ఇంటర్నేషనల్ ఏవియేషన్ షోను ప్రారంభించిన రాష్ట్రపతి..

నేటి నుండి  ఐదురోజుల పాటు బేగంపేట ఎయిర్ పోర్టులో జరగనున్న ఇంటర్నేషనల్ ఏవియేషన్ షోను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు.  ఈ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్,  కేసీఆర్, కేంద్రమంత్రి ఆశోకగజపతిరాజు హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమానికి 25 దేశాల ప్రభుత్వ ప్రతినిధులు.. 12 దేశాల నుండి 200 కంపెనీల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ప్రసంగిస్తూ పౌర విమాన రంగంలో ప్రపంచంలోనే భారత్ 9వ ర్యాంకులో ఉందని, 2020 నాటికి మూడో స్థానానికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ రోజుకు లక్షలాది మందిని గమ్యస్థానానికి చేర్చుతుందన్న ప్రణబ్‌, ఏవియేషన్ రంగంలో తయారీపై దృష్టిసారించామన్నారు.

సభలో నవ్వించిన జానారెడ్డి.. లెక్కలతో గందరగోళంలో పడేశారు..

  కాంగ్రెస్ పార్టీ నేత జానారెడ్డి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు జోకులు వేసి అందరిని నవ్విస్తూనే ఉంటారు. తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే సభలో నవ్వులు పూయించారు. ప్రతిపక్షనేతగా తెలంగాణ బడ్జెట్ పై చర్చను ప్రారంభించిన జానారెడ్డి.. ప్రజల ఆకాంక్షలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చాలి.. ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజామోదం లేకుంటే తెలియజేసే బాధ్యత ప్రతిపక్షానిది.. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయడం ప్రజాస్వామ్యమా..? కొందరు మంత్రులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు.. ప్రతిపక్షాలకు ఓట్లు అడిగే హక్కు లేదనడం నియంతృత్వ ధోరణికి నిదర్శనం అంటూ మండిపడ్డారు. అనంతరం ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడుతూ.. బడ్జెట్ అంటేనే సాధారణంగా గందరగోళ అంశమని, అలాంటి బడ్జెట్ లెక్కలను చేతులకు ఇచ్చి మంత్రి ఈటల రాజేందర్ మరింత గందరగోళంలో పడేశారని.. ఎమ్మెల్యేలు చాలా జాగ్రత్తగా చదువుకోవాలని చెప్పడంతో సభలో అందరూ నవ్వుకున్నారు. అంతేకాదు 'సభలో చాలామంది సభ్యులు లేరు. మంత్రులు ఎవరు లేరు. మండలికి పోయినరా' అంటూ మాట్లాడి సభలో నవ్వులు పూయించారు.  

సద్దాం హుస్సేన్ చాల మంచి వాడు.. ట్రంప్

  డోనాల్డ్ ట్రంప్ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓహియాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న ట్రంప్ మాట్లాడుతూ ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  సద్దాం హుస్సేన్ టెర్రరిస్టులను చంపడంలో చాల మంచి వాడని అన్నాడు. ఈ సందర్భంగా ఆయన ఒబామా మీద విరుచుకుపడ్డారు. ఇరాన్, ఇరాక్ దేశాలను హస్తగతం చేసుకోవాలన్న కారణంతోనే ఆ దేశాలను హస్తగతం చేసుకుని క్రూడ్ ఆయిల్ పై చలామణి చెయ్యాలని ప్రయత్నించారని విమర్శించారు. అందుకే ఇరాక్ మీదకు అమెరికా సైన్యాన్ని ఒబామా పంపించారని ఆరోపించారు.   ఈ కారణంగానే ఐసిస్ ఆవిర్భవించిందని అన్నారు. అయితే అంతలోనే ట్రంప్ మాట మార్చి.. సద్దాం హుస్సేన్ చాల మంచి వాడని ఎవరు చెప్పారు.. ఉగ్రవాదులను చంపడంలోనే సద్దాం హుస్సేన్ మంచివాడని తాను చెప్పాను అంతే అని చెప్పుకొచ్చారు.

జగన్ పై చంద్రబాబు ఫైర్.. ముఖ్యమంత్రిని సంబోధించండం ఇలాగేనా..?

