తెలంగాణలో కోదండరాం కొత్త పార్టీ?
posted on Aug 7, 2015 @ 1:35PM
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు ఆ రాష్ట్రంలో ఎలాంటి డోకా లేదు. ప్రతిపక్ష పార్టీలు ఉన్నా పోటీ చేసి అధికారంలోకి వస్తాయన్న నమ్మకం లేదు. కాని ఇప్పుడు తెలంగాణలో మరో పార్టీ రాబోతుంది అనే వార్తలు జోరుగాసాగుతున్నాయి. అది ఎవరో కాదు తెలంగాణ ఉద్యమం సమయంలో ఆ రాష్ట్రాన్ని సాధించడానికి ముఖ్య పాత్ర పోషించిన టీజేఏసీ చైర్మన్ కోదండరాం. ఆ పార్టీకి ఈయన సారథ్యం వహించనున్నారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఢిల్లీలో ఆప్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ముఖ్య కారకులైన యోగేంద్ర యాదవ్ అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై చాలామంది అసంతృప్తి కరంగానే ఉన్నారు. ఉద్యమ సమయంలో అందరిని కలుపుకున్న కేసీఆర్ ఆ తరువాత ఎవరిని పట్టించుకోకపోవడం.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం వీటన్నింటిపై కోదండరాం ఇంతకుముందే వ్యతిరేకించారు.
అయితే ఆప్ నుంచి బయటకు వచ్చిన యోగేంద్ర యాదవ్ ఆ తర్వాత ‘స్వరాజ్ అభియాన్’ అనే కొత్త వేదికను ప్రారంభించారు. ఈ ‘స్వరాజ్ అభియాన్’ వేదిక ద్వారా ఆయా రాష్ట్రాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ వేదిక ద్వారానే తెలంగాణ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై దృష్టి సారించారు. ఈనేపథ్యంలోనే కోదండరాంతో కూడా చాలా సార్లు సమావేశమయ్యారు. దీనిలో భాగంగానే యోగేంద్ర యాదవ్ కోదండ రాంతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అసలే టీఆర్ఎస్ వైఖరితో ఆసంతృప్తితో ఉన్న కోదండరాం యోంగేంద్ర యాదవ్ తో కలిసి పని చేయడానికి సముఖత చూపినట్టు రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. దీనిలో భాగంగానే ఆప్ తరహాలో తెలంగాణలో జాప్ (జాయింట్ యాక్షన్ పార్టీ)ని ఏర్పాటు చేయాలని కూడా యోగేంద్ర సూచించినట్లు తెలిసింది. అయితే, దీనిపై ఇంకా కోదండరాం తుది నిర్ణయం తీసుకోలేదు అలాగని తోసిపుచ్చనూ లేదు. ఈ నేపథ్యంలో ఈనెల పదిన వీరిద్దరి మధ్య కీలక సమావేశం జరగనుందని అత్యంత విశ్వసనీయ వర్గాలు వివరించాయి. మరి ఇన్ని రోజులు మాకు ఎవరూ పోటీరారని ఎగిరిపడుతున్న టీఆర్ఎస్ కు ఒకవేళ కోదండరాం కనుకు పార్టీ పెడితే టీఆర్ఎస్ కు చెక్ పడినట్టే అని భావిస్తున్నారు.