రామోజీరావుకి చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానం

  అమరావతి శంకుస్థాపనకు రావాలంటూ ‘ఈనాడు‘ సంస్థల అధినేత రామోజీరావును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా ఆహ్వానించారు, రామోజీ ఫిల్మ్ సిటీకి హెలికాప్టర్ లో వెళ్లిన చంద్రబాబుకు  రామోజీరావు స్వాగతం పలికారు, అనంతరం రామోజీరావును పట్టు శాలువాతో సత్కరించిన చంద్రబాబు... రాజధాని శంకుస్థాపన ఆహ్వానపత్రాన్ని అందజేశారు, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుతో రామోజీకి ఉన్న ప్రత్యేక అనుబంధం నేపథ్యంలో ఫిల్మ్ సిటీకి వెళ్లిమరీ ఆహ్వానించడం ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆహ్వానపత్రిక అందజేసిన సమయంలో రామోజీతోపాటు ఆయన సతీమణి రమాదేవి, కుమారుడు కిరణ్, కోడలు శైలజాకిరణ్ ఉన్నారు.

హార్దిక్ పటేల్ పై ఎఫ్ఐఆర్, అరెస్ట్

  పటేళ్లకు కూడా ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలంటూ పెద్దఎత్తున ఉద్యమం చేస్తున్న హార్దిక్ పటేల్ పై గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. రిజర్వేషన్లు కోసం యువకులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, అవసరమైతే పోలీసులను చంపాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో హార్దిక్ పటేల్ పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. హార్దిక్ పటేల్ పై విద్రోహం కింద కేసు నమోదు చేసినట్లు సూరత్ డీసీపీ మార్లండ్ చౌహాన్ తెలిపారు. రాజ్ కోట్ లో జరిగిన భారత్, సౌతాఫ్రికా వన్డే మ్యాచ్ సందర్భంగా హార్దిక్ ను ముందస్తుగా అదుపులోకి తీసుకున్న పోలీసులు... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తపడ్డారు

రేపు సాయంత్రం ‘కళ్లు చిదంబరం‘ అంత్యక్రియలు

  ప్రముఖ సినీనటుడు కళ్లు చిదంబరం కన్నుమూశారు, శ్వాసకోశ సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురై విశాఖ కేర్ ఆస్పత్రిలో చేరిన కళ్లు చిదంబరం... చికిత్స పొందుతూ మరణించారు. సుమారు 300 సినిమాల్లో నటించిన కళ్లు చిదంబరం వయసు 70ఏళ్లు, ఈయన అసలు పేరు కొల్లూరు చిదంబరం, అయితే ‘కళ్లు‘ సినిమాలో తొలిసారి నటించడంతో కళ్లు చిదంబరంగా ప్రాచుర్యం పొందారు. అనేక విజయవంతమైన సినిమాల్లో నటించిన కళ్లు చిదంబరం... విశాఖ పోర్టులో చిన్న ఉద్యోగిగా పనిచేస్తూ... నాటక రంగం నుంచి సినీ పరిశ్రమలోకి వచ్చారు, 1945 అక్టోబర్ 10న విశాఖపట్నంలో జన్మించిన కొల్లూరు చిదంబరం... తన మొదటి సినిమా ‘కళ్లు‘నే ఇంటి పేరుగా మార్చుకుని గుర్తింపు పొందారు, ఆయన నటించిన సినిమాల్లో కళ్లు, అమ్మోరు, పెళ్లిపందిరి, మనీ, చంటి, పవిత్రబంధం, ఆ ఒక్కటీ అడక్కు, గోవిందా గోవిందా, అనగనగా ఒకరోజు, ఏప్రిల్ 1 విడుదల సినిమాలు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి, కళ్లు చిదంబరం అంత్యక్రియలు రేపు సాయంత్రం విశాఖపట్నం శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.

పిలవలేదనే ఫ్రస్ట్రేషన్ లో బొత్స.. అందుకే చంద్రబాబు పై విమర్శలా?

