అందుకయితే రాజీనామాకి సిద్దం:మురళీ మోహన్

  దేశంలో మరే రాష్ట్రానికి కూడా కొత్తగా ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన కేంద్రానికి లేదని కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ పార్లమెంటులో చేసిన ప్రకటనతో తెదేపా, బీజేపీలు చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తోంది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం మళ్ళీ ఉద్యమాలు ఊపందుకొంటున్నాయి. ఎంపీ మురళీ మోహన్ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ప్రజలకి వాస్తవిక పరిస్థితుల గురించి వివరించే ప్రయత్నం చేసారు.   “ప్రస్తుతం కేంద్రప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉంది. అది ఎవరి మద్దతుపై ఆధారపడి లేదు. అందువలన మేము రాజీనామాలు చేసినా దానిపై ఎటువంటి ఒత్తిడి, ప్రభావం ఉండదు. కనుక మేము ఎంపీలుగా ఉన్నప్పుడే కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మేము రాజీనామా చేస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందంటే మేము ఈ క్షణమే రాజీనామాలు చేయడానికి సిద్దంగా ఉన్నాము. కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంభించడం వలన మరింత నష్టమే తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. రాష్ట్ర విభజన వలన తీవ్రంగా నష్టపోయిన మన రాష్ట్రానికి తప్పనిసరిగా ప్రత్యేక హోదా కావలసిందే. అందుకోసమే మేము కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే ప్రత్యేక హోదా కోసం ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నాము” అని తెలిపారు.

వారిద్దరు ఇంకా ఐ.యస్. ఉగ్రవాదుల చెరలోనే!

  ఐదు రోజుల క్రితం లిబియాలో ఐ.యస్.ఐ.యస్.ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన హైదరాబాద్ కి చెందిన బలరాం కిషన్, గోపీ కృష్ణ ఇంకా వారి చెరలోనే ఉన్నట్లు తాజా సమాచారం. వారిని విడిపించేందుకు కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గతవారం 29వ తేదీన వారు హైదరాబాద్ తిరిగి వస్తుండగా సిర్సత్ పట్టణం సమీపంలో కిడ్నాప్ చేయబడ్డారు. కిడ్నాప్ అయిన నలుగురిలో కర్నాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరిని ఉగ్రవాదులు శుక్రవారం సాయంత్రం విడిచిపెట్టారు. కానీ శ్రీకాకుళం జిల్లాలో టెక్కలికి చెందిన టి. గోపీకృష్ణని, హైదరాబాద్ కి చెందిన బలారంకిషన్ న్ని ఇంతవరకు విడిచిపెట్టలేదు.   గత వారం రోజులుగా వారి కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వాల తరపున మంత్రులు వారికి దైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వారిరువురూ ఈ రోజు విడుదలవవచ్చని విదేశాంగ శాఖ అధికారులు ఆశిస్తున్నారు. కానీ ఉగ్రవాదుల చెరలో విడుదలయ్యే వరకు ఎవరూ కూడా ఖచ్చితంగా హామీ ఇవ్వలేని పరిస్థితి నెలకొని ఉంది.

సుమారు 5000 అశ్లీల వెబ్ సైట్లను నిలిపివేసిన కేంద్రం

  ఇప్పుడు ఇంటర్నెట్ సెల్ ఫోన్లకు కూడా విస్తరించడంతో దాని వలన ఎన్ని లాభాలు చేకూరుతున్నాయో అంతకంటే ఎక్కువ నష్టం కూడా జరుగుతోంది. ఇంటర్నెట్ లో వేలాదిగా అశ్లీల వెబ్ సైట్స్ వలన దేశంలో యువత పెడమార్గం పట్టుతోంది. అంతేకాదు అటువంటి వాటిని చిత్రీకరించేందుకు జరుగుతున్న ప్రయత్నాల వలన సమాజంలో నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. అందుకే కేంద్రప్రభుత్వం అశ్లీల వెబ్ సైట్లపై కొరడా జులిపించింది. వివిధ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఇంత వరకు సుమారు 5000 అశ్లీల వెబ్ సైట్లను నిలిపివేసింది.   మొత్తం 32 మంది సర్వీస్ ప్రోవైడర్లను ఈ అశ్లీల వెబ్ సైట్లను నిషేదించమని కోరగా ఇంతవరకు కేవలం 8 మంది మాత్రమే స్పందించారు. దీని వలన న్యాయపరమయిన వివాదాలలో చిక్కుకొన వలసి వస్తుందనే ఉద్దేశ్యంతో మిగిలినవారిలో కొందరు తమకు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే వాటిని నిలిపివేస్తామని స్పష్టం చేసారు. బ్లాక్ చేయబడిన అశ్లీల వెబ్ సైట్లు మళ్ళీ కొత్త ఐ.పి అడ్రస్ మరియు సరికొత్త పేర్లతో తమ కార్యక్రమాలను కొనసాగిస్తుండటంతో వాటిని కూడా నిషేదించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.

