రైతు ఆత్మహత్యలపై కోదండరాం.. హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్

తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై ఇప్పటికే ప్రతిపక్షాలు, అధికార పార్టీని ఎండగడుతున్నాయి. రైతులకు న్యాయం చేయాలని.. రైతులను ఆర్ధికంగా ఆదుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు జేఏసీ కోదండరాం కూడా రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ కు షాకిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యలపై ఆయన కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. అయితే ఇప్పటి వరకూ రైతు ఆత్మహత్యలపై ఏం మాట్లాడటం లేదని కోదండరాంపై ఇప్పుడు హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేయడంతో చర్చాంశనీయమైంది. ప్రభుత్వ విధానాలు ఆత్మహత్యలను ప్రోత్సహించేలా ఉన్నాయని.. స్వామినాథన్ కమిటీ నివేదికను పట్టించుకోవడం లేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలు పెరిగాయని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందని, దీని పైన తాను సమగ్ర సర్వే జరిపానని, ఇందుకు సంబంధించి తన వద్ద నివేదిక ఉందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలతో ఇబ్బందులు పడుతున్న కేసీఆర్ కు ఇప్పుడు కోదండరాం కూడా తోడయ్యాడు. మరి ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.

అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ శంఖనాదం

దసరా రోజు జరగబోయే శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణకు చెందిన ఓ వ్యక్తికి ప్రత్యేకంగా ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఏ ముఖ్యమంత్రో.. ఇంకెవరో అనుకుంటున్నారా? కాదు. అది ఎవరంటే.. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమంలో శంఖం ఊదేందుకు శంఖేశ్వర్ ను ఆహ్వానించారు. తెలంగాణకు చెందిన శంఖేశ్వర్ శంఖం ఊదడంలో  నిష్ణాతుడు. ఈయన గురించి ప్రముఖ సంఘ సేవకుడు రామచంద్ర డోంగ్రీజీ మహరాజ్ గోశాల ట్రస్టీ జస్ మత్ భాయ్ పటేల్ ద్వారా తెలుసుకున్న టీడీపీ వర్గాలు ఆయనతో శంఖం ఊదించాలని నిర్ణయం తీసుకొని ఆయనను ఆహ్వానించినట్టు చెబుతున్నారు. కాగా శంఖేశ్వర్ కు రెండు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉంది. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆయనతో శంకునాదం చేయిస్తుంటారు. ఆయన మంచినీళ్లు కూడా తాగకుండా ఏకధాటిగా 1100 సార్లు శంఖనాదం చేయగలరు.

టీడీపీ ఎంపీ మల్లారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

మెడికల్ సీట్ల విషయంలో మల్కాజ్ గిరి టీడీపీ ఎంపీ మల్లారెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది, సి.మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో 127 సీట్లకు తిరిగి కౌన్సెలింగ్ నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశించింది, సి.మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో A, B కేటగిరి సీట్లను అమ్ముకున్నారంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు... ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది, సి.మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో ఆ 127 సీట్లకు ఈనెల 20లోగా కౌన్సెలింగ్ నిర్వహించాలని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి సూచించింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఒక్కో సీటును కోటి రూపాయలకు అమ్ముకున్నారంటూ అభియోగాలు వచ్చిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు కీలకంగా మారాయి.

నేను కాదు చంపింది... గుట్టువిప్పిన ఇంద్రాణి

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసు మరో కొత్త మలుపు తిరిగింది, ఈ కేసులో అరెస్టయిన షీనా బోరా తల్లి ఇంద్రాణి గుట్టువిప్పింది, ఇప్పటివరకూ విచారణకు సరిగా సహకరించడం లేదంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణి...నోరు విప్పి కొత్త విషయాలు తెలియజేసింది, షీనాను తాను చంపలేదని, తన మాజీ భర్త సంజీవ్ ఖన్నానే ఆమెను కడతేర్చాడని చెప్పుకొచ్చింది. ఒకసారి సంజీవ్ ఖన్నాతో విందుకు షీనాను తీసుకెళ్లానని, అయితే తన ప్రస్తుత భర్త పీటర్ ముఖర్జీ కుమారుడితో షీనా సంబంధం పెట్టుకోవడం సంజీవ్ తట్టుకోలేకపోయాడని, అందుకే డ్రైవర్ తో కలిసి షీనాను సంజీవ్ ఖన్నా చంపేశాడని సీబీఐకి తెలిపింది.  

