మళ్లీ పొగిడేసిన జానారెడ్డి..

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డికి ప్రతిపక్ష పార్టీని పొగడటం కొత్తేమి కాదు. గతంలో ఈయన ప్రతిపక్షపార్టీలను పొగడటం.. దానికి పార్టీనేతలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయడం అన్నీ జరిగాయి. అయితే మళ్లీ ఇప్పుడు జానాసాబ్ ప్రతిపక్ష పార్టీని పొగిడేసి తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నారు. ప్రాజెక్ట్ రీడిజైనింగ్ విషయంలో కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలపై.. రూ.5 భోజనం పథకాన్ని మెచ్చుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గ్రేటర్ పరిధిలో ఏర్పాటు చేసిన రూ.5 భోజనం నాణ్యత ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకునేందుకు గురువారం సీఎల్పీ సిబ్బంది చేత ప్రత్యేకంగా తెప్పించుకున్న జానాసాబ్ దీని నాణ్యత గురించి, రుచి గురించి తెగ పొగిడేశారంట. అంతేకాదు ఈ పథకం మంచిగా అమలవుతుందని కూడా కితాబు ఇచ్చారంట. దీంతో అసలే ఎన్నికల వేళ జానారెడ్డి ఇలా వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ నేతలు అతినిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు దేనికైనా సమయం, సందర్భం ఉండాలి అంటూ జానాపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో తాత్కాలిక సెక్రటేరియట్..?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఏడాది జూన్ కల్లా ఏపీకి రావాలని గతంలో ఆదేశించిన సగంతి తెలిసిందే. అయితే ఉద్యోగులు రావడానికి సిద్దంగా ఉన్నా ఇక్కడ సరైన వసతులు లేకపోవడంతో వారు రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఏపీలో తాత్కాలిక సెక్రటేరియట్ సిద్దం చేసేందుకు ప్రభుత్వం సిద్దమైనట్టు తెలుస్తోంది. మొత్తం ఆరు బ్లాకులుగా.. జీ ప్లస్ 7 విధానంలో డిజైన్ చేస్తున్న ఈ భవనాన్ని మే రెండో వారానికి 6 లక్షల చదరపు అడుగుల స్థలం వినియోగించేందుకు వీలుగా సిద్ధం చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది. కాగా ఈ భవనంలో కనీసం 6750 మంది వరకూ కూర్చొని పని చేసుకునే విధంగా తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు.

కేసీఆర్ ప్రచారం చేస్తే ట్రాఫిక్ జాం అవుతుందట..!

తెలంగాణ సీఎం మాటలు చెప్పడంలో దిట్ట అని అందరికి తెలిసిందే. ఆయన మాటలతోనే అందరిని ఓడించేస్తారు. అలాంటి వాక్చాతుర్యం ఉంది కేసీఆర్ కి. అది ఇంకోసారి నిరూపించారు కేసీఆర్. ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ఎక్కడ చూసినా పార్టీలు ప్రచారాలతో బిజీగా ఉన్నాయి. అయితే టీఆర్ఎస్ పార్టీ తరుపున ప్రచార బాధ్యతలు మొత్తం కేటీఆర్ తీసుకొని నడిపిస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం గురించి మీడియా సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ ను విలేకరులు ఒక ప్రశ్న అడిగారంట.. అదేంటంటే గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మీరెందుకు పాల్గొనడంలేదు. దానికి కేసీఆర్ తాను ప్రచారం చేస్తే  ట్రాఫిక్ జాం అవుతుందని.. ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసమే తాను ప్రచారం చేయటం లేదని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన చెప్పిన మాటకు అందరూ షాకయ్యారంట. మొత్తానికి తన కొడుకు సామర్థ్యం ఈ ఎన్నికల ద్వారా తెలుసుకుందామని  గ్రేటర్ ఎన్నికల ఫలితాలు లిట్మస్ టెస్ట్ మాదిరిగా చూసుకుంటున్న కేసీఆర్ అసలు విషయం చెప్పలేక ఇలాంటి సాకు చెప్పినట్టు తెలుస్తోంది.

తెలంగాణను ఎవరూ విడదీయలేరు.. చంద్రబాబు

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రచారంలో పాల్గొన్నారు. పటాన్‌చెరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ  టీడీపీతో తెలంగాణను ఎవరూ విడదీయలేరని వ్యాఖ్యానించారు. బ్రిటష్ వాళ్లు, నిజాంలు వందల సంవత్సరాలు హైదరాబాద్ ను పాలించారు.. కానీ నేను అధికారంలో ఉన్న తొమ్మిది సంవత్సరాలతో ప్రపంచ పటంలో హైదరాబాద్ కు స్థానం కల్పించా అని అన్నారు. అంతేకాదు హైదరాబాద్‌లో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చానని, దీనివల్ల 14 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని.. హైదరాబాద్‌ వల్ల తెలంగాణకు ఎక్కువ లాభం వచ్చిందని, ఔటర్‌ రింగురోడ్డు, మెట్రోరైలు ఘనత టీడీపీదేనని, 12 ఏళ్లయినా మెట్రో పనులు పూర్తి కాలేదని, అదే తాము మేము గెలిచి ఉంటే మూడేళ్లలో పూర్తిచేసే వాళ్లమని అన్నారు. అలాగే హైదరాబాద్‌లో అడుగడుగునా నేను చేసిన అభివృద్ధి ఉందని, నేను ఎక్కడికీ వెళ్లలేదు.. ఇక్కడే ఉంటా.. మీతోనే ఉంటా అని అన్నారు.

ఒక్క దోమ.. 2018 వరకూ గర్భధారణ లేకుండా చేసింది..!

ఒకప్పుడు ఎబోలా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికించిందో ఇప్పుడు ఇంకో వైరస్ పేరు చెబితేనే వణికిపోతున్నారు బ్రెజిల్ దేశస్థులు. అదే జైకా వైరస్. రోజు.. రోజుకీ ఈ వైరస్ ప్రభావం ఎక్కువతుందే కానీ తగ్గడంలేదు. అసలు ఈ జైకా వైరస్ కు కారణం ఎజెపి దోమ. ఈ దోమ కుట్టడం ద్వారా వైరస్ వ్యాపించి.. జ్వరంతోపాటు డెంగీ, చికున్‌ గున్యా, యెల్లో ఫీవర్‌ వంటి వ్యాధులు కూడా విస్తరిస్తాయి. అంతేకాదు అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే.. గర్భిణీ స్త్రీలకు ఈ వైరస్ రావడం వల్ల పుట్టే పిల్లలకు జన్యుపరమైన లోపాలు రావడం.. పిల్లలకు శారీరక పెరుగుదల ఉండకపోవడం.. చిన్నచిన్న తలలుగా పుట్టడం వంటివి జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా కేసులు నమోదయ్యాయి. మరోపక్క ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా అవి విఫలమవుతున్నాయి. దీంతో చేసేది లేక ఈ సమస్య పూర్తిగా సమసిపోయేంత వరకూ గర్భధారణకు దూరంగా వుండాలని.. 2018 వరకూ స్త్రీలు గర్భం దాల్చకుండా చర్యలు తీసుకోవాలని ఎల్‌సాల్వడార్‌, కొలంబియా, బ్రెజిల్‌ ప్రభుత్వాలు మహిళలకు సూచిస్తున్నాయి. అంతేకాదు ఈ వైరస్ చిన్నచిన్నగా బ్రెజిల్‌తో పాటు పలు లాటిన్‌ అమెరికా దేశాలలో ఈ వైరస్‌ విస్తరించటంతో ఇది అంతర్జాతీయ సమస్యగా మారింది. ఇప్పుడు ఇండియాలో కూడా ఈ వైరస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి అధికారులు తొందరగా మేల్కొని దీనికి తగిన చర్యలు తీసుకొని ఇప్పుడే అరికట్టకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్త్తుంది.

పురంధరేశ్వరికి చంద్రబాబుపై కోపం పోయిందా..?

బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరికి.. చంద్రబాబుకి మధ్య ఉన్న బేధాభిప్రాయల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బీజేపీ-టీడీపీ మిత్రపక్షాలు అయినప్పటికీ.. బీజేపీ పార్టీ నుండి టీడీపీ నేతలను కాని.. ఆఖరికి పార్టీ అధినేత చంద్రబాబును కాని విమర్శించడంలో పురంధరేశ్వరీ ఎప్పుడూ ముందుంటారు. అయితే గత కొద్ది రోజుల నుండి మాత్రం పరిస్థితి మారింది. ఎప్పుడూ చంద్రబాబు మీద విరుచుకుపడే పురంధరేశ్వరీ ఈ మధ్య కాస్త సైలెంట్ అయ్యారు. అంతేకాదు ప్రస్తుతం గ్రేటర్లు ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో జోరుమీదుండగా.. బీజేపీకి టీడీపీ పార్టీల తరుపున ఆమె ప్రచారానికి దిగారు. దీంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పురంధరేశ్వరీకి చంద్రబాబు మీద ఉన్న కోపం పోయిందా అని మాట్లాడుకునే వారు కూడా ఉన్నారు. కాగా ప్రచారంలో ఆమె మాట్లాడుతూ అభివృద్ధి విషయం దగ్గరికి వచ్చే సరికి టి ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం మాటలతోనే సరిపెడుతున్నారని.. అభివృద్ధి మాత్రం జరగడం లేదని ఆమె వాపోయారు. అభివృద్ధి ఎవరు చేశారో చూసి ఓటెయ్యాలని ఆమె కోరారు. ఇదిలా ఉండగా పురంధరేశ్వరీ చంద్రబాబు విషయంలో ఏమనకుండా ఉండటానికి గల కారణం రాజ్యసభ సీటు కోసమే అని కూడా గుసగుసలాడుకుంటున్నారు. మరి ఏది నిజమో ఆమెకే తెలియాలి.

కాంగ్రెస్ కు అంత సీన్ లేదంటున్న తలసాని..

ఎన్నికల సమయంలో పార్టీ నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు మామూలే. మీరు ఎన్నికల్లో విజయం సాధిస్తే నేను పార్టీకి రాజీనామా చేస్తా అని ఒకరంటే.. మీరు గెలిస్తే మేం రాజీనామా చేస్తాం అంటూ పోటాపోటీగా సవాళ్లు విసురుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల సందర్బంగా ఆ సవాళ్లు మరింత ఎక్కువయ్యాయి. ఇప్పుటికే కేటీఆర్, రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి లాంటి ముఖ్య నేతలు సవాళ్లు విసిరారు. ఇప్పుడు వారి జాబితాలో తలసాని కూడా చేరిపోయారు. ఈసారి తలసాని కాంగ్రెస్ పార్టీపై సవాల్ విసిరారు. గ్రేటర్ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పార్టీ 15 సీట్లు గెలిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. అంతేకాదు హైదరాబాద్ ను తామే అభివృద్ధి చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు అని ఎద్దేవ చేశారు. మరి తలసాని సవాల్ కు కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. కాగా గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పార్టీలన్నీ గెలుపు కోసం చాలా కష్టపడుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అయితే తీవ్రంగా కృషిచేస్తోంది. ఎన్నికల బాధ్యతను మొత్తం తన భుజాల మీద వేసుకొని కేటీఆర్ ప్రచారాన్ని నడిపిస్తున్నారు. ఇక మిత్రపక్షమైన టీడీపీ బీజేపీ.. టీఆర్ఎస్ కూడా బానే కష్టపడుతున్నాయి. మరి ఎన్నికల్లో గెలుపు ఎవరిదో తెలియాలంటే అప్పటివరకూ ఆగాల్సిందే.

కేరళ సీ.ఎం చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు

సోలార్‌ స్కామ్‌లోని పాపాలు ఇప్పుడు కేరళ ముఖ్యమంత్రి ఉమెన్‌ చాందీ మెడకి చుట్టుకుంటున్నాయి. స్కామ్‌లోని ముఖ్య పాత్రధారి సరితానాయర్‌ తాను ముఖ్యమంత్రికి రెండు కోట్లు ముట్టచెప్పానని కుండబద్దలుకొట్టడంతో చాందీకి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. సరితా నాయర్‌, ఆమెతో సహజీవనం చేస్తున్న రాధాకృష్ణ కలిసి 2011లో సౌర విద్యుత్తుకి సంబంధించి ఒక సంస్థను నెలకొల్పారు. భవిష్యత్తలో ప్రభుత్వం స్థాపించే సౌర విద్యత్‌ ప్రాజెక్టులన్నీ తమకే వస్తాయని చెప్పి వీరిద్దరూ జనాల దగ్గర్నుంచీ కోట్లాది రూపాయలు దండుకున్నారు. దీనికి ఉమెన్‌ చాందీ సహకారం ఉందన్నదే ఇప్పుడు ప్రధాన ఆరోపణ. తన పేరు వాడుకున్నందుకు ఉమెన్‌ చాందీకి కావల్సినంత సొమ్ము ముట్టిందట! దానికి తోడు ఉమెన్‌ చాందీ లై డిటెక్టరు పరీక్షలను కూడా నిరాకరించడంతో విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. మరోవైపు ఉమెన్‌ చాందీకి సానుభూతి చూపిస్తున్నవారికి కూడా కొదవ లేదు. రాజకీయాలలో వేల కోట్లు హరాయించేసుకున్నవారే దర్జాగా బతుకుతుంటే, ఆఫ్టరాల్‌ రెండు కోట్ల కోసం ముఖ్యమంత్రి అంతటివాడిని ఇబ్బంది పెడతారా అని సదరు సానుభూతిపరులు జాలిపడుతున్నారు!

చంద్రబాబుకి విధేయుడిని.. పార్టీకి కాదు.. జేసీ

  కొన్ని రోజుల నుండి సైలెంట్ గా ఉన్న తాడిపత్రి శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనని పిలిచి టికెట్ ఇచ్చారని.. చంద్రబాబుకు విజన్ ఉందని.. అలాంటి చంద్రబాబుకు మాత్రమే నేను విధేయుడిని కానీ పార్టీకి కాదని ఆయన అన్నారు. అంతేకాదు గత శీతాకాల సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా ఆయన స్పందిస్తూ రోజా అసెంబ్లీలో ఉండటం దురదృష్టకరమని, ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు బాధపడుతున్నానని అన్నారు. ఎంతో హుందాగా, క్రమశిక్షణగా నడుచుకోవాల్సిన సభ్యులు పోడియం వద్దకు వెళ్లి గొడవచేసే సంస్కృతి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వోద్యోగే- కానీ పర్వతం ఎక్కడంలో రికార్డు!

ఆమె ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక ఐపిఎస్‌ అధికారి. శాంతిభద్రతలను కాపాడటంలో నిరంతరం తలమునకలై ఉంటారు. కానీ ఏమాత్రం అవకాశం చిక్కినా తనకు ఇష్టమైన పర్వతారోహణకు సిద్ధమైపోతారు. మనసులో ఆసక్తి ఉండాలే కానీ అనుకున్నది సాధించడానికి స్త్రీ, పురుషులన్న వివక్ష కానీ, ఉద్యోగబాధ్యతలు కానీ అడ్డురావని నిరూపిస్తున్నారు అపర్ణ కుమార్‌. గత వారం అంటార్క్‌టికాలోని మౌంట్‌ విన్సన్‌ అనే 17,000 పర్వతాన్ని అధిరోహించిన అపర్ణ, ఆ పర్వతాన్ని ఛేదించిన తొలి భారతీయ ఉద్యోగిగా రికార్డు సాధించారు. ఇంతేకాదు! మౌంట్‌ విన్సన్‌ని అధిరోహించడంతో ప్రపంచంలోని 7 అతి క్లిష్టమైన పర్వతాలుగా భావించేవాటిలో 5 పర్వతాలను ఆమె అధిరోహించినట్లు అయింది. సాహసమే జీవితంగా గడిపిన అపర్ణకు గత ఏడాదే ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ‘రాణి లక్ష్మిబాయ్‌ పురస్కార్‌’ను అందించింది. ఆ పురస్కారాన్ని మరోసారి సార్థకం చేసుకుంది అపర్ణ. ఇక తన తదుపరి లక్ష్యం ఎవరెస్టు పర్వతమే అంటోంది!

చెన్నైలో నిరసల సెగ..

