మాల్దా ఘటన.. రాష్ట్రపతితో బీజేపీ నేతలు..

పశ్చిమ బెంగాల్ లోని మాల్దా ఘటనపై చర్చించేందుకు బీజేపీ నేతలు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో సమావేశం కానున్నట్టు తెలస్తోంది. మాల్దాలో స్థానిక పోలీస్ స్టేషన్లో అల్లరి మూకలు దాడి చేసి దానికి నిప్పంటించిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ నేతలు నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి నిజ నిజాలు తెలుసుకోవడానికి మల్దా వెళ్లగా అక్కడ వారిని రైల్వే స్టేషన్ నుండే వెనక్కి పంపించేశారు. కాగా ఇప్పుడు ఈ విషయంపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో చర్చించి ఆ సంఘటనకు సంబంధించిన నివేదిక తెప్పించుకోవాలని బిజెపి బృందం రాష్ట్రపతిని కోరనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రపతిని కలిసే వారిలో సిద్ధార్థ్‌నాథ్‌, సంత్‌ కైలాశ్‌, విజయ్‌వార్ఘి ఉన్నారు.

పఠాన్ కోట్ ఉగ్రదాడి.. గృహనిర్బంధ కస్టడీలో మౌలానా మసూద్ అజహర్..?

పఠాన్ కోట్ లో ఉగ్రవాదుల దాడికి సూత్రధారి అయిన జైష్-ఏ-మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ ను గృహనిర్బంధ కస్టడీలో ఉన్నాడని పాకిస్థాన్ వెల్లడించింది. పంబాజ్ లోని పఠాన్ కోట్ విమాన స్థావరంపై దాడి చేసిన ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని భారత్ చెప్పిన నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అందుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పాకిస్థాన్ బృందం అజహర్ గృహనిర్బంధ కస్టడీలో ఉన్నాడని చెప్పింది. కానీ పాక్ న్యాయశాఖ మంత్రి సనావుల్లా మాత్రం మౌలానా మసూద్ అజహర్ ను అరెస్టు చెయ్యలేదని చెప్పారు. అంతేకాదు భారత్ లోని పఠాన్ కోట్ దాడులకు భాద్యులెవరు అని కచ్చితంగా తెలియకుండా మౌలానా మసూద్ అజహర్ ను ఎలా అరెస్టు చేస్తామని న్యాయశాఖ మంత్రి సనావుల్లా ప్రశ్నించారు. ఈ ఘటనపై పాకిస్థాన్ దర్యాప్తు చేపట్టిందని, సాక్షాధారాల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.

భారత్ పాక్ చర్చలు వాయిదా.. భవిష్యత్తులో ప్రారంభించాలని నిర్ణయం.. వికాస్‌ స్వరూప్‌

పంజాబ్ పఠాన్ కోట్ విమాన స్థావరంపై ఉగ్రవాదులు దాడి జరపడంతో పాక్-భారత్ మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక చర్చలు కాస్త వాయిదా పడ్డాయి. అసలు ఉగ్రవాదుల దాడి వలన చర్చలు జరుగుతాయో.. లేదో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు ఉగ్రవాదుల పై చర్యలు తీసుకుంటేనే కాని చర్చలు ఉండవని భారత్ తేల్చిచెప్పేసింది. దీనికి పాకిస్థాన్ కూడా స్పందించి.. ఉగ్రవాదులుపై చర్యలు తీసుకోవడానికి ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో పాక్-భారత్ చర్చలు త్వరలో జరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది. పాకిస్తాన్‌తో జరగాల్సిన విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి సమావేశం వాయిదా పడిందని.. ఇరుదేశాల పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు ఫోన్‌లో మాట్లాడుకొని సంభాషణలను సమీప భవిష్యత్తులో ప్రారంభించాలని నిర్ణయించినట్టు విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ తెలిపారు.

ఏపీకి ఒక్కరోజులో 15 లక్షల మంది..