అసెంబ్లీ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రెండంకెల వృద్ధిని సాధించాం.. ప్రతిపక్షనేత ఏం మాట్లాడుతున్నారు..? ముఖ్యమంత్రిని సంబోధించండం ఇలాగేనా..?ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు..? బాష నేర్చుకోకపోతే సభ హుందాతనం పోతుంది అని హెచ్చరించారు. అంతేకాదు పోలవరం గురించి ఆయన మాట్లాడుతూ ఈ తీర్మానం రాష్ట్రానికి ఎంతో అవసరమని.. తీర్మానానికి చాలామంది సలహాలు, సూచనలు ఇచ్చారు.. సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ 2018 నాటికి ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం..  పోలవరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ చేసింది ఏం లేదు.. రాష్ట్రం ఖర్చు చేయకపోతే కేంద్రం ఇచ్చే దాగా ఆగాలి.. కేంద్రమే బాధ్యత వహిస్తానని చెబితే వెంటనే కేంద్రానికి అప్పగించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు.   ఇంకా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ఇచ్చిన దానిని నేనేమి దాచుకోవడం లేదు.. అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు.. ఏపీ రాజధానికి 35 వేల ఎకరాలు భూమిని రైతులు ఇస్తే.. భూములు లాక్కున్నామంటూ నిందలు వేస్తున్నారు అని ఆగ్రహం ప్యక్తం చేశారు. ప్రపంచంలో పెద్ద పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకువస్తున్నాయని అన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.. రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరడానికి ప్రతిపక్షాలు సహరించాలని కోరారు.

ఉద్యోగం కోసం వెళ్తే... ఓ ఇటుక ప్రాణం తీసింది

23 ఏళ్లా మౌనికారెడ్డి ఓ B.Sc గ్రాడ్యుయేట్. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం కోసమని ఆమె నిన్న బెంగళూరుకి వెళ్లింది. అక్కడ జరిగిన తొలి రౌండ్ ముఖాముఖిలో తన ప్రతిభను బాగానే నిరూపించుకుంది. అదే విషయాన్ని తల్లిదండ్రులకు చెబుదామనుకుంది. కానీ ఫోన్‌ సిగ్నల్స్‌ సరిగా లేకపోవడంతో, ముఖాముఖి జరిగిన భవంతి నుంచి బయటకి వచ్చి నిల్చొంది. ఒక పక్క ఆమె తన తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడుతుండగానే, భవంతి పై నుంచి పడిన కొన్ని ఇటుకలు నేరుగా ఆమె తల మీద పడ్డాయి. దాంతో మౌనిక తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. మౌనికతో పాటుగా తోడు వచ్చిన ఆమె బంధువు, ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. బెంగళూరులోని నిబంధనల ప్రకారం, నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తులకు తప్పనిసరిగా జాలీలు ఏర్పాటు చేయాలనీ, అలాంటి సౌకర్యం లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. మరోవైపు ఇన్ఫోసిస్ జరిగినదానికి సంతాపం తెలియచేస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలా సాయం చేస్తామనీ, జరిగిన ఘటన గురించి నిర్వహించే దర్యాప్తుకు సహకరిస్తామనీ’ ఇన్ఫోసిస్‌ పేర్కొంది.

ఇక మీదట సమాజ్‌వాదీ సెంటు

  సమాజ్‌వాదీ పార్టీ ఉత్తర్‌ప్రదేశ్‌లోకి అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. ఈ నాలుగేళ్లలో అఖిలేష్‌ యాదవ్‌ సాధించిన ఘనత పెద్దగా ఏమీ లేదనీ, పైపెచ్చు నేరాలు పెచ్చరిల్లాయనీ విమర్శకులు అంటే అనవచ్చుగాక. తన ప్రభుత్వ కీర్తి గుబాళింపు ఎలా ఉన్నాగానీ, అఖలేష్‌కు మాత్రం తాము అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తియిన సందర్భంగా ఏదన్నా కొత్త పని చేయాలనిపించింది. ముఖ్యమంత్రి తల్చుకుంటే పథకాలకు కొదవా! వెంటనే ‘సమాజ్‌వాదీ సుగంధ్‌’ పేరుతో ఒక పరిమళాన్ని రూపొందించాలని ఆదేశించారు. ఫ్రాగోమేట్రిక్స్‌ అనే సంస్థ అలాగే అంటూ ఓ నాలుగు పరిమళాలతో సమాజ్‌వాదీ సెంటుని రూపొందించింది. బెనారస్‌, కనౌజ్‌, తాజ్‌మహల్, రూమీదర్వాజా అంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని నాలుగు ముఖ్య ప్రదేశాల పేరుతో నాలుగు పరిమళాలను రూపొందించారు. వీటిలో ఏ పరిమళాన్ని అద్దుకున్నా, ఆ ప్రదేశానికి వెళ్లిన అనుభూతి కలుగుతుందట. ఇంతకీ ఈ సెంటు సీసాలు ఎక్కడపడితే అక్కడ అమ్మరని తెలిసింది. ముఖ్యమంత్రి ఇంటి దగ్గరా, రాజకీయనేతల కార్యాలయాల దగ్గర మాత్రమే అమ్ముతారట.

బస్సులో బాంబు పేలి 10మంది సచివాలయ ఉద్యోగులు మృతి..

  ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డుకట్టు లేకుండా పోయింది. రోజు రోజుకి వీరి ఆగడాలు ఎక్కువవుతున్నాయే తప్పా తగ్గడంలేదు. తాజాగా మరో రక్తపాతం సృష్టించారు ఉగ్రవాదులు. పాకిస్థాన్‌లోని పెషావర్ పట్టణంలో 40 మంది ప్రయాణికులను తీసుకుని వెళ్తోన్న బస్సు సరద్ ప్రాంతంలోని మసీదు రోడ్డులో ఆగిన సమయంలో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడు వల్ల బస్సు30 నుంచి 40 అడుగుల దూరం ఎగిరి పడినట్టు తెలుస్తోంది.  ఈ ఘటనలో 25 మృతిచెందగా మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. కాగా మృతుల్లో 10మంది పాక్‌ సచివాలయ ఉద్యోగులేనని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని స్థానిక లేడీ రీడింగ్‌ హాస్పిటల్‌కి చికిత్స నిమిత్తం తరలించారు

ప్రభాస్‌ తమ్ముడికి ఏడాది జైలు శిక్ష..

  చెక్ బౌన్స్ కేసలో సినీ హీరో ప్రభాస్‌ సోదరుడు యూవీఎస్‌ఎస్‌ఆర్‌ ప్రబోధ్‌కు ఏడాది పాటు జైలు శిక్ష పడింది. వివరాల ప్రకారం.. ప్రభాస్ నటించిన బిల్లా సినిమా నిర్మాతల్లో  ప్రబోధ్‌ కూడా ఒకరు. అయితే ఈ సినిమా నిర్మాణ సమయంలో సికింద్రాబాద్‌కు చెందిన గంగాగనాతే అనే మహిళ దగ్గర రూ.43 లక్షల అప్పు తీసుకున్నారు. అయితే తనకు డబ్బు చెల్లించే క్రమంలో ప్రబోధ్‌ చెక్కు ఇచ్చాడు. ఆ చెక్కు కాస్త బౌన్స్ అయింది. దీంతో ఆమె ప్రబోధ్ ను మరోసారి సంప్రదించింది. అయితే ప్రబోధ్ మాత్రం ఎంతకూ డబ్బు చెల్లించకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. దీంతో దీనిపై విచారించిన రాజేంద్రనగర్‌ కోర్టు ప్రబోధ్ కు సంవత్సరం జైలుశిక్షతో పాటు బాధితురాలికి నష్టపరిహారం కింద రెండు నెలల్లో రూ.87 లక్షలు చెల్లించాలని ఆదేశించారు.

ఏపీకి మట్టి, నీరు ఇచ్చి ముంచారు.. రాహుల్ గాంధీ

  ఏపీ ప్రత్యేక హోదా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆపార్టీ నేతలు కలిశారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం సేకరించిన కోటి సంతకాల పత్రాలను వారికి అందజేశారు. ఈసందర్బంగా సోనియా మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ నేతలు చేస్తున్న కృషిని అభినందిస్తున్నా.. విభజన చట్టంలో ఏపీకి పలు హామీలు ఇచ్చాం.. ఏపీకి ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీ.. రాజధాని నిర్మాణానికి ప్రత్యేక ప్యాకేజి.. పోలవరంకి జాతీయ స్థాయి గుర్తింపు ఇచ్చాం.. కానీ రెండేళ్లు గడుస్తున్నా ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలేదు.. ప్రత్యేక హోదాతోనే ఏపీకి న్యాయం జరుగుతుంది అని అన్నారు. ఇంకా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఏపీకి మట్టి, నీరు ఇచ్చి ముంచారు.. ఏపీ ప్రత్యేక హోదాపై మన్మోహన్ సింగ్ హామి ఇచ్చారు.. విభజన చట్టంలో హామీలు నెరవేర్చడానికి పోరాడుతున్నాము.. ఏపీకి న్యాయం చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు.

జనం సొమ్ముతో బోనీకపూర్‌కు రక్షణ

  వాళ్లు పెద్దపెద్ద సెలబ్రిటీలు. ఒకోసారి తమ భద్రత గురించి వాళ్లకి భయం కలుగుతూ ఉంటుంది. అందుకనే తమకు రక్షణ కల్పించమంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉంటారు. సదరు వ్యక్తులు చెబుతున్న కారణం సహేతుకం అనిపిస్తే, ప్రభుత్వం వారికి తగిన రక్షణను కల్పిస్తుంది. Y, Z, Z+ ఇలా రకరకాల అంచెల ద్వారా వాళ్లని పోలీసుల భద్రత లభిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం నామమాత్రపు రుసుమును వసూలు చేస్తుంది. కానీ పోలీసు సేవలను శుభ్రంగా అనుభవిస్తూ, నామమాత్రపు రుసుమును కూడా చెల్లించకుండా తప్పించుకునేవారిని ఏమనాలి? మహారాష్ట్రలో ఇలా 62 మంది ప్రముఖులు కలిసి ప్రభుత్వానికి దాదాపు 5 కోట్లు బకాయిపడ్డారట. ఈ విషయాన్ని సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే వెల్లడించారు. ఈ జాబితాలో బోనీకపూర్‌, నెస్‌వాడియా వంటి ఉద్దండులు ఉండటం గమనార్హం! స్థానిక జిల్లా కలెక్టర్లు వారికి తాఖీదులు పంపినా కూడా సదరు ప్రముఖులు స్పందించలేదని పేర్కొన్నారు ముఖ్యమంత్రిగారు. మరి మంది సొమ్మంటే ఎవరికి చేదు!

కాంగ్రెస్ పార్టీ నాయకుడి హత్య.. కత్తులతో దాడి చేసి..

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేరళలో ఇప్పటినుండే హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయి. కేరళలోని ఈ పూర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిని అతి దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. వివరాల ప్రకారం... కేరళ యూత్ కాంగ్రెస్ నేత సునీల్ కుమార్ పై  సీపీఎంకు చెందిన డీవైఎఫ్ కార్యకర్తలు కత్తులో దాడి చేశారు. ఈ దాడిలో సునీల్ తీవ్రంగా గాయపడగా అతనిని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స చేస్తుండగానే సునీల్ మరణించాడు.   మరోవైపు ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సునీల్ పై దాడి చేసిన డీవైఎఫ్ కార్యకర్తలను కఠినంగా శిక్షించాలి అంటూ ఆందోళనలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో  ధర్నాలు, రాస్తా రాకోలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసలు అక్కడ కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.

టీవీ యాంకర్ ఆత్మహత్య.. ఉరేసుకొని..

  హైదరాబాద్ నగరంలో టీవీ యాంకర్ నిరోషా ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. ప్రైవేటు హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే నిరోషా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేమ వ్యవహారమే కారణమయి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం నిరోష మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా నిరోషా ఇంత మనస్థాపం చెందడానికి గల కారణాలు.. ఆమె చివరిలో ఎవరికి ఫోన్ చేసింది.. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాల దిశగా పోలీసులు దర్యాప్తు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

టి20 అప్ డేట్ : స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడుతున్న టీం ఇండియా

20 ఓవర్లలో 127 పరుగుల లక్ష్య ఛేదనలో టీం ఇండియా తడబడుతోంది. కేవలం 26 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వికెట్లలో న్యూజిలాండ్ బౌలర్ల ప్రతిభ కంటే, భారత బ్యాట్స్ మెన్ నిర్లక్షమే ఎక్కువగా కనిపించింది. రైనా, యువరాజ్, ధావన్, రోహిత్ వికెట్లన్నీ నిర్లక్ష ధోరణితో పోగొట్టుకున్నవే. ధావన్ స్వీప్ కు ప్రయత్నించి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగితే, రోహిత్ ముందుకొచ్చి స్టంప్ అవుట్ అయిపోయాడు. యువరాజ్, రైనాలు కూడా చాలా సాధారణమైన షాట్లు ఆడి అవుటయ్యారు. ప్రస్తుతం క్రీజులో ఉన్న కోహ్లి(17, 16 బంతుల్లో) , ధోనీ (1, 3 బంతుల్లో) జంటపైనే భారత అభిమానుల ఆశలన్నీ ఉన్నాయి.

టి20 అప్ డేట్ : న్యూజిలాండ్ స్కోర్ 126/7

న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. రెగులర్ గా వికెట్లు తీస్తూ, భారత బౌలర్లు న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ ను కుదురుకోనివ్వలేదు. పిచ్ విపరీతంగా టర్న్ అవుతుండటంతో, బౌలింగ్ ను చాలా కష్టంగా ఎదుర్కొన్నారు న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్. బౌలర్లలో హార్ధిక్ పాండ్యాకు తప్పితే, అందరికీ ఒక వికెట్ లభించింది. బుమ్రా, రైనా బౌలర్స్ లో టాప్ గా నిలిచారు. ఇద్దరూ తమ నాలుగు ఓవర్లలో 15 పరుగులే ఇవ్వడం విశేషం. బుమ్రా యార్కర్లకు బ్యాట్స్ మెన్ వద్ద సమాధానం లేదు. నెహ్రా వేసిన చివరి ఓవర్లో ఇక సిక్స్, ఒక ఫోర్ పడటంతో, కనీసం 126 వరకూ అయినా న్యూజిలాండ్ చేరుకోగలిగింది. కోరే ఆండర్సన్ (34, 42 బంతుల్లో), ల్యూక్ రాంచీ (21, 11 బంతుల్లో) రాణించారు. 13 పరుగులు ఎక్స్ ట్రాల రూపంలో వచ్చాయి. పిచ్ స్పిన్ అనుకూలిస్తుండటంతో, ముగ్గురు స్పిన్నర్లున్న న్యూజిలాండ్ ను భారత బ్యాట్స్ మెన్ ఎలా ఎదుర్కోబోతున్నారో చూడాలి. భారత విజయ లక్ష్యం 20 ఓవర్లలో 127 పరుగులు

టి20 అప్ డేట్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

  ఇండియాలో జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో, ఈరోజు ఇండియా తొలి పోరుకు సిద్ధమవుతోంది. న్యూజిలాండ్ తో జరగబోయే ఈ మ్యాచ్ లో గెలిచి శుభారంభంతో టోర్నీ మొదలెట్టాలని టీం ఇండియా ఉవ్విళ్లూరుతోంది. న్యూజిలాండ్ కూడా బలమైన ఇండియాను సమర్ధంగా ఎదుర్కోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ప్రస్తుతం టాస్ గెలిచి న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. నాగ్ పూర్ లో జరగబోయే ఈ మ్యాచ్ కు బ్యాటింగ్ వికెట్ సిద్ధంగా ఉంది. భారీ స్కోర్లు నమోదవడం ఖాయం.   ఇండియా ఆసియా కప్ గెలిచిన టీంతోనే రంగంలోకి దిగుతుండగా, న్యూజిలాండ్ మాత్రం ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల సూత్రాన్ని ఎంచుకుంది. టిమ్ సౌతీ, బౌల్ట్, మెక్ గ్లెనాగన్ లాంటి తమ టాప్ బౌలర్లను ఈ మ్యాచ్ కు పక్కన పెట్టి వారి స్థానంలో స్పిన్నర్లు నాథన్ మెకల్లమ్, ఇష్ సోథీ, మిచెల్ సాంట్నెర్ లకు చోటు కల్పించింది న్యూజిలాండ్. కేవలం ఆడం మిల్నే, కోరీ యాండర్సన్ లు మాత్రమే న్యూజిలాండ్ కు పేస్ బౌలింగ్ చేయబోతున్నారు. తమ టాప్ బౌలర్లను పక్కన పెట్టి, స్పిన్నర్లను తీసుకోవడం ప్రస్తుతం ఆశ్చర్యకరంగా మారింది. న్యూజిలాండ్ సెకండ్ బౌలింగ్ చేస్తుండటంతో, మంచు ప్రభావాన్ని ముగ్గురు స్నిన్నర్లు ఎంతవరకూ అడ్డుకుంటారనేది ఆసక్తికరం..

