మోడీ జీ.. వాట్ అబౌట్ అమరావతి జీ..
posted on Feb 29, 2016 @ 5:06PM
ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ఒరిగేదేం కనిపించడంలేదు. మొన్నటికి మొన్న ప్రకటించిన రైల్వే బడ్జెట్ లో కూడా తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నిరాశే మిగిల్చింది. ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురుచూస్తున్న తెలుగు ప్రజలకు మొండిచేయి చూపించింది. అసులు విభజన హామీలో ఉన్న విశాఖ రైల్వే జోన్ గురించి ఊసే ఎత్తలేదు. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన తీరు చూస్తుంటే కూడా అలానే కనిపిస్తుంది.
ఒక పక్క ఏపీ సీఎం చంద్రాబబు.. అసలే ఆర్దిక లోటుతో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. ఏపీ నూతన రాజధాని అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని అంటున్నారు. అలాంటి అమరావతికి ఎలాంటి నిధులు కేటాయించలేదు సరికదా.. దాని గురించిన ఊసు కూడా ఎక్కడా ఎత్తలేదు జైట్లీ. ఏపీ అభివృద్దికి పాటుపడుతా.. ఏపీ అభివృద్దికి ఆర్ధికంగా సహాయపడతా అన్న మోడీ ప్రజలకు ఊరించి ఆఖరికి ఏం చేయకుండానే ఈ ఏడాది బడ్జెట్ ను ముగించారు. ఇక ఏదో ఏపీలోని ఐటీ, ఐఐటీ, ఎన్ఐటీలకు మాత్రం కేంద్ర ప్రభుత్వం స్వల్పంగా నిధులు ప్రకటించి చేతులు దులుపుకుంది. ఇక పోలవరం ప్రాజెక్టుకు 100 కోట్లు ..విజయవాడకు 100 కోట్లు కేటాయించింది.
మరి అసలు ప్రధాని మోడీకి ఏపీ అనే ఒక రాష్ట్రం ఉంది.. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రజలకు రాజధానికి ఏర్పాటు కావాలి.. రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించాలి అన్న విషయం అసలు గుర్తుందా అని అనుకుంటున్నారు. రాజధాని శంకుస్థాపనకు వచ్చిన మోడీ కనీసం ఒక్క వరం కూడా ప్రజలకు ఇవ్వలేదు.. ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో కూడా అమరావతికి ఎలాంటి కేటాయింపులు లేవు. ఇక ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీల గురించి చెప్పనవసరం లేదు. ఇలాంటి నేపథ్యంలో అమరావతి నిర్మాణం జరిగేదెప్పుడూ.. సీఎం చంద్రబాబు చెప్పినట్టు అమరాతి విశ్వనగరంగా మారేదెప్పుడూ..తెలుగు ప్రజల కల తీరేదెప్పుడూ..