అమెరికాకు అంత సీన్ లేదు.. ఎక్కడో నాలుగో స్థానం..

ప్రపంచంలో అత్యంత అభివృద్ది చెందిన.. అత్యుత్తమ, గొప్ప దేశం ఏదంటే వెంటనే మనకు గుర్తొచ్చే పేరు అగ్రరాజ్యం అమెరికా. కానీ ఇప్పుడు అలా చెప్పాలంటే కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తాజాగా వచ్చిన జాబితాను చూస్తే అలానే అనిపిస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా.. వార్టన్ స్కూల్ అండ్ గ్లోబల్ బ్రాండ్ కన్సల్టెంట్లు ప్రపంచంలో అత్యుత్తమ దేశాల జాబితాను తయారు చేస్తూ ఉంటాయి. అలా వాళ్లు తాజాగా తయారు చేసిన జాబితా ప్రకారం అమెరికా అత్యుత్తమ దేశం కాదని తేలిపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అమెరికా స్థానాన్ని జర్మనీ ఆక్రమించింది. కనీసం జర్మనీ తరువాత స్థానంలో కూడా  అమెరికా లేకపోవడం దురదృష్టకరం. ముందు ప్లేస్ లో జర్మనీ.. తరువాత కెనడా, బ్రిటన్.. ఆ తరువాత నాలుగో స్థానంలో అమెరికా నిలిచింది. మొత్తానికి అన్ని దేశాలపై పెత్తనం చెలాయిస్తున్న అగ్రరాజ్యమైన అమెరికాకు ఈ విషయం పెద్ద షాకింగ్ న్యూసే.

బెంగళూరు టెక్కి దారుణ హత్య.. ల్యాప్‌టాప్‌ వైరుతో..

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని దారుణ హత్యకు గురైంది. వివరాల ప్రకారం కుసుమ్‌ సింగ్లా(31) అనే యువతి బెంగళూరులోని ఐబీఎం కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా పనిచేస్తుంది. అయితే ఆమెకు సుఖ్‌బీర్‌ సింగ్‌ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా పరిచమయ్యాడు. కాగా మంగళవారం సుఖ్‌బీర్‌ని తన ఇంటికి రావాల్సిందిగా కుసుమ్‌ కోరగా అతను ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే ఇంటికి వెళ్లిన సుఖ్‌బీర్‌  కుసుమ్‌ సింగ్లాను రూ.50వేలు ఇవ్వాల్సిందిగా కోరగా ఆమె నిరాకరించింది. కనీసం రూ.5వేలు ఇవ్వాల్సిందిగా అడిగినా ఆమె ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో కోపంతో ఉన్న సుఖ్‌బీర్‌ ల్యాప్‌టాప్‌ వైరుతో కుసుమ్‌ మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా, తర్వాత ఆమె సోషల్‌మీడియా ఖాతా ద్వారా దర్యాప్తు చేసిన పోలీసులు హర్యానాలో సుఖ్‌బీర్‌ని పట్టుకున్నారు.

హెచ్ సీయూ.. నలుగురు విద్యార్ధులపై సస్పెన్షన్ ఎత్తివేత..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ తో పాటు మరో నలుగురు స్టూడెంట్స్ ని కూడా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ నలుగురు విద్యార్థులు ప్రశాంత్, శేషయ్య, విజయ్, సంకన్నలపై సస్పెన్షన్ ఎత్తివేశారు. రోజు రోజుకి రోహిత్ ఆత్మహత్యపై రేగుతున్న దుమారం నేపథ్యంలో విద్యార్ధులపై సస్పెన్షన్ ఎత్తివేసినట్టు తెలుస్తోంది. మరోవైపు రోహిత్ ఆత్మహత్య పైన ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ మీడియా ఎదుట గురువారం తొలిసారి స్పందించారు. రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరమని.. ఏఎస్ఏ విద్యార్థులు తన పైన దాడి చేశారని.. తాను ఆసుపత్రిలో చికిత్స కూడా పొందానని తెలిపారు. ఈ కేసులో బాధ్యులు ఎవరైనా కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చోశారు

బీజేపీ ఎమ్మెల్యేపై దాడి.. సొంత పార్టీ నేతలే..

