దళిత విద్యార్ది ఆత్మహత్య.. కేంద్రమంత్రి పై కేసు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో వి. రోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు నగరానికి చెందిన రోహిత్ హెచ్‌సియూలో సైన్స్ అండ్ టెక్నాలజీలో పీహెచ్‌డీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే కొద్ది రోజుల క్రిందట విద్యార్థి సంఘాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో ఏబీవీపీ విద్యార్థిపై దాడి చేశారన్న సాకుతో రోహిత్ ను అతనితో పాటు నలుగురు విద్యార్ధులను యూనివర్శిటీ బహిష్కరించింది. దీంతో ఐదుగురు దళిత విద్యార్థులపై బహిష్కరణ ఎత్తివేయాలని కోరుతూ 15రోజులుగా వర్సిటీ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఇంతలో సడెన్ గా నిన్న సాయంత్రం ఎన్‌ఆర్‌ఎస్ వసతి గృహంలో రోహిత్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతేకాదు ఒక సూసైడ్ నోటును కూడా రాసిపెట్టాడు. అందులో "ఈ యూనివర్సిటీలో మనిషిని మనిషిగా చూడటం లేదు. నాపుట్టుకను చూస్తున్నారు. కులం పేరుతో ఇంకా ఏన్నాళ్లు చూస్తారు.. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చా. కొన్ని రోజులుగా నా మనసుకు శరీరానికి తీవ్ర ఘర్షణ జరుగుతోంది. నాపుట్టుక తప్పా.. లేక నేనాకులంలో పుట్టడం తప్పా..'' అని రోహిత్ సూసైడ్ లెటర్ లో పేర్కోన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు రోహిత్ హత్యపై విద్యార్ది నాయకులు మాట్లాడుతూ ఇది ఆత్మ హత్య కాదని మతోన్మాదుల హత్య అని.. దీనికి కారకులైన బీజేపీ నాయకులు, కేంద్రమంత్రులు బండారుదత్తాత్రేయ, స్మృతీఇరానిలను వెంటనే అరెస్టు చేయాలని విద్యార్ధులు డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా హెచ్‌సీయూలో పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఐస్‌ఏ నాయకుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీసీ అప్పారావు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఏబీవీపీ నాయకుడు సుశీల్‌కుమార్, బీజేవైఎం నాయకుడు విష్ణుపై కేసు నమోదు చేసినట్లు గచ్చిబౌలి సీఐ జూపల్లి రమేశ్ తెలిపారు.