టీం ఇండియా బోణీ, చితగ్గొట్టిన కోహ్లీ
టి20 వరల్డ్ కప్ లో భారత్ బోణీ కొట్టింది. చిరకాల ప్రత్యర్ధి పాక్ పై కష్టమైన పిచ్ మీద కూడా అద్భుతంగా రాణించాడు కోహ్లీ. తనను ఛేజింగ్ కింగ్ అని ఎందుకంటారో ప్రూవ్ చేసుకున్నాడు. తనకు అలవాటైన చివరి బాల్ సిక్స్ బదులు, లాస్ట్ బట్ వన్ బంతిని సిక్స్ కొట్టి ధోని లాంఛనాన్ని పూర్తి చేశాడు. నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో టీం ఇండియా నిలిచి గెలిచింది.18 ఓవర్లలో 119 పరుగుల లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో 6 వికెట్లతో గెలుపొందింది. విరాట్ పోరాటం అతని కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలిచిపోతుంది. కష్టమైన పిచ్, పాకిస్థాన్ తో మ్యాచ్, పెవిలియన్ కు క్యూ కడుతున్న సహచరులు, ఇలాంటి సమయంలో టీం కు ఇరుసులా నిలిచి 37 బంతుల్లో 55 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు కోహ్లీ. ఒకానొక టైం లో, న్యూజిలాండ్ మ్యాచ్ రిపీట్ అవుతుందని భారత అభిమానులు భయపడినా, కోహ్లీ ఉన్నంత వరకూ ఏం కాదులే అన్న భరోసాతో ఉన్నారు. నిజంగానే కోహ్లీ తనకు అలవాటైన రీతిలోనే మళ్లీ ఇండియాను గెలిపించాడు.
18 ఓవర్ల ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ భారత అద్భుత బౌలింగ్ వల్ల 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ లో అహ్మద్ షెహజాద్ (25), షోయబ్ మాలిక్ (26), ఉమర్ అక్మల్ (22) రాణించారు. భారత బౌలర్లలో నెహ్రా, బుమ్రా, జడేజా, రైనా, పాండ్యాలకు తలో వికెట్ దక్కింది.
టీం ఇండియా ఇన్నింగ్స్ లో రోహిత్ (10, 11 బంతుల్లో) అనవసర షాట్ కు అవుటైతే, ధావన్ (6, 15 బంతుల్లో) పరుగులు చేయడానికి కష్టపడ్డాడు. వన్ డౌన్ లో వచ్చిన కోహ్లీ ఎప్పటిలాగే, తన ఛేజింగ్ కింగ్ పేరును నిలబెట్టుకున్నాడు. అతని 55 పరుగుల ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. యువరాజ్(24, 23 బంతుల్లో) ఫామ్ లో ఉన్నట్టే కనిపించినా, త్వరగా గేమ్ ను ముగించే ప్రయత్నంలో అవుటయ్యాడు. చివర్లో వచ్చిన ధోనీ (13, 9 బంతుల్లో) నాటౌట్ గా నిలిచాడు.
ఓవరాల్ గా పాయింట్స్ పట్టికలో అకౌంట్ ఓపెన్ చేసిన టీం ఇండియా,రెండు మ్యాచ్ ల్లో, ఒక గెలుపు, 2 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఆడిన రెండు మ్యాచ్ లూ గెలిచిన న్యూజిలాండ్ టాప్ లో ఉండగా, రెండు మ్యాచ్ లాడి ఒకటే గెలిచి పాయింట్లలో ఇండియాతో సమానంగా ఉన్నా, మెరుగైన రన్ రేట్ కారణంగా రెండో స్థానంలో ఉంది పాకిస్థాన్. నాలుగు ఐదు స్థానాల్లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఈ రెండు టీమ్ లు ఇంకా అకౌంట్ ఓపెన్ చేయలేదు.