సంక్రాంతి పండుగ సీమాంధ్రులకు ఎంతపెద్ద పండుగో అందరికి తెలిసిందే. అయితే ఈ పండుగ సందర్భంగా ఏపీకి ఎంతమంది వెళ్లారు అన్న లెక్క ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్ నుండి ఎంతమంది ఏపీ వారు వెళ్లారో చూస్తే షాకవ్వాల్సిందే. సంక్రాంతి సందర్భంగా వివిధ ప్రాంతాలనుండి దాదాపు 20 నుండి 25 లక్షల మంది ఏపీకి వెళ్లగా అందులో దాదాపు 15 లక్షల మంది ఒక్క హైదరాబాద్ నుంచే ఆంధ్రాకు వెళ్లినట్లుగా లెక్క వేస్తున్నారు. రైలు.. బస్సు ప్రయాణాల లెక్కను ప్రాతిపదికగా తీసుకుంటే ఈ సంఖ్యను చెప్పొచ్చు. కాగా ఊర్లకి వెళ్లిన వారందరూ ఒకేరోజు తిరిగి రానున్న పరిస్థితి. దీంతో.. తిరుగు ప్రయాణం పెద్ద ఇబ్బందిగా మారింది. ఒకేరోజు 15 లక్షల మంది తిరిగి రానుండటంతో ట్రాఫిక్ మరీ ఎక్కువగా మారే పరిస్థితి ఏర్పడింది.

జీహెచ్ఎంసీ.. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితాను విడుదల

గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా  డివిజన్ల వారీగా అభ్యర్థుల విషయంలో తెలంగాణ అధికారపక్షం నిన్న రెండు జాబిజాలు విడుదల చేసింది. టీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు అభ్యర్దులు జాబితాను విడుదల చేశారు.  గ్రేటర్లో మొత్తం 150 డివిజన్లకుగాను టీఆర్ఎస్ పార్టీ ముందుగా 60 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. అనంతరం మరో 20 మందితో ఇంకో జాబితాను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన వారికే స్థానం దక్కిందని.. ఈ ఎన్నికల్లో మహిళలకు పెద్ద పీట వేసినట్లుగా పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి 45 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మొత్తానికి ఒక్కరోజులో 80 మంది అభ్యర్దుల జాబితా విడుదల చేసిన టీఆర్ఎస్ పార్టీలో తమ పార్టీ గెలుపుపై వారికి గట్టి నమ్మకం ఉన్నట్టు తెలుస్తోంది.

అగ్రిగోల్డ్ మరో కుంభకోణం..

అగ్రిగోల్డ్ కుంభకోణంలో దాదాపు 40 లక్షల మంది నష్టపోయిన సంగతి తెలిసింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే హైకోర్టులో వాదనలు జరగడం.. హైకోర్టు అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసేందుకు కమిటీని ఏర్పాటు చేయడం.. ఈ కమిటీ ప్రకారం ఆస్తులను వేలం వేసేందుకు పలు కంపెనీలకు ఆ భాద్యతను అప్పగించడం జరిగింది. అయితే ఇప్పుడు అగ్రిగోల్డ్ సంస్థలో మరో కుంభకోణం వెలుగు చూసింది. అగ్రిగోల్డ్ సంస్థ అగ్రిగోల్డ్ పరివార్ మ్యూచువల్ కో-ఆపరేటివ్ సొసైటీ పేరుతో రూ.వందల కోట్లు వసూలు చేసి.. ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తామంటూ డిపాజిట్లు సేకరించింది. దీంతో ఖాతాదారులు ఫిర్యాదు చేయగా  డివిజనల్ కో-ఆపరేటివ్ అధికారి ...అగ్రిగోల్డ్ సంస్థకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ నెల 19న విచారణ జరగనుంది.

గెలిచిన ఫీలింగ్ అప్పుడే వచ్చేసింది.. కేటీఆర్

గ్రేటర్ ఎన్నికల్లో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇప్పటికే మాటలతో అందరూ షాకయ్యేలా చేస్తున్నాడు. 150 డివిజన్లలో 100 డివిజన్లలో గెలుపు తమదేనని.. ఈ ఎన్నికల్లో ఓడిపోతే తాను మంత్రి పదవి నుండి తప్పుకుంటానని.. కూడా సవాల్ విసిరారు. ఇప్పుడు విజయం తమదేనని చెప్పడమే కాదు.. ఆ ఫీలింగ్ ఇప్పుడే వచ్చేసిందంటూ అందరిని ఆశ్చర్యపరచారు. అయితే దీనికి కారణం గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు.. కార్యకర్తలు భారీగా చేరుతుండటమేనని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీంతో.. ఈ సందడి చూస్తుంటే.. పార్టీ గెలవటం పక్కా అని.. ఇప్పటికే తాము చేపట్టిన సర్వేలన్నీ ఆ విషయాల్ని స్పష్టం చేస్తున్నాయని వెల్లడించారు. మరి కేటీఆర్ ఇంత ధీమా వ్యక్తం చేస్తున్నారంటే.. నిజంగా పార్టీ గెలుస్తుందనా.. లేక మెండ్ గేమ్ ఆడుతున్నారా అని అందరి డౌట్..

