బీఆర్‌ఏవోయూలో ఉన్న శాశ్వత, కాంట్రాక్టు, తాత్కాలిక సిబ్బందికి కూడా తెలంగాణ ప్రభుత్వమే జీత భత్యాలు చెల్లిస్తుంది. కానీ చట్ట ప్రకారం చట్ట ప్రకారం ఏడాది ముగిసిన తర్వాత వర్సిటీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంది. దీనికి సంబధించి ఏపీ ప్రభుత్వానికి లేఖలు కూడా రాశాం. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం స్పందించలేదు’’ అని కోర్టు దృష్టికి తెచ్చారు.
దీంతో హైకోర్టు ఏపీ ప్రభుత్వం ఉద్దేశించి మీ రాష్ట్రంలో విద్యార్ధులు నష్టపోతుంటే మౌనంగా ఎందుకు ఉంటున్నారు? మీ వాదనల వల్ల విద్యార్ధులు ఎంత నష్ట పోతున్నారో తెలియడం లేదా అని మండిపడింది. అయితే ఏపీ ఏజీ పి.పి.వేణుగోపాల్ మాట్లాడుతూ 10వ షెడ్యూల్‌లోని సంస్థలపై వివాదం కొనసాగుతోందని, దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిందని, అక్కడ కేసుల విచారణ పెండింగ్‌లో ఉందని వేణుగోపాల్ తెలిపారు. దీంతో ధర్మాసనం కల్పించుకొని మేము పదో షెడ్యూల్‌లోని సంస్థలపై ఉన్న వివాదంలోకి వెళ్లడం లేదు మీ రెండు రాష్ట్రాల వివాదాల వల్ల విద్యార్ధులు నష్ట పోతున్నారు.. వారి కోసం మీ వివాదాలు పక్కనపెట్టి ఇరు రాష్ట్రాల అధికారులు, ఏజీలు మాట్లాడుకొని ఓ నిర్ణయం తీసుకోండి అంటూ సూచించింది. దీనిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమేమిటో తెలపాలంటూ తదుపరి విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది.