కీలకమయిన బీహార్ అసెంబ్లీ రెండవ దశ పోలింగ్ నేడే
బీహార్ అసెంబ్లీకి నేడు రెండవ దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో మాత్రం పోలింగ్ మూడు గంటలకే ముగుస్తుంది. బీజేపీ, జనతా పరివార్, సమాజ్ వాదీ పార్టీలకు అత్యంత కీలకమయినవిగా భావిస్తున్న 32 నియోజక వర్గాలలో ఇవ్వాళ్ళ ఎన్నికలు జరుగబోతున్నాయి. కైమూర్, రోహ్తాస్, అరవాల్, జెహనాబాద్, ఔరంగాబాద్ మరియు గయ జిల్లాలో గల 32 స్థానాలకు మొత్తం స్థానాలకు 456మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజీ (ఎన్డీయే) ఇమామ్ గంజ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రత్యర్ధి ఉదయ్ నారాయణ్ చౌదరి (జె.డి.యు.) ఇదే నియోజక వర్గం నుండి వరుసగా ఐదుసార్లు గెలిచారు. ఆయన బీహార్ అసెంబ్లీ స్పీకర్. ఇవ్వాళ్ళ పోలింగ్ జరుగుతున్న నియోజక వర్గాలలో మొత్తం 86,13,870 మంది ఓటర్లున్నారు. ఎన్నికల సంఘం 32 నియోజక వర్గాలలో మొత్తం 9, 119 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేసింది. పోలింగ్ సజావుగా సాగేందుకు 993 కంపెనీల పారా మిలటరీ దళాలు రంగంలో దింపింది.