"కాపు ఐక్య గర్జన" కాక.. చంద్రబాబు ఫైర్
ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు ఐక్య గర్జన ఉద్యమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పద్మనాభం ఆందోళనకారులకు రైలు, రాస్తారోకోలు పిలుపు నివ్వడంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రత్నాచల్ అనే రైలును కూడా ఆందోళన కారులు తగలబెట్టారు. అంతేకాదు పలు పోలీసులు వాహనాలు కూడా దగ్గమయ్యాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. మరోవైపు ఈ రోజు కూడా పద్మనాభం 3 గంటలకు ముద్రగడ పద్మనాభం కీలక సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రంలోగా కాపులను బీసీల్లో చేరుస్తూ జీవో జారీ చేయాలని లేకపోతే ఆమరణ దీక్షకు దిగుతానని కూడా ఆయన ప్రకటించారు.
ఇదిలా ఉండగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలు ముందుగా జరుగతాయని ఊహించడంలో నిఘా వర్గాలు వైఫల్యం చెందాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిఘా వర్గాలతో పాటు పోలీసులు, మీడియా సైతం కుట్ర జరుగుతోందని అంచనా వేయలేకపోయాయని బాబు అభిప్రాయపడ్డారు. సామాజిక శ్రేయస్సు కోసం తాము ఆలోచిస్తుంటే, కేవలం ఆరేడు వాహనాల్లో వచ్చిన వారు హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. వీళ్లపై పోలీసు చర్యలే ఏకైక మార్గమని అధికారులతో వ్యాఖ్యానించిన చంద్రబాబు, కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగానే ఆధారాల కోసం వీడియో ఫుటేజ్ లను కూడా పరీక్షించనున్నారు.