కాంగ్రెస్ పార్టీ నుండి వైకాపాలోకి చేరి చాలా తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న నేత బొత్స సత్యనారాయణ. తన రాజకీయానుభవంతో జగన్ సైతం తన మాట వినేలా.. తన కుడి భుజంలా తయారయారు. అయితే అదే పార్టీలో ఏకులా వచ్చి మేకులా తయారయ్యాడని.. తమనే శాసిస్తున్నాడని మూతి విరుపులు విరిచే వారు ఉన్నారు. అయితే ఇప్పుడు పార్టీలో నేతలను ప్రశ్నించిన మాదిరి ఇప్పుడు సీఎం చంద్రబాబును కూడా ప్రశ్నిస్తున్నారు బొత్సా. ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం అందిచడానికి చంద్రబాబు కేసీఆర్ ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో బొత్స.. చంద్రబాబు కేసీఆర్ కలిసి ఏం మాట్లాడుకున్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. జగన్ తాను శంకుస్థాపనకు రానని.. ఆహ్వనం పంపించవద్దని.. తగు అంశాలతో కూడిన లేఖ రాసిన నేపథ్యంలో.. జగన్ రాసిన లేఖకు సమాధానం చెప్పలేదని.. ఏ ఒక్క అంశానికి సమాధానం ఇవ్వలేదని తప్పుబట్టారు. అంతేకాదు ఏపీ రాజధానికి తాము ఏమాత్రం వ్యతిరేకం కాదు.. కానీ ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమంతో ఏపీని సింగపూర్ కు కట్టబెట్టడంపై వ్యతిరేకిస్తున్నామని మండిపడుతున్నారు. అయితే బొత్స అనవసరంగా ఎందుకు ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా అంటే అసలు విషయం వేరే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదేంటంటే ఏపీ శంకుస్టాపన కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందకపోవడమే కారణమంట. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తనకంటే తక్కవు పదవిలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, రఘువీరా రెడ్డిని కూడా చంద్రబాబు ఆహ్వానించారట. కానీ ఇప్పుడు కీలకమైన పదవిలో లేకపోవడంతో బొత్సను చంద్రబాబు ఆహ్వానించలేదట. అయితే తన పాత పదవి చూసైనా చంద్రబాబు తనని ఆహ్వానిస్తారని చూసినా చంద్రబాబు ఛాన్స్ ఇవ్వలేదు. ఈ ఫ్రస్ట్రేషన్ లో బొత్స చంద్రబాబును విమర్సిస్తున్నారని అనుకుంటున్నారు.

అరవై దాటితే సలహాలే ఇవ్వాలంటున్న జైరాం

  పొలిటికల్ లీడర్స్ రిటైర్మైంట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, 70ఏళ్ల తర్వాత ఎంత గొప్ప నాయకులైనా రాజకీయాల నుంచి రిటైర్ కావాలని, 60 ఏళ్లు దాటితే సలహాలకే పరిమితం కావాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఈ మేరకు మార్పులు జరుగుతున్నాయన్న జైరాం... కొత్త టీమ్ ను ఎంచుకోవడంతో రాహుల్ గాంధీ బిజీగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. రాహుల్ న్యూ టీమ్ ఎంపిక పూర్తికాగానే ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశముందని, వచ్చే మార్చినాటికి ఈ ప్రక్రియ పూర్తికావొచ్చని అన్నారు. రాహుల్ టీమ్ లో యువకులకు ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరముందని, 30 నుంచి 40 ఏళ్ల వయసులోపు వారికే చోటివ్వాలని ఆయన సూచించారు