విమాన ప్రమాదంలో బిన్ లాడెన్ కుటుంబ సభ్యులు మృతి

  ఒకప్పటి అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ తల్లి, సోదరి, సోదరి భర్త ముగ్గురూ కూడా ఇంగ్లాండ్ లో నిన్న రాత్రి జరిగిన ఒక విమాన ప్రమాదంలో మరణించారు. వారు ఇటలీలోని మిలన్ నుండి బ్రిటన్ లోని హాంప్ షైర్ కి ఒక చిన్న ప్రైవేట్ జెట్ విమానంలో వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ఏమ్బ్రియర్ ఫీనం-300 జెట్ విమానం రన్ వే మీద దిగే ముందు బ్లాక్ బుష్ విమానాశ్రయం పక్కనే ఉన్న కార్ల వేలం వేసే కంపెనీ మీద కూలి పేలిపోయింది. ఆ ప్రమాదంలో విమాన పైలెట్ తో సహా ముగ్గురూ మరణించారు. ఈ ప్రమాదం సాంకేతిక లోపం వాళ్ళ జరిగిందా లేక ఏదయినా కుట్ర జరిగిందా లేక వేరే ఇతర కారణాలేమయినా ఉన్నాయా అనే విషయం దర్యాప్తులో తేలుతుంది. బ్రిటన్ దర్యాప్తు బృందాలు ఘటాన స్థలికి చేరుకొని దర్యాప్తు మొదలు పెట్టాయి.

ప్రత్యేక హోదా వచ్చే వరకూ ప్రయత్నిస్తాం.. చంద్రబాబు

  దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం చెప్పడంతో ఏపీ రాష్ట్రానికి బాంబు పేల్చినంత పైనంది. ఎప్పటినుండో ప్రత్యేక హోదా కోసం ఎదురుచూస్తున్న ఏపీ రాష్ట్రానికి కేంద్రం చెప్పిన మాటతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇప్పుడు ఈవిషయంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందిస్తూ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే వరకూ ప్రయత్నాలు కొనసాగిస్తామని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో గత ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చిందని.. అందుకే రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నామని అన్నారు. అంతేకాదు ప్రత్యేక హోదా విషయంలో అన్ని రాష్ట్రాలతో ఏపీని పోల్చవద్దని.. ఏపీది ప్రత్యేక పరిస్థితి అని.. ఏపీకీ ఇప్పటికే రాష్ట్ర విభజన వల్ల ఆర్ధిక లోటు చాలా ఉందని.. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇవ్వననడం సబబు కాదని వెల్లడించారు. అన్ని రాష్ర్టాలతో పోటీపడే స్థాయికి వచ్చేవరకు కేంద్రం సహకరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

యాకుబ్ భార్యకు రాజ్యసభ సీటు.. పదవికి వేటు

  వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సమాజావాదీ పార్టీ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా అలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇరకాటంలో పడ్డారు ఓ నేత. ముంబై జంట పేలుళ్ల కేసులో యాకుబ్ మెమెన్ ను గురువారం ఉరితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంపై సమాజ్ వాదీ పార్టీ ఉపాధ్యక్షుడు ఫరూక్ ఘోసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లింలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని.. ఈ సమస్యలను అధిగమించాలంటే వారి తరపు మాట్లాడటానికి ఒక వ్యక్తి కావాలని.. సభలో వారి వాదనను వినిపించేందుకు ఒక గొంతు కావాలని.. ఈ నేపథ్యంలో యాకుబ్ మెమెన్ భార్య రహీన్ కు రాజ్యసభకు నామినేట్ చేయాలని పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కు లేఖ రాశారు. ముస్లింల తరపున ఆమె పోరాడుతుందని లేఖలో పేర్కొన్నారు. అంతే ఈయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఫరూక్ ను వెంటనే పార్టీనుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఏపీ హోదా.. చీర, పూలు, జాకెట్లతో నిరసన

  ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని నిన్న లోక్ సభలో జరిగిన ప్రశ్నోత్తరాల చర్చలో కేంద్రమంత్రి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం పై రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఆందోళనలు మొదలయ్యాయి. ప్రత్యేక హోదా కోసం పోరాడటంలో టిడిపి పూర్తిగా విఫలమయ్యిందని.. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడాలంటూ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఇంటిముందు ఏఐవైఎఫ్‌ నాయకులు ఆందోళనకు దిగారు. దీనిలో భాగంగా చీర, పూలు, జాకెట్లతో నిరసన తెలిపారు. మరోవైపు ఉరవకొండలో ప్రజలు ఇంకొంచం వెరైటీగీ నిరసన తెలిపారు. మొహాలకు ముసుగులు వేసుకొని బూట్లను పాలిష్ చేస్తూ తమ నిరసనను తెలిపారు.

68 సంవత్సరాల తర్వాత మళ్లీ స్వాతంత్ర్యం

భారతదేశం.. మనం ఈ దేశంలో ఇప్పుడు ఇంత స్వేచ్చగా.. ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నామంటే దీనికి ఎంతోమంది బలిదానాలు ప్రతిఫలమే. ఎందరో మహనీయుల త్యాగఫలమే. వారు సలిపిన నిర్విరామ పోరాటమే ఇవాళ మనం అనుభవిస్తున్న స్వేచ్చా, స్వాతంత్ర్యాలు. ఇప్పుడు స్వతంత్యం వచ్చి మనకు 68 సంవత్సరాలు అవుతున్నా... ఇప్పుడు మళ్లీ 68 సంవత్సరాల తరువాత కొంతమంది భారతీయులకు స్వతంత్ర్యం వచ్చింది. అదేలా అంటారా.. తలాతోక లేకుండా సాగిన దేశ విభజన ఫలితంగా భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దులు అడ్డదిడ్డంగా రూపొందాయి. దీనివల్ల గత కొన్ని దశాబ్దాలుగా ఈ సరిహద్దు గురించి ఇరు దేశాల మధ్య ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఈ గొడవలకు సమగ్ర పరిష్కారం కనుగొనేందుకు సాగిన ప్రయత్నాల వల్ల ఫలశ్రుతిగా 2011 సెప్టెంబరులో భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య 'ప్రొటోకాల్‌' కుదిరింది. దీంతో వివాదాస్పద భూభాగాల్లో నివసిస్తున్న ప్రజల ఆకాంక్షలను మన్నిస్తూ, వారెవరూ ఉన్నచోటును వదిలిపెట్టి నిర్వాసితులై వెళ్లిపోవాల్సిన అవసరం లేకుండా  ఒప్పందం కుదరగా ఆ మేరకు 2013నాటి బిల్లు రూపొందింది. బంగ్లాదేశ్ లోని నాలుగు జిల్లాల పరిధిలో 111 గ్రామాల్లో కలిపి మొత్తం సుమారు 15000 మంది భారతీయులు ఉన్న నేపథ్యంలో ఎవరి భూభాగంలోని పరగణాలు వారికే చెందేలా తీర్మానించిన బిల్లు- పరాధీనంలో ఉన్న ప్రాంతాల పంపకాల్నీ నిర్దేశించింది.   ఈ మేరకు భారత్ - బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు మధ్య ఒప్పందం కుదిరి.. సరిహ‌ద్దు ఒప్పందం పత్రాలపై ఇరు దేశాల ప్రధానులు సంతకాలు కూడా చేశారు. దీంతో 41 ఏళ్ల పాటు కొనసాగిన సరిహద్దు వివాదానికి ముగింపు పలికారు. తాజా సరిహ‌ద్దు ఒప్పందంతో భారత్ భూభాగంలోకి 51 గ్రామాలు, బంగ్లాదేశ్ లోకి 111 గ్రామాలు వెళ్లనున్నాయి. దీంతో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న దాదాపు 14 వేలమంది బంగ్లాదేశీయులకు నిన్న అర్ధరాత్రి భారత పౌరసత్వం లభించింది. దీంతో గ్రామాల్లో  సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా భారత జెండా రెపరెపలాడుతున్నాయి. ఈ విభజనతో సరిహద్దు ప్రాంతంలో ఉన్న గ్రామాలకు కొత్త భారత పిన్ కోడ్ సంఖ్యలు రానున్నాయి. ఈ నేపథ్యంలో 14 వేల మంది ఉన్న ప్రాంతాలకు నేడు పిన్ కోడ్ సంఖ్యలను అందించనున్నట్టు కూచ్ బెహర్ కలెక్టర్ ఉళగనాథన్ వెల్లడించారు. ఉద్యోగాలకు పోటీ పడేందుకు యువత అర్హత పొందుతుంది.