మదర్ థెరిస్సాకు సెయింట్ హుడ్..

తను జీవించి ఉన్నంతకాలం ప్రజలకు ఎన్నో సేవలు చేస్తూ గడిపిన మదర్ థెరిస్సాకు వాటికన్ సెయింట్ హుడ్ ను ప్రకటించింది. ఈ మేరకు పోప్ ఫ్రాన్సిస్ కాననైజేషన్ (మహిమాన్విత హోదాను ప్రకటిస్తూ తయారుచేసిన ఉత్తర్వుల పత్రం)పై సంతకం చేశారు. ఈ కార్యక్రమానికి పోప్ ఫ్రాన్సిస్ సైతం హాజరవుతారని అంచనా. ఈ సెయింట్ హుడ్ ప్రకటించడం ద్వారా మదర్‌ థెరిస్సాను కేవలం ఓ సేవా మూర్తిగానే కాకుండా దైవశక్తులు ఉన్న ఓ దేవదూతగా చూస్తారు.   కాగా మాసిడోనియాలో 1910లో జన్మించిన మదర్ థెరిసా కోల్‌కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించి 45 ఏళ్లపాటు పేదలు, రోగులకు విశిష్టమైన సేవలందించారు. 1950లో భారత పౌరసత్వం స్వీకరించారు. 1979లో నోబెల్ శాంతి బహుమతి పొందారు. 1997లో కోల్‌కతాలో ఆమె తుది శ్వాస విడిచారు

భారతీయ విద్యార్ధులకు సపోర్ట్ గా ట్రంప్..

అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలతోనే సగం ఫేమస్ అయ్యారు. మొన్నటికి మొన్న ఇస్లాం మతంపై విరుచుకుపడ్డారు. గతంలో భారతీయ విద్యార్దుల గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ట్రంప్ తాజాగా వారికి అనుకూలంగా వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. అమెరికా విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను వెనక్కి పంపించాల్సిన అవసరం లేదని అన్నారు. అలాంటి తెలివైన పిల్లలను అమెరికాలో ఉంచాలని అన్నారు. వారు ఫీజులు కట్టి చదువుకుంటున్నారు.. వారిలో చాలామంది తెలివైనవారు ఉన్నారు.. మనకు అలాంటి వారే కావాలి అని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఇండియన్స్ అయితే తిరిగి ఇండియాకు వెళ్లి కంపెనీలు పెట్టుకొని ఉద్యోగాలు సృష్టించాలి' ట్రంప్ మరో సలహా కూడా ఇచ్చారు.

పాకిస్థాన్ టీమ్ కు మోడల్ ఆఫర్.. ఇండియాపై గెలిస్తే స్ట్రిప్ డ్యాన్స్ చేస్తా..

భారత్-పాక్ మధ్య మ్యాచ్ అంటేనే ఓ క్రేజ్ ఉంటుంది. రెండు జట్ల మధ్య మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఎదురుచూస్తారు. ఇదంతా ఒకఎత్తైతే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ కు ఓ మోడల్  ఓ ప్రకటన చేసింది. ఐసీసీ వరల్డ్ ట్వంటీ20లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌లో భారత్‌ను పాక్ జట్టు ఓడిస్తే, యావత్ పాక్ ప్రజల ముందు 'స్ట్రిప్ డ్యాన్స్' చేస్తానంటూ పాకిస్థాన్‌కు చెందిన మోడల్ కాందీల్ ప్రకటించింది. కాగా గతంలో పూనమ్ పాండే కూడా ఇలాంటి ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2011లో భారత జట్టు వరల్డ్ కప్‌ను సాధిస్తే నగ్నంగా కనిపిస్తానంటూ ఈ భామ అప్పట్లో ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఇది అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది.