రెండు రాష్ట్రాలకు సిగ్గుచేటు
రాష్ట్ర విభజన ముందు తెలంగాణ, ఆంధ్రా అన్న విభేధాలు కొంతమంది మధ్య ఉన్న రాష్ట్ర విభజన తరువాత మాత్రం అది కాస్త ఎక్కువైందనే చెప్పవచ్చు. రాష్ట్రం విడిపోయి ఏడాదిపైన అయినా ఎన్నో విషయాలలో రెండు రాష్ట్రాలు గొడవలు, గిల్లికజ్జాలు పెట్టుకుంటూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి కట్టుగా ఒక పనిని మాత్రం చేస్తున్నాయి. ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారు కదా అది మహిళలను అవమానపరచడం. ఈ విషయంలో మాత్రం రెండు రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే మహిళలను అగౌరపరచడం.. వారిని వేధించడంలో దేశంలోనే ఆంధ్రరాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ కూడా దాదాపు ముందు వరుసలోనే ఉంది. 2014 లెక్కల ప్రకారం ఈ నేరాల్లో ఆంధ్రరాష్ట్రం ముందుండగా రాష్ట్ర విభజన తరువాత కూడా రెండు రాష్ట్రాల్లో ఇదే కొనసాగుతుండటం గమనార్హం. ఒక్క దీనిలోనే కాదు అటు సైబర్ నేరాలు, మోసాలు వంటి నేరాల్లో కూడా తెలుగు రాష్ట్రాలు ముందున్నాయి. కాగా హత్యలు, కిడ్నాప్ కేసుల్లో ఉత్తరప్రదేశ్, అత్యాచారాల్లో మధ్యప్రదేశ్ తొలి స్థానం సంపాదించుకున్నాయి.