chest hospital high court

చెస్ట్ ఆస్పత్రిని కూల్చొద్దు.. హైకోర్టు...

  ఎర్రగడ్డలో వున్న చెస్ట్ ఆస్పత్రి భవనాన్ని కూల్చేసి, అక్కడ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ అంశం మీద హైకోర్టులో కేసు నమోదైంది. ఇప్పుడున్న సచివాలయం వాస్తు బాగా లేదని చెస్ట్ ఆస్పత్రికి కూల్చి అక్కడ సచివాలయాన్ని నిర్మించాలని ఆ కేసులో పేర్కొన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసమే సచివాలయాన్ని మార్చుతున్నామని వివరణ ఇచ్చింది. అయితే చెస్ట్ ఆస్పత్రి హెరిటేజ్ భవనమని, దాన్ని కూల్చరాదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో చెస్ట్ ఆస్పత్రిని ఆరు వారాలపాటు కూల్చరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది. చెస్ట్ ఆస్పత్రి భవనం హెరిటేజ్ భవనమా కాదా అనే విషయాన్ని ఆరు వారాల్లోగా ప్రభుత్వం తేల్చాలని, అప్పటి వరకు భవనాన్ని కూల్చరాదని కోర్టు ఆదేశించింది.

maa winners list

‘మా’ విజేతలు వీరే... లిస్ట్...

  ‘మా’ అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ గెలిచారని పదవీ విరమణ చేస్తున్న అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు మురళీమోహన్ ప్రకటించారు. రాజేంద్రప్రసాద్ 85 ఓట్ల మెజారిటీతో జయసుధ మీద విజయం సాధించారని ఆయన వెల్లడించారు. ఎగ్జిక్యూటీవ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా తనికెళ్ల భరణి (168 ఓట్ల మెజారిటీ) ప్రధాన కార్యదర్శిగా శివాజీరాజా (36 ఓట్ల మెజారీటీ), కోశాధికారిగా పరుచూరి వెంకటేశ్వరరావు (159 ఓట్ల మెజారిటీ), సంయుక్త కార్యదర్శులుగా నరేష్‌ (225 ఓట్ల మెజారిటీ), రఘుబాబు (239 ఓట్ల మెజారిటీ) గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఈ క్రిందివారు గెలుపొందారు. మెంబర్లుగా బెనర్జీ 281 ఓట్లు, బ్రహ్మాజీ 303, ఛార్మి కౌర్ 249, ఢిల్లీ రాజేశ్వరి 262, ఏడిద శ్రీరామ్‌ 253, మహర్షి రాఘవ 255, శశాంక్ 283, గీతాంజలి 285, ఎం. హరనాథ్‌బాబు 255, హేమ 252, జాకీ 311, జయలక్ష్మి 250, కాదంబరి కిరణ్‌ 315, కృష్ణుడు 282, నర్సింగ్‌ యాదవ్‌ 301, పి. శ్రీనివాసులు 245, రాజీవ్‌ కనకాల 315, విద్యాసాగర్‌ 245 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Isis chief bomb killed

బాంబు పెట్టబోయాడు.. పేలింది.. పోయాడు..

  ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాద సంస్థ ఇటీవలి కాలంలో బాగా వేళ్ళూనుకుని ఎంతోమందిని చంపేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సంస్థ చీఫ్ హఫీజ్ మహ్మద్ సయీద్ బాంబు పేలుడులో మరణించాడు. ఈయనగారు వాయవ్య పాకిస్థాన్‌లోని తిరాహ్ లోయలో రోడ్డు పక్కన బాంబు పాతిపెడుతూ వుండగా అది అతని చేతిలోనే పేలిపోవడంతో అక్కడికక్కడే మరణించాడు. ఇతనితోపాటు మరో ఇద్దరు తీవ్రవాదులు కూడా అక్కడే మరణించారు. బాంబు పేలిన సమాచారాన్ని అందుకుని అక్కడకు చేరుకున్న పాకిస్థాన్ భద్రతాదళాలు మరణించింది. ప్రఖ్యాత తీవ్రవాది మహ్మద్ సయీద్ అని తెలుసుకుని, ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియజేశారు. అయితే తమ చీఫ్ మరణించారన్న విషయం మీద ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఇంతవరకు ఎలాంటి స్పందననూ తెలియజేయలేదు.

husbands killed wives

మొగుళ్ళే యముళ్లు

  కట్టుకున్న భర్తలే భార్యలను అతి కిరాతంగా చంపుతున్నారు. మొగుళ్లే యముళ్లులాగా తయారయ్యారు. గొడవేదైనా కాని చంపడమే పరిష్కారంగా ఆలోచిస్తున్నారు. మొన్నటికి మొన్న ఓ భర్త తన ఇల్లాలితో గొడవ పడి గొడ్డలితో అతి దారుణంగా నరికి చంపాడు. ఇప్పుడు అదే తరహాలో శుక్రవారం మరో రెండు దారుణాలు జరిగాయి. గుడిబండ జిల్లాలో ఓ భర్త తన భార్యను కిరాతకంగా కత్తితో నరికి చంపాడు. తరువాత తను కూడా ఉరేసుకొని చనిపోయాడు. ఇదిలా ఉండగా లక్కవరపుకోటలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. గోల్డ్‌స్పాట్‌ కంపెనీ కూడలి దగ్గర ఓ గర్భిణి దారుణహత్యకు గురైంది. భర్తే తన భార్యకు నిప్పంటించి చంపేశాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

terrorists death

18 మంది టెర్రరిస్టులు ఖతం

  టెర్రరిస్టులు ఖతమయ్యారనే వార్త ఈ ప్రపంచానికి నిజంగానే శుభవార్తే. అలాంటి శుభవార్త మరోసారి వినే అవకాశం వచ్చింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 18 మంది టెర్రరిస్టులు ఖతమయ్యారు. ఈజిప్టులోని నార్త్ సినాయ్ ప్రావిన్స్‌లో జరిగిన సైనిక దాడుల్లో ఈ 18 మంది మరణించారు. ఉత్తర సినాయ్ ప్రాంతంలో తీవ్రవాదుల ఆగడాలను అరికట్టడానికి సైనిక బలగాలు జరిపిన వైమానిక దాడుల్లో ఈ తీవ్రవాదులు హతమయ్యారు. మరో నలుగురు తీవ్రవాదులను సజీవంగా పట్టుకున్నారు. ఈ ప్రాంతంలో తీవ్రవాదుల మీద భద్రతా దళాలు సాధించిన చాలా చిన్న విజయమిది. చంపడంలో ఇప్పటి వరకు తీవ్రవాదులదే పైచేయిగా వుంది. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు 500 మంది భద్రతా సిబ్బందిని తీవ్రవాదులు చంపేశారు.

rajendra prasad maa

ఇది తెలుగు ప్రజలు కోరుకున్న విజయం

  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలలో అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా శివాజీరాజా ఎన్నికైన విషయం తెలిసిందే. రాజేంద్రప్రసాద్ ప్యానల్లోని మరికొంతమంది కూడా ఈ ఎన్నికలలో విజయం సాధించారు. ఈ విజయం పట్ల ‘మా’ నూతన అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ స్పందించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగువారందరూ కోరుకున్న విజయమని ఆయన అన్నారు. ‘‘ఎన్నో పరీక్షలను తట్టుకుని, దాటుకుని ఈ ఎన్నికలలో విజయం సాధించాం. ఈ క్షణం నుంచి నేను అధ్యక్షుడిగా వున్నంతకాలం అసోసియేషన్ డబ్బులతో కనీసం టీ కూడా తాగను. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. సినిమా కళాకారులందరూ నవ్వుతూ బతకాలన్నదే నా కోరిక. ఎన్టీఆర్ స్ఫూర్తితో కళాకారుల సంక్షేమానికి కృషి చేస్తాం. ఈ విజయాన్ని తెలుగు ప్రజలకు అంకితం చేస్తున్నాను. నా విజయాన్ని కోరుకున్న, నాకు విజయం అందించిన అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు.