అమరావతికి పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్

ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చూస్తున్న తరుణంలో.. అమరావతి నిర్మాణాన్ని ఆపాలంటూ.. పర్యావరణ అనుమతులు లేవంటూ కొన్ని వార్తలు షికార్లు చేశాయి. అయితే ఇప్పుడు వాటన్నింటికి బ్రేక్ పడింది. అమరావతికి పర్యావరణ అనుమతుల గురించి కేంద్ర మంత్రి జవదేకర్ ప్రకటన చేశారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. రాజధానికి అవసరమైన అన్ని అనుమతులను మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. అసలు దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగబోయే ఈ అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి అనుమతులు రావని అనుకోవడం పొరపాటే.

హైదరాబాద్, సికింద్రాబాద్ లో కేబుల్ టీవీ పన్ను

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఇక కేబుల్ టీవీ పన్ను వసూలు చేయబోతున్నారు. కేబుల్ ఆపరేటర్లు వినోదపన్ను చెల్లించాలన్న చట్టం ఎప్పటి నుంచో ఉన్నా ఇప్పటివరకూ దాన్ని అమలుచేయని జీహెచ్ఎంసీ అధికారులు... ఇకనుంచి పన్ను వసూలుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్రేటర్ అధికారులు చెబుతున్న దాని ప్రకారం కేబుల్ ఆపరేటర్లు 20శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని, దాంతో వినియోగదారులపై కేబుల్ ఆపరేటర్లు అదనపు భారం వేసే అవకాశముందని అంటున్నారు, ఈ లెక్కన 24లక్షల కేబుల్ టీవీ కనెక్షన్లు, 4లక్షల డీటీహెచ్ కనెక్షన్ల ద్వారా జీహెచ్ఎంసీకి పెద్దమొత్తంలోనే ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు

పరువు నష్టం దావా వేస్తానంటున్న మంత్రి

అగ్రిగోల్డ్ భూముల విషయంలో తనపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆవేదన వ్యక్తంచేశారు, తనపై ఆరోపణలను నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్న పుల్లారావు... పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు. వైసీపీ లీడర్స్ కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, తప్పుడు పత్రాలు చూపిస్తూ మీడియాను కూడా తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు, వివాదాస్పద అగ్రిగోల్డ్ భూములను తాను తక్కువ ధరకు కొనుగోలు చేశానంటూ ఆరోపించిన మోపిదేవి వెంకటరమణ, మర్రి రాజశేఖర్ లపై పరువు నష్టం దావా వేయనున్నట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు

అమరావతి శంకుస్థాపన.. యాంకర్ గా సాయికుమార్

ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని చూస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి చేయాల్సిన పనులతో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా బిజీ అయిపోయారు. అంతేకాదు శంకుస్థాపన కార్యక్రమానికి ముందు కొన్ని సాంస్కృతికి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమాలకు యాంకర్ గా సాయికుమార్ ను నియమించినట్టు.. దీనికి చంద్రబాబు కూడా ఓకే అన్నట్టు తెలస్తోంది. శివమణి డ్రమ్స్‌తో పాటు ఏపీకి చెందిన కూచిభొట్ల ఆనంద్ నేతృత్వంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు కూడా ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఏపీ ప్రభుత్వం మొతం మూడు వేదికలను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మూడు వేదికలలో మొదటి ప్రధాన వేదిక.. ఆ దిగువున రెండు వేదికలు ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పాటు15 మంది కీలక వ్యక్తులు ఆసీనులు కానున్నారు. మిగిలిన  రెండు వేదికలపై ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రముఖులు ఆసీనులవుతారు.

