andhra pradesh cabinet meeting

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం బుధవారం నాడు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. * ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫిట్‌మెంట్‌తో కూడిన జీతాలను మే 1వ తేదీ నుంచి  అందుకుంటారు. * ఎస్సీ, ఎస్టీ రైతులకు వ్యవసాయ పరికరాలను 70 శాతం సబ్సిడీతో ఇవ్వాలని నిర్ణయించారు. కరువు పీడిత ప్రాంతల్లోని రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రకృతి వైపరీత్యాలకు గురైన రైతులకు నష్టపరిహారం పెంచి ఇవ్వాలని నిర్ణయించారు. వేరుశనగకు హెక్టారుకు 15,000, వరి, పత్తి, చెరకు, కూరగాయల పంటలకు 15,000, మొక్కజొన్నకు 12,500, మామిడి, జీడిమామిడి, బత్తాయి, నిమ్మ, ఆరెంజ్‌ పంటలకు 20,000 నష్టపరిహారం ఇస్తారు. పప్పు ధాన్యాలు, సోయాబీన్‌ పంటలకు 10,000, అరటికి 25,000 పరిహారం చెల్లిస్తారు. * ప్రకృతి వైపరీత్యాల కారణంగా మరణించిన వారి కుటుంబలకు  ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు చెల్లిస్తుంది. మత్స్యకారుల పడవల మరమ్మతుల కోసం 10,000, చేనేత కార్మికులకు 10,000, క్షతగాత్రులు పది రోజులకు మించి ఆస్పత్రుల్లో చికిత్స పొందితే 50,000 ఇస్తారు. * ఉద్యానపంటలకు కేటాయించిన ఇన్‌పుట్ సబ్సిడీలో 80 శాతాన్ని అనంతపురం జిల్లాకే కేటాయించారు. ఈ జిల్లాకు 856 కోట్లు కేటాయించారు. మిగిలిన మొత్తాన్ని  చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాలకు కేటాయించారు. * ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీరు - చెట్టు కార్యక్రమంలో భాగంగా మే 31వ తేదీ లోపల ప్రాజెక్టుల వంతుగా కాలువల వెంట పర్యటిస్తారు. * ఇసుక రీచ్‌లలో జీపీఎస్ విధానం అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. * అంగన్‌వాడీ కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధుల జీతాలను పెంచడానికి కేబినెట్ ఉపసంఘాన్ని నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. * నీటి యాజమాన్య పనుల కోసం ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు 50 కోట్ల చొప్పున, తూర్పు గోదావరి జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు 20 కోట్ల రూపాయల చొప్పున ఉపాధి హామీ పథకం కింద నిధులను కేటాయించారు. ఇకపై గ్రామాల్లో పనుల ఆమోదానికి సర్పంచ్‌లతోపాటు జన్మభూమి కమిటీలకు కూడా అధికారం వుంటుంది.

Chiranjivi

చిరంజీవి సరసన శ్రీదేవి?

  మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం మెగా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు చేస్తారు? కొత్త హీరోయిన్ ను పరిచయం చేస్తాడా లేక ఇప్పుడున్న హీరోయిన్ లతోనే చేస్తాడా? అని చాలా సందేహాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తన 150వ సినిమాకు హీరోయిన్ ఖరారైనట్లు న్యూస్ వినిపిస్తోంది. ఆ లక్కీ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా... ఎవరో కాదండి చిరంజీవితో కలిసి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో దేవకన్యలాగా మెరిసి అందరిని మెప్పించిన అలనాటి అందాల తార శ్రీదేవి. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను శ్రీదేవితో ఇప్పటికే మాట్లాడినట్లు, అగ్రిమెంట్కు సంబంధించిన పనులు కూడా పూర్తి అయినట్లుగా టాక్స్ వినిపిస్తున్నాయి.

john key

పనిపిల్ల జడ లాగిన ప్రధాని

  ఎదో సరదాగా పోనీ టెయిల్ పట్టుకొని లాగినందుకు పోనీ లే అని ఊరుకోకుండా రచ్చ చేసిందో వెయిట్రెస్. లాగింది మామూలు వ్యక్తి కూడా కాదు న్యూజిలాండ్ ప్రధానమంత్రి. ఫలితం ఆమెకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ప్రధాని జాన్ కీ ఆక్లాండ్ లో ఓ వెయిట్రస్ వేసుకున్న పోనీ టెయిల్ పట్టుకొని లాగాడు. దీంతో ఆమె దాన్ని వేధింపులుగా భావించడంతో ప్రధాని క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాధారణంగా ప్రాక్టికల్ జోక్స్ వేయడం తనకి ఇష్టమని అన్నాడు. ఆ ఉద్దేశంతోనే పోనీ టైల్ లాగానని, తను చేసిన పనికి ఆమె బాధపడినట్టు తెలిసిన వెంటనే క్షమాపణ చెప్పానని వివరించారు.

net neutrality parliament

నెట్ న్యూట్రాలిటీపై లోక్‌సభలో రచ్చ

  నెట్ న్యూట్రాలిటీ అంశం మీద లోక్‌సభలో చర్చ జరుగుతున్న సందర్భంగా లోక్‌సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ అంశం మీద మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నెట్ న్యూట్రాలిటీ మీద చట్టం తీసుకురావాలని సూచించారు. కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం లొంగిపోతోందని విమర్శించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యల మీద కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. నెట్ న్యూట్రాలిటీ విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు లొంగిపోలేదని, స్పెక్ట్రమ్ వేలంలో అధికంగా బిడ్లు రాబట్టిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. నెట్ న్యూట్రాలిటీ విషయంలో నిబంధనలను రూపొందిస్తున్నామని వివరించారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు విమర్శించారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగి, గందరగోళం ఏర్పడింది.

telangana inter first year results

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు

  తెలంగాణలో ఇంటర్మీడియల్ ప్రథమ సంవత్సర ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో 55.60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది కూడా బాలికలే పైచేయి సాధించారు. ఈ ఏడాది మొత్తం 4,31,361 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,39,954 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలికల ఉత్తీర్ణత శాతం 61.68 కాగా, బాలురు 49.60 శాతం ఉత్తీర్ణత సాధించారు. రంగారెడ్డి జిల్లా (71శాతం) మొదటి స్థానంలో నిలిచింది. నల్గొండ జిల్లా (43శాతం) చివరి స్థానంలో నిలిచింది. ఈ ఫలితాలపై మే 22వ తేదీ లోపు రీ-వెరిఫికేషన్ జరుపుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించాలి. మే 25 నుంచి అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతాయి.

kara mastar nrt national award

కారా మాస్టారుకి ఎన్టీఆర్ జాతీయ అవార్డు

  ప్రముఖ తెలుగు కథా రచయిత, కారా మాస్టారుగా అందరూ పిలుచుకునే కాళీపట్నం రామారావు 2015 సంవత్సరానికి ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని మే 28న అందజేస్తారు. అవార్డుతో పాటు లక్ష రూపాయల నగదు పురస్కారం కూడా ప్రదానం చేస్తారు. కాళీపట్నం రామారావు 1924, నవంబరు 9న శ్రీకాకుళం లో జన్మించారు. కాళీపట్నం రాసిన 'యజ్ఞం' కథకు 1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. ఈ క్రింది లింకు ద్వారా కారా మాస్టారు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.   కథా యజ్ఞం చేస్తున్న మహర్షి కారా మాస్టారు

aadhar card

కుక్కకి ఆధార్ కావాలన్న తింగరోడు

  తనతో పాటు తన కుక్కకి ఆధార్ కార్డ్ కావాలని ధరఖాస్తు చేసుకున్నాడు ఓ తింగరోడు. ఈ విచిత్రమైన ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని రాజాపూర్ లో మనీశ్ కుమార్ అనే వ్యక్తి ఓ ప్రైవేటు సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అతను గత మార్చి నెలలో తన కుక్క ఫోటోతో పాటు తప్పు సమాచారాన్ని నింపి ఆన్ లైన్ లో ధరఖాస్తు పెట్టాడు. అది కాస్తా ప్రభుత్వ అధికారుల కంట పడింది. మనీశ్ పెట్టిన దరఖాస్తును వారు తిరస్కరించి ఈ తిక్కలి పనికి పాల్పడినందుకు అతనిపై కేసు పెట్టారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామని చూసి చివరికి తనే ఇరుకున పడ్డాడు.

tirumala laddoo

రోజుకు మూడు లక్షల లడ్డూలు

  తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ అంటే ఇష్టం లేనిదెవరికి? శ్రీవారి లడ్డూ భక్తులకు మహా ప్రసాదం. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. భక్తి, ముక్తి విషయంలో మాత్రమే కాదు... రుచి విషయంలో కూడా తిరుమల లడ్డు ప్రత్యేకతే వేరు. అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోయే శ్రీవారి లడ్డూ ఎవరికైనా స్పెషల్ ఎట్రాక్షన్.. అయితే తిరుమలలో వీఐపీ భక్తులకు తప్ప సాధారణ భక్తులకు ఎక్కువ సంఖ్యలో లడ్లు దొరకవన్న అభిప్రాయం వుంది. క్యూలో వెళ్ళే సమయంలో ఇచ్చే లడ్లు సరిపోకపోవడంతో భక్తులు ఆ తర్వాత గంటలు గంటలు క్యూలో నిల్చుని అదనంగా లడ్లు కొనుగోలు చేస్తూ వుంటారు. అయితే ప్రస్తుతం తిరుమలలో రోజుకు భక్తుల కోసం రెండు లక్షల లడ్డు తయారు చేస్తున్నారు. ఈ లడ్లు సరిపోవడం లేదు. దాంతో ఇకపై రోజుకు మూడు లక్షల లడ్లు చేయాలని టీడీటీ ఇవో నిర్ణయించారు. లక్ష లడ్లు అదనంగా సమకూరడం వల్ల ఇకపై భక్తులకు లడ్లు సులభంగా లభించే అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు. లడ్ల తయారీని పెంచడానికి వీలుగా ఇటీవల పోటును విస్తరించారు కూడా.

assembly constituency andhra pradesh

అసెంబ్లీ సీట్లు పెంచరట

  ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశాలు వున్నాయన్న వార్తలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా ఆసక్తిగా వుంది. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెంచాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను పెంచే అవకాశం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. అసెంబ్లీ స్థానాలను పెంచడం 2026 తర్వాత మాత్రమే సాధ్యమవుతుందని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 170వ అధికరణ ప్రకారం 2026వ సంవత్సరం వరకు ఏ రాష్ట్రంలోనూ అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచడం సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి లిఖిత పూర్వకంగా తెలియజేశారు. తెలంగాణ ఎంపీ వినోద్ కుమార్‌ లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి ఇలా సమాధానం ఇచ్చారు. అయితే ఈ విషయంలో తమ పోరాటాన్ని ఆపేదే లేదని ఎంపీ వినోద్ కుమార్ అంటున్నారు.

అవనిగడ్డ ఆంజనేయ ఆలయం ధ్వంసం

  కృష్ణాజిల్లా దివిసీమలోని అవనిగడ్డలో అత్యంత పురాతన ఆంజనేయ స్వామి ఆలయం, విగ్రహం సమూలంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఈ దేవాలయాన్ని విశేషంగా సందర్శిస్తూ వుంటారు. ఈ ఆలయం అవనిగడ్డ వంతెన సెంటర్ వద్ద ప్రధాన కాల్వ గట్టు మీద వుంది. అయితే, మంగళవారం ఉదయం ఈ ఆలయం అకస్మాత్తుగా కాలవలోకి కూలిపోయింది. ఈ విషయం తెలుసుకుని స్థానిక ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. గత కొద్ది రోజులుగా ఓ కాంట్రాక్టర్ డెల్టా ఆధునీకరణ పనులు చేయిస్తున్నాడు. కాల్వ గట్టు మీద ఆంజనేయ దేవాలయం ఉన్న విషయాన్ని పట్టించుకోకుండా దేవాలయం పక్కనే భారీ కందకం తవ్వించాడు. మంగళవారం నాడు కాల్వలోకి నీళ్ళు విడుదల చేశాడు. దాంతో ఆ నీటి ఒరవడికి గట్టు మొత్తం కోసుకునిపోయి దేవాలయం ఒక్కసారిగా కుప్పకూలింది. దేవాలయం మొత్తం ధ్వంసం కావడంతోపాటు దేవాలయంలో వున్న ఆంజనేయ స్వామివారం విగ్రహం కూడా దెబ్బతింది. ఇలా జరగడం అమంగళకరమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన జరగడానికి కారకుడైన కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళన నిర్వహించారు. అధికారుల తీరును నిరసిస్తూ ప్రజలు రాస్తారోకోకు దిగడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రజల ఆందోళనతో దారికి వచ్చిన కాంట్రాక్టర్ కూలిపోయిన దేవాలయాన్ని పునరుద్ధరిస్తానని హామీ ఇవ్వడంతో స్థానిక ప్రజలు శాంతించారు. అనంతరం, ఘటనలో దెబ్బతిన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పులిగడ్డ వద్ద నిమజ్జనం చేశారు.

టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవం

  తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కెసీఆర్‌ను అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ ఇప్పటి వరకు ఆరు నామినేషన్లు దాఖలయ్యాయని, పార్టీ అధ్యక్ష పదవికి కేసీఆర్ మినహా ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదని ఎన్నికల పర్యవేక్షకుడిగా వ్యవహరించిన మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కేసీఆర్‌ని పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపాదించారని, ఆ ప్రతిపాదనను ఆరుగురు మంత్రులు బలపరిచారని నాయిని తెలిపారు. దీంతో కేసీఆర్ మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని నాయిని వివరించారు.