చెన్నైలో నిరసల సెగ మరితం ఉద్రిక్తమయింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపైనే ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తుతుంటే.. తాజాగా తమిళనాడులో ముగ్గురు మహిళా వైద్య విద్యార్ధినులు ఆత్మహత్య చేసుకోవడంతో ఇప్పుడు విద్యార్ధుల ఆందోళనలు మరింత ఎక్కువయ్యాయి. ఈ రెండు ఘటనలతో చెన్నై రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలకు దిగారు. రెండు ఉదంతాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ.. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరాని తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దాదాపు 60 మంది విద్యార్దులను అదుపులోకి తీసుకున్నారు. కాగా హెచ్ సీయూ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఇవాళ దేశవ్యాప్తంగా వర్సిటీల బంద్‌కు హెచ్‌సీయూ జేఏసీ పిలుపునిచ్చింది. నేడు, రేపు రెండురోజులపాటు కూడా ర్యాలీలు, ఆందోళనలు చేసేందుకు విద్యార్ధులు సిద్ధమవుతున్నారు.

లోకేశ్ ను తమ్ముడు అంటున్న కేటీఆర్.. తమ్ముడు అంటూనే..

గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా తమ పార్టీ తరపున బాధ్యతను భుజాల మీద వేసుకున్న కేటీఆర్.. ప్రచారంలో చాలా తెలివిగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. ఒక పక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొడుకు లోకేశ్ ను తమ్ముడు అంటూనే ఆయనపై తెలివిగా విమర్శలు చేస్తున్నారు. ఈ మధ్య జరిగిన బహిరంగ సభలో లోకేశ్ అధికార పార్టీపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన కేటీఆర్.. గ్రేటర్ పగ్గాలు తమకిస్తే హైదరాబాద్ ను అద్భుతంగా అభివృద్ధి చేస్తామని తమ్ముడు లోకేశ్ చెబుతున్నారు..  ముందు ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి చేసుకోవాలని సలహా ఇచ్చారు. అంతే కాదు ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి మోడీ తట్టెడు మట్టి.. చెంబుడు నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారు.. అలాంటి మోడీ సర్కార్ నుండి నిధులు తీసుకొచ్చి హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తారంటా.. ముందు నిధులు తెచ్చుకొని అమరావతి అభివృద్ధి మీద దృష్టి పెడితే బావుంటుందని అన్నారు. అంతేకాదు తమ రాష్ట్రానికే నిధులు తెచ్చుకోవడంలో విఫలమైన వారు పక్కనున్న రాష్ట్రానికి నిధులు తెచ్చి ఏం అభివృద్ధి చేస్తారు.. తెలంగాణ సంగతి తాము చూసుకుంటాలేం అని ఎద్దేవ చేశారు.

అనుపమ్‌ ఖేర్‌కి అవార్డు అందుకేనా!

‘ఈ అవార్డులన్నీ ఒక బూటకం! వాటిలో ఎలాంటి విశ్వసనీయతా లేదు. పద్మా పురస్కారాలు కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు’ అంటూ 2010లో అనుపమ్‌ ఖేర్ తన ట్విట్టర్‌లో విమర్శించారు. ఇప్పడు అదే అనుపమ్‌ ఖేర్‌ 'పద్మభూషణ్‌ అవార్డు అభించడం తన జీవితంలో మర్చిపోలేని ఘట్టం'గా పేర్కొన్నారు. అనుపమ్ గతంలో తను పద్మ పురస్కారాల గురించి చేసిన విమర్శను మర్చిపోయినా జనాలు మర్చిపోయినట్లు లేదు. సోషల్‌ మీడియాలో ఇప్పడు అనుపమ్‌ మీద తీవ్రమైన విమర్శలను గుప్పిస్తున్నారు విమర్శకులు. కశ్మీరి పండిట్లకు చెందిన అనుపమ్‌ ఖేర్‌ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మారడం వల్లే ఈ అవార్డు వచ్చిందంటున్నారు. దేశంలో పెరిగిపోతున్న అసహనం మీద చర్చ సందర్భంగా బాలీవుడ్ తరఫున అనుపమ్‌ ప్రభుత్వానికి బహిరంగంగా మద్దతుని ప్రకటించాడు. అవార్డులను వెనక్కి ఇచ్చి దేశం పరువు తీయవద్దంటూ ర్యాలీని సైతం నిర్వహించాడు. అసహనం గురించి అమీర్‌ ఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలను చేసినప్పుడు అతని మీద తీవ్రంగా విరుచుకుపడ్డాడు. మరో పక్క అనుపమ్‌ ఖేర్‌ భార్య అయిన కిరణ్‌ ఖేర్‌ భాజపా తరఫున పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నారు. ఇవన్నీ కేవలం యాదృచ్ఛికం కాదనీ, ఆపత్కాలంలో బాలీవుడ్‌ తరఫున తమకు అండగా ఉన్నందుకు ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపే ఈ పద్మభూషణ్‌ అనీ అంటున్నారు విమర్శకులు. అనుపమ్‌ మాత్రం సినీరంగంలో ఇన్నాళ్లపాటు తాను చేసిన కృషి ఫలితంగానే ఈ అవార్డు దక్కిందని వాదిస్తున్నారు. వీరిలో ఎవరి మాట నిజమన్నది మాత్రం తెలిసే అవకాశం మనకి లేదు!

