చంద్రబాబు, కేసీఆర్.. ఇద్దరి ఫొటోలు తొలగించారు

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల గొడవలు ఇక్కడ చాలవన్నట్టు ఢిల్లీలో కూడా మొదలుపెట్టారు. ఢిల్లీలోని ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి గురజాడ సమావేశ మందిరం ఉమ్మడిగా కొనసాగుతుంది. అయితే ఈ మందిరంలో రెండు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ ల  ఫొటోలను మందిరం అధికారులు పెట్టారు. అయితే నిన్న చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు.. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ జర్నలిస్టు అసోసియేషన్ (ఢిల్లీ శాఖ)ను ప్రారంభించడానికి గురజాడ సమావేశ మందిరానికి వెళ్లారు. అయితే ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరవడానికి ముందు ఇద్దరు సీఎంల ఫొటోలలో కేసీఆర్ ఫొటో తీసేసి చంద్రబాబు  ఫొటో ఉంచారు. అంతే దీనిని గమనించిన తెలంగాణ జర్నలిస్ట్ వెంటనే దీనిని తెలంగాణ భవన్ అసిస్టెంట్ కమిషనర్ రామ్మెహన్ కు తెలుపగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురజాడ సమావేశ మందిరానికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సిబ్బందిని నిలదీశారు. ఉంటే ఇద్దరు సీఎంల ఫొటోలు ఉండాలి లేకపోతే ఇద్దరివి తీసేయాలి.. అంతేకాని కేసీఆర్ ది తీసేసి చంద్రబాబుది ఉంచడం ఏంటని మండిపడ్డారు. దీంతో చంద్రబాబు ఫొటోని కూడా తీసేశారు. అయితే చంద్రబాబు కార్యక్రమానికి వచ్చి వెళ్లిన తరువాత కూడా ఫొటోలు పెట్టకపోవడం గమనార్హం. .

మోడీని ఆహ్వానించిన చంద్రబాబు.. తప్పకుండా వస్తా

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాగరమాల కార్యక్రమం నిమిత్తం ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈసందర్బంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. దీనికి మోడీ సాకుకూలంగా స్పందించి తాను శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని.. మధ్యాహ్నం 12.35 నుంచి 12.45లోపు వస్తాయని చెప్పారని.. అనంతరం తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటానని చెప్పారని చంద్రబాబు తెలిపారు. అంతేకాక రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీలు.. ఇతర నిధుల మంజూరు తదితర విషయాలపై చర్చించినట్టు తెలిపారు. కాగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని దసరా రోజు ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 12.45 నిమిషాలకు ఖరారు చేసిస సంగతి తెలిసిందే. కార్యక్రమాని ప్రధాని నరేంద్రమోడీతో పాటు సింగపూర్, జపాన్ ప్రధానులు కూడా పాల్గొననున్నారు.

రఘువీరా కారుపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి

చిత్తూరు జిల్లా కుప్పంలో ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు, కుప్పంలో ఎయిర్ పోర్ట్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న స్థానికులకు అండగా అక్కడికి వెళ్లిన రఘువీరాను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు... కాన్వాయ్ పై చెప్పులు, రాళ్లు విసిరారు. దాంతో తెలుగుదేశం, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది, ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా, కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది, మరోవైపు కుప్పంలో కాంగ్రెస్ తలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అభ్యంతరం తెలిపారు, టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ నేపథ్యంలో సభకు అనుమతి నిరాకరించిన పోలీసులు... పెద్దఎత్తున మోహరించారు

కారెక్కుతారంటూ దానంపై మళ్లీ వార్తలు

దానం నాగేందర్ త్వరలో కారెక్కుతారంటూ మళ్లీ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి, దానంతోపాటు అతని సన్నిహితుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ కూడా గులాబీ కండువా కప్పుకుంటారని టాక్ వినిపిస్తోంది, గతంలో కూడా అనేకసార్లు ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు దానం ఖండించినా, ఈసారి మాత్రం పక్కా అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక ఒకరోజు అటూఇటుగా ఈ కార్యక్రమం ఉంటుందని గులాబీ నేతలు లీకులిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లో పలువురు నేతలను పార్టీలోకి లాగాలనుకుంటున్న అధికార పార్టీ... దానంతో ఎప్పట్నుంచో మంతనాలు జరుపుతోంది, కానీ డీల్ కుదరక పెండింగ్ లో పడ్డ ఈ వ్యవహారం...ఈసారి కారెక్కేయడం ఖాయమంటున్నారు.  

కేసీఆర్ పై జానారెడ్డికి కోపమొచ్చింది

మీరు సీనియర్... మీ సలహాలు తీసుకుంటామంటూ పొగుడుతూ సీఎం కేసీఆర్ ఐస్ చేస్తుంటే... కూల్ గా సెలైంటయిపోయే ప్రతిపక్ష నేత జానారెడ్డికి ఈసారి కోపమొచ్చింది, రైతు ఆత్మహత్యలపై చర్చకు పట్టుబడ్డిన విపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంపై ఊగిపోయిన జానారెడ్డి... సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది మీరు కాదా అంటూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు, సమస్యలు పట్టించుకోమంటే నిబంధనలు గుర్తుచేస్తారా... అవి మాకు తెలియదా... అంటూ ఫైరయ్యారు, విపక్ష ఎమ్మెల్యేల సస్పెన్షన్ అప్రజాస్వామికమన్న జానా... అధికార పార్టీ నిరంకుశ విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, అందుకే అన్నదాతలకు భరోసా ఇవ్వలేకపోతుందని ఆరోపించారు, సభను స్తంభింపజేయడం తమ ఉద్దేశం కాదన్న జానా... అన్నదాతల ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేయాలన్నదే లక్ష్యమన్నారు, అయితే ప్రభుత్వం తమ గొంతు నొక్కాలని ప్రయత్నిస్తోందని, సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ కి త్వరలో ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయమన్నారు.

రేవంత్ రెడ్డి రంగంలోకి దిగాడు

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావుపై టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు, తెలంగాణ అసెంబ్లీ మామా అల్లుళ్లకు ఆటవిడుపు కేంద్రంగా మారిందని, అందుకే సభలో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని రేవంత్ ఆరోపించారు, 32మంది విపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దారుణమన్న రేవంత్ రెడ్డి... ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై పోరాడుతూనే ఉంటామన్నారు, తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న 1400మంది రైతులకు 6లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలన్న రేవంత్, మిగిలిన రుణమాఫీని ఒకే విడతలో చేయాలని డిమాండ్ చేశారు, ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న కేసీఆర్... రైతుల రుణాలు మాఫీ చేసేందుకు మాత్రం డబ్బుల్లేవా అంటూ ప్రశ్నించారు, ఆంధ్రా కాంట్రాక్టర్ల కోసం 40వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారు కానీ...రైతులకు సాయం చేయడానికి డబ్బు ఎందుకు లేదని నిలదీశారు. రైతులకు న్యాయం జరిగేవరకూ ముఖ్యమంత్రిని మంత్రులను నిలదీస్తూనే ఉంటామని, జిల్లాల్లో వారి పర్యటనలను అడ్డుకుంటామని రేవంత్ హెచ్చరించారు.

సస్పెన్షనే... అధికార పార్టీ ఆయుధం

రైతు ఆత్మహత్యలపై విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడతాయని ముందే ఊహించిన అధికార పార్టీ... సస్పెన్షన్ ను ఆయుధంగా వాడుకోవాలని ముందే డిసైడైంది, రెండ్రోజులపాటు అసెంబ్లీ కూల్ గా జరిగినా, మూడోరోజు విపక్షాలు విశ్వరూపం చూపించడంతో, ముందుగా అనుకున్నట్లుగా కేసీఆర్ సర్కార్  సస్పెన్షన్ అస్త్రాన్ని బయటికి తీసింది, అన్నదాతల ఆత్మహత్యలపైనే చర్చించాలని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ సభ్యులంతా పట్టుబట్టడంతోపాటు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగడంతో ఏకంగా 32మంది ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేసేశారు. దాంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది, కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో అసెంబ్లీని హోరెత్తించారు. టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ కూడా జత కలవడంతో అధికారపక్షం డిఫెన్స్ లో పడింది.

తెలంగాణ అసెంబ్లీలో లొల్లి మొదలైంది

అనుకున్నట్లుగానే తెలంగాణ అసెంబ్లీలో లొల్లి మొదలైంది, రైతు ఆత్మహత్యలపై రెండ్రోజులపాటు చర్చించినప్పటికీ, తిరిగి అదే అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది, విపక్షాల వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించడంతో మొదలైన లొల్లి... 32మంది ఎమ్మెల్యేల సస్సెన్షన్ వరకూ వెళ్లింది, దాంతో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి రచ్చరచ్చ చేశారు, అయితే విపక్షాల తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు, సభను జరగనివ్వబోమనే రీతిలో విపక్షాలు ప్రవర్తించడం సరికాదని, బీఏసీ నిర్ణయాల మేరకు సభను నిర్వహిస్తున్నామన్నారు, రైతుల సమస్యలపై రెండ్రోజులపాటు చర్చించాం, ప్రభుత్వం ఏంచేయగలుతుందో చెప్పాం, కానీ సాధ్యంకాని వాటిని విపక్షాలు అమలు చేయమంటే ఎలా కుదురుతుందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్ణయం నచ్చకపోతే నిరసన తెలిపాలే గానీ, ఇలా సభను అడ్డుకోవడం సరికాదని విపక్షాలకు కేసీఆర్ సూచించారు.

టీ-అసెంబ్లీలో గందరగోళం, 32మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్

తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం ఏర్పడింది, రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని, అన్నదాతల ఆత్మహత్యలను ఆపేందుకు చర్యలు చేపట్టాలంటూ విపక్షాలన్నీ శాసనసభలో ఆందోళనకు దిగాయి, ప్రభుత్వం అందుకు సానుకూలంగా స్పందించకపోవడంతో విపక్ష సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు, దాంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది, సభ సజావుగా జరిగేందుకు అటు ప్రభుత్వం, ఇటు స్పీకర్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో 32మంది ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. ప్రతిపక్ష నేత జానారెడ్డి, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మినహా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైసీపీ, సీపీఐ, సీపీఎంకి చెందిన 32మంది ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు.

నేడు భోగాపురంలో పర్యటించనున్న జగన్

  రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూములు సేకరిస్తున్నప్పుడు రైతుల తరపున నిలబడి పోరాడుతానని గట్టిగా హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి వారి కోసం మంగళగిరిలో ఓ రెండు రోజులు దీక్షలు చేసారు. ఆయన రాజధాని పనులకు అడుగడునా అడ్డుపడుతూనే ఉన్నారు. ఎందుకంటే రైతుల కోసమేనని చెప్పుకొన్నారు. పోనీ రైతులకయినా అండగా నిలబడ్డారా...అంటే అదీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా గుంజుకొన్నపటికీ తను ముఖ్యమంత్రి కాగానే ఎవరి భూములు వారికి తిరిగి ఇచ్చేస్తానని రైతులకు హామీ ఇచ్చి తన దీక్ష ముగించారు. కానీ రైతుల నుండి ప్రభుత్వం సేకరించిన భూములపై రాజధాని నిర్మాణం జరిగిన తరువాత ఆయన ఆ భూములను రైతులకు ఏవిధంగా తిరిగి అప్పగిస్తారో చెప్పలేదు.   రాజధాని రైతులకు హ్యాండిచ్చిన జగన్ ఇప్పుడు భోగాపురం రైతుల తరపున పోరాడేందుకు బయలుదేరుతున్నారు. విజయనగరం జిల్లా, భోగాపురం గ్రామం వద్ద విమానాశ్రయం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకు రైతుల నుండి భూసమీకరణ చేస్తోంది. దానికి స్థానిక రైతుల నుండి వ్యతిరేకత ఎదురవుతుండటంతో వారికి అండగా నిలబడి పోరాడేందుకు జగన్ అక్కడ వాలిపోతున్నారు. అక్కడి రైతులను కలిసేందుకు ఈరోజు ఆయన భోగాపురంలో పర్యటించబోతున్నారు. వారితో మాట్లాడిన తరువాత తన తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా కోసం ఈనెల 7వ తేదీ నుండి గుంటూరులో ఆయన నిరవధిక నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. కనుక ఆ కార్యక్రమం ముగిసిన తరువాత భోగాపురం రైతుల కోసం దీక్ష చేస్తారేమో?

తలసానిపై త్వరలో నిర్ణయం

తెలంగాణ మంత్రి తలసానికి పదవీ గండం పొంచి ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టిన తలసాని విషయంలో అనేక విమర్శలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదోఒక నిర్ణయం తీసుకోవాలని డిసైడైనట్లు చెబుతున్నారు, తలసాని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా ఇంతవరకూ ఆమోదించకపోవడం, పైగా మంత్రి పదవి చేపట్టి ఆర్నెళ్లు దాటిపోవడంతో కేసీఆర్ సర్కార్ కూడా ఇరకాటంలో పడిందని, మరోవైపు గవర్నర్ నుంచి ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో మంత్రి పదవి నుంచి తప్పిస్తారని టాక్ వినిపిస్తోంది, తలసానిని కేబినెట్ నుంచి తప్పించడం మినహా మరో గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడిందని, దీనిపై సీఎం కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు, తలసాని రాజీనామా ఆమోదింపజేసి, ఉపఎన్నికల్లో గెలిస్తే మళ్లీ కేబినెట్ లోకి తీసుకోవాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి

టీడీపీలోకి ఆదినారాయణరెడ్డి, వైసీపీలోకి రామసుబ్బారెడ్డి?

జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీ చేరాలని నిర్ణయించుకోవడంతో అతని రాజకీయ ప్రత్యర్ధి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రామసుబ్బారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది, ఆదినారాయణరెడ్డి రాకపై రామసుబ్బారెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపినప్పటికీ చంద్రబాబు, చినబాబు... పట్టించుకోలేదని, దాంతో చేసేదేమీ లేక....జగన్ పార్టీతో మంతనాలు జరిపినట్లు సమాచారం. ఆదినారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన వెంటనే, రామసుబ్బారెడ్డి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పశ్చిమ వైసీపీలో రాయుడు వర్సెస్ నాయుడు

పశ్చిమగోదావరి జిల్లా వైసీపీలో కొత్తపల్లి సుబ్బారాయుడు, ఆళ్ల నాని మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందని, వీళ్లిద్దరికీ అస్సలు పడటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్తపల్లి రాకముందు పశ్చిమ వైసీపీకి అంతా తానై వ్యవహరించిన ఆళ్ల నాని... ఇప్పుడు గుర్రుగా ఉన్నాడని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న కొత్తపల్లితో పలువురికి పొసగడం లేదని,  గత ఎన్నికల్లో ఓడిపోయిన గ్రంథి శ్రీనివాసరావు, కారుమూరి నాగేశ్వర్రావు లాంటి వాళ్లు తీవ్ర అసంతప్తితో ఉన్నారని, ఏదోఒక పార్టీకి గుడ్ బై చెప్పేయడం ఖాయమని అంటున్నారు. జగన్ చేసిన తప్పిదాలతో 2014లో కోలుకోలేని దెబ్బతింటే, పార్టీని బతికించుకోవాల్సిన నేతలు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో వైసీపీ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు

ఏడిద నాగేశ్వరరావు జీవిత విశేషాలు

  ప్రముఖ నిర్మాత, పూర్ణోదయ పతాకం మీద ‘శంకరాభరణం’ లాంటి అనేక ఉత్తమ సినిమాలను నిర్మించిన ఏడిద నాగేశ్వరరావు ఆదివారం నాడు కన్నుమూశారు. ఆయన జీవిత విశేషాలివి... ఏడిద నాగేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 24, ఏప్రిల్ 1934వ సంవత్సరంలో జన్మించారు. ఏడిద పాప లక్ష్మి, సత్తిరాజు నాయుడు ఆయన తల్లిదండ్రులు. ఆయన కాకినాడలో 10వ తరగతి, విజయనగరంలో ఇంటర్మీడియట్, కాకినాడలో బి.ఎ. చదివారు. ఆ తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించారు. నటుడిగా ఆయన తొలి చిత్రం ‘ఆత్మబంధువు’. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తొలి చిత్రం ‘పార్వతీ కళ్యాణం’. ఆత్మబంధువు, ఆస్తులు - అంతస్తులు, రణభేరి, పసిడి మనసులు, పవిత్రబంధం, నేరము - శిక్ష, బాలభారతం, కాదల్ ఓవియం (తమిళం), ఆరాధ, సంగీత లక్ష్మి, అత్తగారు - కొత్తకోడలు, పెళ్ళిరోజు తదితర చిత్రాల్లో నటించారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా దాదాపు వంద చిత్రాలకు పనిచేశారు. ‘తాయారమ్మ - బంగారయ్య’ నిర్మాతగా ఆయన తొలిచిత్రం. సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సీతాకోకచిలక, సాగర సంగమం, సితార, స్వాతిముత్యం, స్వయంకృషి, ఆపద్బాంధవుడు లాంటి ఉత్తమ చిత్రాలను ఆయన నిర్మించారు. ఏడిద నాగేశ్వరరావుకు భార్య ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. ఆయన కుమారులు ఏడిద రాజా, ఏడిద శ్రీరామ్ సినిమా రంగంలోనే వున్నారు.

నారాయణఖేడ్ బైపోల్ బరిలో అధికార పార్టీ

కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్ణారెడ్డి హఠాన్మరణంతో అనివార్యమైన నారాయణఖేడ్ బైపోల్ లో వామపక్షాలు పోటీ చేయాలని ప్రకటించడంతో అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా బరిలోకి దిగాలని డిసైడైంది, కిష్ణారెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరు ఏకగ్రీవమయ్యేలా సహకరించాలని అన్ని పార్టీలనూ కాంగ్రెస్ కోరినప్పటికీ, సీపీఎం పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది, దాంతో ఎలాగూ ఎన్నిక జరుగుతుందని కాబట్టి పోటీ చేయడమే మంచిదనే నిర్ణయానికి టీఆర్ఎస్ వచ్చింది, పైగా నారాయణఖేడ్ పై కన్నేసిన కేసీఆర్... ఇప్పటికే మంత్రి హరీష్ కి బాధ్యతలు అప్పగించారు, దాంతో టీఆర్ఎస్ నేతలు ఇప్పట్నుంచే ముమ్మరంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు, గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన ఎం.భూపాల్ రెడ్డికే మళ్లీ టికెట్ దక్కొచ్చని సమా చారం, టీఆర్ఎస్ పోటీకి దిగాలని నిర్ణయం తీసుకోవడంతో... హరీష్ తోపాటు మంత్రి ఈటెల, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి తదితరులు నారాయణఖేడ్ పై ఫోకస్ పెట్టారు.