ప్రేమించలేదని... 15 ఏళ్ల అమ్మాయిని తుపాకీతో కాల్చేశాడు
వెంటపడిన అమ్మాయి తన ప్రేమను ఒప్పుకోలేదని, ఏకంగా ఓ తుపాకీని కొనుక్కొచ్చి ఆమెను షూట్ చేశాడు ఓ ప్రబుద్ధుడు. రాజస్థాన్‌కు చెందిన కమల్‌కాంత్, ఒక చుట్టాలమ్మాయిని ప్రేమించాడు. తరచూ ఆమెతో ఫోన్లో మాట్లాడేవాడు కమల్‌కాంత్. రోజురోజుకీ ఫోన్లో సంభాషణలు పెరిగిపోవడంతో, ఆ అమ్మాయి తనను ప్రేమిస్తోందని అపోహ పడ్డాడు. అదే నమ్మకంతో ముంబైలో ఉండే అమ్మాయి ఇంటికి చేరుకున్నాడు.
‘నీ మీద అలాంటి ఉద్దేశమేదీ లేదు’ అని అమ్మాయి చెప్పడంతో రాజస్థాన్‌కు తిరిగివెళ్లి పోయాడు. ఈసారి ఓ తుపాకీ కొనుక్కుని మరీ వచ్చాడు కమల్‌కాంత్. మరోసారి తన ప్రేమ గురించి ఆమె అభిప్రాయం ఏమిటంటూ ఆ అమ్మాయిని కదిపాడు. ఎప్పటికీ తన జవాబు ఒకటేనని అమ్మాయి తేల్చిచెప్పడంతో, జేబులోని తుపాకీని తీసి కాల్చాడు. తూటా బాధితురాలి గొంతులోకి దూసుకుపోవడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఇంతాచేసి బాధితురాలు మైనారటీ కూడా తీరని ఓ పదిహేనేళ్ల అమ్మాయి! ప్రేమించలేదన్న పాపానికి యాసిడ్ దాడులు, అత్యాచారాలు, కత్తిపోట్లకు గురవుతున్న ఆడవాళ్లు ఇప్పుడు తుపాకులకు కూడా భయపడాల్సి వచ్చేట్లుంది.