పాకిస్తాన్‌లో భారతీయ జెండా ఎగిరితే!

భారతదేశంలో పాకిస్తాన్‌ జెండా రెపరెపలాడటం కొత్తేమీ కాదు. కశ్మీర్‌లోని వేర్పాటవాదులు నిత్యం ఈ పని చేస్తూనే ఉంటారు. వాటిని మన దేశ అధికారులు చూసీ చూడనట్లు వదిలేయాల్సిన పరిస్థితి అక్కడిది. కానీ నిన్న ఓ పాకిస్తాన్‌ జాతీయుడికి తన దేశంలో భారతీయ జెండాని ఎగురవేస్తే ఏం జరుగుతుందో తెలిసి వచ్చింది. లాహోర్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని ఒకారా జిల్లాలో నివసించే ‘ఉమర్‌ ద్రాజ్‌’కి విరాట్‌ కోహ్లీ అంటే వెర్రి అభిమానం. నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన 20-20 క్రికెట్‌ మ్యాచ్‌లో కోహ్లీ చెలరేగిపోవడంతో కోహ్లీ మీద అభిమానంతో తన ఇంటి మీద భారతీయ జెండాను ఎగురవేశాడు. అదే అక్కడి పోలీసుల దృష్టిలో తీవ్ర నేరమైపోయింది. వెంటనే ఉమర్‌ని అరెస్టు చేశారు. దేశంలోని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడంటూ అతడి మీద నేరాన్ని మోపారు. అందులోనూ నిన్న భారతీయ గణతంత్ర దినోత్సవం కావడంతో ఉమర్ చర్యని అధికారులు చాలా తీవ్రంగా పరిగణించారని తెలుస్తోంది. ప్రస్తుతం జైల్లో ఉన్న ఉమర్‌ ఇంటిని సోదా చేసిన పోలీసులకు అతని గది నిండా విరాట్‌ కోహ్లీ పోస్టర్లు మాత్రమే కనిపించాయి. మరి పిచ్చివాడనుకుని వదిలేస్తారో లేకపోతే పొరుగు దేశం మీద ప్రేమ పెంచుకున్న పాపానికి దండిస్తారో వేచి చూడాలి!

రిపబ్లిక్ డే పై బాహుబలి ఎఫెక్ట్..

తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ రేంజ్ కు తీసుకెళ్లిన సినిమా బాహుబలి. ఈ సినిమా ప్రభావం మాత్రం ప్రజల్లో బాగానే పడింది.  ఈ సినిమా విడుదలైన తరువాత వచ్చిన వినాయ చవితి పండుగలో కూడా అలాంటి విగ్రహాలు తయారు చేసి వ్యాపారస్తులు మంచి లాభాలే పొందారు. ఇప్పుడు రిపబ్లిక్ డే పై కూడా బాహుబలి ఎఫెక్ట్ బానే కనిపిస్తుంది. నిన్న 67వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించగా అందులో ఒక వ్యక్తి బాహుబలిలో ప్రభాస్ మాదిరిగా శివలింగాన్ని భుజానికెత్తుకుని  బైక్ పై నిల్చుని తన విన్యాసాన్ని ప్రదర్శించాడు. దీంతో అతని ప్రదర్శనతో అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాదు అక్కడ జరిగిన అన్ని విన్యాసాల్లో ఆయనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

మెరిసిపోయిన ఐశ్వర్య.. ఫ్రాన్స్ పురస్కారం

67వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు  ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్సిస్కో హోలాన్ ముఖ్యఅతిధిగా హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఇండియాకు వచ్చిన గౌరవార్దం ఏర్పాటు చేసిన విందులో అందాల తార ఐశ్వర్యరాయ్ కూడా హాజరయ్యారు. అయితే ఈ విందు కార్యక్రమానికి వచ్చిన ఐశ్యర్యాయ్ మాత్రం సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎర్రరంగు చీరలో..  తలలో రెండు గులాబీలు పెట్టుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంకా ఈవిందుకు ఐశ్యర్వరాయ్ తోపాటు బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్, ఆదిత్య చోప్రా మరికొందరు బాలీవుడ్ ప్రముఖులూ హాజరయ్యారు. విందు అనంతరం ఐశ్వర్యకు ఫ్రాన్స్ దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం అయిన ''నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్సు అండ్ లెటర్స్" ప్రదానం చేయగా.. షారూక్  ''ఆర్డర్ డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్'' పురస్కారం అందుకున్నారు.

మళ్లీ కాల్పుల కలకలం..

ఈ రోజు మళ్లీ అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. వివరాల ప్రకారం కాలిఫోర్నియా నగరం.. డియోగోలోని నావల్ ఆసుపత్రిలోకి ఓ దుండగుడు చొరబడి ఆస్పత్రి సిబ్బందిపై కాల్పులు జరిపాడు. దీంతో అక్కడ ఉన్నవారు అప్రమత్తమై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అధికారులు అక్కడికి చేరుకొని మొదట నావెల్ ఆసుపత్రిని మూసివేశారు. అనంతరం హాస్పిటల్ చుట్టు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ ఈ కాల్పుల్లో ఎవరైనా మరణించారా అనే విషయం తెలియడం లేదని.. అతను ఉగ్రవాదా..? కాదా..? అన్న విషయం ఇంకా తెలియలేదని.. ఈ షూటర్ ని పట్టుకుంటామని తెలిపారు.

రోహిత్ ఆత్మహత్య.. రోహిత్ తండ్రి ప్రశ్నలతో ఇంకా అనుమానాలు..!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ ఆత్మహత్య చేసుకన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఇప్పటికే ఎన్నో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో రోహిత్ తండ్రి మాటలు వింటుంటే ఇప్పుడు ఇంకా అనుమానాలు రేకెత్తుతున్నాయి. రోహిత్ ఆత్మహత్యపై అతని తండ్రి వేముల మణికుమార్ మాట్లాడుతూ రోహిత్ ఆత్మహత్య చేసుకునేంత పరికివాడు కాదని అన్నారు.  చదువుల్లో ఎంతో ఉన్నతంగా రాణిస్తున్న తన కుమారుడు రోహిత్‌ను ఉద్దేశపూర్వకంగా ఎవరో హతమార్చి ఉరివేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు రోహిత్ ఆత్మహత్యపై పలు ప్రశ్నలు సంధించారు మణికుమార్. రోహిత్ తో పాటు నలుగురు విద్యార్ధులను సస్పెండ్ చేశారు.. వారి సమస్యను పరిష్కరించుకునేందుకు ఐదుగురు కలిసి నిరాహార దీక్ష చేస్తున్నారు.. అలాంటప్పుడు తన కుమారుడు ఒక్కడే శిబిరం నుంచి వెలుపలకు వెళ్లి గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటని .. ఒకవేళ తాను నిజంగా ఆత్మహత్య చేసుకోవాలని భావించినా పోరాట పటిమతో అందరి ముందు ఆత్మహత్య చేసుకొనే వాడు కాని ఇలా ఒంటరిగా ఆత్మహత్య చేసుకునేవాడు కాదని.. అయినా వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోదలిస్తే మొత్తం ఐదుగురూ కలిసి ఆత్మహత్య చేసుకుని ఉండేవారు కదా అని ప్రశ్నించారు. దీంతో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతుంది.