బెంగుళూరు-నాందేడ్ రైలుకి ప్రమాదం, 6 మంది మృతి
ఈ రోజు తెల్లవారుజామున అనంతపురం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బెంగుళూరు నుండి నాందేడ్ వెళుతున్న ఎక్స్ ప్రెస్ రైలుని లారీ డ్డీ కొంది. ఈ ప్రమాదంలో రైలులో ప్రయాణిస్తున్న కర్నాటకలోని దేవ్ దుర్గ్ ఎమ్మెల్యే వి. వెంకటేష్ నాయక్, మహమ్మద్ మరో ముగ్గురు మరణించారు. లారీ డ్రైవర్ కూడా మరణించాడు.
అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో మడకశిర రైల్వే గేటు వద్ద సుమారు 2.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మడకశిర నుండి తాడిపత్రికి గ్రానైట్ తీసుకువెళుతున్న లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో మూసి ఉన్న రైల్వే గేటుని డ్డీ కొని రైల్వే ట్రాక్ పైకి చొచ్చుకు పోయి సరిగ్గా అదే సమయంలో బెంగుళూరు నుండి నాందేడ్ వెళుతున్న ఎక్స్ ప్రెస్ రైలుని డ్డీ కొంది. లారీలో ఉన్న గ్రానైట్ పలకలు హెచ్-1 బోగీలోకి దూసుకుపోయాయి. యస్-1 నుండి యస్-5వరకు బోగీలు పట్టాలు తప్పాయి.
ప్రమాదం సంగతి తెలుసుకోగానే అనంతపురం జిల్లా డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీకాంతం, పోలీసులు, వైద్య, సహాయ సిబ్బంది అక్కడికి చేరుకొని తక్షణమే సహాయ చర్యలు చేప్పట్టారు. గాయపడినవారిని ధర్మవరం, పెనుగొండ, అనంతపురం ఆసుపత్రులలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని బస్సులలో వారివారి గమ్యస్థానాలకి పంపిస్తున్నారు. రైల్వే శాఖ హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. హెల్ప్ లైన్ నెంబర్లు: పెనుగొండ:08555 220249 ధర్మవరం:08559 222555, అనంతపురం:08554 236444.