ఈ మధ్య పార్టీ నేతలకు తమ సొంత పార్టీ కార్యకర్తల చేతిలోనే దెబ్బలు తీనే పరిస్థితి వచ్చింది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఈ గొడవలు మరీ ఎక్కువయ్యాయి. ఇటీవలే కాంగ్రెస్ నేత దానం నాగేందర్ కు అలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బీజేపీ నేతకు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. ఉప్పల్ ఎమ్మెల్యే బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ పై బీజేపీ కార్యకర్తలే దాడి చేశారు. ఎన్నికల్లో భాగంగా ఉప్పల్ లో పర్యటిస్తున్న ఆయన కారును కార్యకర్తలు అడ్డుకొని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ నాయకుడికి టికెట్ ఇవ్వలేదని దాడి చేశారు. ఆయన కార్యకర్తలకు సర్దిచెప్పడానికి ప్రయత్నించినా వినిపించుకోకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఈ విషయంపై సీరియస్ గా ఉన్న ప్రభాకర్ ఇప్పటికే కేంద్రంలోని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం.

జీహెచ్ఎంసీ.. ముగిసిన నామినేషన్ల గడువు

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈరోజుతో ముగిసింది. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం నుండి రాజకీయ పార్టీల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే అన్ని పార్టీల సంగతేమో కాని అధికార పార్టీ టీఆర్ఎస్ కు, కాంగ్రెస్ పార్టీకి రెబల్ అభ్యర్ధుల బెడద ఎక్కువైంది. దీంతో ఉదయం వీరు నామినేషన్లు ఉపసంహరించుకుంటారా లేదా అన్న సందేహం నెలకొంది. అయితే మధ్యాహ్నం రెండు గంటల నుండి 450 నామినేషన్లు ఉపసంహరణ జరిగిందని అధికారులు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా రెబల్స్ ఉపసంహరించుకోకపోయినా నామమాత్రపు పోటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తుండగా.. టీఆర్ఎస్ మాత్రం బరి నుండి రెబల్స్ తప్పుకుంటారని ధీమా వ్యక్తం చేస్తుంది.

హెచ్ సీయూలో అసదుద్దీన్ ఓవైసీ.. ఈసారి కులం గురించి..

రోహిత్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఇప్పటికే ఎంతో మంది రాజకీయ నేతలు హెచ్ సీయూ వెళ్లి విద్యార్ధులకు మద్దతు పలికారు. ఇప్పుడు వారి ఖాతాలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా చేరిపోయారు. ఎప్పుడూ మతం గురించి.. హిందుత్వం గురించి మాట్లాడే ఓవైసీ ఇప్పుడు కూడా అదే తరహాలో మాట్లాడారు. కాకపోతే ఈ సారి మతం గురించి కాకుండా కులం గురించి మాట్లాడారు.  బ్రాహ్మణ అగ్రకుల అహంకారమే ఎంతో భవిష్యత్తు ఉన్న మేధావి ఆత్మహత్యకు కారణమని..  కేంద్రంలో ఉన్న బీజేపీ భారతదేశంలో కేవలం హిందువులు మాత్రమే ఉండాలని.. ఇతరులు ఉండకూడదని భావిస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ అందరిదని..విద్యాసంస్థల్లో రాజకీయ నాయకులు ప్రమేయం సరికాదని అన్నారు. అయితే అంతా చెప్పిన అసద్ తాను మాత్రం రాజకీయ నాయకుడు కాదా.. తాను ఎందుకు యూనివర్సిటీలోకి వెళ్లాడు అని పలువురు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

మహిళా ప్రొఫెసర్ అనుచిత వ్యాక్యలు.. ముస్లింలు మహిళలను బానిసలుగా వాడుకోవచ్చు..

