నడిఘర్ సంఘం ఎన్నికలలో హీరో విశాల్ ప్యానల్ విజయం
తమిళ సినీ పరిశ్రమకి చెందిన నటీనటుల నడిఘర్ సంఘానికి నిన్న జరిగిన ఎన్నికలలో ఊహించని విధంగా హీరో విశాల్ ప్యానల్ విజయం సాధించింది. గత పదేళ్లుగా నడిఘర్ సంఘం తమిళ హీరో శరత్ కుమార్ ప్యానల్ చేతిలోనే ఉంది. ఈసారి కూడా పోటీ ఉండదని అందరూ భావించారు కానీ హీరో విశాల్ బరిలోకి దిగడంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. సాధారణ ఎన్నికలకి ఏమాత్రం తీసిపోని విధంగా ఇరు వర్గాలు ఒకరిపై మరొకటి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకొన్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆశీస్సులు శరత్ కుమార్ ప్యానల్ కే ఉన్నట్లు ప్రచారం జరుగడంతో ఆయనే ఈ ఎన్నికలలో మళ్ళీ గెలుస్తారని అందరూ అనుకొన్నారు. కానీ ఊహించని విధంగా హీరో విశాల్ ప్యానల్ 107 ఓట్లు తేడాతో శరత్ కుమార్ ప్యానల్ పై విజయం సాధించారు. విశాల్ ప్యానల్ కి 1,445, శరత్ కుమార్ ప్యానల్ కి 1,138 ఓట్లు లభించాయి.
విశాల్ ప్యానల్ తరపున పోటీ చేసిన ప్రముఖ నటుడు నాజర్ నడిగర్ సంఘానికి అధ్యక్షుడుగా, విశాల్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అయితే ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే నిన్న ఉదయం ఎన్నికలు మొదలయినప్పటి నుండి హీరో శరత్ కుమార్ ప్యానలే పూర్తి ఆధిక్యత కనబరిచింది కానీ మధ్యాహ్నం నుండి క్రమంగా హీరో విశాల్ ప్యానల్ ఆధిక్యతలోకి వచ్చి చివరికి విజయం సాధించింది. విశాల్ ప్యానల్ తరపున కోశాధికారి పదవికి పోటీ చేసిన హీరో కార్తిక్ 413 ఓట్ల తేడాతో తన ప్రత్యర్ధి కన్నన్ పై విజయం సాధించారు. కార్తిక్ కి 1,493 ఓట్లు లభించగా కన్నన్ కి 1,080 ఓట్లు దక్కాయి. నడిగర్ సంఘంలో మొత్తం 3139మంది సభ్యులు ఉండగా వారిలో 83శాతం అంటే 2605 మంది వచ్చి ఓటింగులో పాల్గొన్నారు.
ఎన్నికలు ఫలితాలు వెలువడిన తరువాత శరత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, “పూర్తి ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఈ ఎన్నికలలో విజయం సాధించిన విశాల్ ప్యానల్ సభ్యులందరికీ మనస్పూర్తిగా మా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికల సమయంలో కనబడిన విభేదాలను ఇంతటితో మరిచిపోయి అందరూ మన సినీ పరిశ్రమ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి. అందుకు మా సలహాలు కోరితే తప్పకుండా ఇస్తాము. విశాల్ మరియు ఆయన బృందానికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను,” అని అన్నారు.