విరమణ మాత్రమే.. విరామం కాదు.. కేసీఆర్ కు కోదండరాం చురక

తెలంగాణ జేఏసీ నేత కోదండరాం ముఖ్యమంత్రి కేసీఆర్ కు చురకలు అంటించేలా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన హరగోపాల్ తదితరులతో కలిసి మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ రకంగా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ అంశంలో తమ ఉద్యమానికి విరామం మాత్రమేనని.. విరమణ మాత్రం కాదని.. తెలంగాణ బిల్లు విషయంలో కెసిఆర్‌తో పాటు అన్ని పార్టీలు కీలక పాత్ర పోషించాయని ఆయన అన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) కొనసాగుతుందని.. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ కంకణబద్దులం అవుదామన్నారు.

కోపంలోనే అలా అన్నాను సారీ.. బలరాం నాయక్

మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ తన ప్రసంగాలతో ఎప్పుడైనా ఫేమస్ అయ్యారో లేదో తెలియదు కాని రెండు రోజుల క్రితం  ఆయన చేసిన ఒక వ్యాఖ్య వల్ల ఇప్పుడు ఫుల్లు గుర్తింపు వచ్చింది. అదేంటని అనుకుంటున్నారా అదే తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ ను కాదని టీఆర్ఎస్ కు పట్టం కట్టారు..ఈసారి ఎన్నికల్లో తమను గెలిపించకపోతే తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తాం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్సలు రావడంతో ఇప్పుడు సారీ చెప్పుతున్నారు. గత ఎన్నికల్లో నాకు అన్యాయం (ఓడించారు) జరిగిందన్న కోపంలోనే అలా అన్నానని.. ఏదిఏమైనా తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాని క్షమాపణ చెపుతున్నట్టు బలరాం నాయక్ అన్నారు.

కేసీఆర్ మనమడు తినే బియ్యం పంపండి.. రేవంత్ రెడ్డి

తెలంగాణ టీడీపీ యువనేత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి మండిపడ్డారు. ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లలో ప్రభుత్వం సన్నబియ్యంతో భోజనం  పెడుతుందని చెపుతున్నారు కాని వాటికి బదులు దారుణమైన బియ్యంతో భోజనం పెడుతున్నారని విమర్శించారు. ఈ సన్నబియ్యం వ్యవహారంలో కోట్ల రూపాయల అవినీతి జరగుతుందని.. ఏదో బియ్యం తీసుకొచ్చి వాటికి పాలిష్ చేసి సన్న బియ్యమని మభ్యపెడుతున్నారని అన్నారు. కేసీఆర్ కు చిత్తశుద్ది ఉంటే దీనిపై చర్య తీసుకోవాలని సూచించారు. అంతేకాదు ఆ అన్నంను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబ సభ్యులు ఎవరైనా తింటారా.. కేసీఆర్ మనమడు ఏ రకమైన సన్న బియ్యం తింటారో అలాంటి బియ్యాన్ని సంక్షేమ హాస్టళ్లకు కూడా అందించాలని అన్నారు.

కేసీఆర్, సోనియాకు ఆహ్వానం.. రండి.. వచ్చి కుళ్లుకోండి

ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కర్యాక్రమం ఈనెల 22వ తేదీన మధ్యాహ్నం 12.45 నిమిషాలకు జరగనుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఏపీ ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతుంది. అదేంటంటే శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ ను అలాగే సోనియా గాంధీని ఆహ్వానించడంపై. అయితే కేసీఆర్ ను తానే స్వయంగా ఇంటికెళ్లి ఆహ్వానిస్తానని చంద్రబాబు అన్నట్టు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. మరి సోనియా గాంధీని కూడా అలాగే పిలుస్తారా అని డౌట్. అయితే చంద్రబాబు వారిని పిలవడంపై ఎలాంటి ఉద్దేశం ఉందో తెలియదు కాదని మిగిలిన నేతలు మాత్రం శంకుస్థాపన కార్యక్రమానికి రండి.. చూడండి.. చూసి కుళ్లుకోండి అని వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రాన్ని విడదీసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి.. అప్పుల రాష్ట్రంగా మిగిల్చారు సోనియా గాంధీ. ఇలాంటి సమయంలో రాజధాని నిర్మాణం చాలా కష్టమని చాలా మందే అన్నారు. అయితే వాటన్నింటిని ఖండించి రాజధాని శంకుస్థాపనకు శ్రీకారం చుట్టి..   హైదరాబాద్ ను తలదన్నేలా అంతర్జాతీయ స్థాయిలో అమరావతి ఉంటుందని మూడేళ్ల తర్వాత ప్రపంచంలోని అద్భుత నగరాల్లో అమరావతి ఒకటి అవుతుందని కూడా ఘంటాపథంగా తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి రాజధాని లేకుండా విభజనకు కారణమైనవారు కేసీఆర్ అయితే.. ఏపీకి రాజధాని లేకుండా చేసింది సోనియా కాబట్టి వీరిద్దరికి శంకుస్థాపనకు ఆహ్వానించి వారు కుళ్లుకునేలా చేయాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తుందట. అయితే కేసీఆర్ ను స్వయంగా పిలిచినట్టు, సోనియాను కూడా స్వయంగా పిలిస్తే బావుంటుందని పార్టీ నేతలు అనుకుంటున్నారట.