వరంగల్, నారాయణఖేడ్ టీఆర్ఎస్ అభ్యర్ధులు వీళ్లే

  వరంగల్ పార్లమెంట్, నారాయణఖేడ్ అసెంబ్లీ బైపోల్ అభ్యర్ధులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరంగల్ ను తిరిగి నిలబెట్టుకోవడంతోపాటు నారాయణఖేడ్ ను తమ ఖాతాలో వేసుకోవాలనుకుంటున్న అధికార పార్టీ... ఆ మేరకు పావులు కదుపుతోంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ముమ్మరంగా తిరుగుతూ డెవలప్ మెంట్ కార్యక్రమాలను చేపడుతున్న అధికార పార్టీ నేతలు... ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు, అయితే వరంగల్, నారాయణఖేడ్ అభ్యర్ధులను కేసీఆర్ దాదాపు ఖరారు చేశారని, నారాయణఖేడ్ లో పోటీచేసి ఓడిపోయిన భూపాల్ రెడ్డికే తిరిగి టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. భూపాల్ రెడ్డిపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్పటికీ... ఇటీవల కొత్తగా పార్టీలో చేరినవారికి టికెట్ ఇవ్వరాదని పార్టీ డిసైడైందని అంటున్నారు. అలాగే వరంగల్ పార్లమెంట్ స్థానానికి రవికుమార్, దయాకర్, ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని, అయితే రవికుమార్, దయాకర్ లలో ఎవరో ఒకరిని ఫైనల్ చేయవచ్చని అంటున్నారు.

చంద్రబాబు ఆహ్వానం.. కేసీఆర్ అన్నా.. కేటీఆర్ అంకుల్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య ఉన్న వైరం అందరికి తెలిసిందే. రాష్ట్రం విడిపోక ముందు వీరిద్దరి మధ్య ఉన్న వైరం ఒక ఎత్తైతే.. రాష్ట్రం విడిపోయి ఆతరువాత ఓటుకు నోటు కేసు తర్వాత ముదిరిన వైరం ఒక ఎత్తు. ఈ నేపథ్యంలో ఒకరి మీది ఒకరు ఒక రేంజ్ లో డైలాగులు వేసుకున్నారు. అందులో కేసీఆర్ అయితే మరీ కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా ఏకవచనంతో తిట్టేస్తూ ఉంటారు. అంత కచ్చితంగా.. అంత సూటిగా తిట్టేస్తుంటారు. దీంతో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటుదేమో అన్న పరిస్థితి వచ్చింది. అయితే రాజకీయంగా ఎన్ని గొడవలు ఉన్నా కాని ముఖాముఖి కలిసినప్పుడు మాత్రం రాజకీయ నేతలు బానే ఉంటారు అని చాలా సందర్భాల్లో చూశాం. అయితే ఇక్కడి పరిస్థితి వేరు ఒకవైపు చంద్రబాబు.. మరోవైపు కేసీఆర్.. అందులో వారిద్దరు మధ్య ఉన్న వైరం. అలాంటప్పుడు వాళ్లు కలిస్తే ఎలా ఉంటుంది?.. ఎలా సంభాషించుకుంటారు? అనే అనుమానాలు ప్రతి ఒక్కరికి వస్తాయి. దీనిలో భాగంగానే చంద్రబాబు,కేసీఆర్ ను కలుస్తున్నారు అన్నప్పుడు కూడా అందరికి అలాంటి అనుమానాలే వచ్చాయి. అయితే అనుమానాలన్నింటికి వీరిద్దరూ సమాధానం చెప్పారు. చంద్రబాబు ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ ను ఇంటికి వెళ్లి మరీ పిలుస్తా అని చెప్పిన ప్రకారం నిన్న ఆయన ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా చంద్రబాబును సాదరంగా ఆహ్వానించి పలుసందర్బాల్లో అన్నా అని సంబోధించి అందరిని ఆశ్చర్య పరిచారు. అంతేకాదు ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి తప్పకుండా రావాలని చంద్రబాబు కోరితే.. అన్నా మీరు స్వయంగా వచ్చి ఆహ్వానించారు.. తప్పకుండా వస్తా అని సమాధానమిచ్చారు. అంతేకాదు రాజధాని పర్యటన పక్కా అని  నువ్వు చెబుతావా? లేక నన్ను చెప్పమంటావా? అని సరదాగా చంద్రబాబు కేసీఆర్ ను అడిగితే కేసీఆర్ మీరే చెప్పండన్నా అని సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. చివర్లో కేటీఆర్ ను కూడా ఆహ్వానం అందింది కదా అని అడుగగా కేటీఆర్ కూడా అందింది అంకుల్ అని చెప్పడం గమనార్హం. మొత్తానికి ఎలా కలుస్తారా? ఎలా మాట్లాడుకుంటారా? అని అందరూ ఎదురుచూస్తుండగా వారందరికి ఈ తెలుగు ముఖ్యమంత్రులు షాకిచ్చారు.