ఈ తొమ్మిది రోజులు ఎవరినీ తిట్టను.. కవిత

రాజకీయ నాయకులకు తిటుకోవడానికి.. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడానికి ఆరోజు.. ఈరోజు అంటూ ఏమి ఉండదు. తమపై విమర్శలు చేసిన నేతలపై వారు కూడా వెంటనే విమర్శలు చేసి వారు కూడా ఏం తక్కువ తినలేదని నిరూపించుకుంటారు. అయితే ఇక్కడ కేసీఆర్ కూతురు కవిత విమర్శలకు పండుగరోజు మినహాయించింది. అదేంటనుకుంటున్నారా.. బతుకమ్మ పండుగ సందర్భంగా ఎంపీ కవిత పై పలు రకాల విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. మామూలుగా అయితే కేసీఆర్ లాగే కవిత కూడా తమ ప్రత్యర్ధులను మాటలతో చీల్చి చెండాడుతుంది. అలాంటి కవిత ఈ బతుకమ్మ పండుగ సందర్బంగా.. తొమ్మిది రోజులు తాను ఎవరిని విమర్శించనని చెప్పింది. బతుకమ్మ పండుగ సందర్భంగా చేస్తున్న విమర్శలపై తాను మాట్లాడనని.. పవిత్రమైన రోజుల్లో పూజలు చేసుకోవటం మానేసి.. ఈ విమర్శలేంటి అని కవిత అంటున్నారు. అంతేనా తమ వేతనాలు పెంచమని డిమాండ్ చేస్తున్న ఆశావర్కర్లను సైతం తమ నిరసనలు పక్కన పడేసి బతుకమ్మ ఆడాలని సూచించారట. అయితే బతుకమ్మ ఆడాలని.. చెప్పే బదులు.. తమ సమస్యను తీరీస్తే నిజంగానే సంతోషంగా బతుకమ్మ ఆడుకుంటాం కదా అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

రైతు రుణమాఫీలపై టీడీపీ, జీజేపీ నిరసనలు.. టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్

రైతు రుణమాఫీలపై తెలంగాణ టీడీపీ, బీజేపీ నేతలు అధికార పార్టీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. లక్షలోపు ఉన్న రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని.. వారికి కొత్త రుణాలు అందించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ, బీజేపీ నేతలు అబిడ్స్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. దీంతో అక్కడ పోలీసులు నేతలను అడ్డుకొనగా అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు టీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీ సహా మరికొందరు నేతలను అరెస్టు చేసి ఆబిడ్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ ఎన్నికలప్పుడు రైతు రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను మరిచిపోయారని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కోసం రూ. 1000 కోట్లు మార్కెట్‌ ఫండ్‌ విడుదల చేస్తామని.. ఖరీఫ్‌లో రైతులకు రూ. 15వేల కోట్ల వరకు రుణాలు అందిస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం అందులో కనీసంఅయిదు వేల కోట్లయినా ఇవ్వలేదని మండిపడ్డారు. ఇంకా ఈ నిరసనలో టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నాడు. ఆయన మాట్లాడుతూ.. రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ ప్రభుత్వం ఏం పట్టనట్టు వ్యవహరిస్తుందని.. లక్షలోపు ఉన్న రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.  

తలసాని జుట్టే కాదు.. పదవి నకిలీదే.. రేవంత్ రెడ్డి

  టీటీడీపీ ఫైర్ బ్రాండ్ అంటే మొదట గుర్తొచ్చేంది రేవంత్ రెడ్డినే. ప్రత్యర్ధులను విమర్శించాలన్నా.. వారి విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాలన్నా రేవంత్ రెడ్డి తరువాతే. అందుకే మాటలతో చవాకులు పేల్చే కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డికి కొంత భయపడేది. అధికార పార్టీపై తనదైన శైలిలో మాటల తూటాలు పేలుస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకూ కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తలసానికి శ్రీనివాస్ యాదవ్ పై కామెంట్స్ విసిరారు. తమ పార్టీపై తలసాని చేస్తున్న విమర్శలకు ధీటుగా.. తలసాని శ్రీనివాస్ యాదవ్ జుట్టే కాదు ఆయన మంత్రి పదవి కూడా నకిలీదేనని సరైన కౌంటర్ ఇచ్చారు. కాగా రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డి కేసీఆర్ ని కచరా అని.. కేసీఆర్ చుట్టూ ఉన్నది కచరా బ్యాచ్ అని విమర్శించిన సంగతి తెలిసిందే.

5 నిమిషాల టైం ఇవ్వండి మోడీ.. కాంగ్రెస్ ఎంపీలు

ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు చిరంజీవి, కేవీపీ రామచంద్రరావు, సుబ్బిరామిరెడ్డి, జైరామ్ రమేశ్, జేడీ శీలం ఆయనకు ఘన స్వాగతం పలుకుతామని చెప్పారు. అంతే కాదు కాంగ్రెస్ నేతలందరూ కలిసి ప్రధానికి ఓ లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్న సందర్భంగా తమకు ప్రత్యేక హోదా గురించి.. ప్రత్యేక ప్యాకేజీల మాట్లాడేందుకు ఓ ఐదు నిమిషాల టైం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.  ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని గత ఎన్నికల ప్రచారంలో మోడీ హామీ ఇచ్చారని.. ఇప్పుడు ఆ హామీని నేరవేర్చాలని అన్నారు. అలాగే హామీలను ఎవరు అమలు చేశారన్నది ముఖ్యం కాదని అమలయ్యాయా లేదా? అన్నదే ప్రధానమని శీలం విలేకరులతో చెప్పారు. మరి మోడీ వాళ్లకి టైం కేటాయిస్తారో లేదో చూడాలి.

జగన్ ప్రాణాలు పణంగా పెట్టొద్దు.. దిగ్విజయ్

జగన్ చేస్తున్న దీక్షకు రాష్ట్ర పార్టీల నేతలతో పాటు అటు తెలంగాణ, ఆంధ్రా కాంగ్రెస్ పార్టీ వ్యవహాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ కూడా మద్దతు పలికారు. కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయి తను సొంతగా పార్టీ పెట్టుకున్నా.. పార్టీ పరంగా ఎలాంటి రాజకీయ విభేదాలున్నా తను చేస్తున్న నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయని తెలిపారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం జగన్ తన ప్రాణాలను ఫణంగా పెట్టొద్దని.. హోదా కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేయాలన్నారు. రాష్ట్రాభివృద్ధికి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోరాడుతుందని అన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తానని మోదీ చెపుతున్నారు.. అసలు ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకుండా ఎలా ఇస్తారని ప్రశ్సించారు. కేసీఆర్ తన కుటుంబంకోసమే పాలన సాగిస్తున్నట్టు ఉంది కాని రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల గురించి పట్టించుకోవడం లేదని.. కాని రైతుల గురించి కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటుందని అన్నారు. 

జగన్ దీక్ష.. అసలు షర్మిళ ఎక్కడ?

గుంటూరు జిల్లా నల్లపాడులో ఏపీ ప్రత్యేక హోదా కోసం జగన్ నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఈ రోజు జగన్ దీక్షను భగ్నం చేసిన సంగతి విదితమే. అయితే జగన్ దీక్షకు ఎన్నో పార్టీలు మద్దుతు తెలిపాయి.. ఎంతో మంది నేతలు వచ్చి పరామర్శించారు. అయితే ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే అసలు జగన్ దీక్ష చేస్తున్న సమయంలో జగన్ చెల్లి షర్మిళ ఎక్కడా కనిపించకపోవడం. అంత పెద్ద దీక్షను తెలపెట్టిన జగన్ కు మద్దతు పలకడానికి ఎంతో మంది నాయకులు రాగా.. తల్లి విజయమ్మ.. భార్య భారతి పక్కన ఉన్నా షర్మిళ మాత్రం జగన్ దీక్ష ప్రారంభించిన తరువాత అసలు రానేలేదు. మరోవైపు జగన్ దీక్షకు షర్మిళ రాకపోవడంపై పార్టీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే షర్మిళ రాకపోవడానికి పలు కారణాలు చెపుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే పార్టీలో రాజేశేఖర్ రెడ్డి తరువాత జగన్.. జగన్ తరువాత షర్మిళ కు  అంత ఆదారణ ఉంది కాబట్టి.. తన చెల్లెలు తనకు పోటీ అవుతుందని.. తనను డామినేట్ చేస్తుందని జగనే షర్మిళను దీక్షకు రావద్దని చెప్పారని అంటున్నారు. మరోవైపు షర్మిళ తెలంగాణలో యాత్రలు చేస్తూ బిజీగా ఉందని కొందరు అనుకుంటున్నారు. మొత్తానికి జగన్ తన చెల్లెలే తనకు పోటీగా వస్తుందని భయపడినట్టున్నారు.. అందుకే దీక్షవైపు షర్మిళ రాకుండా అడ్డుకట్టవేశారు.

