ఫోన్ ట్యాపింగ్.. లోకేష్, బ్రాహ్మణి ఫోన్లు కూడా
posted on Aug 7, 2015 @ 11:33AM
ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏపీ పోలీసుల దర్యాప్తులో కొత్త కొత్త అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏపీ అధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేసిందని దానికి సంబంధించిన పలు ఆధారాలతో కూడిన నివేదికను ఏపీ ప్రభుత్వం పదిరోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. అంతేకాదు దానిలో ఫోన్ ట్యాపింగ్ కు తలపడిన పలు అధికారుల పేర్లును కూడా పేర్కోంది. ఏపీ సీఎం చంద్రబాబు, తనయుడు నారా లోకేశ్ తోపాటు పలు అధికారుల ఫోన్లు జరిపినట్టు చెపుతున్నారు. అయితే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒక్క నోటుకు ఓటు వ్యవహారం విషయంలో కాకుండా మరెన్నో లక్ష్యాలతో ఏపీ ప్రభుత్వ పెద్దల ఫోన్లను ట్యాప్ చేసినట్టు ఏపీ పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఏపీ రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి గాను చంద్రబాబు సింగపూర్ జపాన్ ప్రతినిధులతో మాట్లాడిన సంభాషణలు, ఇంకా ముఖ్యమైన అధికారుల కుటుంబ సభ్యుల సంభాషణలు కూడా తెలంగాణ ప్రభుతం ట్యాపింగ్ చేసినట్టు ఏపీ పోలీసులు పేర్కొంటున్నారు. అంతేకాదు సీఎం తనయుడు నారా లోకేశ్ తన భార్య బ్రహ్మిణి ల ఫోన్ సంభాషణలు.. వ్యాపార, వ్యక్తిగత విషయాలనూ తెలంగాణ పోలీసులు ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నట్లు ఏపీ పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం హైకోర్టులో ఈ వ్యవహారంలో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఈ అంశాలన్నీ పొందుపరచనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
అయితే ఈ కేసులో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అవును మేము ట్యాపింగ్ చేశాము.. అది మా హక్కు.. చట్టప్రకారమే ఫోన్ ట్యాపింగ్ చేశామని బహిరంగంగానే వెల్లడించాయి. వారు చెప్పిన చట్టం ప్రకారం అంటే టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 52 ఆధారంగా దేశ భద్రత, శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్య క్తుల ఫోన్లు ట్యాపింగ్ చేయవచ్చు. అలా ట్యాపింగ్ చేయడానికి కూడా కొన్ని షరతులుంటాయి.. ముందుగా దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ నుండి అనుమతి తీసుకొని అప్పుడు ట్యాపింగ్ చేయాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం అవేమీ లేకుండా తనకి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించింది. ఇప్పుడు వాళ్లు చట్ట ప్రకారమే అంటున్నా ఆచట్టాన్నే కనుక తీసుకుంటే వాళ్లు చెప్పిన దాని ప్రకారం దేశ భద్రత, శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్య క్తుల లిస్టులోకి ఎవరూ రారు. ఆ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అడ్డంగా బుక్కయింది. మొత్తానికి తీగ లాగితే డొంకంతా కదిలి అన్నట్టు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఇంకా ఎన్ని విషయాలు బయటపడతాయో చూడాలి.