ఇంకేం చేయాలి.. బట్టలూడదీసుకొని తిరగాలా

  దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని నిన్న లోక్ సభలో జరిగిన ప్రశ్నోత్తరాల చర్చలో కేంద్రమంత్రి చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్రం నీళ్లు చల్లినంత పని చేసింది. రాష్ట్ర విభజన వల్ల ఏపీకి ఆర్ధిక లోటు చాలా ఉన్న నేపథ్యంలో ఈ ప్రత్యేక హోదాపైనే చాలా ఆశలు పెట్టుకుంది. అసలు అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ప్రత్యేక హోదా కల్సిస్తామని హామీ ఇచ్చిన తరువాతే రాష్ట్ర విభజనకు ఒప్పుకోవండం జరిగింది. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం మాత్రం అవేమి పట్టించుకోకుండా ఒక్కమూటలో ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు అని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ విషయంపై బీజేపీ తీరును ఏపీ ఎంపీలు తప్పుబడుతున్నారు.   ఈ విషయంపై ఎంపీ తెలుగుదేశం పార్టీ పార్లెమంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు స్పందించి ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ అన్యాయం చేస్తుందని.. గతంలో రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని.. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ తప్పుచేస్తుందని విమర్శించారు. ఈ విషయంలో టిడిపి, బిజెపిలకు నష్టం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంతలో మీడియా ప్రతినిధులు ప్రత్యేక హోదా గురించి అడిగిన ప్రశ్నలకు సహనం కోల్పోయి.. ప్రత్యేక హోదా కోసం ఇంకేం చేయమంటారు.. బట్టలూడదీసుకుని తిరగమంటారా అని మాట్లాడారు. ప్రత్యేక హోదాపై జనసేన అధినేత పవ్ కళ్యాణ్ ముందండి నజిపిస్తే తాము కూడా ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని రాయపాటి అన్నారు.

తెలంగాణలో ఈతచెట్లు.. 5 కోట్లు

  తెలంగాణలో కల్తీ కల్లు తాగి చాలా మంది చనిపోతున్నారని సీఎం కేసీఆర్ చాలా బాధపడుతున్నట్టున్నారు అందుకే తెలంగాణ చెరువు కట్టల మీద ఐదు కోట్ల ఈతచెట్లను పెంచాలని ఆదేశించారట. ఈ బాధ్యతను ఎక్సైజ్ శాఖ తీసుకోవాలని ,ఈత నర్సరీలను తయారుచేయాలని ఆయన సూచించారట. తెలంగాణలో చాలా చోట్ల కల్తీ గుడుంబా వల్ల ప్రజలు చనిపోతున్నారని.. ఈ పరిస్థితిని అరికట్టాలని ఈయన అన్నారు. దీనిలో భాగంగానే మంచి కల్లు కోసం ఈత చెట్లను పెంచాలని.. కాయకష్టం చేసుకుని వచ్చిన శ్రామికులు విశ్రాంతి కోసం మద్యం తీసుకుంటారని అందువల్ల వారి ఆరోగ్యానికి నష్టం లేని విధంగా మంచి మద్యం అందించాలని కెసిఆర్ సూచించారట.

