చంద్రబాబు ప్రచారం చేస్తే మాకే ఉపయోగం..! కేటీఆర్ మైండ్ గేమ్..!
posted on Jan 23, 2016 @ 4:37PM
రాజకీయాల్లో ఒక పార్టీని దెబ్బ కొట్టాలంటే మిగిలిన పార్టీలు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాయి.. మిగిలిన పార్టీలను కన్ఫ్యూజ్ చేయాడానికి మైండ్ గేమ్ ఆడుతుంటాయి. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను చూస్తుంటే అలా అనిపిస్తుంది. ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికలకుగాను వాతావరణం చాలా వేడెక్కింది. ఇప్పటికే అన్ని పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్సలు చేసుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక టీఆర్ఎస్ సంగతైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేటీఆర్ సారధ్యంలో ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ అని పార్టీల కంటే ఒక అడుగు ముందంజలోనే ఉంది. ఇక టీడీపీ-బీజేపీ కూడా తమ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఈనెలాఖరున టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారంలో పాల్గొంటారు.
ఇక్కడి వరకూ బానే ఉంది. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రచారంపైన కేటీఆర్ కొత్తగా మైండ్ గేమ్ ఆడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నెలాఖరున చంద్రబాబు ప్రచారానికి వస్తున్న నేపథ్యంలో కేటీఆర్ దీనిపై స్పందిస్తూ చంద్రబాబు ఎంత ఎక్కువ ప్రచారం చేస్తే తమకు అంత ప్రయోజనమని అన్నారు. హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలా? వద్దా అనేది చంద్రబాబు విజ్ఞత అని.. ఆయన ప్రచారం చేస్తే తమకే ఉపయోగమని వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు అసలు కేటీఆర్ ఏ ఉద్దేశంతో ఇలా అన్నారు.. ఆ వ్యాఖ్యలు చేయండం వెనుక మతలబు ఏంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి మతలబు లేదని.. కావాలనే తను అలా వ్యాఖ్యానించారని.. ఇది కేటీఆర్ ఆడుతున్న మైండ్ గేమ్ అని అంటున్నారు. అంతేకాదు చంద్రబాబు ప్రచారం చేస్తే తమకే ఉపయోగమని చెప్పిన కేటీఆర్.. ఏ రకంగా ఉపయోగమో కూడా చెబితే బావుండేదని అంటున్నారు. మరి కేటీఆర్ ఎందుకు అలా మాట్లాడారో ఆయనకే తెలియాలి.