జానారెడ్డి పార్టీ మారడానికే ఇలా చేస్తున్నారా?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి గులాబీ రంగు పూసుకోనున్నారా? కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ గూటికి చేరుతున్నారా? అంటే అవునని కొంత మంది రాజకీయ నేతలు అనుకుంటున్నారు. తెలంగాణ సీనియర్ నేత డీ.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లోకి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జానారెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దపడుతున్నారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీకి సరైన ఉనికి లేదు. ఈ నేపథ్యంలోనే పార్టీలో ఉన్నా పెద్ద ప్రయోజనం లేదని అనుకున్నారేమో పార్టీ మారే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది జానారెడ్డి. దీనిలో భాగంగానే ముందునుంచి ఆయన పార్టీ వ్యవహారాలను కూడా అంతగా పట్టించుకోవడం.. దీనిపై ఇతర కాంగ్రెస్ నేతలు కూడా ఆయనమీద ఆగ్రహంగా ఉండటం అన్నీ జరుగుతూనే వస్తున్నాయి. అంతేకాక అధికార పార్టీ.. కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసినా అధికార పార్టీని పల్లెత్తు మాటకూడా అనకుండా టీఆర్ఎస్ పార్టీకి ఒత్తాసు పలకడం.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలతో అధికార పార్టీకి క్షమాపణలు చెప్పిండటం.. ఇవన్నీ ఆయన పార్టీపై మరింత అనుమానాలు ఎదురవుతున్నాయి. దీనికి తోడు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు అన్నిపార్టీలు కలిసి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నిన్న చేపట్టిన తెలంగాణ బంద్ కు జానారెడ్డి డుమ్మాకొట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతల కోపం నషాళానికి అంటింది. అయితే జానారెడ్డి మాత్రం తాను కాంగ్రెస్ వాదినే అని  ఎవరి సర్టిఫికెట్టూ తనకు అవసరం లేదని చెప్పుకొస్తున్నారు. కానీ పార్టీ నేతలు మాత్రం జానారెడ్డి తీరుపై చాలా అసహనంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో రాహుల్ గాంధీ కూడా జానారెడ్డితో ఏం సార్ పార్టీ మారుతున్నారా అని కూడా సెటైర్లు వేశారు. అయితే కొంతమంది మాత్రం జానారెడ్డి పార్టీ మారేందుకు కావాలనే ఇలా వ్యవహరిస్తున్నారని.. కావాలనే అధిష్టానంతోనూ.. పార్టీ నేతలనూ కయ్యం పెట్టుకోవడానికి చూస్తున్నారని అనుకుంటున్నారు. అయితే కేంద్రం తనంతట తానుగా పంపించినా.. లేక తాను స్వయంగా వెళ్లిపోయినా తనకే మంచిదని భావిస్తున్నట్టు రాజకీయ వర్గాలతో పాటు పార్టీ నేతలు కూడా అనుకుంటున్నారు. మొత్తానికి రాజకీయానుభవం జానాకు బాగానే వర్కవుట్ అయినట్టు ఉంది. మరి జానా కూడా పార్టీ మారే రోజు తొందరలోనే ఉందని తెలుస్తోంది.

జగన్ దీక్ష.. పరామర్శిండానికి వచ్చారా.. ఎటకారం చేయడానికా

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్న తరుణంలో పలు పార్టీ నేతలు మద్దతుపలుకుతున్నారు. అయితే అందరూ మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ఒక నేత మాత్రం జగన్ పరామర్శిండానికి వచ్చారో లేదా ఎటకారం ఆడటానికి వచ్చారో తెలియకా అర్ధంకావడంలేదట. సీపీఎం మాజీ ఎంపీ సీనియర్ నేత మధు జగన్ పరామర్శించడానికి వెళ్లి జగన్ తో కొంచెం సేపు ముచ్చటించి ఆఖరికి ''మాకు పోరాటాలే అజెండా... మాకు ఎలాంటి వ్యాపారాలు లేవు'' అని ఒక మాట అన్నారంట. దానికి ఒక్కసారిగా జగన్ కు ఎమనాలో తెలియక.. నోట మాట రాక.. ఏదో తలాడించి అలా ఊరుకున్నారంట. అయితే మధు చేసిన వ్యాఖ్యలపై పార్టీ నేతలు కోపంగా ఉన్నా.. కొంతమంది మాత్రం మధు అదెదో యథాలాపంగా అన్న మాట కాదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

జగన్ 5వ రోజు దీక్ష.. సైలెంట్ గా ఏపీ ప్రభుత్వం

ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గుంటూరు సమీపంలో నల్లపాటు వద్ద నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే జగన్ దీక్షకు ఇతర పార్టీనేతల దగ్గర నుండి ప్రజాసంఘాలు మద్దతు పలుకుతున్నాయి. ఒక్క ఆంధ్రాలోనే కాదు హైదరాబాద్ లో ఉన్న ఏపీ విద్యార్ధులు కూడా జగన్ దీక్షకు మద్దతు పలికారు. ఏపీకి ప్రత్యేక హోదా చాలా అవసరమని.. నూతన రాష్ట్రం.. అందున నూతన రాజధానిలో ఎన్నో నిర్మించాల్సి ఉంటుంది.. అంలాటప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా చాలా అవసరమని జగన్ కు మద్దతివ్వాలని.. జగన్ ఇప్పటి వరకూ ఏం చేసినా విజయం సాధించారు. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో కూడా విజయం సాధిస్తారని అన్నారు.   ఇదిలా ఉండగా జగన్ దీక్ష ఈ రోజుతో 5వ రోజుకు చేరింది. దీంతో జగన్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు జగన్ ఆరోగ్యం క్షీణిస్తోందని.. జగన్ బరువు తగ్గి, నీరసించారని.. షుగర్ లెవల్స్ పడిపోయాయన్నారు. బీపీ 110/70గా ఉందని, పల్స్ రేట్ 66 ఉందని చెప్పారు.   అసలు నిన్న రాత్రే జగన్ తో దీక్షను విరమించాలని అనుకున్నా జగన్ దానికి అంగీకరించక ఈరోజు కూడా దీక్షను కొనసాగిస్తున్నారు. మరోవైపు జగన్ దీక్షపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కాస్త టెన్షన్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. జగన్ దీక్ష ప్రారంభించిన రెండు రోజులు విమర్శలు చేసినా ఇప్పుడు మాత్రం చాలా సెలెంట్ గా ఉంటూ జగన్ దీక్ష గురించిన వివరాలు సేకరించే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. మొత్తానికి జగన్ దీక్షతో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయో అని ఆసక్తికరంగా మారింది. జగన్ కూడా చాలా మొండిగా దీక్ష చేస్తూ అందరి మద్దతు ఇవ్వడం చూస్తే ఒక రకంగా ఈ దీక్ష వల్ల జగన్ కు కొంత మేలు జరిగినట్టే కనిపిస్తుంది. 

ప్రతిపక్షాల బంద్.. విఫలమైందన్న మంత్రులు

రైతు రుణమాఫీలను ఒకేసారి మాఫీ చేయాలని.. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వ వైఖరికి ప్రతిపక్షపార్టీలన్నీ కలిసి ఒకేసారి మూకుమ్మడిగా అధికార పార్టీకి వ్యతిరేకంగా నిన్న తెలంగాణ రాష్ట్ర బంద్ ను చేపట్టారు. అయితే ప్రతిపక్షపార్టీలు చేసిన బంద్ ను అధికార పార్టీ మంత్రులు ఎండగట్టారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ మంత్రులు మీడియాతో మాట్లాడుతూ  టీఆర్ఎస్ పార్టీని కావాలసిన విమర్శిస్తూ.. పార్టీకి వ్యతిరేకంగా అందరూ కలిసిన బంద్ విఫలం అయిందని అన్నారు. వారు రైతుల కోసం చేసిన బంద్ కు కనీసం రైతలే మద్దతు పలుకలేదన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఓ వైపు ప్రశంసలు లభిస్తుండగా, మరోవైపు విపక్షాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పోచారం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రూ.8,836 కోట్లు చెల్లించామని, మిగతా మొత్తాన్ని కూడా వడ్డీతో సహా చెల్లించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. ఆంధ్రాలో అయితే మొత్తం రూ.24వేల కోట్ల పంట రుణాలకు గాను కేవలం రూ.3,400 కోట్లు మాత్రమే చెల్లించింది మరి అక్కడ మాట్లాడని నేతలు ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. అసలు గత ప్రభుత్వాలు ప్రాజెక్టులు నిర్మించి వుంటే ప్రస్తుత పరిస్థితి ఎదురయ్యేది కాదని విపక్షాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు.

