లీవ్‌పై వెళ్లిన హెచ్‌సియు వీసీ అప్పారావు
వేముల రోహిత్ ఆత్మహత్య, ఎన్ని పరిణామాలకు దారితీసిందో తెలిసిందే..తాజాగా, యూనివర్సిటీ వీసీ అప్పారావు లీవ్ పై వెళ్లడం మరింత వివాదాస్పదంగా మారింది..వర్సిటీలో వాతావరణం వేడిగా ఉన్న ఇలాంటి సమయంలో, అప్పారావు లీవ్ పెట్టడం పై విద్యార్ధులు మండిపడుతున్నారు..లీవ్ పై వెళుతూ ఇన్ ఛార్జ్ వీసీగా ప్రొఫెసర్ విపిన్ శ్రీవాత్సవ్ ను నియమించారు.దీక్ష చేస్తున్న విద్యార్థులు ఎంత చెప్పినా వెనక్కి తగ్గడం లేదని, తనపై ఆరోపణలు వస్తున్నాయని భావించిన వీసీ తాత్కాలికంగా ఈ ఘటన నుంచి తప్పుకునేందుకు లీవ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇన్ ఛార్జ్ వీసీగా విపిన్ శ్రీవాత్సవ్ ను నియమించడాన్ని కూడా విద్యార్థి సంఘాలు తప్పుబడుతున్నాయి. గతంలోనూ ఓ విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి ఆయనపై అభియోగాలున్నాయి.
ప్రస్తుతం రోహిత్ అతడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థులు దీక్ష చేస్తున్నారు. తమ ఉద్యమానికి విలువ లేకుండా చేస్తున్నారనేది విద్యార్ధుల ఆరోపణ. అసలే తమ కడుపు మండిపోతుంటే, మళ్లీ మరోసారి మంట పెట్టిన చర్యగా శ్రీవాత్సవ్ నియామకాన్ని విద్యార్థులు అభివర్ణించారు. ఎంతో మంది సీనియర్ ప్రొఫెసర్స్ ఉండగా కేవలం శ్రీవాత్సవ్ నే ఇన్ ఛార్జ్ వీసీగా ఎందుకు నియమించారని ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు.తమిళనాడు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి రేపు మరికొంతమంది విద్యార్థులు వస్తున్నారని,ఈ ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని విద్యార్ధులు చెబుతున్నారు..