బీఫ్ పార్టీ ఇచ్చాడని ఎమ్మెల్యేపై బీజేపీ అటాక్

  బీఫ్ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది, అనేక రాష్ట్రాల్లో ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటుంటే, కొన్నిచోట్ల చంపుకునే వరకూ వెళ్తోంది, తాజాగా జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో ఏకంగా ఎమ్మెల్యేపైనే దాడి జరిగింది, బీఫ్ పార్టీ ఇచ్చిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రషీద్ పై బీజేపీ ఎమ్మెల్యేలు భగత్, రాజీవ్ శర్మలు దాడికి దిగి చితకబాదారు, అసెంబ్లీలో అందరూ చూస్తుండగా, స్పీకర్ ఎదుటే దాడికి పాల్పడటంతో మిగతా ఎమ్మెల్యేలంతా విస్తుపోయారు, బీజేపీ ఎమ్మెల్యేల బారి నుంచి రషీద్ ను కాపాడటానికి విపక్ష సభ్యులు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. బీఫ్ ను నిషేధించినా తాను తింటానని చెప్పడమే కాకుండా, బీఫ్ పార్టీ ఇచ్చినందుకే రషీద్ పై బీజేపీ ఎమ్మెల్యేలు దాడి చేసినట్లు తెలుస్తోంది, అయితే ఎమ్మెల్యేపై దాడి చేయడాన్ని విపక్ష నేత ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు

బ్లాక్ లిస్ట్ లో పెడతామంటూ నిర్మల వార్నింగ్

కేంద్రం ఆదేశాల మేరకు రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేయకపోతే వ్యాపారులను బ్లాక్ లిస్ట్ లో పెడతామంటూ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. కేంద్రం ఆదేశించినా వ్యాపారులు కొనుగోళ్లు జరపక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన నిర్మలా సీతారామన్... పొగాకు బోర్డు అధికారులు, వాణిజ్యశాఖ ప్రతినిధులతో అత్యవసరంగా సమావేశమై సమీక్షించారు. రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు పొగాకు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యాపారులు పాటించడం లేదంటూ ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నివేదిక ఇవ్వడంతో నిర్మల సీరియస్ అయ్యారు, కేంద్రం ఆదేశాలను పాటించకపోతే బ్లాక్‌లిస్టులో పెడతామంటూ పొగాకు వ్యాపారులకు హెచ్చరికలు పంపారు.

బాబు సర్కార్ పై పురంధేశ్వరి ఆరోపణలు

చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుపై తనకు అనేక అనుమానాలున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి... మరోసారి కీలక కామెంట్స్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వ జాప్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతోందని ఆమె ఆరోపించారు, టీడీపీ ప్రభుత్వం గడువులోగా నివేదిక పంపకపోవడం వల్లే... కేంద్రం నుంచి నిధుల విడుదలలో జాప్యం జరిగిందన్నారు. జగన్ దీక్షపై కూడా కామెంట్స్ చేసిన పురంధేశ్వరి.... ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆడతున్న డ్రామా అంటూ విమర్శించారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా గురించి లేకపోయినా, అధిక నిధులు కేటాయిస్తూ ఏపీని కేంద్రం ఆదుకుంటోందని గుర్తుచేశారు.

జగన్మోహన్ రెడ్డిపై రావెల తీవ్ర ఆరోపణలు

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గుంటూరులో దీక్ష చేపట్టడాన్ని మంత్రి రావెల ఎద్దేవా చేశారు, జగన్ కు నిజంగా దమ్ముంటే... దీక్ష గుంటూరులో కాదు ఢిల్లీలో చేయాలని సవాలు విసిరారు, దొంగ దీక్షలు చేసే జగన్మోహన్ రెడ్డి... గుంటూరులో అలజడి సృష్టించాలని చూస్తున్నారని మంత్రి ఆరోపించారు. అమరావతి శంకుస్థాపనకు దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులను అడ్డుకోవాలని జగన్ చూస్తున్నారని, జగన్ ప్రవర్తనను చూసి ఆ పార్టీ నేతలే అసహ్యించుకుంటున్నారని రావెల విమర్శించారు, నవ్యాంధ్రప్రదేశ్ ను పునాదుల నుంచి పునర్ నిర్మించడానికి చంద్రబాబు రాత్రీపగలూ కష్టపడుతుంటే, జగన్ అడ్డుపుల్లలు వేస్తూ అభివృద్ధి నిరోధక దీక్ష చేస్తున్నారని విమర్శించారు.

రెండోరోజుకి చేరిన జగన్ ప్రత్యేక దీక్ష

విభజన హామీల మేరకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి... గుంటూరులో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండోరోజుకి చేరింది, స్పెషల్ స్టేటస్ పైనే నవ్యాంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు ఆధారపడి ఉందని, అందుకోసం ఎంతకైనా తెగించి పోరాడదామని జగన్ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా వస్తేనే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న ఆయన, ప్రతి పనికీ కేంద్రం నుంచి 90 శాతం గ్రాంటు, పది శాతం లోను వస్తాయన్నారు. స్టేటస్ లభిస్తే పరిశ్రమలకు పన్ను, ఎక్సైజ్‌ డ్యూటీలకు మినహాయింపు ఉంటుందని, అంతేకాకుండా ఇరవై ఏళ్లపాటు విద్యుత్‌ చార్జీలు సగం ధరే చెల్లించవచ్చన్నారు.దాంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారని, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు,  ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు ప్రత్యేక హోదాపై నోరు విప్పకపోవడం దౌర్భాగ్యమంటూ జగన్ వ్యాఖ్యానించారు.

కొన్నిటికే ‘ఆధార్‘.. తేల్చిచెప్పిన సుప్రీం

ఆధార్ కార్డుపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, ఎల్పీజీ గ్యాస్ కు తప్ప అన్నింటికీ ఆధార్ కార్డు తప్పనిసరి కాదంటూ గతంలో తేల్చిచెప్పిన అత్యున్నత ధర్మాసనం... మరోసారి అలాంటి వ్యాఖ్యలనే చేసింది. ప్రతిదానికీ ఆధార్ కార్డు కావాలని కోరడమంటే... అది వ్యక్తిగత స్వేచ్చను హరించడమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందుకే అన్నిటికీ ఆధార్ కార్డు  తప్పనిసరి కాదని, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే దాన్ని వినియోగించాలని సూచించింది. ఓటర్ కార్డుకు ఆధార్ ను లింక్ పెట్టడాన్ని కూడా తప్పుబట్టిన సుప్రీం... ఆధార్ కార్డు ఆధారంగా ఓట్లు తొలగించడం సరికాదంది. అయితే ఆధార్ కార్డు విషయంలో కేంద్రం వైఖరికి భిన్నంగా సుప్రీం ఆదేశాలు, సూచనలు ఉండటంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.

జగన్మోహన్ రెడ్డికి గంటా సవాల్

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రులు గంటా, అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు, భోగాపురం ఎయిర్ పోర్ట్ భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్న జగన్... రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు, జగన్ మానసిక స్థితి సరిగా లేదని, అందుకే డెవలప్ మెంట్ కు అడ్డుపడుతున్నాడని ఆరోపించారు, భోగాపురంలో తనకు భూములున్నాయంటూ జగన్ చేసిన విమర్శలను ఖండించిన గంటా.... అక్కడ తనకు ఒక్క ఎకరం ఉందని నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. వైఎస్ హయాంలో 117 కంపెనీలకు భూములిస్తే తప్పులేదు గానీ, రాష్ట్రాభివృద్ధి కోసం భూములు సేకరిస్తుంటే మాత్రం అడ్డుకుంటున్నారని గంటా మండిపడ్డారు.

కేసీఆర్ ముక్కు నేలకు రాయించేవాడిని.. నాగం

రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వ తీరుపై కేసీఆర్ పై నాగం జనార్ధనరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ వర్షాకల సమావేశల నేపథ్యంలో రైతు ఆత్మహత్యలపై చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలన్నీ.. అధికార పక్షంపై ముకుమ్మడిగా దాడి చేశాయి. దీనిలో భాగంగా నాగం కేసీఆర్ పై విమర్శలు చేశారు. ఒకవేళ తాను కాని అసెంబ్లీ సమావేశాల్లో ఉండి ఉంటే రైతుల ఆత్మహత్యల విషయంలో.. ప్రభుత్వ వహిస్తున్న నిర్లక్ష్యాన్ని ఎండగట్టే వాడినని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ముక్కును నేలకు రాయించేవాడినని ఘాటుగా వ్యాఖ్యానించారు. తనను ప్రశ్నిస్తున్నారని చెప్పి అసెంబ్లీ నుండి ప్రతిపక్షనేతలను సస్పెండ్ చేసి తన నియంతృత్వ పోకడను చూపించారని.. అసలు ప్రతిపక్షాలు లేని అసెంబ్లీ ఏం అసెంబ్లీ అని ఎద్దేవ చేశారు. అంతేకాదు కేసీఆర్ హఠావో.. కిసాన్ బచావో అంటూ సరికొత్త నినాదాన్ని తెరపైకి లేపారు. ఈనినాదంతో ఉద్యమం కూడా చేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చినప్పుడు తెలియదా.. అసాధ్యం అని తెలిసినప్పుడు  ఎందుకు హామీలు ఇచ్చారు అని ప్రశ్నించారు. అంతేకాదు ప్రతిపక్షాలు ఈనెల 10న చేపట్టిన బంద్ కు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ముగిశాయి. మొత్తం ఏడు రోజుల్లో 30గంటలపాటు బీఏసీలో నిర్ణయించిన అంశాలపై చర్చించారు, పదో తేదీ వరకూ సభ కొనసాగాల్సి ఉన్నప్పటికీ విపక్షాల సస్పెన్షన్ తో మూడ్రోజుల ముందే నిరవధిక వాయిదా పడింది, అయితే ప్రతిపక్షాలు లేకపోవడంతో చివరి మూడ్రోజులు సభ చప్పగా సాగింది, మొత్తం 30 గంటల 6 నిమిషాలపాటు చర్చ జరగగా, అధికార పార్టీ టీఆర్ఎస్ 18 గంటల 19 నిమిషాలు, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 3 గంటల 56 నిమిషాలు మాట్లాడాయి. ఇక టీడీపీ 2 గంటల 7 నిమిషాలు, ఎంఐఎం రెండున్నర గంటలు, బీజేపీ గంటా 38 నిమిషాలు, వైసీపీ 42 నిమిషాలు, సీపీఐ 33 నిమిషాలు, సీపీఎం 21 నిమిషాలు మాట్లాడినట్లు స్పీకర్ తెలిపారు.

నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, 10మంది మృతి

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది, రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం దగ్గర ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే 10మంది ప్రాణాలు కోల్పోయారు, బస్సులో డ్రైవర్ వైపు కూర్చున్న వాళ్లంతా మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు, బస్సులో మొత్తం 33మంది ప్రయాణిస్తుండగా డ్రైవర్ తో సహా 10మంది చనిపోయారు, మరికొందరి పరిస్థితి సీరియస్ గా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందంటున్నారు. క్షతగాత్రుల్లో కొందరికి కాళ్లూచేతులు విరిగిపోవడంతో ఘటనాస్థలం భయానకంగా మారింది. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్... క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు

ప్రత్యేక హోదా...ఏపీ హక్కు... గుంటూరులో జగన్ నినాదం

ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటూ గుంటూరులో దీక్ష చేపట్టిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ప్రారంభోపన్యాసం చేశారు, ప్రత్యేక హోదాపై వరుసగా చేస్తున్న పోరాటాలకు కొనసాగింపుగానే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టినట్లు తెలిపారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కన్న జగన్... స్టేటస్ వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని అన్నారు, ప్రత్యేక హోదా పదేళ్లు కావాలన్న చంద్రబాబు... ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించిన జగన్... ఒకప్పుడు ప్రత్యేక హోదా సంజీవని అన్న నోటితోనే... అదేమీ సంజీవని కాదంటూ మాట మార్చారని మండిపడ్డారు, నవ్యాంధ్రలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే ప్రత్యేక హోదా కావాలన్నారు, ఈ దీక్ష ద్వారా అయినా కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తీసుకొచ్చి... రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ సాధించాలని జగన్ సూచించారు.

అక్బరుద్దీన్ ఓవైసీపై అరెస్ట్ వారెంట్ జారీ

ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో అక్బరుద్దీన్ అరెస్ట్ కు కిషన్ గంజ్ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు, మోడీపై అనుచిత వ్యాఖ్యలతోపాటు ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఓవైసీ అభియోగాలు ఎదుర్కొంటున్నారు, గతంలో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లోనూ ఇదే తరహాలో వ్యాఖ్యలు చేయడంతో జైలుకెళ్లిన అక్బర్... ఇప్పుడు మళ్లీ అదే తరహా కేసులో ఇరుక్కున్నారు, దాంతో అక్బరుద్దీన్ ను బీహార్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముందని, మళ్లీ జైలుకెళ్లడం ఖాయమని వార్తలు వస్తున్నాయి.

అమరావతికి వంద ప్రత్యేక విమానాలు

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవాన్ని పెద్ద పండుగులా చేయాలనుకుంటున్న ఏపీ ప్రభుత్వం.... తరలివచ్చే అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది, శంకస్థాపన కార్యక్రమానికి వచ్చే వీవీఐపీలను తరలించేందుకు వంద ప్రత్యేక విమానాలను వినియోగించాలనుకుంటోంది, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, హైదరాబాద్ విమానాశ్రయాల ద్వారా అతిథులను తరలించడంతోపాటు అమరావతి పరిసర ప్రాంతాల్లో 13 హెలిప్యాడ్లను కూడా రెడీ చేస్తోంది, దేశ విదేశాల నుంచి తరలివచ్చే అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం.... శంకుస్థాపన కార్యక్రమాన్ని కళ్లుచెదిరే రీతిలో చేయనుంది, ఈ కార్యక్రమం నిమిత్తం మొత్తం మూడు వేదికలను రెడీ చేస్తున్నారు, ప్రధాన వేదికపై ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, గవర్నర్ నర్సింహన్, కేంద్ర మంత్రులు, జపాన్, సింగపూర్ తోపాటు విదేశీ ప్రతినిధులు మాత్రమే కూర్చుంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి

కృష్ణాలో మాగంటి వర్సెస్ ముద్రబోయిన

కృష్ణాజిల్లా నూజివీడు టీడీపీ ఇన్ ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వర్రావుకి, ఏలూరు టీడీపీ ఎంపీ మాగంటి బాబుకి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి, ముద్రబోయిన, మాగంటి ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు, తనకు సమాచారం ఇవ్వకుండా మాగంటి బాబు... ఆయన బంధువులను, ఇతర నేతలను తీసుకుని తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని, తాను బీసీని అయినందువల్లే ఇలా చేస్తున్నారని ముద్రబోయిన ఆరోపిస్తున్నారు, అయితే ముద్రబోయిన ఆరోపణలను ఖండించిన మాగంటి... తాను నూజివీడు నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ముద్రబోయినకు ఫోన్ చేశానని, కానీ ఆయన హైదరాబాద్ లో ఉన్నానని చెప్పారని అంటున్నారు, మాగంటి వ్యాఖ్యలను ముద్రబోయిన కూడా ఖండిస్తున్నారు, తనకు అసలు ఫోనే చేయలేదని... అయినా తనంటే గిట్టని నాయకులను వెంటబెట్టుకుని తన నియోజకవర్గంలో పర్యటించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు