ఏపీ టైప్ లో పంజాబ్ లోనూ కాంగ్రెస్ కు దెబ్బ
రాహుల్ గాంధీకి ఇంకా మెచ్యూరిటీ రాలేదంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అమరీందర్ సింగ్... పార్టీకి గుడ్ బై చెబుతారంటూ వార్తలు వస్తున్నాయి, ప్రస్తుతం లోక్ సభలో కాంగ్రెస్ ఉపనేతగా ఉన్న అమరీందర్... పంజాబ్ వికాస్ పేరుతో కొత్త పార్టీ పెట్టబోతున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి, అమరీందర్ కొద్దిరోజులుగా కాంగ్రెస్ హైకమాండ్ తో అంటీముట్టనట్లుగా ఉంటున్నారని, ఇటీవల జరిగిన పార్లమెంట్ సెషన్స్ కు కూడా సరిగా హాజరుకాలేదని అంటున్నారు, అయితే అమరీందర్ కొత్త పార్టీ పెడితే... వచ్చే ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోతామని గుర్తించిన కాంగ్రెస్ పెద్దలు...నష్ట నివారణ చర్యలకు దిగారు, అమరీందర్ ను బుజ్జగించడానికి రంగంలోకి దిగిన కాంగ్రెస్ సీనియర్లు... ఆయన ఏ కోరిక కోరినా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు, అమరీందర్ కోరితే పీసీసీ అధ్యక్షుడిగా కూడా నియమిస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ తెలిపారు. అయితే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో అమరీందర్ సింగ్ టచ్ లో ఉన్నాడని, కొత్త పార్టీ పెట్టడానికే మొగ్గుచూపుతున్నాడని సన్నిహితులు అంటున్నారు.