ఆరు నెలల్లో నిర్ణయం తీసుకుంటే మంచిది

  రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న హైకోర్టు విభజనపై ఇరు రాష్ట్రాల మధ్య వాదనలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వెంటనే హైకోర్టును విభజించాలని ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడ హైకోర్టు విభజన సాధ్యం కాదని.. ఏపీ ప్రభుత్వం అక్కడ హైకోర్టును నిర్మించుకున్న తరువాత విభజన కుదురుతుందని న్యాయస్థానం టీ సర్కారుకు సూచించింది. ఏపీ హైకోర్టు బాధ్యతను కేంద్రంపై పెడుతూ.. దానికి కావలసని అనువైన స్థలాన్ని.. నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని కూడా కేంద్రం భరించాలని సూచించింది. కానీ న్యాయస్థానం అయితే చెప్పింది కానీ కేంద్రం మాత్రం ఇప్పటివరకూ స్పందించలేదు. ఇప్పుడు ఈ విషయంపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టు ఎక్కడ ఉండాలో ఆరు నెలల్లోపు ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదని.. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పరస్పరం సంప్రదించుకోవాలని తెలిపింది. ఏపీలో హైకోర్టు ఎక్కడ నిర్మించుకోవాలి.. దానికి అనువైన ప్రదేశం ఎక్కడో చూసి హైకోర్టు న్యాయమూర్తికి తెలపాలని.. న్యాయమూర్తి ఏపీ మంత్రులతో కలిసి చర్చించి ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.

ఏపీకి నో స్పెషల్ స్టేటస్! నోరెత్తని ఏపీ ఎంపీలు

ఎప్పటినుండో ఆశగా ఎదురుచూస్తున్న ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్ర ఒక్కసారిగా నీళ్లు చల్లినంత పనిచేసింది. ప్రత్యేక హోదాపై చర్చలు జరుగుతున్నాయి.. 60 శాతం చర్చలు పూర్తయయ్యాయి.. ఆలోచిస్తున్నాం అని ఎన్నో మాటలు చెప్పిన కేంద్రం ఇప్పుడు ఉన్నట్టుండి బాంబు పేల్చినంత పనిచేసింది. కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ దేశంలోని ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని.. గతంలో బీహార్ కు కూడా స్పేషల్ స్టేటస్ ఇవ్వలేదని లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపిన సంగతి తెలిసిందే. అంటే దీనిని బట్టి ఏపీకి కూడా ప్రత్యేక హోదా రానట్టే అర్ధమవుతోందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంటే ఇంద్రజిత్ ప్రత్యక్షంగా చెప్పకపోయినా పరోక్షంగా మాత్రం చెప్పినట్టే భావిస్తున్నారు. లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ సభ్యుడు బీబీ పాటిల్‌, బీజేపీ సభ్యుడు విష్ణుదయాళ్‌ రామ్‌ ప్రత్యేక హోదాపై అడిగిన ప్రశ్నలపై ఇంద్రజిత్‌ సమాధానం చెపుతూ గతంలో ప్రత్యేక హోదా వివిధ రాష్ట్రాలకు అమలయ్యేదని, కాని ఇప్పుడు దానికి బదులు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా పెంచాలన్న 14వ ఆర్థిక సంఘం ప్రతిపాదనల్ని కేంద్రం యథాతథంగా ఆమోదించి అమలు చేస్తోందని చెప్పారు. దీనివల్ల ఏరాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలేదని తెలిపారు. ఇప్పటికే ఈ వార్తతో షాక్ లో ఉన్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఏలాగూ ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం లేదు కాబట్టి ఇక కాలయాపన చేయకుండా కనీసం స్పెషస్ ప్యాకేజీ అయినా దక్కించుకుందామని అనుకుంటున్నారట. లేకపోతే ప్రత్యేక హోదా విషయంలో జరిగినట్టే ప్రత్యేక ప్యాకేజీలో కూడా జరిగి దానిని కూడా కోల్పోయే పరిస్థితి వస్తుందని అనుకుంటున్నారట. అసలు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీ ప్రభుత్వానికి  ప్రత్యేక హోదా ఇస్తామని అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.. ఈ విషయంలో అప్పటి  విపక్ష నేత వెంకయ్యనాయుడే పట్టుబట్టారు. దీంతో నవ్యాంధ్రకు పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామంటూ మన్మోహన్‌సింగ్‌ ప్రకటించారు.. కేబినెట్‌లో తీర్మానమూ చేశారు. కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏపీ ప్రత్యేక హోదాపై ఇలా మాట్లాడటం గమనార్హం.    మరోవైపు కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పుతున్న మన ఏపీ ఎంపీలు మాత్రం నోరుకదపకపోవడం విచిత్రం. వాస్తవానికి ప్రశ్నోత్తరాల సమయంలో ఎవరైనా దాని అనుబంధం ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంటుంది. కానీ మన ఏపీ ఎంపీలు మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు కూర్చుండిపోయారు. ప్రత్యేక హోదా ప్రశ్నపై చర్చ జరుగుతుండగా టీడీపీ లోక్‌సభాపక్ష నాయకుడు తోట నరసింహం, బీజేపీ ఎంపీలు కంభంపాటి హరిబాబు, గోకరాజు గంగరాజు, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి సభలోనే ఉన్నారు కానీ ఒక్కరు కూడా కేంద్రాన్ని ప్రశ్నించలేదు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజు ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేసిన ఎంపీలు ఇప్పుడు వారి నోటికి తాళం ఎందుకు పడిందో.. మరో వైపు ఈ ప్రత్యేక హోదాపై జగన్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని చెపుతున్నారు. పార్లమెంట్ లోనే అడగటం చేతకాని నాయకులు ఇప్పుడు ధర్నా చేసి మాత్రం ఏ చేస్తారో చూద్దాం.

దిగివచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు

  అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు తగ్గుతుండటంతో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. నిన్న అర్ధరాత్రి నుండి పెట్రోల్ పై లీటరుకి రూ.2.43, డీజిల్ పై లీటరుకి రూ. 3.60 ధరలు తగ్గాయి. సబ్సీడీయేతర గ్యాస్ సిలిండర్ ధర రూ. 23.50 తగ్గింది. కానీ, గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యంత కనిష్ట స్థాయికి దిగివచ్చాయి. ఫిబ్రవరి 4న డీజిల్ ధర లీటరుకి రూ.46.01, ఫిబ్రవరి 15న పెట్రోల్ ధర లీటరుకి రూ.57.31కి దిగివచ్చింది. కానీ మళ్ళీ మే 15నాటికి పెట్రోల్ ధర రూ.66.29కి డీజిల్ ధర రూ.52.28కి పెరిగిపోయింది. మళ్ళీ నిన్న అర్ధరాత్రి పెట్రోల్ ధర రూ.64.47, డీజిల్ ధర రూ.46.12కి దిగివచ్చాయి. అంటే డీజిల్ ధర మళ్ళీ ఫిబ్రవరి ధరల స్థాయికి దిగివచ్చినట్లయింది. కానీ పెట్రోల్ ధర మాత్రం ఇంకా ఎక్కువగానే ఉంది.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనట్టేనా!

  ఆంధ్రరాష్టానికి ప్రత్యేక హోదా కల్పించడంపై ఎన్నో రోజుల నుండి చర్చలు జరుగుతున్నాయి. దీనిమీద ఒక పక్క ఏపీ ఎంపీలు కూడా పార్లమెంట్ లో ఆందోళనలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చింది. కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ ను ప్రత్యేక హోదా గురించి అడుగగా ఆయన చెప్పిన దాని బట్టి చూస్తే ఏపీకి ప్రత్యేక హోదా విషయం అనుమానంగానే ఉన్నట్టు తెలుస్తోంది. బీహార్‌కు స్పెషల్ ప్యాకేజీ మాత్రమే ఇచ్చామని.. ప్రత్యేక హోదా ఇవ్వలేదని.. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. అంటే ఆయన ఏపీకీ ప్రత్యేక హోదా లేదని ప్రత్యక్షంగా చెప్పనప్పటికీ పరోక్షంగా మాత్రం ఏపీకీ ప్రత్యేక హోదా వర్తించదని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, ఏ రాష్ట్రానికి అని చెప్పినప్పటికీ ఏపీకీ హామీ ఇచ్చినందు వల్ల దీనిపై వివరణ ఇవ్వాల్సి ఉంది.