ఇప్పటికే మత వివక్షాలతో ఎన్నో వివాదాలు జరుగుతుంటే ఇప్పుడు ఓ ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలు వాటికి ఆజ్యం పోసేలా ఉన్నాయి. ఈజిప్ట్ రాజధాని కైరోకు చెందిన అల్-అజర్ యూనివర్శిటీకి చెందిన మహిళా ఇస్లామిక్ ప్రొఫెసర్ సువాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ "ముస్లిం పురుషులు ఇతర మతానికి చెందిన మహిళలను లైంగిక బానిసలుగా చూసుకోవచ్చని అది అల్లా దృష్టిలో చట్ట సమ్మతమేనని ఈ ప్రొఫెసర్ గారు సెలవిచ్చారు". దీంతో ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇన్ క్విస్టర్ రిపోర్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో ఈజిప్ట్ ముస్లింలు ఇజ్రాయిల్ మహి ళలను లైంగిక బానిసలుగా వాడుకోవచ్చని అత్యాచారాలు చేయవచ్చని ప్రచురించింది. అంతే ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు తెలత్తుతున్నాయి. పలువురు ముస్లింలే ఆమె చేసిన వ్యాఖ్యలను ఖండిస్తుండటంతో ఈవ్యవహారం పెద్ద దుమారంగా మారింది.

అమీర్ ను అందుకే తప్పించారు..

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ను ఇన్ క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ హోదా నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అసహనంపై అమీర్ వ్యాఖ్యలు చేసినందుకే అతనిని తప్పించారని వార్తలు వచ్చినా దానిని కేంద్రం మాత్రం తోసి పుచ్చి అదేంలేదు.. తన కాంట్రాక్ట్ గడువు ముగిసింది అంతే అంతకన్నా ఏం లేదు అని అన్నారు. కానీ ఇప్పుడు అది నిజమేనని తేలిపోయింది. తాజాగా ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ శాఖ కార్యదర్శి అమితాబ్ కాంత్.. అమీర్ భారత్ బ్రాండ్ ఇమేజికి నష్టం కలిగించారని అందువల్లే ఆయన్ను ఇన్ క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా తొలగటించారని ప్రకటించారు. అంతేకాదు అంబాసిడర్ గా వ్యవహరించిన ఆయన ఆ బ్రాండ్ ను పెంచేలా కృషి చేయాలి తప్ప నష్టం కలిగించరాదు ఆయన్ను తొలగించడం సరైన చర్యే అని ఆయన అన్నారు.

ఐసిస్ కు ధీటుగా ప్రైవేటు సైన్యం.. రంగంలోకి దిగడమే ఆలస్యం..!

గత కొద్ది రోజులుగా ఉగ్రవాదుల ఆగడాలు మరింత ఎక్కువైపోయాయి. ఉగ్రవాదులు ఉగ్ర పంజా విప్పి దాడులకు పాల్పడి ఎంతో మంది ప్రాణాలు బలిగొంటున్నారు. అయితే ఇప్పుడు అందరిని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదంపై పోరాడేందుకు ప్రైవేటు సైన్యం ఒకటి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లోని ధర్మయుద్ధానికి ప్రయివేటు సైన్యం సిద్ధమవుతోంది. దాదాపు 1500 మంది సైనికులు ఇస్లామిక్ స్టేట్ పై యుద్ధానికి తయారుగా ఉన్నారు. ఇక వారు రంగంలోకి దిగడమే ఆలస్యం. కాగా హిందూ స్వాభిమాన సంస్థ ఆధ్వర్యంలో ధర్మసేన పేరుతో 50 శిక్షణ శిబిరాల్లో ఈ ప్రయివేటు సైన్యం రెడీ అవుతోంది. ఈ క్యాంపుల్లో యువకులే కాకుండా పిల్లలు కూడా యుద్ధ విద్యలలో శిక్షణ పొందుతున్నారు.

జుకర్ బర్గ్ కి ఇంటి కష్టాలు..

ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ కి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. మార్క్ జుకర్ బర్గ్ పై అతని కాలనీ వాసులు ఫిర్యాదులు చేశారంట. వివరాల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన జుకర్ బర్గ్ శాన్ ప్రాన్సిస్కోలోని లిబర్టీ హిల్ కమ్యూనిటీలో తన సొంత ఇంట్లో ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఆయన తన ఇంటిని రీమోడల్ చేయిస్తున్నారంట. ఈ పనుల వల్ల అక్కడ వీపరీతమైన శబ్దాలు.. దుమ్ము వస్తుండటంతో కాలనీ వాసులకు చిరాకు వచ్చిందంట. అంతేకాదు జుకెర్ బర్గ్ రాంగ్ పార్కింగ్ వల్ల కూడా కాలనీ వాసులకు చుక్కలు కనిపిస్తున్నాయంట. ఆయన రెండు స్పోర్ట్ యుటిలిటీ కార్లు బారెడంత ఉండి పార్కింగ్ కు ఇబ్బందిని కలిగిస్తున్నాయట. దీంతో కాలనీ వాసులు నగర ట్రాన్స్ పోర్ట్ ఏజెన్సీకి ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఏదో ఒకటో రెండో రోజులు అయితే పర్వాలేదు.. నెల నుండి ఇంటి పనులు జరుగుతున్నాయి.. ఇంటి రిపేరు పేరుతో దుమ్ము కొట్టుకుపోయేలా చేయడం భరించలేని స్థాయికి చేరిందని.. దానికి తోడు రాంగ్ పార్కింగ్ అని ఆరోపిస్తున్నారంట. మరి జుకర్ బర్గ్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

హెచ్‌సీయూ.. ముగిసిన ద్విసభ్య కమిటీ విచారణ

హెచ్‌సియూలో దళిత విద్యార్ది రోహిత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలు విద్యార్ధుల సంఘాలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా రోహిత్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో కేంద్రం ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. దీని నిమిత్తం వారు నిన్ననే హెచ్‌సియూ చేరుకొని రోహిత్ ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యపై విచారణ పూర్తయిందని.. అందరినుంచి వివరాలు సేకరించామని తెలిపారు. త్వరలోనే కేంద్రానికి నివేదిక ఇస్తామని.. అయితే నివేదిక ఎప్పుడు ఇచ్చేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. తిరిగి వారు ఢిల్లీ బయలుదేరారు.

సింపుల్ గా దత్తాత్రేయ ఇంటిని ముట్టడి..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటిలో దళిత విద్యార్ధి రోహిత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కేంద్రమంత్రి దత్తాత్రేయపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ ఆత్మహత్యకు కారణం దత్తాత్రేయ అంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు విద్యార్ధి సంఘాలు ఆయన ఇంటిని ముట్టడిస్తున్నాయి. నిన్న కొన్ని విద్యార్ది సంఘాలు దత్తాత్రేయ ఇంటిని ముట్టడించాయి.. ఈరోజు మరికొన్ని సంఘాలు దత్తాత్రేయ ఇంటిని ముట్టడించాయి. ఏఐఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం నేతలు దత్తాత్రేయ ఇంటిని ముట్టడించి.. దత్తాత్రేయ తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అరికట్టే ప్రయత్నం చేసినా అది కాస్త విఫలమైంది. ఇదిలా ఉండగా మరోవైపు ఇంతమంది విద్యార్ధి సంఘాలు ఒక కేంద్ర మంత్రి ఇంటిని ముట్టడిస్తుంటే ముందుగా పోలీసులు ఏం చేస్తున్నారు అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. అంత సింపుల్ గా కేంద్ర మంత్రి ఇంటిని ముట్టడి చేస్తుంటే పోలీసుల నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి అని అనుకుంటున్నారు.

పాకిస్థాన్ లో ఉగ్రవాదుల దాడి..15 మంది మృతి..

పాకిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పాకిస్థాన్‌లోని బచాఖాన్ యూనివర్సిటీలో ఉగ్రవాదులు దాడి చేశారు. యూనివర్సిటీలో ఓ ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో సుమారు 3వేల మంది విద్యార్దులు దాదాపు 600 మంది అతిథులు హాజరయ్యారు. దీంతో ఇదే అదనుగా చూసుకొని 10 మంది ఉగ్రవాదులు యూనివర్శిటీలోకి చొరబడి విద్యార్దులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 15 మంది మృతిచెందగా, 70మందికి గాయాలైనట్లు పాక్‌ ప్రభుత్వం ప్రకటించింది. గాయపడ్డ విద్యార్థులను సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ ఘటనతో పాక్ భద్రతా సిబ్బంది హైఅలర్ట్ ప్రకటించింది. ఈసందర్భంగా డిప్యుటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ సయీద్‌ వజీర్‌ మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, అతిథులను రక్షించేందుకు ఆపరేషన్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు.

పవన్ కళ్యాణ్ సడెన్ గా సింగపూర్ ట్రిప్.. సీక్రెట్ ఏంటో..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సడెన్ గా సింగపూర్ వెళ్లడంపై ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతున్న వేళ.. ఉన్నట్టుండి బ్రేక్ తీసుకొని మరీ పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు.. సింగపూర్ దేశ అధికారులతో మంతనాలు జరుపుతూ మాస్టర్ ప్లాన్స్ రెడీ చేస్తున్న తరుణంలో పవన్ సింగపూర్ పర్యటన చేయబోతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విహార యాత్రకి సింగపూర్ వెళ్లారా..? లేక రాజకీయ పరంగా వెళ్లారా అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్నారు కానీ.. షూటింగ్ పూర్తికాకపోవడంతో అదికాస్త ఏప్రిల్ కు వాయిదా పడింది. ఇప్పుడు ఏప్రిల్ లో కూడా సినిమా వస్తుందో రాదో డౌటే అంటున్నారు.

పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి.. చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్విట్జర్లాండ్ దావోస్‌లో జరిగే 46వ ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన జ్యూరిక్ లో కొద్దిసేపు ఉండి అక్కడ ఉన్న ప్రవాసాంధ్రులు.. ప్రవాస భారతీయులు.. వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాల్సిందిగా.. ఏపీ అభివృద్దికి తోడ్పడాల్సిందిగా వారికి పిలుపునిచ్చారు. అంతేకాదు యూరోపియన్ దేశాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న ఉత్తమ విధానాలు, పద్ధతులతో నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేయవచ్చని.. సరికొత్త ఆలోచనలను ఆహ్వానించడానికి తాను దేశ విదేశాల్లో పర్యటిస్తున్నానని.. ప్రవాస భారతీయుల సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఏపీ ఎన్‌ఆర్‌టీ పేరుతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా చంద్రబాబుతోపాటు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌, ఎంపీ సీఎం రమేష్‌, ఇతర ఉన్నతాధికారులు, ఏపీ ఎన్‌ఆర్‌టీ అధ్యక్ష, కార్యదర్శులు జయకుమార్‌, కారం సురేష్‌లు ఇందులో పాల్గొన్నారు.

పీఎస్ఎల్వీ-సీ31 రాకెట్ ప్రయోగం విజయవంతం

పీఎస్ఎల్వీ-31 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. నెల్లూరు జిల్లాలోని సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి పీఎస్ఎల్వీ-31పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ31(పీఎస్ఎల్వీ)ను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. దీంతో ఈరోజుతో ఐదు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాలను ఇస్రో ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. ఈ రాకెట్‌ ద్వారా నావిగేషన్‌ వ్యవస్థకు సంబంధించిన 1,425 కిలోల ఐఆర్‌ ఎన్‌ఎస్‌ఎస్‌-1ఇ ఉప గ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌ కుమార్ దగ్గరుండి ప్రయోగాన్ని పర్యవేక్షించారు. త్వరలో మరో 2  ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాలను ప్రవేశపెడతామని తెలిపారు. 2016 లో ఇస్రో సాధించిన తొలి విజయం ఇది. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

రోజా సస్పెన్షపై కమిటీ చర్చ..

వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆమె సస్పెండ్ పై విచారించేందుకు గాను డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటైన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి విచారణ కమిటి ఈరోజు మూడు గంటల పాటు చర్చించినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో జరిగిన వాదనల గురించి.. శాసనసభ వీడియో ఫుటేజీల లీకేజీపై కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. కాగా దీనిపై చర్చించేందుకు గాను తిరిగి ఈ నెల 27వ తేదీన మళ్లీ సమావేశం కావాలని కమిటీ నిర్ణయించుకుంది.