ఇప్పుడు ఈ డైలాగ్స్ అవసరమా రోజమ్మా..

ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైకాపా పార్టీ అధినేత జగన్ తలపెట్టిన నిరాహార దీక్షను ఏపీ ప్రభుత్వం ఈ రోజు తెల్లవారుజామున భగ్నం చేసింది. జగన్ దీక్ష తలపెట్టి ఈ రోజుకి ఏడు రోజులు కావడంతో.. అందులోనూ జగన్ దీక్షను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పార్టీ సీనియర్ నాయకులు అంతా కలిసి ఏదో ఒక రకంగా దీక్షను విరమించాలని అనుకున్నారు. కానీ ఈలోగా ప్రభుత్వం చొరవ తీసుకొని దీక్షను భగ్నం చేసింది. అయితే దీక్షను భగ్నం చేసినందుకు పార్టీ నేతలు ఊపిరి పీల్చుకొని..సంతోషపడుతున్నా ఏదో పైపైకి మాత్రం బలవంతంగా దీక్షను విరమింపజేశారు అని మాటలు చెపుతున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.  అయితే అందరి సంగతి ఎలా ఉన్నా ఆపార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజాని మాత్రం రోజా సంతోషం వచ్చినా తిడుతుంది అని అందరూ అనుకుంటున్నారు. జగన్ దీక్షను ప్రభుత్వం విరమించినందుకు గాను చంద్రబాబు అత్యంత అప్రజాస్వామికంగా జగన్ దీక్షను భగ్నం చేశారని.. దీక్ష భగ్నం చేసినంతమాత్రాన తమ పోరాటాన్ని ఆపలేరని హెచ్చరించారు. నిన్న మొన్నటి వరకూ జగన్ చేస్తున్న దీక్షను విమర్శిస్తూ ఇప్పుడు దొంగ దారిన దీక్షను విరమిస్తారా అని తెగ ఫైర్ అవుతుంది. ప్రత్యేక హోదాకోసం టీడీపీ ప్రభుత్వం పై పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు. అయితే రోజా చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు సీరియస్ గా తీసుకోకపోగా.. తమ నాయకుడిని బతికించారన్న సంతోషంలో రోజా ఇలా మాట్లాడుతుందని అనుకుంటున్నారు. ఇంకొంత మందైతే ఇప్పుడు ఈ డైలాగ్స్ అవసరమా అని కూడా అనుకుంటున్నారు.

ఏం పనిలేదా దాని గురించే మాట్లడటానికి.. వెంకయ్య

  కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రతిపక్షాల చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని.. ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లడటం లేదని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విమర్శలకు ధీటుగా వెంకయ్య సమాధానం చెప్పారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంపై కేంద్రంలో చర్చలు జరుగుతున్నాయి.. దీనికి సంబంధించి నీతి అయోగ్ కమిటీ కూడా పర్యవేక్షిస్తుందని అన్నారు. అంతేకాదు అధికారంలో ఉన్నవాడు పనిచేయాలి.. ప్రతిపక్షంలో ఉన్నవాడు మాట్లాడాలని అన్నారు. మేం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ప్రతిరోజూ  ప్రత్యేక హోదా గురించి మాట్లాడడమే పనా? వేరే పనంటూ లేదా? అని వెంకయ్య ప్రశ్నించారు. మాకు మాటల కంటే చేతలే ముఖ్యమని.. వెంకయ్య చెప్పారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని.. ఇందులో భాగంగానే విశాఖకు మెట్రోరైలు, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎన్డీయే చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.

