నా ఉద్దేశం అది కాదు.... షాహిద్ ఆఫ్రిదీ వివరణ
పాకిస్తాన్‌కంటే భారతదేశంలోనే తమను ఎక్కువగా ప్రేమిస్తారంటూ షాహిద్ ఆఫ్రిదీ చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించిన విషయం తెలిసిందే! ఈ విషయమై పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లతో సహా పలువులు అభిమానులు మండిపడటంతో ఆఫ్రిదీ వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. తాను కేవలం ఒక క్రికెటర్‌గా ఆ మాటలు అనలేదనీ, పాకిస్తాన్ తరఫున భారత్‌లోకి అడుగుపెట్టిన వ్యక్తిగా వారి మనసుని గెల్చుకునేందుకు అలా అన్నాననీ, ఈ క్రికెట్ యోధుడు పేర్కొన్నాడు.
తనకు పాకిస్తాన్ అభిమానులను చులకన చేయాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదనీ, అసలు తన ఉనికే పాకిస్తాన్‌తో ముడిపడి ఉందనీ, వివరణ ఇచ్చుకున్నాడు. భారత్‌లో క్రికెట్‌ను ఒక మతంగా ఆరాధిస్తారు కాబట్టే, ఇక్కడ తమకు దక్కే అభిమానాన్ని గురించి ప్రత్యేకించి చెప్పాననీ, తన సీనియర్లైన వసీం అక్రం వంటి క్రికెటర్లు కూడా తన మాటలతో ఏకీభవిస్తారనీ చెప్పుకొచ్చాడు. ఆఫ్రిదీ తెలివిగా తన సీనియర్లందిరినీ ఉట్టంకించడం వల్ల, ఇప్పుడు వాళ్లు కూడా ఈ వివాదం మీద తమ అభిప్రాయాన్ని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఆఫ్రిదీ మాటలకు పాక్ అభిమానులు సంతృప్తి చెందుతారో లేకపోతే కేసులు మీద కేసులు వేసి ధర్నాల మీద ధర్నాలను నిర్వహిస్తారో వేచిచూడాలి.