ఏపీ కోసం మోడీకి రాహుల్ స్పెషల్ లెటర్

  ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్రమోడీకి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లేఖ రాశారు. రాష్ట్ర విభజన సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, ఆ మేరకు ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని రాహుల్ కోరారు, 2014 ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూడాలని, ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ పై కేంద్రం ప్రకటన చేయాలంటూ ప్రధాని నరేంద్రమోడీకి రాసిన లేఖలో రాహుల్ రిక్వెస్ట్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చింది యూపీఏ ప్రభుత్వమేనని, దాన్ని సాధించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని రాహుల్ అన్నారు.

ఇప్పటికిప్పుడు మిమ్మల్ని రేప్ చేస్తే ఏంచేయగలం.. బీజేపీ నేత ఈశ్వరప్ప

రాజకీయ నాయకులు మహిళల అత్యాచారాలపై అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటైపోయింది. గత కొద్దిరోజుల క్రితమే కర్ణాటకు చెందిన నేత కె.జె జార్జ్ ఇద్దరు కలిసి రేప్ చేస్తే అది గ్యాంగ్ రేప్ కాదని నలుగురైదుగురు కలిసి రేప్ చేస్తేనే దానిని గ్యాంగ్ రేప్ అంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆతరువాత తేరుకొని సారీ చెప్పారు. ఇప్పుడు మళ్లీ తాజాగా మరోనేత  కర్ణాటక మాజీ ఉపముఖ్యమంత్రి, బీజేపీ శాసనసభ ప్రతిపక్ష నేత ఈశ్వరప్ప కూడా అలాంటి వ్యాఖ్యలే చేసి బుక్కయ్యారు. శనివారం అసెంబ్లీ ప్రాంగణంలో ఒక మహిళా జర్నలిస్ట్ ఈశ్వరప్పని మహిళా అత్యాచారాలపై ప్రశ్న అడుగగా.. దానికి ఆయన ఇపుడు మీరు నా ఎదుట నిలబడి ప్రశ్నలడుగుతున్నారు. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఎత్తుకెళ్లి రేప్ చేస్తే ప్రతిపక్షంగా మేమేం చేయగలం అంటూ ఎదురు ప్రశ్నించడంతో ఆ జర్నలిస్ట్ ఒక్కసారిగా ఖంగుతిని అక్కడికక్కడే ఈశ్వరప్పకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర విపక్ష పార్టీలు ఆయనపై మండిపడుతున్నారు. దీంతో ఈశ్వరప్ప సారీ చెబుతూ తను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని వివరణ ఇచ్చారు.

తెలంగాణ సెక్రటేరియట్ లో దొంగలు పడ్డారు

  అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే తెలంగాణ సెక్రటేరియట్ లో చోరీ జరిగింది, సచివాలయం డి బ్లాక్ లోకి ప్రవేశించిన దొంగలు... అక్కడ ఉండే జనరేటర్ బ్యాటరీని ఎత్తుకెళ్లిపోయారు, ఇవాళ జనరేటర్ బ్యాటరీ లేకపోవడాన్ని గుర్తించిన సెక్రటేరియట్ సిబ్బంది... పోలీసులకు సమాచారమివ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే సచివాలయంలో దొంగతనం జరగడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే సెక్రటేరియట్ లో సిబ్బంది సహకారం లేకుండా అసలు లోపలికి ప్రవేశించడమే సాధ్యంకాదని, సచివాలయ సిబ్బంది సహకారంతోనే బయటివాళ్లు లోపలికి వచ్చుంటారని, లేక సిబ్బందిలోనే ఎవరైనా ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు... సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు.

చంద్రబాబు రామోజీని స్వయంగా పిలుస్తారా? పవన్ ను అవమానించినట్లేనా?

  ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలి ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికే శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన పిలుపుల కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ పిలుపుల వ్యవహారం ఏమో కాని దీనివల్ల చంద్రబాబుకు రాజకీయ విభేధాలు తలెత్తుతాయేమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ ను స్వయంగా పిలిచారు చంద్రబాబు అలాగే జగన్ ను కూడా పిలవచ్చు కదా అని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా రామోజీరావుకు ఆహ్వానం అందించే క్రమంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో విభేదాలు తెలెత్తే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి రామోజీరావును చంద్రబాబు స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తారు అనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అలా జరిగితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హర్ట్ అవ్వడం ఖాయం. ఎందుకంటే గత ఎన్నికల్లో బీజేపీ.. టీడీపీ పార్టీలకు మద్దతుగా ఉండి వాళ్ల ప్రచారంలో తోడుండి వాళ్ల గెలువడానికి ఒకింత ముఖ్యభూమికను పోషించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇతి అందరికి తెలిసిన విషయమే.. మరి అలాంటి పవన్ కళ్యాణ్ కు ఏపీ మంత్రుల చేత ఆహ్వానం పంపించి ఇప్పుడు రామోజీరావును కలిసి ఆహ్వానిస్తే చంద్రబాబు కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అందులోనూ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ ఎంటో చంద్రబాబుకు తెలిసిందే. మరి అలాంటప్పుడు చంద్రబాబు రామోజీరావును స్వయంగా ఆహ్వానించి పవన్ తప్పు చేస్తారా అన్న ప్రశ్న. చూద్దాం ఏం జరుగుతుందో.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ భేటీ.. అన్నయ్యతో రాజకీయ విధానాలు వేరు

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం తన అన్న చిరంజీవి ఇంటికి వెళ్లారు. చిరంజీవి తనయుడు హీరో రాంచరణ్ తేజ్ పవన్ కళ్యాణ్ ను ఇంటికి ఆహ్వానించడంతో పవన్ కళ్యాణ్ వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ బ్రూస్లీ సినిమాలో నటించినందుకు గాను చిరంజీవికి అభినందనలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా అన్నయ్య చిరంజీవి, తన విధానాలు వేరైనప్పటికీ సినిమాల పరంగా తనకు అన్నయ్య అంటే తనకు గౌరవం అని.. తాను సినిమాల్లోకి రావడానికి, తనకు జీవితం కారణం చిరంజీవేనని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి వచ్చాక అన్నయ్యను చాలాసార్లు కలిశానని, ప్రత్యేకంగా కలవలేదని చెప్పారు. కాగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమం గురించి మాట్లాడుతూ తనకు శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లాలని ఉందని.. కానీ షూటింగ్ ఉండటం వల్ల చెప్పలేకపోతున్నానని.. శంకుస్థాపనకు వెళ్లేది.. వెళ్లనిది షూటింగ్ పై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

చంద్రబాబుకి సోనియాగాంధీ కృతజ్ఞతలు

ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా ఏపీ మంత్రులు అందరికి ఆహ్వాన పత్రికలు అందిస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖ నేతలకు ఆహ్వానాలు అందజేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చంద్రబాబునాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి చంద్రబాబు సోనియాగాంధీని కూడా ఆహ్వానించారు. దీనికి సోనియాగాంధీ తనను శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించినందుకుగాను చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతు లేఖ రాశారు. అంతేకాదు ఏపీ నూతన రాజధాని అమరావతి పరిఢవిల్లాలని.. ఒక రాష్ట్రానికి రాజధాని నిర్మాణం లాంటి మంచి పని చేస్తున్నందుకు చంద్రబాబుకు అభినందనలు తెలుపుతున్నామని అన్నారు. ఈ అమరావతికి రెండువేల సంవత్సరాలకు ముందు నుండే ఘన చరిత్ర ఉందని.. ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతి అభివృధ్ధి చెందాలని కోరుతున్నానని లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందించి రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా కోరగా కేసీఆర్ తాను తప్పకుండా వస్తానని చెప్పారు. అనంతరం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ నరసింహన్ కు కూడా ఆహ్వానపత్రికను అందజేశారు.

భారత్ లో 9మంది ఐసిస్ కోసం పనిచేస్తున్నారు

  హైదరాబాద్ నగరంలోని టోలి చౌక్ అనే ప్రాంతానికి చెందిన అఫ్శా జబీన్ అనే 38 ఏళ్ళు వయసుగల మహిళ దుబాయిలో ఉంటూ ఐసిస్ ఉగ్రవాదుల ముఠాలో భారత్ యువకులను చేర్పించే ప్రయత్నాలు చేస్తునందున అరెస్ట్ చేసి హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు. ఇంటలిజన్స్ అధికారుల విచారణలో ఆమె భారత్ లో మొత్తం తొమ్మిది మంది యువకులు ఐసిస్ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నట్లు తెలిపింది. వారిలో ఇద్దరు ముంబై, హైదరాబాద్, బెంగళూరు, జమ్మూ కాశ్మీర్ లకు చెందినవారని ఆమె తెలియజేసింది. అయితే ప్రస్తుతం వారివల్ల ఎటువంటి ప్రమాదం లేదని, వారి కదలికలపై నిఘా పెట్టమని ఇంటలిజన్స్ అధికారులు మీడియాకి తెలిపారు.   చాలా కాలంగా దుబాయ్ లో ఉంటున్న అఫ్శా జబీన్ తనను తాను బ్రిటిష్ దేశాస్తురాలిగా చెప్పుకొనేది. ఇంటర్నెట్ ద్వారా ఇస్లాం మతానికి సంబంధించిన మత గ్రంధాలను, వివరాలను సేకరించే ప్రయత్నంలో ఆమెకు హైదరాబాద్ కు చెందిన సలాం మోహినుద్దీన్ అనే కెమికల్ ఇంజనీర్ తో పరిచయం ఏర్పడింది. అక్కడి నుండి ఆమె గమ్యం పక్కదారి పట్టింది. వారిరువురూ కలిసి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో భారత్ యువతీ యువకులను చేర్పించేందుకు సామాజిక వెబ్ సైట్లలో అందుకోసం అనేక గ్రూపులు సృష్టించి యువతను ఆకర్షించడం మొదలుపెట్టారు. వారిరువురూ ఇంకా ఎంతమందిని ప్రభావిద్తం చేసారో తెలియదు కానీ ప్రస్తుతం తొమ్మిది మంది ఐసిస్ ఉగ్రవాదుల మద్దతుదారులు భారత్ లో తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు అఫ్శా జబీన్ ఇంటలిజన్స్ అధికారులకి తెలియజేసారు.

నోయిడాలో నల్గొండ విద్యార్ధి దారుణ హత్య.. కాల్పులు జరిపి నరికి చంపారు

నల్గొండజిల్లాకు చెందిన విద్యార్ధి ఉత్తరప్రదేశ్ లో దారుణ హత్యకు గురయ్యాడు. అతని స్నేహితులే ఇంతటి ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం నల్గొండ  జిల్లా శ్రీనగర్ కాలనీకి చెందిన సందేశ్ అనే వ్యక్తి నోయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయంలో  బీఎస్సీ (మెరైన్ సైన్స్) కోర్సు చేస్తున్నాడు. అయితే సందేశ్ మొదటి సంవత్సరం కాలేజ్ హాస్టల్లో ఉండి చదువుకోగా.. రెండవ సంవత్సరం ప్లాట్ అద్దెక్ తీసుకొని అందులో ఉంటున్నాడు. ఈనేపథ్యంలో అదే యూనివర్సిటీలో చదువుతున్న అమన్, అతని స్నేహితుడు మౌంటీ సందేశ్ నివాసముంటున్న ఫ్లాట్ వద్దకు వచ్చి అతనిపై నేరుగా కాల్పులు జరిపి.. ఆతరువాత గొడ్డలితో నరికారు. అయితే సందేశ్ రూంలో ఉన్న అతని స్నేహితుడు నదీమ్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకోగా.. నదీమ్ జరిగిందంతా పోలీసులకు వివరించగా కేసు నమోదు చేసుకున్నారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలిసిరాలేదు. కాగా సందేశ్ మరణవార్తను పోలీసులు అతని తండ్రికి చేరవేయడంతో అతను వెంటనే నోయిడాకు చేరుకొన్నాడు. ఆదివారం పోస్టుమార్టం పూర్తిఅయిన అనంతరం మృతదేహాన్ని విమానంలో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.