జగన్ కోలుకుంటున్నారు.. ఇంకా 24 గంటలు ఉంచాలి.. జీజీహెచ్

  వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ గుంటూరులో తలపెట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ రోజు ఉదయం ఆయనను కలిసిన పోలీసులు ఆయనతో  మాట్లాడి అనంతరం అంబులెన్స్ల్ లో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించి దీక్షను భగ్నం చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనను చేర్పించి వైద్యం అందిస్తున్నారు. ఈ మేరకు జగన్ ఇంకా 24 గంటలు తమ పర్యవేక్షణలోనే ఉండాలని.. ఫ్లూయిడ్స్ అందిస్తున్నాం.. ఇప్పుడిప్పుడే ఆరోగ్యం కుదుట పడుతుంది.. బిపి 130/80, యూరిక్ యాసిడ్ 13.2గా ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా పోలీసులు జగన్ దీక్షను భగ్నం చేయడంపై పార్టీనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిని నిరసిస్తూ ఏపీలో అన్ని జిల్లాల్లో వైసిపి నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ప్రత్యేక హోదా పై ఎలాంటి ప్రకటన చేయకుండా జగన్ దీక్షను భగ్నం చేయడం సరికాదని.. ప్రత్యేక హోదా పైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కాగా ప్రత్యేక హోదాపై ఎలాంటి భవిష్యత్ కార్యాచరణలు తలపెట్టాలి అనే విషయాన్ని జగన్ కోలుకున్న తరువాత ఆయనను సంప్రదించి ఆతరువాత నిర్ణయం తీసుకోనున్నారు.

టీ సర్కార్ పై మధుయాష్కీ ఫైర్.. కవిత సాయం అంటే కేసీఆర్ విఫలమా?

కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మధు యాష్కీకి ఉన్నట్టుండి ఏమైందో తెలియదు కాని ఒక్కసారిగా తెలంగాణ అధికార పార్టీపై  నిప్పులు చెరిగారు. రాహుల్ టీంతో క్లోజ్ గా ఉంటూ రాజకీయాలు చేసే మధుయాష్కీ రాష్ట్రం విడిపోయిన తరువాత పెద్దగా నోరు విప్పిన దాఖలాలు లేవు. ఎన్నికల్లో ఓడిపోయి.. ఆతరువాత సైలెంట్ ఉంటూ.. కనీసం అధికార పార్టీని కూడా విమర్శించే వారు కాదు. అలాంటిది.. ఇప్పుడు అందరూ తనని మరిచిపోతున్నారు అని అనుకున్నారేమో ఉన్నట్టుంది కేసీఆర్ పార్టీపై దుమ్మెత్తిపోశారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమార్తె.. ఎంపీ కవిత.. మేనల్లుడు హరీశ్.. మంత్రి పోచారం..పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై కేసీఆర్ ఏం పట్టన్నట్టు వ్యవహరిస్తున్నారని.. రైతులు పిట్టల్లా రాలిపోతున్నారని మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ కూతురు జాగృతి సంస్ధ ద్వారా సాయం చేయడానికి ముందుకొచ్చారు.. అంటే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేయలేదని ఒప్పుకుందా అని ప్రశ్నించారు. అంతేకాదు రైతుల ఆత్మహత్యలపై మంత్రి పోచారం కూడా అబద్దాలు ఆడుతున్నారని ఎద్దేవ చేశారు. ఒకపక్క రైతు ఆత్మహత్యలతో వారి భార్యల పసుపుతాళ్లు తెగిపోతుంటే మరోపక్క కవిత బతకమ్మ ఆడుతూ తిరుగుతుందని అన్నారు. అంతేకాదు కవిత లాక్మే షోరూంలు పెట్టుకున్నారు.. మంత్రి హరీశ్ రావు.. ఆంధ్రా వ్యాపారులతో కలిసి టూవీలర్ వెహికిల్స్ బిజినెస్ చేస్తున్నారని విమర్శించారు. మొత్తానికి చాలా రోజులకి నోరు విప్పిన మధుయాష్కీ ఇన్నీ రోజులదంతా ఒకేసారి వెళ్లగక్కినట్టున్నారు.