భారత్ మీదే ఒత్తిడి ఎక్కువ- పాకిస్తాన్ కోచ్
టి-20 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ చేతిలో భంగపడిన భారత్‌కు, చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. కానీ తదుపరి మ్యాచ్ గురించి ఆలోచన, భారత్ జట్టు మీద మరింత ఒత్తిడి పెంచేట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, చిరకాల శత్రువు పాకిస్తాన్‌తో, భారత్ రెండో మ్యాచ్‌ను ఆడవలసి ఉంది. రేపు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌కు ముందుగానే, ఇరుజట్ల మధ్యా మాటల పోటీ మొదలైపోయింది. భారత్-పాక్ జట్ల మధ్య క్రికెట్ అంటే సరిహద్దు మధ్య తగాదాగా చూస్తారని, భారతీయ స్పిన్నర్ అశ్విన్ పేర్కొన్నాడు. కానీ పాకిస్తాన్ కోచ్ వకార్ యూనస్ మాత్రం అశ్విన్ మాటలను కొట్టిపారేస్తున్నాడు. స్పర్ధ క్రీడకు మాత్రమే పరిమితం కావాలని సూచించాడు వకార్. అంతర్జాతీయ పోటీలలో తరచూ పాకిస్తాన్ మీద భారత్‌దే పై చేయిగా ఉంటున్నప్పటికీ, ఈసారి ఆ చరిత్రను తిరగరాస్తామని ప్రకటించాడు. టోర్నీలో నిలిచేందుకు భారత్‌కు ఈ మ్యాచ్ కీలకం కావడంతో, వారి మీదే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని పేర్కొన్నాడు. వకార్ మాటల్ని మరీ కొట్టిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే టోర్నమెంటులోని తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి భారంతో నిలిస్తే, పాకిస్తాన్ మాత్రం బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించి విజయోత్సాహంతో ఉంది. మరి చరిత్ర మారుతుందా లేకపోతే పునరావృతమవుతుందా తేలేందుకు ఒక్క రోజు ఓపిక పడితే సరిపోతుంది.