సీ.ఎం కొడుకుకీ భాగముంది!
కేరళని ముంచెత్తిన సోలార్ స్కాంలో రోజుకో కొత్త విషయం బయటకి వస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సరితా నాయర్ ఇవాళ జరిగిన న్యాయవిచారణలో మరో బాంబు పేల్చారు. కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి మాత్రమే కాదు, ఈ సోలార్ స్కాంలో ఆయన పుత్రరత్నం చాందీ ఉమెన్‌కి కూడా భాగస్వామ్యం ఉందని తేల్చారు. చాందీ ఉమెన్ షోకిల్లా రాయుడనీ, స్కాంలో దిగమింగిన సొమ్ముతో అతను గల్ప్‌లో విహారయాత్రలు సాగించేవాడనీ చెప్పారు సరిత. తాను చెప్పిన వివరాలన్నింటికీ ఫొటోలతో సహా సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. సరిత చెబుతున్న విషయాలకీ, ముఖ్యమంత్రి మాటలకూ పొంతన లేకపోవడంతో ఎక్కడో తేడా జరుగుతోందన్న అనుమానం మాత్రం బలపడుతోంది. ఇంతకు ముందు జరిగిన విచారణలో కేరళ ముఖ్యమంత్రి సరితతో తనకి పెద్దగా పరిచయం లేదనీ, తామిద్దం కేవలం మూడుసార్లే కలుసుకున్నాననీ చెప్పడం గమనార్హం. సరితను కూడా ఇవే విషయాలు చెప్పమంటూ అదే రోజున సరితకు వచ్చిన ఫోన్ కాల్స్ ఇప్పడు సంచలనం సృష్టిస్తున్నాయి. పైగా సరిత కూడా స్వయంగా ఈ వాదనని నిరాకరిస్తూ, తామిద్దం తరచూ కలిసేవాళ్లమని కుండ బద్దలు కొట్టేశారు. తాను నిర్దోషినంటూ ఉమెన్ చాందీ చెబుతున్న ప్రతిసారీ మరో బలమైన సాక్ష్యం ఆయన మాటలకు ఎదురొడ్డుతోంది. ఏదేమైనా కానీ తాను మాత్రం ముఖ్యమంత్రి పీఠాన్ని వదిలిపెట్టేది లేదని ఉమెన్ చాందీ పట్టుదలగా ఉన్నారు. ఇంకెన్ని సాక్ష్యాలు బయటకి వచ్చినా ఆయన తన పట్టుదలని వీడేట్లు లేరు