పవన్ కళ్యాణ్ న్ని అలయ్ బలయ్ కార్యక్రమానికి దత్తన్న ఆహ్వానం

  బీజేపీ సీనియర్ నేత మరియు కేంద్ర మంత్రి అయిన బండారు దత్తాత్రేయ చాలా ఏళ్లుగా దసరా పండుగ సందర్భంగా అలయ్ బలయ్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతీ ఏటా నిర్వహించే ఆ కార్యక్రమానికి అన్ని పార్టీలకి చెందిన రాజకీయ నాయకులను ఆహ్వానిస్తుంటారు. ఈసారి విశేషం ఏమిటంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ న్ని కూడా ఆయన ఆ అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆహ్వానించారు. నిన్న ఆయన బీజేపీ ఎమ్మెల్యే డా. లక్ష్మణ్ తో కలిసి రామానాయుడు స్టుడియోలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా షూటింగులో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ న్ని కలిసి ఆహ్వానించారు. వీలు కుదిరితే తప్పకుండా వస్తానని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు సమాచారం.

నడిఘర్ సంఘం ఎన్నికలలో హీరో విశాల్ ప్యానల్ విజయం

  తమిళ సినీ పరిశ్రమకి చెందిన నటీనటుల నడిఘర్ సంఘానికి నిన్న జరిగిన ఎన్నికలలో ఊహించని విధంగా హీరో విశాల్ ప్యానల్ విజయం సాధించింది. గత పదేళ్లుగా నడిఘర్ సంఘం తమిళ హీరో శరత్ కుమార్ ప్యానల్ చేతిలోనే ఉంది. ఈసారి కూడా పోటీ ఉండదని అందరూ భావించారు కానీ హీరో విశాల్ బరిలోకి దిగడంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. సాధారణ ఎన్నికలకి ఏమాత్రం తీసిపోని విధంగా ఇరు వర్గాలు ఒకరిపై మరొకటి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకొన్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆశీస్సులు శరత్ కుమార్ ప్యానల్ కే ఉన్నట్లు ప్రచారం జరుగడంతో ఆయనే ఈ ఎన్నికలలో మళ్ళీ గెలుస్తారని అందరూ అనుకొన్నారు. కానీ ఊహించని విధంగా హీరో విశాల్ ప్యానల్ 107 ఓట్లు తేడాతో శరత్ కుమార్ ప్యానల్ పై విజయం సాధించారు. విశాల్ ప్యానల్ కి 1,445, శరత్ కుమార్ ప్యానల్ కి 1,138 ఓట్లు లభించాయి.   విశాల్ ప్యానల్ తరపున పోటీ చేసిన ప్రముఖ నటుడు నాజర్ నడిగర్ సంఘానికి అధ్యక్షుడుగా, విశాల్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అయితే ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే నిన్న ఉదయం ఎన్నికలు మొదలయినప్పటి నుండి హీరో శరత్ కుమార్ ప్యానలే పూర్తి ఆధిక్యత కనబరిచింది కానీ మధ్యాహ్నం నుండి క్రమంగా హీరో విశాల్ ప్యానల్ ఆధిక్యతలోకి వచ్చి చివరికి విజయం సాధించింది. విశాల్ ప్యానల్ తరపున కోశాధికారి పదవికి పోటీ చేసిన హీరో కార్తిక్ 413 ఓట్ల తేడాతో తన ప్రత్యర్ధి కన్నన్ పై విజయం సాధించారు. కార్తిక్ కి 1,493 ఓట్లు లభించగా కన్నన్ కి 1,080 ఓట్లు దక్కాయి. నడిగర్ సంఘంలో మొత్తం 3139మంది సభ్యులు ఉండగా వారిలో 83శాతం అంటే 2605 మంది వచ్చి ఓటింగులో పాల్గొన్నారు.   ఎన్నికలు ఫలితాలు వెలువడిన తరువాత శరత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, “పూర్తి ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఈ ఎన్నికలలో విజయం సాధించిన విశాల్ ప్యానల్ సభ్యులందరికీ మనస్పూర్తిగా మా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికల సమయంలో కనబడిన విభేదాలను ఇంతటితో మరిచిపోయి అందరూ మన సినీ పరిశ్రమ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి. అందుకు మా సలహాలు కోరితే తప్పకుండా ఇస్తాము. విశాల్ మరియు ఆయన బృందానికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను,” అని అన్నారు.