ఏపీ క్యాబినేట్.. వైఎస్సార్ కడప జిల్లా వద్దు కడపజిల్లానే

శనివారం ఏపీ క్యాబినేట్ సమావేశం జరిగింది. ఈసందర్బంగా పలు అంశాలపై మంత్రివర్గం చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వైఎస్సార్ కడప జిల్లా గురించి చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. వైఎస్సార్ కడప జిల్లాను కడప జిల్లాగే ఉంచాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. మంత్రి అచ్చెన్నాయుడు అసలు కడప జిల్లాకు దేవుని గడప పేరుతో వచ్చిందని.. ఇప్పుడు దేవుని పేరు తీసి వైఎస్సార్ కడప అని ఎలా మారుస్తారని ఈ అంశాన్ని లేవనెత్తారు. దీనికి చంద్రబాబు స్పందించి అయితే, దీని పైన ప్రజాభిప్రాయ సేకరణ చేద్దామని.. ప్రజాభిప్రాయం ప్రకారం వెళదామని చెప్పినట్టు తెలుస్తోంది.కాగా ఇసుక విధానంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని కొందరు మంత్రులు ప్రస్తావించారు.

జానాపై కాంగ్రెస్ నేతల కోపం.. దాని మీద కారం జల్లిన జానా

  తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై అధికార పార్టీ చూపిస్తున్న వైఖరికి.. రైతు ఆత్మహత్యలను అసలు ఏమాత్రం పట్టించుకోవండలేదని కేసీఆర్ పై ప్రతిపక్షాలు మండిపడుతూ.. ఈరోజు బంద్ ను నిర్వహించాయి. రాష్ట్రంలో అన్నిచోట్లా ప్రతిపక్షపార్టీలు బంద్ ను నిర్వహించాయి. అయితే బంద్ సంగతేమో కాని ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఒక్క విషయంలో చాలా కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. అది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఈ బంద్ లో పాల్గొనకపోవడం. ఈ రోజు తెల్లవారుజాము నుండే ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా బంద్ లో పాల్గొన్నారు. కానీ ఈ బంద్ లో జానా ఎక్కడా కనిపించలేదు. నగరంలో చాలామంది కాంగ్రెస్ నేతలు కానీ, బీజేపీ నేతలు, టీడీపీ, వామపక్ష నేతలు చాలా మంది అరెస్ట్ కూడా అయ్యారు. అయితే జానా రాకపై పలు పార్టీనేతలు చర్చించుకున్నా సర్లే అని చెప్పి ఊరుకున్నారు. అయితే అసలే కోపంగా ఉన్న కాంగ్రెస్ నేతలకు ఆజ్యం పోసినట్టుగా చేశారు జానా. బంద్ నేపథ్యంలో అరెస్ట్ అయిన నేతలను పరామర్శించడానికి వెళ్లిన జానా అక్కడ వారిని చూసి బావున్నారా అని అన్నారంట. అంతే దీనితో కాంగ్రెస్ నేతలకు కోపం నషాళానికి ఎక్కిందట. పైగా తాను అనారోగ్యం కారణంగా బంద్ లో పాల్గొనడానికి రాలేకపోయానని చెప్పారంట. అయితే నేతలు మాత్రం ఆరోగ్యం బాలేకపోతే పరామర్శించడానికి ఎలా వచ్చారని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఉండవల్లి సోనియాను అవమానించడమే.. వీహెచ్