చేతులెత్తేసిన కేంద్రం

  ఏపీ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఉద్యోగుల బదిలీపై వాదనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 1200 మంది ఏపీ ఉద్యోగులను బదిలీ కింద రిలీవ్ చేసింది. దానికి సంబంధించి ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తుంది. మళ్లీ ఇప్పుడు ఆరుగురిని బదిలీ చేసింది. దీంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంపై మండిపడుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకొని వ్యవహరిస్తుందని నిప్పులు చెరుగుతున్నారు.   ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై ఈరోజు కేంద్ర హోంశాఖ కార్యదర్శితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎస్‌లు సమావేశమయ్యారు. ఇద్దరు సీఎస్‌లు హోంశాఖ కార్యదర్శికి తమ సమస్యలను విన్నవించారు. అయితే ఈ విషయంపై కేంద్ర హోంశాఖ కూడా చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. ఈ ఉద్యోగుల బదిలీ వ్యవహారం ఇప్పటికే కోర్టులో ఉన్నందున కోర్టులోనే తేల్చుకోవాలని.. ఇందులో తాము జోక్యం చేసుకోలేమని హోంశాఖ కార్యదర్శి ఇద్దరు సీఎస్ లకు సూచించినట్టు తెలుస్తోంది. దీంతో ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం లేకుండానే ముగిసింది.   టీ విద్యుత్ ఉద్యోగుల ఆందోళన మరోవైపు రిలీవ్ చేసిన ఏపీ ఉద్యోగులను తెలంగాణలోకి రానివ్వద్దని.. వారి స్థానికత ఆధారంగా ఏపీలోనే ఉంచాలని తెలంగాణ ఉద్యోగులు కేపీటీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. ఒకవేళ వారు తెలంగాణకు వస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఏపీలో 13 టూరిస్ట్ ప్రదేశాలు

  ఏపీ రాజధాని నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటినుండే కసరత్తు చేసే పనిలో పడింది. రాజధాని అమరావతిని ఎలా నిర్మించాలి.. ఏంఏం ప్రత్యేకంగా నిర్మించాలి అనే విషయంపై చర్చలు జరుపుతున్నారు. ఇప్పుటికే రాజధానిలో 45, 50 అంతస్తులు కలిగిన ట్విన్ టవర్స్ నిర్మించాలని... అంతేకాక ఓ 10 అతి పెద్ద బిల్డింగులు కట్టాలని ఆదిశగా ప్రయత్నాలు జరుపుతున్నారు. దీనితో పాటు అమరావతి ఓ పెద్ద టూరిస్ట్ ప్రదేశంగా మార్చే యోచనలో ఉన్నారు. దీనిలో భాగంగానే చంద్రబాబు మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చంద్రబాబుతో పాటు ముఖ్యమైన అధికారులు స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ కుటుంబరావు, ఏ.కే. పరిడా, సతీష్ చంద్ర, నీరబ్ కుమార్ ప్రసాద్, సాయి ప్రసాద్, అనురాధ పాల్గొన్నారు.   అయితే ఈ సమావేశం అనంతరం అధికారులు మాట్లాడుతూ ఏపీ రాజదానిలోని 13 ప్రాంతాలను టూరిస్ట్ ప్రదేశాలుగా మార్చాలని చంద్రబాబు నిర్ణయించినట్టు చెప్పారు. అంతేకాదు ప్రపంచ దేశాల నుండి బౌద్దులు బీహార్లోని బుద్దగయకు వస్తుంటారు.. అలాంటి తరహాలోనే అమరావతిలోని విశాలమైన ఆశ్రమాన్నినిర్మించాలని ఏపీ ప్రభుత్వం యోచన చేస్తున్నట్టు తెలిపారు. కాకినాడలోని కోనసీమను కూడా మంచి ఐలాండ్ తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు. అంతేకాక టూరింగా స్పాట్లో అక్కడక్కడ వాహనాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే చంద్రబాబు నెలరోజుల్లో తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేయాలని.. హైదరాబాద్ లో ఉన్న శాఖలలోని కొన్ని శాఖలను ఇక్కడకు మార్చాలని భావిస్తున్నారు. అంతేకాక 2018 కల్లా మొదటి దశ రాజధానిని పూర్తి చేయాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు కుదిరితే ఓ అద్భుతమైన రాజధానిని చంద్రబాబు ఏపీకి అందిస్తారని అనిపిస్తుంది.

ఎట్టకేలకు విజయవాడ కోర్టుకు కాల్ డేటా

  అనేక వాదనలు ముగిసిన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు కాల్ డేటాను విజయవాడ కోర్టుకు అందించింది. సర్వీసు ప్రొవైడర్లు కాల్ డేటా వివరాలను సీల్డ్ కవర్ లో పెట్టి విజయవాడ కోర్టుకు అందజేశారు. అయితే సీల్డ్ కవర్ లో ఏమున్నాయో తెలిపేలా నోట్ ఫైల్ ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదులు ప్రొవైడర్లను కోరగా.. సర్వీసు ప్రొవైడర్ల తరపు న్యాయవాదులు దానిని తిరస్కరించి సుప్రీంకోర్టు ఆదేశించినట్టుగా సీల్డ్ కవర్ లోనే ఇస్తామని స్పష్టం చేశారు. కాగా కాల్ డేటా వివరాలను ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన మేరకు ప్రత్యేక మెసెంజర్ ద్వారా కాల్ డేటా వివరాలను హైదరాబాద్ లోని హైకోర్టు రిజిస్ట్రార్ కు ఇవ్వాల్సి ఉంది.

తలసాని రాజీడ్రామా పై స్పందించిన స్పీకర్

  తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీడ్రామాకు తెరపడినట్టు తెలుస్తోంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచి ఆ తరువాత టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి మంత్రిగా కొనసాగుతున్న విషయంపై రాజకీయ వర్గాలు మండిపడ్డాయి. ఒక పార్టీలో పదవి పొంది రాజీనామా చేయకుండా మరో పార్టీలోకి మారి మంత్రిగా కొనసాగడం చట్ట విరుద్ధమని టీడీపీ నేతలు దుమ్మెత్తిపోశారు. అయితే కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణారెడ్డి సమాచార హక్కు చట్టం కింద అసెంబ్లీ సచివాలయానికి దరఖాస్తు చేయగా వాళ్లు రాజీనామా లేఖ రాలేదని చెప్పడంతో నిజం బయట పడింది. దీంతో ఒక్కసారిగా నేతలందరూ తలసానిపై విరుచుకుపడ్డారు. ఇన్నీ రోజులు రాజీనామా చేశానని తలసాని డ్రామాలాడారని తిట్టిపోశారు. అయితే తలసాని మాత్రం 2014 డిసెంబర్ 16న తాను రాజీనామా చేశానని.. రాజీనామా లేఖను జేబులో పెట్టుకొని తిరుగుతున్నానని చెప్పి మరీ ఎన్నో ప్రగల్భాలు పలికారు.   మరోవైపు తలసాని రాజీనామా చేస్తే స్పీకర్ ఇంతవరకూ ఎందుకు ఆమోదించలేదని పలు రాజకీయ నేతలు ప్రశ్నించారు. అంటే దీనిలో స్పీకర్ కు కూడా సంబంధం ఉందా అని పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా ఇప్పుడు తలసాని రాజీనామా పై స్పీకర్ మధుసూధనాచారి స్పందించినట్టు తెలుస్తోంది. తలసాని రాజీనామాపై మాట్లాడేందుకు కాంగ్రెస్ నేతలు మధుసూధనాచారిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన తలసాని రాజీనామాపై అనుకూలంగా స్పందినట్టు కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.