ఏపీస్ ఆర్టీసీ త్వరలో ప్రభుత్వంలో విలీనం?

  ఏపీస్ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరిక త్వరలో తీరబోతోంది. నిన్న విజయనగరంలో జరిగిన ఆర్టీసీ కార్మికుల సమావేశంలో పాల్గొన్న మంత్రి పీతల సుజాత కార్మికులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సంబంధిత అధికారులు అవసరమయిన చర్యలు మొదలుపెట్టారని చెప్పారు. అదే విధంగా ఆర్టీసి కార్మికుల సంక్షేమం కోసం సంస్థ చేపడుతున్న పలుచర్యలను ఆమె వివరించారు. అనంతరం మాట్లాడిన ఆర్టీసీ మేనేజిన్ డైరెక్టర్ నండూరి సాంభశివరావు, రాష్ట్రంలో 13జిల్లాలలోను ఆర్టీసీ బస్ స్టేషన్లను ఆదినీకరించే ప్రక్రియ కూడా మొదలుపెట్టమని, ఆర్టీసీ నష్టాలను తగ్గించుకొనేందుకు కూడా అనేక చర్యలు చేపదుతున్నామని తెలిపారు. ఒకవేళ మంత్రి చెపుతున్నట్లుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్లయితే దానికి కూడా బడ్జెట్ లో కేటాయింపులు జరుగుతుంటాయి కనుక సంస్థ నష్టాల్లో నుండి బయటపడే అవకాశం ఉంటుంది.

కేసీఆర్ ని ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం బేగంపేటలో ఉన్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి అమరావతి ఆహ్వాన పత్రం అందజేసి కుటుంబ సమేతంగా అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి రావలసిందిగా ఆహ్వానించారు.చంద్రబాబు నాయుడుతో బాటు తెలంగాణా తెదేపా అధ్యక్షుడు యల్. రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు కేసీఆర్ క్యాంప్ కార్యాలయానికి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు అక్కడే ఉన్న తెలంగాణా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు కె. తారక రామారావు, జగదీశ్ రెడ్డికి కూడా ఆహ్వానపత్రాలు అందజేసి అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి రావలసిందిగా వారిని కూడా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి  తను తప్పకుండా వస్తానని కేసీఆర్ చెప్పారు. అనంతరం చంద్రబాబు నాయుడుని కేసీఆర్ కి అమరావతి అభివృద్ధి ప్రణాళిక ఇతర విశేషాల గురించి వివరించారు. వారిరువురూ సుమారు గంటసేపు అనేక విషయాల గురించి మాట్లాడుకొన్నారు. మళ్ళీ 8 నెలల తరువాత వారిరువురూ ఈవిధంగా కలిసి కూర్చొని చాలాసేపు మాట్లాడుకోవడం చూసి అందరూ చాలా సంతోషిస్తున్నారు.