  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత వీ హనుమంత రావు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీరును విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపైన  చర్చ జరగాలని.. రాజ్యాంగం, పార్లమెంట్ నియమ నిబంధనలకు లోబడి ఏపీ పునర్విభజన చట్టం ఉభయ సభల ఆమోదం పొందిందా? లేదా? అన్న విషయంపై సమగ్రంగా ఆరా తీసి జరిగిన నష్టాన్ని సరిదిద్దాలని ఉండవల్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేస్తూ పుస్తకం ఇచ్చారు. దీనికి వీహెచ్ స్పందిస్తూ ఉండవల్లి చేసిన పని సరైనది కాదని.. రాష్ట్ర విభజన ఉభయ సభల ఆమోదం పొందిన తరువాత జరిగిందేనని.. ఇప్పుడు ఉండవల్లి ఇలా చేయడం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని అవమానించడమే అని అన్నారు.

కేసీఆర్ ఖాతాలో మరో సమస్య

  ఇప్పటికే రైతుల ఆత్మహత్యలతో కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు అందరూ. దీనికి తోడు మళ్లీ ఇప్పుడు వేరే అంశం ఒకటి కేసీఆర్ ఖాతాలో చేరింది. వేతనాల పెంపుదలపై ఆశావర్కర్లు ఛలో అసెంబ్లీని చేపట్టిన నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎక్కడి వారిని అక్కడే అడ్డుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ నేపథ్యంలో పలుచోట్ల పోలీసులకు, వర్కర్లకు మధ్య తోపులాటలు జరగాయి. ఈ తోపులాటలో కొంతమంది వర్కర్లకు గాయాలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు తొమ్మిదివేల మంది వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు.  సచివాలయం ముట్టడికి జిల్లాల్లో ఆందోళనలకు ప్రయత్నించిన 8805 మందిని అరెస్టు చేసినట్లు డిజిపి అనురాగ్ శర్మ స్వయంగా ప్రకటించడమే దీనికి నిదర్శనం. ఇదిలా ఉండగా రైతు సమస్యలపై ఇప్పటికే ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టారు. దీనిలో భాగంగానే ఈరోజు బంద్ కూడా నిర్వహించారు. దీనితో పాటు ఇప్పుడు ఈ అంశం పై కూడా అధికార పార్టీపై ఆందోళనకు దిగడానికి యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆశా కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అయితే ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే రాష్ట్రంలో ఇంతా జరుగుతున్న కేసీఆర్ మాత్రం నిమ్మకు నీరెత్తన్నట్టు వ్యవహరించడం. 

అమరావతి శంకుస్థాపన.. ఇన్విటేషన్ కార్డ్ ఇదే

ఈనెల 22న మధ్యాహ్నం 12.45 గంటలకు ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరగనున్నసంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక మందిని ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డును ఆవిష్కరించారు. ఈ కార్డును చూస్తుంటే ఏపీ ప్రభుత్వం దీనిని చాలా చక్కగా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. పూర్ణకుంభం చిత్రంతో కూడిన ఆహ్వాన పత్రికను ప్రభుత్వం తరఫున ప్రధాని మోడీకి ప్రత్యేక ఆహ్వానాన్ని తెలియజేస్తూ దీనిని రూపొందించారు. మరోవైపు ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి.. చేపట్టవలసిన బాధ్యతలను తదితర అంశాలను చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకునేలా చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అంశంతో పాటు రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చనున్నారు.

తెలంగాణలో మరో 12 కొత్త జిల్లాలు

  తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 10 జిల్లాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ 10 జిల్లాలు కాకుండా ఇంకా రాష్ట్రంలో జిల్లాలను పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఒకవేళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టయితే రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తానని అప్పుడే చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరో 12 జిల్లాలు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఒక ముసాయిదాను కూజా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకోనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు మరింత అసంతృప్తి సెగ రేపకుండా ఉండేలా.. జిల్లా ఏర్పాటుకు సంబంధించి నిరసనలు.. ఆందోళనలు లాంటివి చోటు చేసుకోకుండా ఉండాలన్న భావనలో తెలంగాణ సర్కారు ఉంది. అంతేకాకుండా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వచ్చే జూన్ నాటికి పూర్తి కావాలని.. తెలంగాణ ఆవిర్భావ రెండో వార్షికోత్సం నాటికి.. తెలంగాణ కొత్త జిల్లాలతో కళకళలాడిపోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే వచ్చే ఏడాదికి 22 జిల్లాల తెలంగాణగ కళకళలాడుతుంది.