Sun TV Directed to Pay Rs 10 Lakh to Actress Sukanya as Damages

నటి సుకన్యకి 10 లక్షల పరిహారం

ప్రముఖ సినీ నటి సుకన్యకు సన్ టీవీ యాజమాన్యం పది లక్షల 500 రూపాయల పరిహారం చెల్లించాలని మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది. 1996 సంవత్సరంలో సుకన్య వేసిన కేసుకు ఇప్పుడు తీర్పు వచ్చింది. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ బతికున్న రోజుల్లో నక్కీరన్ పత్రిక ఎడిటర్ గోపాల్ అడవుల్లోకి వెళ్ళి వీరప్పన్ ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఆ ఇంటర్వ్యూని ‘నక్కీరన్’ పత్రికలో ప్రచురించారు. సన్‌టీవీతో వున్న ఒప్పందంలో భాగంగా వీరప్పన్ వీడియో ఇంటర్వ్యూని ప్రసారం చేశారు. అయితే ఆ ఇంటర్వ్యూలో వీరప్పన్ మాట్లాడుతూ, హీరోయిన్ సుకన్య మీద కొన్ని కామెంట్లు చేశాడు. అప్పుడు హీరోయిన్‌గా వున్న సుకన్య వయసు 18 సంవత్సరాలు. వీరప్పన్ తన మీద కామెంట్లు చేసిన ఇంటర్వ్యూను ప్రసారం చేయడం మీద సుకన్య మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. సన్ టీవీని, వీరప్పన్‌ని, నక్కీరన్‌ ఎడిటర్ గోపాల్‌ని ఈ కేసులో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆ కేసు ఇంతకాలం సాగీ సాగీ ఇప్పుడు తీర్పు వచ్చింది.  సన్ టీవీ  కారణంగా మనోవేదనకు గురైన సుకన్యకు సన్ టీవీ యాజమాన్యం 10 లక్షల 5 వందల రూపాయలను పరిహారంగా చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.

model killed

మోడల్ హత్య

  ఆస్ట్రేలియాకి చెందిన ఓ మోడల్ హత్యకు గురయ్యాడు. ఇరాక్‌కి వెళ్ళిన ఆయన అక్కడ హత్యకు గురయ్యాడు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కి చెందిన ఒక మోడల్ తీవ్రవాదం పట్ల ఆకర్షితుడయ్యాడు. ఇరాక్‌లో మోడలింగ్ కోసం వెళ్తున్నానని చెప్పి 2014 సంవత్సరంలో వెళ్ళాడు. అయితే అక్కడ అతను తీవ్రవాద క్యాంపుల్లో శిక్షణ తీసుకుటున్నట్టు తమ దగ్గర సమాచారం వుందని ఆస్ట్రేలియా అధికారులు చెప్పారు. ప్రస్తుతం దేశాన్ని గడగడలాడిస్తూ, యువతను తీవ్రవాదం వైపు ఆకర్షితులను చేస్తున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులతో కలసి అతను పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతను హత్యకు గురై కనిపించాడు. అతని మృతదేహం దగ్గర ఒక మిషన్ గన్ కూడా వుంది. అతన్ని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులే చంపేశారా, మరెవరైనా చంపారా అనేది ఇంకా తెలియరాలేదు.

maa rajendra prasad

‘మా’ అధ్యక్షుడిగా రాజేంద్రుడి విజయం

తెలుగు సినిమా నటీనటుల సంఘం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు. ఆయన తన ప్రత్యర్థి నటి జయసుధపై 87 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ‘మా’లో మొత్తం 702 మంది సభ్యులున్నారు. వీరిలో 394 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఫిల్మ్‌ఛాంబర్‌ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ‘మా’ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన మొదట్లో సినీ పరిశ్రమలోని పెద్ద తలకాయలన్నీ అండగా నిలిచిన జయసుధ విజయం సాధించే అవకాశాలున్నాయని భావించారు. అయితే ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ ప్యానల్ ప్రచారంలో ముందంజ వేయడం, ఇతర కారణాల వల్ల ఆయన గెలుస్తారన్న అభిప్రాయాలు ఏర్పాడ్డాయి. ఎన్నికలు పూర్తయిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ విజయం ఖాయమన్న అభిప్రాయాలు బలపడ్డాయి. ఇప్పుడు ఫలితాలు వెల్లడి అయిన తర్వాత అది నిజమైంది. రాజేంద్రప్రసాద్ ప్యానల్ తొలి రౌండ్ నుంచే ఆధిక్యాన్ని చూపించింది. ‘మా’ ఎన్నికలు ఈసారి ఎప్పుడూ లేని విధంగా వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. రెండు ప్యానళ్ళూ విమర్శలు గుప్పించుకున్నారు. ఒక నటుడు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. చివరికి కోర్టు అనుమతితో ఓట్ల లెక్కింపు జరిగింది. కోర్టుకు వెళ్ళిన నటుడికి మొట్టికాయలూ పడ్డాయి.

Ok Bangaram Review

‘ఓకే బంగారం’ షార్ట్ రివ్యూ

ఆయన అద్భుతమైన దర్శకుడు.. కానీ ఇటీవలి కాలంలో వరుసగా ఫెయిల్యూర్స్‌ని ఎదుర్కొంటున్నారు. ఆయన ఎవరో అందరికీ తెలుసు.. మణిరత్నం. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘ఓకే బంగారం’ సినిమా శుక్రవారం నాడు విడుదలైంది. ఆ సినిమా ఎలా వుందో చూద్దాం. ముంబై బ్యాక్‌డ్రాప్‌తో జరిగే సినిమా ఇది. తమ జీవితాలను ఎంతో ప్రేమించే, ఎన్నో యాంబిషన్లు వున్న ఆది, తార అనే అమ్మాయి  - అబ్బాయి కథ ఇది. విదేశాలలో స్థిరపడాలని అనుకునే వీరిద్దరూ అనుకోకుండా ఒకరినొకరు కలుస్తారు. ఇద్దరూ సహజీవనం చేస్తూ వుంటారు. వీరిద్దరూ ప్రకాష్ రాజ్, లీలా థామ్సన్ ఇంటిలో వుంటారు. కథ ఇలా జరుగుతూ వున్న సమయంలో కొన్ని మలుపులు వస్తాయి. ఆ మలుపుల కారణంగా అప్పటి వరకూ వారిద్దరిలో వున్న మైండ్ సెట్ మారే పరిస్థితులు కూడా వస్తాయి. తమ సహజీవనాన్ని కొనసాగించాలా వద్దా అనే పరిస్థితులు వీరికి ఎదురవుతాయి.  చివరికి ఏమైందనేదే ఈ సినిమా కథాంశం. ఈ సినిమా హీరో దల్కీర్ సల్మాన్ ఎవరో కాదు.. మన మమ్ముట్టి కొడుకు. హీరోయిన్ నిత్యామీనన్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ చక్కని నటనను ప్రదర్శించారు. ఒక జంట మధ్య కెమిస్ట్రీ బాగా కుదరాలని అంటారు చూశారా.. ఆ కెమిస్ట్రీ వీరిద్దరి మధ్య బాగా వర్కవుట్ అయింది. దల్కీర్ సల్మాన్‌కి మన నాని డబ్బింగ్ చెప్పడం కలిసొచ్చింది. ఇక దర్శకుడు మణిరత్నం విషయానికి వస్తే, ఆయన మరోసారి  విజృంభించారు. ఆయనలోని ఉత్సాహాన్ని పెంచే సినిమా ఇది. ఎఆర్ రెహమాన్ సంగీతం, పిసి శ్రీరామ్ కెమెరా పనితనం ఈ సినిమాని ఎక్కడకో తీసుకెళ్ళి వదిలిపెట్టాయి.  మొత్తమ్మీద ఒకసారి తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ‘ఓకే బంగారం’.