చంద్రబాబుపైనే రాయపాటి విమర్శలు.. దొబ్బేయమన్నారు..

ఈ మధ్య రాయపాటి సాంబశివరావు ఏదో ఒక వివాదాస్పద  వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈమధ్య రైల్వే జోన్ విషయంలో.. మళ్లీ సీపీఐ విషయంలో ఇప్పుడు ఊహించని రీతిలో టీడీపీ అధినేత చంద్రబాబు మీదే సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి వచ్చారు. రాయపాటి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ పల్నాడులోని మాచర్ల.. వినుకొండ.. గురజాల గ్రామాల నీటి సమస్యను తీర్చేందుకు వీలుగా రూ.1120కోట్లతో వాటర్ గ్రిడ్ ఏర్పాటుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు వెళితే నిధులు లేవన్నారన్నారు అని వ్యాఖ్యానించారు. అంతేకాదు కేంద్రం గురించి కూడా మాట్లాడుతూ ఆయన.. కేంద్రంతో గట్టిగా మాట్లాడితే దొబ్బేస్తున్నారంటూ వ్యాఖ్యానించి అందరిని ఆశ్చర్యపరిచారు. అక్కడితో ఆగకుండా ఇంకా చంద్రబాబు పై పలు ఆరోపణలు చేశారు. బ్యాంకు రుణాల కోసం ప్రయత్నిస్తే.. బ్యాంకోళ్లు 9.6శాతం వడ్డీకి అప్పు ఇస్తామంటే.. చంద్రబాబు మాత్రం 8.5శాతం అయితేనే ఓకే అంటున్నారని..గుంటూరు రైల్వే జోన్ కోసం ఒత్తిడి చేద్దామంటే కోప్పడుతున్నారని..  సీపీఐ నేతలకు భోజనాలు పెడితే.. ఎందుకు పెట్టావని చంద్రబాబు ప్రశ్నించారని.. తాను పార్టీలో ఇమడలేకపోతున్నానని.. తనను అడవుల్లోకి (పల్నాడు) తీసుకొచ్చి పడేశారని ఆరోపించారు. అయితే ఇంతా చెప్పిన రాయపాటి లాస్ట్ లో ఇదంతా ఆఫ్ ద రికార్డ్ అంటూ చెప్పడం కొసమెరుపు. మరి చెప్పాల్సిందంతా ఓపెన్ గా చెప్పేసి ఇప్పుడు ఆఫ్ ద రికార్డ్ అంటూ రాయపాటి చెప్పిన విషయమంతా బయటకు వచ్చేసింది. మరి రాయపాటి వ్యాఖ్యలకు చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

కేసీఆర్, చంద్రబాబు ఫ్రెండ్ షిప్ పై దిగ్విజయ్ సింగ్..

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలు నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రచారానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సభలో ప్రసంగించిన చంద్రబాబు కేసీఆర్ ను పల్లెత్తు మాట కూడా అనలేదు. ఇక మిగిలిన నేతలు తమదైన శైలిలో కేసీఆర్ పై మండిపడ్డారు. అయితే ఇప్పుడు దీనిపై ఎఐసిసి ప్రధాన కార్యదర్సి దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. గురువారం హైదరాబాద్ వచ్చిన ఆయన కేసీఆర్ చంద్రబాబు గురించి మాట్లాడుతూ బద్దశత్రువులైన కెసిఆర్, చంద్రబాబు మిత్రులుగా మారడానికి వెనక గల కారణమేమిటని ప్రశ్నించారు. నోటుకు ఓటు కేసు వెలుగు చూసినప్పుడు ఇరువురు ముఖ్యమంత్రులు కోడి పుంజుల్లా కలబడ్డారని, ఇప్పుడు మిత్రులుగా మారి పరస్పరం అభినందించుకుంటున్నారని, కేసులను మాత్రం గాలికి వదిలేశారని ఆయన అన్నారు.

నాయిని ఓపెన్ వార్నింగ్..

  రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఓ అధికారికి ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా కంటోన్మెంట్ పరిధిలోని కార్ఖానాలోని మూడో వార్డులో  పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో నాయిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీఈవో సుజాతా గుప్తాకు వార్నింగ్ ఇచ్చారు.  ప్రజలను బోర్డు సభ్యులను వేధించటం మానుకోవాలని.. జాగ్రత్తగా మసలుకోవాలని.. లేదంటే ఢిల్లీకి వెళ్లిపోవాలంటూ ఓపెన్ గా హెచ్చరించారు. దీంతో సుజాతా గుప్తాకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. మరోవైపు నాయిని వార్నింగ్ పై పలువురు పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నాయిని వార్నింగ్ ఇవ్వాలంటే వ్యక్తిగతంగా ఇవ్వాలి లేకపోతే.. చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలే కానీ ఇలా అందరిముందు వార్నింగ్ ఇవ్వడం ఏంటంని అంటున్నారు.

మోడీ పై కేటీఆర్ ఫైర్.. ఏనాడైనా తెలంగాణ ప్రజలకు ముఖం చూపించారా..

తెలంగాణ మంత్రి కేటీఆర్ మోడీపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు బంగారు ప్రకాశ్, సామ సుందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 18 నెలలు అయింది.. ఈ 18 నెలల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఇతర ప్రాంతాల వారిపై ఈగ కూడా వాలకుండా శాంతిభద్రతలను పరిరక్షించామని అన్నారు. అంతేకాదు టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక ఒక్కరికీ మేలు జరిగిందని..  పేదల పక్షాన నిలవాలనే ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్ వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు ప్రవేశపెట్టారని తెలిపారు. ఇక ప్రధాని మోడీ గురించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఇంత కాలం అయినా మోడీ ఇంతవరకూ ఇక్కడ అడుగు పెట్టారా.. ఏనాడైనా తెలంగాణ ప్రజలకు ముఖం చూపించారా? అని ప్రశ్నించారు. అసలు ప్రధాని మోడీ హైదరాబాద్‌కు ఏం చేశారో చెప్పాలని బీజేపీ నేతలను డిమాండ్ చేశారు.

రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేసేందుకు నగ్మా ప్రయత్నాలు..

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నగ్మా రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయడానికి బానే కష్టపడుతున్నట్టు ఉంది. తమిళనాడులో పార్టీ వ్యవహారాలు చూస్తున్న నగ్మా తాజాగా తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే అలానే ఉన్నాయని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. ఇంతకీ నగ్మా తీసుకుంటున్న నిర్ణయం ఏంటంటే..  కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల సంస్కృతికి కళ్లెం వేయాలని. మహిళా కాంగ్రెస్ లో గ్రూపులకు ఆస్కారం లేకుండా పనిచేయాలని ఈనేపథ్యంలోనే మహిళా నేతలకు ఆదేశాలు జారీ చేశారంట. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించినా మహిళా విభాగంలో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేసినా రాహుల్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరిస్తున్నారు. కాగా తమిళనాడులో కాంగ్రెస్ పార్టీలో విజయధరణి అధ్యక్ష పగ్గాలు చేపట్టినానంతరం మహిళా రాజకీయాల్లో మరింత వేడెక్కింది. విజయధరణి ఏకంగా టీఎన్సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ను ఢీకొట్టడంతో వివాదం ముదిరింది. ఈ వివాదం కాస్త అధిష్టానంకి చేరడంతో ఇక మహిళా విభాగం రాష్ర్ట ఇన్చార్జ్ జాతీయ ప్రధాన కార్యదర్శి నగ్మా రంగంలోకి దిగారు. మహిళా నాయకుల్ని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి తామంతా ఒక్కటే అని చాటేందుకు తీవ్ర కుస్తీల్లో పడ్డారు.

జకార్తా ఉగ్రదాడి.. ఆరుగురు మృతి

ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఉగ్రవాదులు దాడి చేశారు. మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఆరు సార్లు పేలుళ్లు జరిపి దాడి చేశారు. ఈ ఉగ్రవాదుల దాడిలో ఇప్పటి వరకూ ఆరుగురు మృతిచెందగా.. పలువురికి గాయాలపాలయ్యాయి. అంతేకాదు ముగ్గురు పోలీసులు కూడా మృతి చెందారు. దీనిపై ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో స్పందించి.. ఇది ఉగ్రవాదుల పనేనని.. ఈ పని చేసిన వారిని వదిలిపెట్టమని అన్నారు. మరోవైపు దుండగులకు ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్‌తో సంబంధాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. పలువురు ఉగ్రవాదులు నగరంలోని ఓ థియేటర్ కాంప్లెక్స్‌లో దాక్కున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.