అదిపోయే సరికి కాంగ్రెస్ కు ఇప్పుడు గుర్తొచ్చిందా... వెంకయ్య

  కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఏదో ఒకటి చెప్పాలని అంటున్నకాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి ఏళ్లకు ఏళ్లు పైగా కాలయాపన చేసి.. ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న తరువాత.. ఆఖరికి తమ పార్టీ ప్రయోజనాల కోసం తీరిగ్గా అప్పుడు రాష్ట్ర విభజన చేసింది. అలాంటిది ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి వారు విమర్శించడం.. ప్రత్యేక హోదా విషయంలో మోడీ మాట మీద నిలబడలేదు అని అనడం ఎటకారంగా ఉందని అన్నారు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే.. ఏపీ ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదు.. చట్టంలో ఎందుకు పెట్టలేదు..ఇప్పుడు ప్రతిపక్ష హోదా పోయిన తరువాత ప్రత్యేక హోదా గుర్తొచ్చిందా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల ముందు హామీ ఇస్తే సరిపోతుందా’ అంటూ కాంగ్రెస్‌ను నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా పై నీతి అయోగ్ కమిటీ పర్యవేక్షిస్తుంది.. దానిని బట్టి ఏపీకి ప్రత్యేకహోదాపై నిర్ణయం తీసుకుంటాం అని వెంకయ్య తెలిపారు.

తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తాం.. బలరాం సంచలన వ్యాఖ్యలు

  రాజకీయ నాయకులు అప్పుడప్పుడు ప్రసంగాల్లో ఆవేశంతో కొన్ని మాటలు మాట్లాడి పార్టీకి తంటాలు తీసుకొస్తుంటారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేత మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ కూడా చేసింది అలాగే ఉంది. వరంగల్ జిల్లా నర్సంపేటంలో కాంగ్రెస్ నేతలు ఓసమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జానారెడ్డి.. ఉత్తమ్ కుమార్ రెడ్డితో, బలరాం నాయక్ తోపాటు ఇతర సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే మీరు టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని.. ఈసారి కనుక కాంగ్రెస్ ను గెలిపించకపోతే తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తామని నోరు జారారు. అంతే బలరాం చేసిన వ్యాఖ్యలకు పార్టీ నేతలు ఒక్కసారిగా షాకయ్యి.. ఏం మాట్లాడుతున్నావని బలరాం ను హెచ్చరించారు. దీంతో బలరాం తేరుకొని జస్ట్ జోక్ చేశా అంటూ కవర్ చేసుకున్నారు. అయితే ఒకసారి నోరు జారిన తరువాత ఆమాటలు వెనక్కి రావు కదా.. ఇప్పుడు బలరాం చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. దొరికిందే ఛాన్స్ కదా అని కాంగ్రెస్ పై నిప్పులు చెరుగుతున్నారు. కేంద్ర నాయకత్వం చేస్తున్న కుట్రులను బలరాం మాటల్లో అర్థమవుతుందని అంటున్నారు. ఈ ఒక్క మాట చాలు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కుట్రలు చేస్తుందో అంటూ ఒంటి కాలు మీద లేస్తున్నారు. అసలే అంతంత మాత్రం ఉన్న కాంగ్రెస్ ఉనికికి బలరాం వ్యాఖ్యలతో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో.

రాష్ట్ర వ్యాప్తంగా బంద్.. పలు పార్టీ నేతల అరెస్ట్

తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై గత కొద్దిరోజుల నుండి అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నసంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఇప్పుడు రైతు రుణమాఫీలు అన్నీ ఒకే దఫా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఈ రోజు బంద్ ను నిర్వహించాయి. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో పలుచోట్ల బంద్ కొనసాగుతుంది. దీంతో పలు డిపోల నుండి బస్సులు బయటకు రాలేదు. కొన్నిచోట్ల నిరసన కారులు తెల్లవారుజామునుంచే డిపోల వద్దకు చేరుకొని బస్సులను కదలకుండా ఆపేశారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్ అదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు నగరంలోని పలు డిపోల ఎదుట అఖిలపక్ష కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నగరంలో పలుచోట్ల బంద్ నిర్వహిస్తున్న పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంజీబీఎస్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దానం నాగేందర్, అంజన్‌కుమార్, పొన్నాల లక్ష్మయ్య, సీపీఐ నేత నారాయణను.. దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు ఇంద్రసేనారెడ్డి సహా పలువురు నాయకులను..  అదే విధంగా జూబ్లీ బస్టాండ్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.