modi obama

మోడీ మీద ఒబామా వ్యాసం

  భారత ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మధ్య ఫ్రెండ్‌షిప్ బాగా కుదిరినట్టుంది. అంతర్జాతీయ వేదికల మీద ఒకరినొకరు కలిసినప్పుడు, మోడీ అమెరికా వెళ్ళినప్పుడు, ఒబామా ఇండియాకి వచ్చినప్పుడు వీరిద్దరి మధ్య కనిపించిన స్నేహ సంబంధాలు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా చేశాయి. ఒకప్పుడు మోడీకి వీసా ఇవ్వడానికే అమెరికా నిరాకరించింది. ఇప్పుడు సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడే మోడీకి మంచి స్నేహితుడైపోయాడు. ఈ స్నేహంతోనే ఒబామా మోడీ మీద ఒక వ్యాసం రాశాడు. నరేంద్రమోడీని కీర్తిస్తూ ఒబామా రాసిన ఈ వ్యాసం ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్‌లో ప్రచురితమైంది. టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన వందమంది ప్రభావవంతుల వ్యక్తుల జాబితాలో మోడీకి స్థానం దొరికింది. దాంతోపాటు ‘ఇండియాస్ రిఫార్మర్ ఇన్ ఛీఫ్’ పేరుతో ఒబామా రాసిన వ్యాసాన్ని కూడా ప్రచురించారు. ఇది మోడీకి దక్కిన అరుదైన గౌరవం. పేదరికం నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని ఒబామా తన వ్యాసంలో ప్రసంశించారు. చిన్నతనంలో తన తండ్రికి చాయ్ అమ్మడంలో సహకరించిన బాలుడు నేడు ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకుడయ్యాడని ఒబామా కొనియాడారు. అలాగే యోగా మీద మోడికి వున్న ఆసక్తిని, మోడీ ప్రవేశపెట్టిన ‘డిజిటల్ ఇండియా’ గురించి కూడా ఒబామా తన వ్యాసంలో ప్రస్తావించారు.

revanth reddy kcr

కేసీఆర్ని పాతరేస్తాం... రేవంత్...

  కేసీఆర్ జూరాల - పాకాల అంటే ఆయన్ని పాలమూరు జిల్లాలోనే పాతరేస్తామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ ‌రెడ్డి హెచ్చరించారు. మహబూబ్ నగర్‌ జిల్లా షాద్ నగర్, జడ్చర్ల తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన కేసీఆర్‌కి ఈ స్ట్రాంగ్ హెచ్చరిక జారీ చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి కేసీఆర్ మీద, ఆయన ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. ‘‘తెలంగాణ బిడ్డల శవాల మీద నిల్చుని గద్దెనెక్కిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆయన కుటుంబ సభ్యులకే రాజకీయ కొలువులు తెచ్చుకున్నాడు. ఆయన ఒక రాక్షసుడు. టీఆర్ఎస్ పాలన పాలన హౌస్‌ఫుల్ - కలెక్షన్ నిల్ అన్నట్టుగా వుంది. కేసీఆర్ జూరాల - పాకాల అంటున్నాడు. అలా అంటే ఆయన్ని జిల్లాలోనే పాతరేస్తాం. పాలమూరు జిల్లా విషయంలో కేసీఆర్ కూడా వైఎస్సార్‌ లాగానే దుర్మార్గుడే. వైఎస్సార్ పోతిరెడ్డిపాడు పేరుతో రాయలసీమకి నీళ్ళు తీసుకెళ్తే కేసీఆర్ వరంగల్‌కి నీళ్ళు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇద్దరికీ ఏ తేడా లేదు. కేసీఆర్ని పాలమూరు నుంచి పార్లమెంటుకు పంపిస్తే ఆయన జిల్లాకు ఏం ఒరగబెట్టాడు? ఆస్పత్రి స్థానంలో సచివాలయం, సచివాలయం స్థానంలో ఆకాశ హర్మ్యాలు కడతామని ప్రకటించినప్పుడే కేసీఆర్ అంటే ఏమిటో అందరికీ తెలిసిపోయింది’’ అని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

యువతిని చంపాలనుకున్నాడు.. కానీ...

  కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లో శుక్రవారం తెల్లవారుఝామున ఒక సంచలన ఘటన జరిగింది. ఒక యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడిని ఆ యువతి బంధువులు కొట్టి చంపారు. కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌కి చెందిన ఒక యువతిని రాజు అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. ఆ యువకుడికి ఎన్నిసార్లు చెప్పినా తన ఉన్మాదం వదల్లేదు. శుక్రవారం తెల్లవారుఝామున రాజు కొడవలితో తమ ఇంటికి వచ్చి తమ కుమార్తెను చంపడానికి ప్రయత్నించాడని, తామంతా కలిసి రాజును చంపేశామని ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపి లొంగిపోయారు. ఈ ఘటనలో యువతి తల్లిదండ్రులతోపాటు ఆ యువతి కూడా స్వల్పంగా గాయపడింది. నిజానికి అక్కడ జరిగిన ఘటన యువతి తల్లిదండ్రులు చెప్పినట్టే జరిగిందా... ఇందులో మరోకోణం ఏమైనా వుందా అనే అనుమానాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

‘మా’ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు నేడే

  ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. నటుడు ఓ.కళ్యాణ్ సిటీ సివిల్ కోర్టులో వేసిన పిటిషనును  కొట్టివేసి ఫలితాలు వెల్లడించేందుకు ‘మా’కు కోర్టు అనుమతి ఈయడంతో ఈరోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్, ఫిల్మ్ ఛాంబర్ లో ఎన్నికల అధికారులు ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించబోతున్నారు. అయితే కళ్యాణ్ తను క్రింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాలు చేయబోతున్నట్లు ప్రకటించడంతో మళ్ళీ కొంచెం గందరగోళం నెలకొంది. కానీ ఆయన హైకోర్టులో పిటిషను వేసి దానిని కోర్టు అంగీకరించేలోగానే ఓట్లు లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడుతాయి కనుక హైకోర్టు అతని పిటిషనును విచారణకు స్వీకరిస్తుందా లేదా స్వీకరించినా ‘మా’ ఎన్నికలపై మళ్ళీ స్టే విదిస్తుందా లేక హైకోర్టు కూడా అతని పిటిషనును కొట్టివేస్తుందా? అనేసందేహాలున్నాయి. ‘మా’ లో మొత్తం 702మంది సభ్యులు ఉండగా కేవలం 394 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఏది ఏమయినప్పటికీ ‘మా’ అధ్యక్ష పదవికి పోటీపడిన రాజేంద్ర ప్రసాద్, జయసుధ ఇద్దరిలో ఎవరు గెలుస్తారనే విషయం ఈరోజు 10-11 గంటలలోగా తేలిపోబోతోంది.

విరాట్ కోహ్లీకి స్టీవా సలహా

  ఆసీస్ కెప్టెన్ స్టీవ్ వా విరాట్ కోహ్లీకి ఓ సలహా ఇచ్చాడంట. విరాట్ కోహ్లీ ధోని నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలని అన్నారు. భావోద్వేగాలు ఎలా అదుపు చేసుకోవాలి, కెప్టెన్ గా ఎలా పరిపక్వత చెందాలి అనే విషయాలు ధోని నుంచి నేర్చుకోవాలని సూచించాడు. ఎన్ని సమస్యలొచ్చినా ధోని చలించడని, బయటి విషయాలు ధోనిపై ఎలాంటి ప్రభావం చూపవని అన్నాడు. కోహ్లీకి ధోని ఆధర్శమని, ధోనిలో ఉన్న లక్షణాలు కోహ్లీ అలవాటు చేసుకోవాలని స్టీవ్ అన్నాడు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు ప్రతి విషయానికి గొడవ పడడం సరి కాదని, సంఘటనలు జరుగుతున్నప్పుడు కాస్త సంయమనం పాటించాలని వ్యాఖ్యానించాడు. కోహ్లీ ప్యాషన్ కూడా తనకు నచ్చుతుందని స్టీవ్ అన్నాడు.